కర్ణాటకలో 'అమూల్‌ X నందిని' వివాదం ఏమిటి? గుజరాత్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు ఏమైంది?

ఆవులను మేపుతున్న మహిళ

ఫొటో సోర్స్, KMFNANDINI.COOP

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

భారత్‌లోని అతిపెద్ద మిల్క్ బ్రాండ్ అమూల్‌ త్వరలో ఎన్నికలు జరగబోతున్న కర్ణాటకలో కొత్త వివాదానికి కేంద్రమైంది.

కర్ణాటకలో 'అమూల్‌ X నందిని' వివాదం ఎలా మొదలైంది? ఆంధ్రప్రదేశ్‌కు అమూల్ వచ్చినప్పుడు ఏమైంది?

అమూల్ చేసిన ఒక ట్వీట్‌తో కర్ణాటకలో వివాదం మొదలైంది. తమ కొత్త ప్రణాళికలను వివరిస్తూ అమూల్ ఆ ట్వీట్ చేసింది. దీంతో ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రత్యేక ప్రచారాలు కనిపిస్తున్నాయి.

బెంగళూరులో కొత్తగా పాల విక్రయాలకు అమూల్ తీసుకొచ్చిన ప్రతిపాదన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) బ్రాండ్ నందిని వ్యాపారాన్ని దెబ్బతీసేదిగా చెబుతూ విమర్శలు, విశ్లేషణలూ వస్తున్నాయి.

పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్‌కు చెందిన కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) బ్రాండ్ 'అమూల్' దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక వ్యాపారంలో పాగా వేయాలని చూస్తోందని మీడియాలో కథనాలు కూడా ప్రచురించారు. ఇది రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. నందినిని ప్రాంతీయతకు ప్రతీకగా కర్ణాటకలో చూస్తున్నారు.

మే 10న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమూల్-నందిని వివాదం ప్రాధాన్యం సంతరించుకొంది.

నందిని ఉత్పత్తులు

ఫొటో సోర్స్, KMFNANDINI.COOP

కర్ణాటకలో ఏమిటీ వివాదం?

పాల వ్యాపారంలో ఒక రాష్ట్రానికి చెందిన సహకార సంఘం మరో రాష్ట్రంలోకి అడుగుపెట్టి అక్కడి సంఘం వ్యాపారాన్ని దెబ్బ తీయకూడదనే ఒక 'సంప్రదాయం' ఉంది. దీంతో అమూల్ ప్రతిపాదనలపై చాలా ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే, మిల్క్ కోఆపరేటివ్ వ్యాపారాన్ని అమూల్ మరో కోణంలో చూస్తోంది. తాము నందినిని దెబ్బ తీసేందుకు కర్ణాటకలో అడుగుపెట్టడంలేదని చెబుతోంది.

‘‘మేం నందినిని దెబ్బ తీసేందుకు మా పాల ధరను తగ్గించడం లేదు. నందినిని కూడా మేం పెద్ద బ్రాండ్‌గానే చూస్తున్నాం. ముంబయి, దిల్లీ నుంచి చండీగఢ్ వరకు దేశంలోని భిన్న నగరాల్లో లీటరు రూ.54కే మేం పాలను విక్రయిస్తున్నాం. బెంగళూరులో కూడా అదే ధరకు అమ్ముతాం. అక్కడ నందిని రూ.39కే లీటరు పాలను విక్రయిస్తోంది’’ అని అమూల్ ఎండీ జేఎన్ మెహ్తా బీబీసీతో చెప్పారు.

అయితే, టెట్రాప్యాక్ పాల ప్యాకెట్లు, లస్సీ, చాక్లెట్లు లాంటి అమూల్ ఉత్పత్తులను ఇప్పటికే బెంగళూరుతోపాటు కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.

‘‘బెంగళూరు, హాసన్, బళ్లారిలలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఫ్యాక్టరీల్లో ఇప్పటికే అమూల్ ఐస్ క్రీమ్‌ను తయారుచేస్తున్నాం. బెంగళూరుతోపాటు దక్షిణ భారత దేశంలోని వినియోగదారులకు సరఫరా చేసేందుకు మేం నందిని ప్లాంట్‌ల నుంచి రోజూ 30 వేల నుంచి 35 వేల లీటర్ల ఐస్ క్రీమ్‌ను కొనుగోలు చేస్తుంటాం. మా మధ్య చాలా మంచి సంబంధం ఉంది. మేం ఒకేలాంటి విలువలు పాటిస్తాం. మా లక్ష్యం కూడా ఒకటే’’ అని ఆయన చెప్పారు.

