తెలంగాణ: రబీ సాగును ముందుకు జరపాలని కేసీఆర్ ఎందుకు అంటున్నారు? ఇది రైతులకు ప్రయోజనకరమేనా?

తెలంగాణ వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

అకాల వర్షాలతో భారీ విస్తీర్ణంలో కలిగిన పంట నష్టంతో తెలంగాణలో రబీ సాగు ముందే ప్రారంభించాలన్న చర్చ సాగుతోంది. ఈ దిశలో చర్యలు చేపట్టాలని, రైతులకు అవగాహన కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర యంత్రాంగాన్ని కోరారు.

రబీ ముందస్తు సాగుకు ఉన్న అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లపై రైతులు, వ్యవసాయ నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఈ రబీ (2022-23) సీజన్‌లో 72 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి.

ఈ సీజన్‌లో కురిసిన అకాల వర్షాలకు వరి సాగుచేసిన రైతులే ఎక్కువగా నష్టపోయారు.

వడగళ్ళతో పొలంలోనే కంకి నుంచి ధాన్యం గింజలు రాలిపోవడం, ధాన్యం ఆరబోసిన సమయంలో వర్షాలతో తడవడంతో నష్టం వాటిల్లింది.

అకాల వర్షాలు, వడగళ్ల నుంచి పంట రక్షణకు మార్చిలోపు రబీ సీజన్‌ను ముగించాలన్న చర్చ తెలంగాణ ప్రభుత్వంలో మొదలయ్యింది.

‘’అకాల వర్షాల బారిన పడకుండా మార్చి నెలాఖరు లోపు యాసంగి పంటలు చేతికి వచ్చేలా రబీ సీజన్ ఒక నెల ముందుకు జరుపుకొని ప్రణాళికాబద్ధంగా సాగు జరగాలి. ఈ విషయంలో రైతులను చైతన్యం చేస్తున్నాం. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, సూర్యాపేట ప్రాంతాల్లో రైతులు దీనిని అనుసరిస్తున్నారు’’ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

వ్యవసాయం, తెలంగాణ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

పెరుగుతున్న వరి సాగు విస్తీర్ణం

తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. నిరుడు రబీలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, ఈ ఏడాది రబీలో 56 లక్షల ఎకరాల్లో సాగు అయిందని ప్రభుత్వ అంచనా.

ఉచిత వ్యవసాయ విద్యుత్, భూగర్భ జలాలు పెరగడం, పంట పెట్టుబడి సహాయం, గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. వంటి అంశాలు వరి విస్తీర్ణం పెరగడానికి ఊతం ఇచ్చాయన్న విశ్లేషణలు ఉన్నాయి.

పంట నష్టం అంచనాపై క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సర్వేలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఈ వివరాలను మే 12లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావ్ ఆదేశాలు జారీ చేశారు.

అకాల వర్షాలతో మార్చ్ 23 నాటికి తెలంగాణలో 2.28 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వర్షాలు కొనసాగడంతో పంటనష్టం పెరుగుతూ పోతోంది. ఇప్పటికే సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నది ఒక ప్రాథమిక అంచన.

ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పంట నష్టం జరిగింది.

వ్యవసాయం, తెలంగాణ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

వాతావరణ మార్పుల ప్రభావమేనా?

వాతావరణ మార్పులే ప్రకృతి విపత్తులకు కారణం అవుతున్నాయని, విపత్తుల నుంచి తక్కువ నష్టంతో రైతులు బయటపడేందుకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, సాగు పద్ధతుల్లో మార్పుల అవసరం ఉందని రైతు సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

గతంతో పోలిస్తే ఈ రబీలో ఎక్కువ రోజులు అకాల వర్షాలు కొనసాగడంతో నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికలపై ఇటీవల వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.

నష్టాలు జరగకుండా ఏటా ముందస్తు వరి నాట్లు వేసుకుని మార్చి నెలాఖరుకల్లా యాసంగి వరికోతలు పూర్తి చేసేలా చూడాలని సీఎం కోరారు.

ఈ అంశంలో శాస్త్రీయంగా అధ్యయనం చేసి వాతావరణ మార్పులతో తలెత్తుతున్న పరిణామాలకు అనుగుణమైన విధానాలపై రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ శాఖను ఆయన ఆదేశించారు.

నిరుడు రబీ బియ్యం సేకరణలో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ‘బాయిల్డ్ రైస్’ విషయంలో పేచీ వచ్చింది. ముడి బియ్యం మాత్రమే కొంటామన్న కేంద్ర నిర్ణయం వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ దిల్లీలో ధర్నాకు దిగారు.

తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల సమయంలో( ఏప్రిల్,మే) కోతకు వచ్చే రబీ ధాన్యం మిల్లింగ్ చేస్తే నూక శాతం ఎక్కువగా వస్తుంది. ఎఫ్‌సీఐ నిబంధనల మేరకు తక్కువ నూకలు వచ్చేందుకే బాయిల్డ్ రైస్‌గా మారుస్తున్నామన్నది తెలంగాణ వాదన.

