యుక్రెయిన్ యుద్ధంలో ఓడితే రష్యా ముక్కలవుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 2000, మార్చి...
బీబీసీ చైనా సర్వీసులో పనిచేస్తున్న సహచరుడితో కలిసి మాస్కోలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లా.
అక్కడ కొందరు యువతులు జానపద పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు.
ఒక టేబుల్ వద్ద నుంచి మరొక టేబుల్ వద్దకు వెళ్తూ అక్కడ కూర్చొని ఉన్న యువ రష్యన్లను రంగ స్థలానికి తీసుకొస్తున్నారు.
ఆ యువకులంతా మిలిటరీ యూనిఫామ్‌లో ఉన్నారు. యుద్ధం ఇతివృత్తంగా ఆ నాట్యం సాగుతోంది.
పాడుతున్న జానపద పాటలన్నీ రష్యన్ సైనికుల సాహస గాథలకు సంబంధించినవి.
సంప్రదాయ గ్రామీణ దుస్తులు ధరించిన ఆ బాలికలంతా బాలురను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. పాత రోజుల్లో ఎలా జరిగేదో అచ్చం అలాగే వారిని తయారు చేస్తున్నారు.
అనంతరం ఓ రష్యన్ మిత్రుడు ఈ సంప్రదాయం ప్రాధాన్యాన్ని మాకు వివరించారు. రష్యాలో యువకులను ఇళ్ల నుంచి, గ్రామాల నుంచి యుద్ధ భూమికి పంపించడమంటే అసామాన్యమైన దేశ భక్తిని ప్రదర్శించడం.
దేశం కోసం త్యాగాలు చేయడం జానపద సంప్రదాయాల్లో భాగంగా మారింది.

ఫొటో సోర్స్, EPA
ప్రస్తుతం యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న రష్యన్ సైనికుల్లో ఆనాటి ప్రతిబింబాలను ఎవరైనా గమనించవచ్చు. రష్యాలోని చాలా ప్రావిన్సులు, గ్రామాలు, నగరాలకు చెందిన యువకులు సైన్యంలో చేరారు.
నాన్-రష్యన్ జాతులకు చెందిన వేలాది మంది యువకులు కూడా రష్యన్ సైన్యంతో కలిసి పోరాటం చేస్తున్నారు.
యుక్రెయిన్ మీద సైనిక చర్య ప్రకటించిన అనంతరం రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలుకుబడి ఒక్కసారిగా పెరిగింది. రెండు దశాబ్దాల క్రితం చెచెన్యా వేర్పాటు వాదులను అణచివేసినప్పుడు కూడా ఇదేవిధంగా ఆయన పాపులారిటీ అమాంతం అధికమయింది.
నిజానికి 2000లో మేం రష్యా వెళ్లింది అధ్యక్ష ఎన్నికల వార్తలు సేకరించడానికి.
చెచెన్యాలో తిరుగుబాటును అణచివేసిన తరువాత అప్పటికే వ్లాదిమిర్ పుతిన్ నేషనల్ హీరోగా మారారు.
అధ్యక్షునిగా ఎన్నికవుతారని ముందే నిశ్చయమైపోయింది. ఆయన భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
అయితే ఆ విజయంతో దేశంలో ప్రజాస్వామ్యం పతనం ప్రారంభమయిందని ఆయన విమర్శకులు ఇప్పుడు అంటున్నారు. ఆయన నిరంకుశునిగా మారారని చెబుతున్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద దాడి చేసినప్పటి నుంచి అమెరికా, యూరోప్‌ల్లో ఉన్న రష్యా నిపుణులు ఓ మాట చెప్పడం ప్రారంభించారు. పుతిన్ చేపట్టిన సైనిక చర్య రష్యాకు ఆత్మహత్యా సదృశంగా మారుతుందని అంటున్నారు.
యుక్రెయిన్‌లో ఓడిపోయిన తరువాత ప్రపంచంలో పెద్ద దేశమైన రష్యా ముక్కలయిపోతుందన్నది వారి అభిప్రాయం. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయిన రీతిలోనే ఇప్పుడూ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యన్ ఫెడరేషన్ విచ్ఛిన్నమవుతుందా?
రష్యన్ వ్యవహారాల నిపుణుడు, అమెరికన్ రచయిత జానుస్ బుగాజ్స్కీ గత ఏడాది చివర్లో ‘ఫెయిల్డ్ స్టేట్ ; ఏ గైడ్ టు రష్యన్ రప్చర్’ పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. ఆయన అందులో రష్యా విచ్ఛిన్నం గురించి రాశారు.
‘‘చిత్రంగా వ్లాదిమిర్ పుతిన్ రష్యా విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నట్టుంది. విచ్ఛిన్నాన్ని ఆపుతానని చెప్పే ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు దేశం పతనానికి కారకునిగా ఆయన గుర్తుండిపోతారేమో’’ అని వ్యాఖ్యానించారు.