అమూల్

ఫొటో సోర్స్, Getty Images

దీనిపై కేఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ సతీశ్ బీబీసీతో మాట్లాడుతూ- ‘‘మా దగ్గర పాలు అదనంగా ఉండేటప్పుడు మిగతా కోఆపరేటివ్‌లకు వారి ఉత్పత్తుల తయారీలో సహకరిస్తాం. దీనిని కోప్యాకింగ్ అంటారు. అది అమూల్ కావచ్చు. లేదా ఇంకేదైనా వ్యాపార సంస్థ కావచ్చు. ఉదాహరణకు మేం పాలు ఎక్కువగా సేకరించినప్పుడు, చీజ్, పనీర్ లాంటి ఇతర ఉత్పత్తులను అమూల్ కొంటుంది’’ అని ఆయన చెప్పారు.

ఈ-కామర్స్ సైట్ల ద్వారా బెంగళూరులో పాలను విక్రయించేందుకు ప్రస్తుతం అమూల్ ప్రణాళికలు రచిస్తోంది.

‘‘మేం పాలను విక్రయించని నగరాల్లోని ఈ-కామర్స్ డేటాను పరిశీలించినప్పుడు, అక్కడి ప్రజలు కూడా మా ఉత్పత్తుల గురించి సెర్చ్ చేస్తున్నట్లు తెలిసింది. అక్కడ మా ఉత్పత్తుల కోసం మేం నందిని పాలనే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం’’ అని మెహ్తా చెప్పారు.

అయితే, ఈ విషయంపై ఒక కేఎంఎఫ్ మాజీ అధికారి బీబీసీ హిందీతో మాట్లాడుతూ.. ‘‘కోఆపరేటివ్‌ల మధ్య ఎప్పుడూ ఒకరకమైన అంగీకారం ఉంటుంది. మార్కెట్‌లో ఏదైనా కొరత వస్తే తప్పా, ఒక మార్కెట్‌లోకి మరొకరు అడుగు పెట్టకూడదనే సంప్రదాయాన్ని అందరూ పాటిస్తారు’’ అని వివరించారు.

ఈ మాటతో మెహ్తా ఏకీభవించారు. అయితే ఇక్కడ తామేమీ ధరలు తగ్గించి వేరొక కోఆపరేటివ్‌ను దెబ్బ తీయడంలేదని ఆయన చెప్పారు. ‘‘మేం మా ఉత్పత్తుల కోసం నందిని దగ్గర పాలను సేకరిస్తూనే ఉంటాం’’ అని ఆయన అన్నారు.

అమూల్

బెంగళూరును అమూల్ ఎలా చూస్తోంది?

బెంగళూరును రోజుకు 30 లక్షల లీటర్ల నుంచి 35 లక్షల లీటర్లు అవసరమయ్యే మార్కెట్‌గా అమూల్ చూస్తోంది. అయినా, అమూల్ నుంచి కర్ణాటకకు పాలు రావడం ఇదేమీ కొత్త కాదు.

హుబ్బళ్లి-ధార్వాడ్‌తోపాటు ఉత్తర కర్ణాటకలోని చాలా ప్రాంతాలకు రోజుకు పది వేల లీటర్ల పాలను అమూల్ విక్రయిస్తోంది.

మొత్తంగా గుజరాత్, దిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లో అమూల్ పాలను విక్రయిస్తోంది. మరోవైపు కేఎంఎఫ్ కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా, మహారాష్ట్రలలో పాలు అమ్ముతోంది.

బెంగళూరుకు అవసరమయ్యే 33 లక్షల లీటర్ల పాలలో కేఎంఎఫ్ 26 లక్షల లీటర్లు సరఫరా చేస్తుందని సతీశ్ చెప్పారు.

‘‘డిమాండ్ ఎక్కువయ్యే సీజన్‌లో ఇది 94 లక్షల లీటర్లకు కూడా పెరుగుతుంది. ఉదాహరణకు కేరళలో ఓనం సీజన్‌లో రోజుకు నాలుగు లక్షల లీటర్లు అదనంగా అవసరం అవుతాయి. దీని కోసం అక్కడి కోఆపరేటివ్ ఎంఐఎల్ఎంఏ మాకు సరఫరా చేస్తుంది. పొరుగు రాష్ట్రాల కోఆపరేటివ్‌ల మధ్య అలాంటి సంబంధాలు ఎప్పుడూ ఉంటాయి’’ అని సతీశ్ చెప్పారు.