మార్చ్ నెలాఖరు లోపే ధాన్యం చేతికి వస్తే ఈ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

వ్యవసాయం, తెలంగాణ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

తెలంగాణలో రబీ సాగు

నిజామాబాద్ లాంటి కొన్ని ప్రాంతాలు మినహా తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌లో వివిధ కారణాలతో జూన్ రెండో వారం మొదలు ఆగష్టు రెండో వారం వరకు వరి నాట్లు వేస్తున్నారు.

నారు, వరి నాట్ల సమయంలో వర్షాలు, సాగునీరు ఆలస్యం కావడం లేదా ఎక్కువ వర్షాలు కురిసి సాగుకు భూమి సిద్ధం కాకపోవడంతో ఆగస్టులో ఆలస్యంగా వేసిన పంట నవంబరు, డిసెంబరు నెలల్లో చేతికి వస్తోంది. ఆ తర్వాత రబీ సాగు కోసం జనవరిలో వరి నాట్లు వేస్తుండటంతో పంట కాలం ఏప్రిల్, మే వరకు పోతోంది. ఇది అకాల వర్షాలు, వడగళ్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉండే కాలం.

రబీ సాగు ఆలస్యం వెనుక కారణాలపై కరీంనగర్ జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన ఆదర్శ రైతు రాజమల్లయ్య బీబీసీ తో మాట్లాడారు.

‘’ఖరీఫ్ వరి కోతలకే నవంబరు పూర్తవుతోంది. డిసెంబరులో వరి నారు పోస్తే వరి పూత, పొట్ట దశలో, పాలినేషన్ సందర్భంలో ప్రభావంతో దిగుబడులు రావు. విస్తీర్ణం, దిగుబడులు పెరగడంతో మార్కెట్‌లో కొనుగోళ్లు పూర్తయ్యేందుకు ఆలస్యం అవుతోంది. అప్పటికే అకాల వర్షాలు వస్తున్నాయి. దిగుబడులకు అనుగుణంగా గోడౌన్ల సంఖ్య పెంచాలి’’ అని రాజమల్లయ్య అన్నారు.

వ్యవసాయం, తెలంగాణ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

ఖరీఫ్ పంట చేతికొచ్చాక భూమి ఆరక ముందే రబీ పంటలు వేస్తే దిగుబడి సరిగా రాదని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు.

‘‘గతంలో పంజాబ్ రైతులు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. అందుకే రైతులు కొంత కాలం భూమికి విరామం ఇస్తారు. డిసెంబరు, జనవరి నెలల్లో ఉండే చలి పరిస్థితుల్లో వరి నారు సరిగా పెరగదు. అందుకే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట విధానం, విత్తనాలు మారాలి’’ అని ఆయన చెప్పారు.

‘‘తెలంగాణలో వ్యవసాయ పరిశోధన కేంద్రాల అధీనంలో 27 వేల ఎకరాల భూమి ఉన్నా వారి పరిశోధనలు పేలవంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నూనె గింజలు, పప్పు ధాన్యాలను రబీ సీజన్‌లో మన రైతులే పండించేలా చేయాలి. మార్కెటింగ్ సదుపాయాలు కల్పించినప్పుడే రైతులు పంట మార్పిడికి ముందుకు వస్తారు’’ అని మల్లారెడ్డి అన్నారు.

రైతు మార్కెట్‌కు అమ్మకానికి తెచ్చిన మొదటి రోజే పంట తూకం జరగాలని, భూసార పరీక్షలు జరిపి దానికి అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహించాలని మల్లారెడ్డి చెప్పారు.

వ్యవసాయం, తెలంగాణ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

“వాతావరణ మార్పులపై దృష్టి పెట్టకపోతే వ్యవసాయ రంగం ముందుకు పోదు. అందుకే మా పరిశోధనలు ఆ దిశలోనే సాగుతున్నాయి. గతంతో పోలిస్తే పరిశోధన కేంద్రాల్లో పనిచేసే శాస్త్రవేత్తల సంఖ్య పెరిగింది. 2014 నుంచి తెలంగాణలో వరి, కందులు, మొక్కజొన్న వంటి పంటల్లో 56 రకాల కొత్త వంగడాలు వచ్చాయి" అని కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు బీబీసీతో అన్నారు.

ముందుగానే రబీ సాగు ఆరంభిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతుల అనుభవాలు ఎలా ఉన్నాయో తెలుసుకొనేందుకు బీబీసీ పలువురు రైతులతో మాట్లాడింది.

