తెలుగు, కన్నడ భాషల లిపి చూడడానికి ఒకేలా ఎందుకు ఉంటుంది... ఒకప్పుడు ఈ రెండు భాషలూ ఒకటేనా?

ఫొటో సోర్స్, Twitter/Nikhil Pujar
- రచయిత, వి.రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ಬಿಬಿಸಿ ನ್ಯೂಸ್ ತೆಲುಗುಗೆ ಸುಸ್ವಾಗತ’’
మీలో కొందరు ఈ వాక్యాన్ని చదవగలిగే ఉంటారు. అర్థం కూడా తెలిసే ఉంటుంది.
చదవలేకపోయినా అర్థం తెలియకపోయినా అది ‘కన్నడ’ భాష అని చాలామంది చెప్పగలరు.
చూడటానికి కన్నడ లిపి, తెలుగు లిపి రెండూ కాస్త దగ్గరగా ఉండటమే ఇందుకు కారణం.
కన్నడలో పైన రాసిన వాక్యాన్ని తెలుగులో రాస్తే ఇలా ఉంటుంది...
‘‘బీబీసీ న్యూస్ తెలుగుకు స్వాగతం’’
ఇలా ఎందుకో తెలియాలంటే కాస్త భాషల చరిత్రను తెలుసుకోవాలి.


ఫొటో సోర్స్, WTCHYD2017/TWITTER
భాషలు-మూలాలు
ప్రపంచంలో ప్రతి భాషకు ఒక చరిత్ర ఉంది. వాటి మూలాలు (జీనియలాజికల్), నిర్మాణం (గ్రామర్) ఆధారంగా భాషలను కుటుంబాలుగా విడతీశారు.
ఇలా చూస్తే భారత్‌లో ప్రధానంగా 5 భాషా కుటుంబాలు కనిపిస్తాయి.
ఇండో-యూరోపియన్: సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, గ్రీక్, లాటిన్
ద్రవిడియన్: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గోండి, కోయ
ఆస్ట్రో-ఏసియాటిక్: సంతాళి, ముండారి, సవర, ఖాశీ
టిబెటో-బర్మీస్: మణిపురి, బోడో, త్రిపురి, టిబెటన్
సెమిటో హామిటిక్: అరబిక్/అరబి
వివిధ భాషా కుటుంబాలు, వాటికి చెందిన కొన్ని భాషలను పైన చూశాం. తెలుగు, కన్నడ భాషల మధ్య పోలికలు తెలియాలంటే ద్రావిడ భాషా కుటుంబం గురించి తెలుసుకోవాలి.


ఫొటో సోర్స్, indianculture.gov.in
ద్రావిడ భాషలు:
భారత్‌లో ప్రధానమైన భాషా కుటుంబాల్లో ‘ద్రావిడ’ ఒకటి. దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వంటి భాషలు ఈ కుటుంబంలో ఉన్నాయి.
అందుకే వీటిని ద్రావిడ భాషలు అని అంటారు.
ప్రముఖ భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి పరిశీలన ప్రకారం, 26కు పైగా ద్రావిడ భాషలున్నాయి. వీటిని మళ్లీ నాలుగు గ్రూపులుగా విభజించారు.
దక్షిణ ద్రావిడ భాషలు: తమిళం, మలయాళం, కన్నడ, ఇరుళ, కురుంబ, కొడగు, తోడ, కోట, బడగ, కొరగ, తులు
దక్షిణ-మధ్య ద్రావిడ భాషలు: తెలుగు, గోండి, కొండ, పెంగో, మండ, కుయి, కువి
మధ్య ద్రావిడ భాషలు: గడబ, పర్జీ, కోలామీ, నాయక్రి, నాయకి, ఒల్లారి
ఉత్తర ద్రావిడ భాషలు: కురుఖ్, మాల్తో, బ్రాహుయి
వీటన్నింటికీ మళ్లీ కొన్ని మూల భాషలున్నాయి. అవి... ‘‘మూల దక్షిణ ద్రావిడం’’, ‘‘మూల మధ్య ద్రావిడం’’, ‘‘మూల ఉత్తర ద్రావిడం’’.
ఇవి ‘‘మూల ద్రావిడం’’ నుంచి పుట్టుకొచ్చాయి.

