ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..

ఫొటో సోర్స్, DOUYIN
మెడకు గొలుసు బిగించి మహిళను నిర్బంధించిన కేసులో చైనా కోర్టు ఆరుగురికి శిక్ష విధించింది. చైనాలోని ఓ మారుమూల గ్రామంలో మహిళను నిర్బంధించిన ఘటన గతేడాది వెలుగుచూసింది.
మానవ అక్రమ రవాణాతో సంబంధమున్న ఈ కేసు గురించి చైనాలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
దేశాన్ని నివ్వెరపరిచిన ఈ ఘటన 'వధువుల అక్రమ రవాణా'పై ఉక్కుపాదం మోపేందుకు దారితీసింది.
మహిళను బంధించి, చిత్రహింసలకు గురిచేసినందుకు ఆమె భర్తకు కోర్టు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఐదుగురికి 8 నుంచి 13 ఏళ్ల శిక్ష విధించింది.
కానీ, ఈ శిక్షలు వారికి చాలా చిన్నవని, చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
2022 జనవరిలో షాహువామె ఉదంతం బయటి ప్రపంచానికి తెలిసింది. జాంగ్సు ప్రావిన్స్, షుఝౌ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో షాహువామెను ఒక వ్లాగర్ గుర్తించారు. ఇంటి బయట ఓ పాత షెడ్డులో, మెడకు ఇనుప చైన్‌తో ఆమె కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజాగ్రహంతో కదిలిన యంత్రాంగం
ఫెంగ్జియాన్ కౌంటీ నుంచి ఆ వ్లాగర్ చేసిన వీడియో వైరల్ అయింది. నలభైలలో ఉన్న షాహువామెకు 8 మంది పిల్లలున్నారని ఆ వీడియోలో తెలిపారు. ఆమె భయంభయంగా ఉన్నారని, మానసికంగానూ సరైన స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదని చెప్పారు. మహిళల అక్రమ రవాణాకు సంబంధం ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ ఘటన చైనాలో చర్చనీయాంశంగా మారింది. ఆమెకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా భారీ ఉద్యమం నడిచింది.
అయితే అక్రమ రవాణా జరిగిందని వచ్చిన వాదనలను స్థానిక అధికారులు మొదట కొట్టిపారేశారు.
వారిద్దరికీ వివాహం జరిగిందని, అందుకు వివాహ ధ్రువీకరణ పత్రం కూడా ఉందని స్పష్టం చేశారు. అవి కుటుంబ సమస్యలుగా చెప్పుకొచ్చారు.
అయితే షాహువామె షిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, ఇతరులతో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుండటం వల్లే చైన్‌తో కట్టేసినట్లు భర్త డాంగ్ జిమిన్స్ చెప్పారని అధికారులు వెల్లడించారు.
అయితే, అధికారుల ప్రకటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. అధికారుల కళ్లు మూసుకుపోయాయని తీవ్ర విమర్శలు చేశారు.
ఆమెకు చికిత్స అందించడంలో, మనుషుల అక్రమ రవాణా బాధితులకు భరోసానివ్వడంలో అధికారులు విఫలమయ్యారని సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి.
ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఈ కేసు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌కు దారితీసింది. అలాగే మహిళలు, చిన్నారుల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపేలా చేసింది.
ఈ కేసుకు సంబంధించిన చాలా వివరాలు విచారణ సందర్భంగా బయటికొచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
టీనేజ్‌లో ఉన్నప్పుడే కిడ్నాప్
యున్నాన్ ప్రావిన్స్‌కి చెందిన షాహువామె టీనేజర్‌గా ఉండగా 1998లో కిడ్నాప్‌కి గురైందని.. ఆమెను డొంఘాయ్‌కి చెందిన ఓ రైతుకి రూ. 51 వేలకు (5 వేల యువాన్లకు) అమ్మేసినట్లు కోర్టు తెలిపింది.