"సాధారణంగా రబీలో నవంబర్ మొదటి, రెండో వారంలో వరి నారు పోసుకుంటే మార్చి చివరి వరకు పంట నూర్పిడి అయిపోతుంది. దీంతో అకాల వర్షాల బారిన పడకుండా తక్కువ నూకతో నాణ్యమైన పంట వస్తుంది. సాగు నీరు ఉన్న వారు ఖరీఫ్‌ను త్వరగా ప్రారంభిస్తే రబీ సాగు అంతే త్వరగా పూర్తి చేయవచ్చు’’ అని చింతలూరుకు చెందిన ఆదర్శ రైతు ‘చిన్ని కృష్ణుడు’ బీబీసీతో అన్నారు.

‘‘రబీలో ఆలస్యంగా వరి వేసే వారు పంటకాలం తక్కువగా ఉండే మధ్యకాలిక, స్వల్ప కాలిక విత్తనాలను వేయాలి. విత్తనాలు వెదజల్లే విధానంలో వరిసాగు చేస్తే పక్షం రోజుల వరకు పంట సమయంతోపాటు నాట్లు వేసే కూలీల ఖర్చు కలిసి వస్తుంది. అయితే నాట్లు వేసిన పంటతో పోలిస్తే దిగుబడులు కొంత తక్కువగా వచ్చే అవకాశం ఉంది’’ అని కృష్ణుడు చెప్పారు.

వ్యవసాయం, తెలంగాణ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

నిపుణుల మాట ఏమిటి?

రబీని త్వరగా ప్రారంభించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలపై వ్యవసాయ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పంట చేతికి వస్తే కొనుగోళ్ల విషయంలో ఎదురయ్యే సమస్యలను ముందస్తు ప్రణాళికతో అధిగమించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.

పంట కోతకు సరిపడా హార్వెస్టర్లు, గన్నీ బ్యాగులు, ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత, గోడౌన్లను సిద్ధం చేయడంపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు.

డిసెంబరులో వరి నార్లు సరిగా ఎదగవన్న సమస్యను సరైన యాజమాన్య పద్ధతుల ద్వారా అధిగమించవచ్చని చెబుతున్నారు.

‘‘పొలం సిద్ధంగా లేక, చలికి నార్లు ఎర్ర రంగులో మారతాయని రబీ సాగు ఆలస్యం చేస్తుంటారు. చలిని తట్టుకునే జేజీఎల్24423, తెల్లహంస, గంగ, కావేరీ వంగడాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. వరి నారు చలిని తట్టుకునేందుకు 999, మల్టీకే లాంటి రసాయనాలు పిచికారి చేస్తే ఫలితం ఉంటుంది. విత్తనాలు వెదజల్లే విధానంలో సాగు చేస్తే కలుపు సమస్య ఉంటుందని అని రైతులు ముందుకు రారు. గతంలో కంటే మంచి కలుపు మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సరైన పద్ధతులు పాటిస్తే వెదజల్లే విధానంలో కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు’’ అని రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రం రైస్ బ్రీడింగ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ చంద్రమోహన్ తెలిపారు.

‘‘మే చివరి వారంలో ఖరీఫ్ పంట వేస్తే అక్టోబర్ 15 చివరిలోగా పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత లభించే గ్యాప్‌లో నవంబర్ 15లోగా భూమి సిద్ధం చేసుకుని రబీ సాగుకు వెళ్లవచ్చు. ఇలా చేస్తే అకాల వర్షాల బారి నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఇలా జరగాలంటే ఖరీఫ్ నుంచే రైతులకు సూచనలు చేయాలి’’ అని వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రమోహన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఖర్జూరం సాగు: ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడి’

తెలంగాణలో 365 రోజులు సాగుదశలో వరి పంట

వేర్వేరు సమయాల్లో ఖరీఫ్, రబీ వరి పంట చేతికి వస్తుండటంతో ఇప్పుడు సంవత్సరం అంతా, అన్ని రోజులు తెలంగాణలోని ఏదో ఒక ప్రాంతంలో వరి సాగు దశలో కనిపిస్తోంది.

దీంతో పంటసాగులో విరామం లేక వివిధ తెగుళ్లకు కారణం అయ్యే పురుగుల జీవితచక్రం నిరంతరం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో వరిలో ‘మొగి పురుగు’తో రైతులు ఇలానే ఇబ్బంది పడ్డారు.

‘‘ పంట మార్పిడి విధానంతో రోగాలు, తెగుళ్ళు కలిగించే పురుగులను నివారించవచ్చు. అయితే సరైన మార్కేటింగ్ సౌకర్యం లేకపోతే పంట మార్పిడికి రైతులు ముందుకురారు. పండించిన గ్రామంలోనే కొనుగోళ్లు చేస్తున్నారు.. కాబట్టే మార్కేటింగ్ ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతోనే రైతులు ఎక్కువగా వరికి మొగ్గుచూపుతున్నారు" అని సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, రూ.3,000 తో కోళ్ల పెంపకం మొదలుపెట్టిన పేద రైతు, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)