ఫొటో సోర్స్, @MPI_SHH
ఒకటే మూలం
‘‘మూల దక్షిణ ద్రావిడ’’ భాషల సమూహం నుంచే దక్షిణ ద్రావిడ భాషలు, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలు వచ్చాయని ‘‘ద ద్రవిడియన్ లాంగ్వేజెస్’’ అనే పుస్తకంలో భద్రిరాజు కృష్ణమూర్తి రాశారు.
అంటే తెలుగు, కన్నడ భాషలు ఒకే మూలం నుంచి వచ్చాయి. అందువల్ల ఈ రెండు భాషల మధ్య లిపి, నిర్మాణం వంటి వాటిలో సారూప్యతలు కనిపిస్తాయి.
క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన ‘బ్రాహ్మి’ లిపి నుంచి ఇండో-ఆర్యన్, ద్రావిడ భాషల లిపిలు వచ్చాయి. మౌర్యచక్రవర్తుల్లో ఒకడైన అశోకుడు బౌద్ధమతాన్ని ఆచరించాడు. అశోకుడు తన రాజ్యంలో రాళ్ల మీద ప్రాకృతంలో చెక్కించిన బుద్ధుని బోధనలు బ్రాహ్మి లిపిలోనే ఉన్నాయి.
అశోకుని తరువాత రెండు వేల సంవత్సరాల కాలంలో బ్రాహ్మి లిపిలో అనేక మార్పులు వచ్చాయి. అది స్థానిక లిపిలుగా విడిపోయి పరిణామం చెందుతూ వచ్చింది. 10వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్య చాలా వరకు ఇండో-ఆర్యన్, ద్రావిడ లిపిలు తమకంటూ ప్రత్యేకతలను రూపొందించుకున్నాయి.
అశోకుని కాలం నాటి బ్రాహ్మి లిపి నుంచి ఉత్తర, దక్షిణ, పశ్చిమ బ్రాహ్మి అనే మూడు శాఖలు పుట్టుకొచ్చాయి.
దక్షిణ బ్రాహ్మి శాఖలో రెండు రకాల లిపిలు ప్రధానంగా ఉన్నాయి. అవి..
1.తెలుగు-కన్నడ
2.తమిళం-మలయాళం
పాకృత భాషలోని అనేక శాసనాల్లో ‘‘దక్షిణ బ్రాహ్మి’’ లిపికి చెందిన ఒక రకం కనిపించింది. 6వ శతాబ్దం నాటికి ఆ రకం కాస్త ‘‘తెలుగు-కన్నడ’’ లిపిగా పరిణామం చెందింది. తెలుగు, కన్నడ భాషలో వేసిన శాసనాలు కూడా 6వ శతాబ్దం నుంచి కనిపించడం మొదలైంది.
నేడు మనం చూస్తున్న తెలుగు, కన్నడ లిపిలకు మూలం ఈ ‘‘తెలుగు-కన్నడ’’ లిపినే.
ఉదాహరణకు క్రీ.శ.624 నుంచి 1,189 మధ్య తెలుగు ప్రాంతాలను పాలించిన వేంగి చాళుక్యుల కాలంలో శాసనాలు ‘‘తెలుగు-కన్నడ’’ లిపిలో ఉండేవి.

