కర్ణాటక: ఈ 10 ఆసక్తికర అంశాలు మీకు తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి.రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వల్ల ఈ రాష్ట్రం కొంత కాలంగా అందరి నోళ్లలో నానుతోంది.
పోలింగ్ మే 10న ముగిసింది. ఫలితాలు మే 13న వెలువడనున్నాయి. కర్ణాటక గురించి అంతా మాట్లాడుకొంటున్న సందర్భంలో ఈ రాష్ట్రం గురించి 10 ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. ఇందులో తెలుగువారికి బాగా నచ్చేవీ ఉన్నాయండోయ్!
1.మైసూరు పాక్
ఈ స్వీట్ చాలా ఫేమస్. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే మైసూరు పాక్ పుట్టుక వెనుక ఒక కథ కూడా ఉంది.
తన ఇంటికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకమైన వంటకం చేయాల్సిందిగా రాచకుటుంబానికి వంట చేసే కాకాసుర మాడప్పను మైసూరు పాలకుడు కృష్ణ రాజ వడియార్-4 ఆదేశించారంట.
అప్పుడు మాడప్ప బాగా ఆలోచించి... నెయ్యి, చక్కెర, సెనగ పిండితో ఒక తియ్యని పదార్థం చేశారంట. ఆ స్వీటు రాజుకు చాలా బాగా నచ్చింది. దాని పేరు ఏంటని? మాడప్పను రాజు అడిగారు. కానీ మాడప్ప అంత వరకు దానికి ఏ పేరు పెట్టలేదు.
రాజు సడన్‌గా అడిగేసరికి, వెంటనే ‘‘మైసూరు పాక్’’ అని మాడప్ప చెప్పారు. పాక్ అంటే కన్నడలో పాకం అని అర్థం. మైసూరు కోటలో తయారు చేసిన వంట కాబట్టి దాన్ని మాడప్ప ‘‘మైసూర్ పాక్’’ అని పిలిచారు.
మైసూరు పట్టణంలోని ప్రజలు కూడా దాన్ని రుచి చూడాలనే ఉద్దేశంతో తన కోట బయట మాడప్ప చేత మైసూరు పాక్ షాపును తెరిపించారంట రాజు.

ఫొటో సోర్స్, Mysore.nic.in
2.మైసూరు సిల్క్
కర్ణాటక పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే మరొక పేరు మైసూరు సిల్క్. మల్బరీ పట్టు ఉత్పత్తికి కర్ణాటక ప్రధాన కేంద్రంగా ఉంది. దేశంలోని 70 శాతం మల్బరీ పట్టు ఇక్కడే ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.
మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కాలంలోనే ఇక్కడ పట్టు పరిశ్రమ ఏర్పడింది. రాచకుటుంబానికి పట్టు దుస్తుల కోసం 1912లో కృష్ణ రాజ వడియార్-4, మైసూరులో ఫ్యాక్టరీని స్థాపించారు. ఆ తరువాత అది కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీ కార్పొరేషన్‌గా మారింది.

ఫొటో సోర్స్, Karnataka Tourism/Facebook
3. యక్షగానం
ఇది కర్ణాటక జానపద నృత్యం.
దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ వంటి ప్రాంతాల్లో ఇది రూపొందింది. రామాయణం, మహాభారతం లాంటి వాటిలోని ఘట్టాలను యక్షగానం కళాకారులు ప్రదర్శిస్తుంటారు. ఇందుకోసం వారి అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, KSDL
4.మైసూరు శాండల్
కర్ణాటకలో గంధపు చెట్లు ఎక్కువ. అక్కడి చెట్ల నుంచి తయారు చేసే ఉత్పత్తులు కూడా చాలా ఫేమస్. మైసూర్ శాండల్‌వుడ్ నూనె, సబ్బు, అగరబత్తీలు వంటివి బాగా ఆదరణ ఉన్నవే.
అమెరికా, కెనడా, యూరప్, చైనా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాలకు ఈ ఉత్పత్తులను ఎగుమతి చేస్తారు.

ఫొటో సోర్స్, Siddaramaiah/Twitter
5.ప్రత్యేక జెండా
భారతదేశానికి జాతీయ జెండా ఉన్నట్లే కర్ణాటక రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేక జెండా ఉంది. పసుపు, తెలుపు, ఎరుపు రంగులు ఉండే ఈ జెండాను 2018లో ఆవిష్కరించారు.
కన్నడ ప్రజల సంస్కృతి, ఆత్మగౌరవానికి ఆ జెండా గుర్తుగా ఉంటుందని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య అన్నారు.
తెలుపు రంగు మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. పసుపు క్షమాగుణానికి, తెలుపు శాంతికి, ఎరుపు ధైర్యానికి ప్రతీకలుగా ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, Simmering Kitchen/Twitter
6.మైసూరు బోండ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బాగా తెలిసిన మరొక కర్ణాటక వంటకం మైసూరు బోండ.
దీన్ని కర్ణాటకలో మంగళూరు బజ్జీ లేదా గోలీబజ్జీ అని పిలుస్తారు. మైదా, పెరుగు, బియ్యం పిండి వంటి వాటితో దీన్ని చేస్తారు. దీని మూలాలు మంగళూరులో ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
7.కర్ణాటక కాఫీ
కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
చిక్కమగళూరు, కొడగు, హసన్ జిల్లాలు కాఫీ ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలు. కాఫీ బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోనే ఏర్పాటు చేసింది.
2021-22లో 2,41,650 మెట్రిక్ టన్నుల కాఫీని కర్ణాటక ఉత్పత్తి చేసింది. ఇదే సమయంలో కేరళ 69,900 మెట్రిక్ టన్నులు, తమిళనాడు 17,970 టన్నులను ఉత్పత్తి చేశాయి.

ఫొటో సోర్స్, Bimlesh Gundurao | Foundership/Twitter
8.గోమటేశ్వర విగ్రహం
జైన క్షేత్రమైన శ్రావణబెలగోలలోని 18 మీటర్ల ఎత్తు ఉండే గోమటేశ్వరుని విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఎత్తైన ఏకశిలా విగ్రహాల్లో ఇదీ ఒకటని చెబుతారు. 981 సంవత్సరంలో దీన్ని చెక్కారు.
30 కిలోమీటర్ల దూరం వరకు ఇది కనిపిస్తుందని అంటారు.

ఫొటో సోర్స్, PMO India/Facebook
9.జాతీయ జెండా తయారీ
భారతదేశం అధికారికంగా ఉపయోగించే జెండాలను కర్ణాటకలోనే తయారు చేస్తారు.
కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ(కేకేజీఎస్ఎస్) కొన్ని దశబ్దాలుగా కేంద్ర ప్రభుత్వానికి జాతీయ జెండాలను సరఫరా చేసే ఏకైక సంస్థగా ఉంది.
కేంద్రప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలకు కూడా ఇదే జాతీయ జెండాలను తయారు చేసి పంపిస్తుంది.

ఫొటో సోర్స్, Karnataka Tourism/Facebook
10.లింగాయత మతం
హిందూ, క్రైస్తవం, ఇస్లాం మాదిరిగా తమదీ ఒక మతమని లింగాయతులు చెబుతారు. 12వ శతాబ్దానికి చెందిన బసవన్న లింగాయత మతానికి ఆద్యుడని చెబుతారు.
లింగాయతులు తమను హిందువులుగా పరిగణించరు. లింగాయతాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది.
2018 కర్ణాటక ఎన్నికల సందర్భంగా లింగాయతాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. అయితే కేంద్రప్రభుత్వం ఆ మతానికి మైనారిటీ హోదా ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