ఎవరైనా మార్కెట్‌లోకి వచ్చినప్పుడు అభ్యంతరాలు లేవనెత్తాల్సిన అవసరంలేదని, కానీ, ప్రస్తుత పరిస్థితి వేరని కేఎంఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రేమానంద్ ఎస్ఏ చెప్పారు.

‘‘మేమంతా వర్గీస్ కురియన్ కోఆపరేటివ్ నిబంధనలు పాటిస్తాం. నందిని దగ్గరే పాలు అదనంగా ఉంటున్నప్పుడు అమూల్ ఎందుకు మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది? ముంబయి, గోవాలకు కేఎంఎఫ్ వెళ్లింది. అది నిజమే కానీ, అక్కడ పాలు కొరత ఉన్నప్పుడు మాత్రమే వెళ్లింది. కానీ, ఈ విషయంలో రాజకీయాలు చేయకూడదు’’ అని ఆయన

బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.

అమూల్

ఫొటో సోర్స్, Getty Images

ఆ ధరకు అమ్మితే నందినికి సమస్య ఉండదా?

మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు కర్ణాటకలో పాల వినియోగం తక్కువగా ఉందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్ డైరెక్టర్ డీ.రాజశేఖర్ బీబీసీతో చెప్పారు.

‘‘మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రమే పాలను ఎక్కువగా ఉపయోగస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాల వినియోగం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అమూల్ పాల ధర లీటరు రూ.54 అయితే, నందినికి ఎలాంటి సమస్యా ఉండకపోవచ్చు’’ అని ఆయన అన్నారు.

‘‘నాకు ఇది ఎందుకో రాజకీయ వివాదంలా అనిపిస్తోంది. ఆర్థికంగా వినియోగదారులపై ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం పడదు. కానీ, ఒకవేళ అమూల్ కర్ణాటకలో రైతుల నుంచి పాలను కొనుగోలు చేస్తే, ఇక్కడి రైతులకు మేలు జరుగుతుంది’’ అని రాజశేఖర్ చెప్పారు.

పాల కోఆపరేటివ్స్, రైతులపై ఆయన అధ్యయనం కూడా చేపట్టారు.

అమూల్

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ రంగు

కేఎంఎఫ్‌కు పాలను సరఫరా చేసే 26 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతుందని కర్ణాటకలోప్రతిపక్షాలైన కాంగ్రెస్, జనతా దళ్ సెక్యులర్ ప్రధానంగా ప్రస్తావించడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకొంది.

కేంద్ర కోఆపరేటివ్ శాఖను కూడా చూస్తున్న హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇటీవల ఒక మీటింగ్‌లో అమూల్, నందిని కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. దీంతో కర్ణాటకు గర్వకారణమైన నందిని గొంతు కోయాలని అమిత్ షా యత్నిస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

‘‘గుజరాత్‌కు వెలుపలున్న కోఆపరేటివ్‌లను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అమిత్ షా యత్నిస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో వీటిని దుర్వినియోగం చేసే అవకాశం ఆయనకు వస్తుంది’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ వైబీ శ్రీవత్స కూడా దీనిపై స్పందించారు.

‘‘ఎన్నికల సమయంలో కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని వివాదాన్ని రేపి బీజేపీ చాలా తప్పు చేసింది. నందిని అనేది కర్ణాటకకు గర్వకారణం. ఇది భావోద్వేగాలతో ముడిపడిన అంశం. నందిని ఉత్పత్తులు రాష్ట్రంలో అందరికీ బాగా తెలుసు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌లో 26 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 16 జిల్లాల్లో సేవలు అందిస్తూ 20 వేల కోట్లను ఆదాయాన్ని కేఎంఎఫ్ పొందుతోంది. క్షీర భాగ్య పథకం కింద ఇదివరకటి ప్రభుత్వం రైతులకు లీటరుపై రూ.5 రాయితీ ఇచ్చింది. దీంతో 2014లో 43 లక్షల లీటర్లుగా ఉండే పాల ఉత్పత్తి 2018 నాటికి 75 లక్షల లీటర్లకు పెరిగింది. బీజేపీ పాలనా కాలంలో ఈ రాయితీని పెంచలేదు. దీంతో పాల ఉత్పత్తి మళ్లీ పడిపోయే స్థాయికి వస్తోంది’’ అని ఆయన విమర్శించారు.