స్వయంగా రష్యన్ అధ్యక్షుడు పుతిన్ కూడా గత ఏడాదిగా ఈ విషయంపైనే మాట్లాడుతున్నారు. పాశ్చాత్య దేశాలు, నాటోలు కలిసి రష్యన్ ఫెడరేషన్‌ను ముక్కల కింద విడదీసి, చిన్న చిన్న రాజ్యాలుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ తీవ్రమైన ఆరోపణలే చేశారు.
గత నెల చివర్లో ప్రభుత్వ ఆధీనంలోని టీవీ ఛానెల్ రొస్సియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇలాంటి ఆరోపణే చేశారు. సోవియట్ యూనియన్ పతనమయిన దగ్గర నుంచి రష్యాను విడదీయడానికి కుట్ర పన్నుతున్నాయని అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రష్యాను ముక్కలుగా విడదీయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ పాశ్చాత్య దేశాలపై ఆరోపణలు చేస్తున్న పుతిన్ మరోవైపు దేశ భూభాగాన్ని విస్తరింపజేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబరులో అధ్యక్షుడు పుతిన్ నాలుగు యుక్రెయిన్ ప్రావిన్సులను రష్యాలో కలుపుకొన్నారు.
మాస్కోలో జరిగిన ఆకర్షణీయ కార్యక్రమంలో డోనెట్స్క్, ఖెర్సాన్, లుహాన్స్క్, ఝపోరిజియా ప్రావిన్సులను విలీనం చేసుకున్నట్టు ప్రకటించారు.
అంతకుముందు ఆయా ప్రావిన్సుల్లో ‘ప్రజాభిప్రాయ సేకరణ’ కార్యక్రమాలను నిర్వహించారు.
2014లోనూ ఇలాంటి ‘ప్రజాభిప్రాయ సేకరణ’ పేరుతోనే క్రిమియాను ‘అక్రమంగా’ స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యన్ ఫెడరేషన్ సరిహద్దులు తూర్పు యూరోప్ నుంచి పశ్చిమ ఆసియా వరకు విస్తరించాయి. ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా గుర్తింపు పొందింది.
జనాభా మాత్రం 15 కోట్లే. సుమారుగా బిహార్ రాష్ట్రం జనాభా అంత ఉంటుంది. రష్యా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో తొమ్మిదవ స్థానాన్ని పొందింది.
మొదట్లో రష్యన్ ఫెడరేషన్ 83 రీజియన్లు, స్టేట్లు, నగరాలు, ప్రావిన్సులుగా ఉండేది. ప్రస్తుతం వాటి సంఖ్య 89కి పెరిగింది.
ఇందులో 21 ప్రావిన్సుల్లో మైనార్టీలైన నాన్-రష్యన్ జాతుల ప్రజలు నివసిస్తున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన సీనియర్ జర్నలిస్టు, ‘ఆస్ట్రేలియన్ ఫారిన్ అఫైర్స్’ పత్రిక సంపాదకుడు జొనాథన్ పెర్ల్ మాన్ మాత్రం రష్యా విభజనకు కుట్ర జరుగుతోందన్న వాదనతో ఏకీభవించడం లేదు.
‘‘రష్యన్ ఫెడరేషన్‌ను నాశనం చేయడానికి యూఎస్ ప్రయత్నిస్తుందనేందుకు ఎలాంటి సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది ఫిబ్రవరిలో పుతినే యుక్రెయిన్‌ను ఆక్రమించారు. ఆక్రమణల నుంచి కాపాడుకోవడానికే యుక్రెయిన్ కు అమెరికా, పాశ్చ్యాత్త దేశాలు సహకరిస్తున్నాయి.
యుక్రెయిన్ భూభాగాన్ని దురాక్రమణ చేసుకొని, ఆధీనంలో పెట్టుకోకుండా రష్యాను నిరోధించడం కోసమే ఈ సాయం చేస్తున్నాయి’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా విచ్ఛిన్నం కాబోదని దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ రష్యన్ అండ్ సెంట్రల్ ఆసియన్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అజయ్ పట్నాయక్ కూడా అభిప్రాయపడ్డారు.
ఆయన బీబీసీ హిందీతో మాట్లాడుతూ ‘‘రష్యా ముక్కలు కావాలంటే ఆ దేశంలో యుద్ధమైనా జరగాలి. లేదంటే యుద్ధంలో ఓడిపోవడమైనా జరగాలి. అప్పుడే విభజన సాధ్యమవుతుంది. వియత్నాం యుద్ధంలో ఓడిపోయిన తరువాత అమెరికా ఏమీ విచ్ఛిన్నం కాలేదు. యుద్ధంలో ఓటమి ఎదురయిన తరువాత నాయకత్వంలో మార్పు జరగవచ్చు. యుద్ధంలో రష్యా ఓడిపోయే అవకాశాలేమీ లేవు. యద్ధం మరో మార్గం కనిపించని చివరి దశకు చేరుకున్నా, కొన్ని ప్రాంతాలను రష్యా కోల్పోయినా కూడా దేశ స్వరూపంపై ఎలాంటి ప్రభావం చూపబోదు’’ అని చెప్పారు.