ఏడాది తర్వాత ఆమెను పలుమార్లు మానవ అక్రమ రవాణా గ్యాంగ్‌లకు అమ్మేశారు. చివరిగా ఓ జంట డాంగ్ తండ్రికి షాహువామెను విక్రయించింది.
డాంగ్ ఇంటికి వచ్చిన కొత్తలో షాహువామె ''ఆమె పనులు ఆమె చేసుకోవడంతో పాటు అందరితో మాట్లాడుతూ ఉండేది'' అని న్యాయమూర్తి తెలిపారు.
తన భార్యను చిత్రహింసలకు గురిచేయడం, దుర్భాషలాడిన కేసులో డాంగ్‌ని దోషిగా కోర్టు నిర్ధారించింది. పిల్లలను కనాలని భార్యను డాంగ్ బలవంతం చేశాడని, దాని ఫలితంగా 1999లో ఒకరు, 2011 - 2020 మధ్య మరో ఏడుగురు పిల్లలు జన్మించినట్లు కోర్టు తెలిపింది.
మూడో బిడ్డ పుట్టిన తర్వాత షిజోఫ్రీనియా వ్యాధితో షాహువామె తీవ్రంగా బాధపడేవారు. అయితే, ఆమె భర్త డాంగ్ మాత్రం మరింత దారుణంగా ప్రవర్తించాడని షుఝౌ సిటీ ఇంటర్మీడియెట్ పీపుల్స్ కోర్టు తెలిపింది.
''జీవితం నాశనం చేసిన వారికి విధించే శిక్ష ఇంతేనా?''
2017లో ఆమెను ఇంటి బయట ఉన్న ఓ షెడ్డులోకి మార్చారు. భర్త ఆమెను తాళ్లు, చైన్లతో కట్టేశాడు. ఆ షెడ్డులో నీళ్లు, విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. ఆమెకు భోజనం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు.
తన భార్యకు ఆరోగ్యం బాగోకపోయినా డాంగ్ వైద్యుల వద్దకు తీసుకెళ్లలేదు. కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితిని కూడా పట్టించుకోకుండా గర్భవతిని చేస్తూనే ఉన్నాడని జడ్జి యా హుయ్ తెలిపారు.
ఈ కేసు తీర్పు వార్త సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ వీబోలో టాప్‌లో నిలిచింది. తీర్పు వెలువడిన గంటలోనే కోటి మంది వరకు వీక్షించారు.
అయితే నిందితులకు విధించిన జైలు శిక్షలపై చాలా మంది ఆగ్రహం, నిరాశ వ్యక్తం చేశారు.
''జీవితం నాశనం చేసిన వారికి విధించే శిక్ష ఇంతేనా?'' అని ఒకరు కామెంట్ చేశారు.
''ఆమె పూర్తి జీవితం నాశనమైంది. కానీ, అతనికి తొమ్మిదేళ్ల జైలేనా?'' అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘ఎనిమిది మంది పిల్లలను కనేందుకు తొమ్మిదేళ్లు ఆమెకు సరిపోవు’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడిన వారికి గరిష్టంగా పదేళ్ల శిక్ష మాత్రమే అమలవుతుండటాన్ని కూడా కొందరు ప్రస్తావించారు.
కఠిన శిక్షలు లేకపోవడం వల్లే వధువుల అక్రమ రవాణా వ్యాపారానికి, వారిని కొనుగోలు చేస్తున్న వారిలో భయం లేకుండా పోయిందన్న వాదనలు వచ్చాయి. చట్టాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్న చర్చ కూడా జరిగింది.
ఆ శిక్షలు సరిపోవు. చట్టాలు మార్చాలి అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.
కొందరు షాహువామో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. గతేడాది ఆమె ఉదంతం బయటికి రావడంతో అధికారులు ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని చైనా మీడియా తెలిపింది.
ఇవి కూడా చదవండి
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