కర్ణాటక

ఫొటో సోర్స్, JAGADEESH NV/EPA

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధా రామయ్య ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

‘‘గుజరాత్‌కు చెందిన బరోడా బ్యాంకు మా విజయ బ్యాంకును మింగేసింది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు కూడా గుజరాత్‌కు చెందిన అదానీకి అప్పగించారు. ఇప్పుడు గుజరాత్‌కు చెందిన అమూల్ కేఎంఎఫ్‌ను తినేందుకు ప్రయత్నిస్తోంది. మోదీగారు మమ్మల్ని గుజరాత్ శత్రువులుగా భావిస్తున్నారా’’ అని ఆయన ప్రశ్నించారు.

కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ హాసన్‌లో నందిని స్టోర్‌కు వచ్చి అక్కడి పాల ఉత్పత్తులను ప్రజల ముందు తిన్నారు, అక్కడి ప్రజలకు వీటిని పంపిణీ చేశారు.

నందిని ఉత్పత్తుల కేంద్రం వద్ద శివకుమార్

ఫొటో సోర్స్, DKSHIVAKUMAR

ఫొటో క్యాప్షన్, నందిని స్టోర్‌ వద్ద డీకే శివకుమార్

‘‘మాకు గుజరాత్ రైతులతో ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, నందిని మార్కెట్‌ షేర్ కోతపడేలా అమూల్‌ను ప్రోత్సహించడం మాత్రం సరికాదు’’ అని శివకుమార్ అన్నారు.

జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి కూడా దీనిపై స్పందించారు. ‘‘బాందీపుర్ పులుల అభయారణ్యానికి మోదీ సఫారీకి వచ్చినప్పుడు.. చివర్లో నందినిని చంపేయాలని సుపారీ ఇచ్చారు’’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ చెప్పేది ఒకటి, చేసేది మరొకటని విమర్శిస్తూ ట్విటర్‌లో ఒక యూజర్ ట్వీట్ చేశారు.

హెరిటేజ్, దొడ్ల, మిల్కీ మిస్ట్, ఆరోక్య లాంటి ఇతర రాష్ట్రాల బ్రాండ్లు కర్ణాటక మార్కెట్‌లో ఇప్పటికే ఉన్నాయని, అమూల్‌తోనే సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు.

రైతు భరోసా కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ అనుభవం ఏమిటి?

శంకర్ వడిశెట్టి

బీబీసీ కోసం

అమూల్ సంస్థ ఆధ్వర్యంలో పాలసేకరణ, విక్రయం ఆంధ్రప్రదేశ్‌లోనూ జరుగుతున్నాయి. దీనికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తోంది.

ఏపీలో 2020 డిసెంబర్ 2న అమూల్ పాల సేకరణ మొదలయ్యింది. తొలుత చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆ తర్వాత గుంటూరు, పశ్చిమ గోదావరి వంటి ఇతర జిల్లాలకు విస్తరించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డెయిరీ నిర్వహణను ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో కుదుర్చుకున్న ఎంవోయూ మేరకు అమూల్‌‌కు అప్పగించారు.

300 కేంద్రాలతో మొదలయిన పాల సేకరణ ప్రస్తుతం 1500 కేంద్రాలకు విస్తరించినట్టు చెబుతున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాలసేకరణకు శ్రీకారంచుట్టారు.

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లోనే అమూల్ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి ప్రభుత్వమే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేసి అమూల్ సంస్థకు పాలుపోసేలా రైతులను ప్రోత్సహించింది.

అమూల్ ప్రారంభం నుంచే పాల సేకరణ ధర పెంచిన మూలంగా పోటీలో నిలబడేందుకు అన్ని ప్రైవేటు డెయిరీలు కూడా లీటర్‌కు రూ. 5 నుంచి 10 వరకూ పెంచాయని, ఫలితంగా సాధారణ రైతులకు లబ్ధి చేకూరిందని ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?

ఏపీలో నిలిచిపోయిన విస్తరణ

ఏపీలో ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి అమూల్ సంస్థకు లబ్ది చేకూర్చుతోందనే విమర్శలు విపక్షాల నుంచి వచ్చాయి.

అమూల్‌కే పాలుపోయాలని ఒత్తిడి తెస్తున్నారంటూ విపక్ష నాయకులు ఆరోపించారు.

అమూల్ సంస్థకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. సంగం డెయిరీ పిటిషన్‌పై కోర్టు ఉత్తర్వుల మేరకు అమూల్ విస్తరణ నిలిచిపోయింది. రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ అమూల్ ద్వారా ఏర్పాటు చేయదలచిన 10 వేల పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు కాలేదు.

అమూల్ సంస్థ నుంచి రైతులకు పాడిపశువులు కొనేందుకు రుణాలు, ఇతర ఏర్పాట్లు అందిస్తామన్న హామీ కూడా అమలు కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)