ప్రొఫెసర్ పట్నాయక్ అభిప్రాయం ప్రకారం రష్యాలో నాయకత్వ మార్పునకు గల అవకాశాలు కూడా తక్కువే. ‘‘ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. రష్యాలో అంతర్గతంగా ఈ యుద్ధం జరగడం లేదు. ఒకవేళ రష్యా కొన్ని భూభాగాలను కోల్పోయినా అవి యుక్రెయిన్ కు చెందినవే అయి ఉంటాయి. రష్యాపై విధించిన ఆంక్షలేవీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏమీ లేదు. ఒక వేళ రష్యన్ సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోతే దేశంలో నిరసనలు ఎదురు కావచ్చు. ఆ కారణంగా నాయకత్వంలో మార్పు ఉండవచ్చు.
రష్యా విడిపోదు అని చెప్పడానికి మూడో కారణం ఏమిటంటే యుక్రెయిన్ నుంచి రష్యాకు వలస వచ్ఛిన శరణార్థుల మద్దతు. ప్రస్తుతం అలాంటి వారు 27 లక్షల మంది వరకు ఉన్నారు. వారంతా రష్యన్ భాష మాట్లాడే వారు. రష్యన్ మూలాలకు చెందిన వారు. రష్యన్ నాగరికతకు చెందిన వారు. వారంతా పుతిన్‌తోనే ఉన్నారు’’ అని వివరించారు.
ఈ నిశ్చిత అభిప్రాయంతో ఆస్ట్రేలియన్ సీనియర్ జర్నలిస్టు జొనాథన్ పెర్ల్ మాన్ ఏకీభవించారు. బీబీసీకి ఇచ్చిన ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘ఒకవేళ రష్యా యుద్ధంలో ఓడిపోతే అది పుతిన్‌కు రాజకీయంగా నష్టం కలిగిస్తుంది. అయితే ఆయన బదులుగా ఎవరైనా బాధ్యతలు చేపట్టడానికి ఉన్నారా అని తెలుసుకోవడం కష్టమే’’ అని అన్నారు.
‘‘రష్యన్ ఫెడరేషన్ కుప్పకూలుతుందన్నది జరగని పని. రాజకీయ సంక్షోభానికి దారితీసే ఆర్థిక రంగ పతనాన్ని కూడా రష్యా చవిచూసే అవకాశం లేదన్నది గమనించాల్సిన విషయం. రష్యా ఇంధనం అమ్మకాలు చాలా అధికంగా ఉన్నాయి. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు బాగానే నడుస్తోంది’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, RUSSIAN PRESIDENCY
క్రెమ్లిన్..కేంద్రీకృత అధికార వ్యవస్థ
పశ్చిమ దేశాల్లోని రష్యన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం విశాలమైన ఆ దేశంలోని అధికారమంతా ఒక్క క్రెమ్లిన్‌లోనే కేంద్రీకృతమయింది. క్రెమ్లిన్ అనుమతి లేకుండా సుదూరంగా ఉన్న ప్రావిన్స్‌లోనూ ఏమీ జరగదు.
అమెరికన్ రచయిత జానుస్జ్ బుగాజ్స్కీ మాట వేరుగా ఉంది. రష్యన్ ఫెడరేషన్ అస్థిర పునాదులపై నిర్మితమయి ఉందన్నది ఆయన అభిప్రాయం. యుక్రెయిన్ యుద్ధం కారణంగా అది మరింత బలహీనమయిందని, అది ఎప్పుడయినా కూలి పోవచ్చని అంటున్నారు.
ఆయన బీబీసీ ఇండియాతో మాట్లాడుతూ ‘‘రష్యా బలమైన దేశం అన్న ఇమేజ్ వెనుక ఎన్నో బలహీనతలు ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ప్రస్తుతం జరుగుతున్న యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ బలహీనతలన్నీ బహిర్గతమయ్యాయి. ఆ లోపాలు అన్నింటినీ నా పుస్తకంలో ప్రస్తావించాను.
బలహీనపునాదిపై నిర్మితమైన నేషనల్ ఐడెంటిటీగానీ, జాతి నిర్మాణంగానీ, సాధారణ సమాజంగానీ, వివిధ జాతుల సమాజాలుగానీ.. ఇవన్నీ క్రెమ్లిన్ అధికార కేంద్రం ద్వారా ఒకటికొకటి అనుసంధానమై ఉన్నాయి. ఈ అధికార కేంద్రం ఒకప్పుడు కమ్యూనిస్టుల నియంత్రణలో ఉండగా, ఇప్పుడు పుతిన్ అధీనంలో ఉంది.