వేరు పడిన దారులు
15వ శతాబ్దం వరకు ‘‘తెలుగు-కన్నడ’’ లిపి పరిణామం చెందుతూ వచ్చింది. ఆ తరువాత రెండు భాషలు విడిపోయి విడివిడిగా ప్రయాణించాయి. 14వ శతాబ్దం నాటికి పాత తెలుగు లిపి, హళగన్నడ లిపిల మధ్య స్పష్టమైన తేడాలు కనిపించాయి.
తెలుగు లిపిలో అక్షరాల మీద ఉండే చిన్న ‘అడ్డగీత’ కాస్త ‘తలకట్టు’గా మారింది. వంకర టింకరలుగా ఉండే అక్షరాలు గుండ్రంగా (సర్క్యులారిటీ) మారాయి.
అయితే కన్నడ లిపిలో ‘అడ్డగీత’లు తలకట్టులుగా మారలేదు. లిపిలో వంకర టింకరలు పూర్తిగా పోలేదు. కన్నడ లిపి కోణాకారంగా మారింది.
అచ్చుయంత్రం వచ్చిన తరువాత ప్రింట్ చేయడంలో భాగంగా తెలుగు, కన్నడ భాషల లిపిలను స్థిరీకరించారు. అంటే ఇప్పుడు మనం కామా(,), ఫుల్ స్టాప్(.) వంటివి వాడుతున్నాం. కానీ పూర్వం విరామ చిహ్నంగా ఒక నిలువు గీత (|) ఉండేది. వాక్యం పూర్తి అయింది అని తెలపడానికి సంకేతంగా రెండు నిలువు గీతలు (||) ఉండేవి.
విదేశీయులు అచ్చుయంత్రాన్ని తీసుకొచ్చి ముద్రణ ప్రారంభించిన తరువాత, అక్షరాలు చక్కని రూపాన్ని సంతరించుకోవడంతోపాటు కామా(,), ఫుల్ స్టాప్(.) వంటివి వచ్చి చేరాయి.
పూర్వం తెలుగు, కన్నడ భాషల లిపి ఒకటేనని పరిణామక్రమంలో అవి రెండూ విడిపోయాయని ప్రాచీన తెలుగు భాషా కేంద్రం (ఆంధ్ర-తెలంగాణ) డైరెక్టర్, ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ అన్నారు.
‘‘శబ్దం పరంగా తెలుగు, కన్నడం ఎప్పుడో విడిపోయాయి. లిపి విడిపోవడం అనేది సుమారు 500 ఏళ్ల కిందట జరిగింది. ఒక కుటుంబంలోని అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఎవరి భావాల ప్రకారం వారి పద్ధతులు ఏర్పడతాయి. అలాగే భాష కూడా.
ఒకప్పుడు ‘ప’ను తెలుగులోనూ కన్నడలోనూ ఒకే విధంగా ‘ప’ అనే పలికే వారు. కానీ ఇప్పుడు కన్నడలో ‘హ’ అని పలుకుతున్నారు. బహువచనాలు తెలుగులో తప్పనిసరిగా ఉంటాయి. కానీ కన్నడలో కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు’’ అని సంపత్ కుమార్ బీబీసీతో అన్నారు.
(ఆధారం: భాషా శాస్తవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి రాసిన ‘‘ద్రవిడియన్ లాంగ్వేజెస్’’, అలాగే ఆయన సంపాదకత్వంలో వచ్చిన ‘‘తెలుగు భాషా చరిత్ర’’ పుస్తకాల నుంచి తీసుకున్న సమాచారం)
ఇవి కూడా చదవండి
- జనగణమన: జాతీయగీతానికి మదనపల్లెకూ సంబంధం ఏమిటి?
- ఐశ్వర్య తాటికొండ: టెక్సస్ కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదీ, ఆమె ఫ్రెండ్‌కూ బుల్లెట్ గాయాలు
- పాకిస్తాన్: ఉచిత ఆహారం కోసం క్యూ కడుతున్న ప్రజలు... రాజకీయ కలహాలే ఆ దేశాన్ని చిందరవందర చేస్తున్నాయా?
- కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మళ్లీ వస్తుందా, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా? గ్రాఫిక్స్‌లో రాజకీయ ముఖచిత్రం
- తెలంగాణ: రబీ సాగును ముందుకు జరపాలని కేసీఆర్ ఎందుకు అంటున్నారు? ఇది రైతులకు ప్రయోజనకరమేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