సోవియట్ యూనియన్ పతనమైన దగ్గర నుంచి రష్యన్ ఫెడరేషన్‌ను పశ్చిమ దేశాలు ముక్కలు చేస్తాయన్న ఆరోపణలను మనం వింటున్నాం’’ అని జానుస్జ్ బుగాజ్స్కీ అని చెప్పారు.
అయితే ఏ అమెరికన్ నాయకుడుగానీ, యూరోప్ నాయకుడుగానీ రష్యన్ ఫెడరేషన్ విచ్ఛిన్నం కావాలని కోరుకోవడం లేదని ఆయన చెప్పారు.
‘‘అయితే రష్యన్ ఫెడరేషన్ విచ్ఛిన్నమయితే చాలా లాభాలు ఉన్నాయని నమ్మేవారిలో నేనూ ఒకడ్ని. దాని వల్ల పొరుగు ధేశాలు సురక్షితంగా ఉంటాయి. రష్యన్ ఫెడరేషన్‌లో నివసిస్తున్న ప్రజలు బానిసత్వం నుంచి విముక్తి చెందుతారు’’ అని జానుస్జ్ బుగాజ్స్కీ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా ఫెడరేషన్ ముక్కలవడానికి అవకాశాలు చాలా తక్కువని వాషింగ్టన్‌లోని ద కేథలిక్ యూనివర్సిటీకి చెందిన చరిత్ర విభాగం ప్రొఫెసర్ మైఖెల్ సి కిమ్మేజ్ అభిప్రాయపడ్డారు. ఆయన అమెరికా-రష్యా సంబంధాలు, ప్రచ్ఛన్న యుద్ధం చరిత్ర అంశాల్లో నిపుణుడు కూడా. రష్యా, యుక్రెయిన్ వ్యవహారాలపై 2014 నుంచి 2016 వరకు అమెరికా రక్షణ శాఖలో నిపుణునిగా పనిచేశారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘పుతిన్ గత 20 ఏళ్లుగా చాలా బలమైన మిలిటరీ, రహస్య సేవల సంస్థలను నిర్మించారు. వీటిలో కొన్ని సోవియట్ యూనియన్ నుంచి వారసత్వంగా వచ్చినవి. ఈ వ్యవస్థలన్నీ ఆకస్మికంగా కూలిపోయే అవకాశాలు లేవు.
దగెస్తాన్, చెచెన్యా, నార్త కాకసస్ ప్రావిన్సులు రష్యా నుంచి విడిపోవడానికి నిర్దిష్టమైన ప్రయత్నాలు చేస్తున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సుదూరంలో ఉన్న తూర్పు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అంచనా వేయదగ్గ భవిష్యత్తు కాలం వరకు భౌగోళిక సమగ్రతను కాపాడుకునే సామర్థ్యం రష్యాకు ఉన్నట్టు కనిపిస్తోంది’’ అని కిమ్మేజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోతే పరిస్థితి ఏమిటన్నదానిపై ఫారిన్ పాలసీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అమెరికాకు చెందిన ఫిలిప్ వసైలేవస్కి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన దశాబ్దాల పాటు అమెరికా గూఢచారి సంస్థ సీఐఏలో పనిచేశారు.
యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోతే ఏమి జరగొచ్చు అనేదానిపై ఆయన ఇటీవల ఓ వ్యాసం రాశారు.
‘‘రష్యా ప్రభుత్వం కనుక ఓటమి పాలైన సైన్యాన్ని, బలహీనమైన నిఘా వ్యవస్థను కలిగి ఉంటే దేశంలో సాయుధ పోరాటం తలెత్తుతుంది. అది రష్యాకు శాపంలా మారుతుంది. దేశంలోని కొన్ని జాతుల రిపబ్లిక్‌లు దీన్ని అవకాశంగా తీసుకొని విడిపోవడానికి ప్రయత్నిస్తాయి. అది రష్యా ఫెడరేషన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెడుతుంది’’ అని చెప్పారు.
రష్యా విడిపోతే ఎదురయ్యే అణు యుద్ధం ముప్పు గురించి ఆస్ట్రేలియన్ సీనియర్ జర్నలిస్టు జోనాథన్ పెర్ల్ మాన్ మాట్లాడారు. రష్యా వద్ద అణ్వాయుధాల నిల్వలు ఉన్నాయని, అవి పశ్చిమ దేశాలకు, ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతాయని అన్నారు. ‘‘రష్యన్ ఫెడరేషన్ విచ్ఛిన్నమయితే ఈ సారి రష్యా సంఘటితంగా ఉండబోదు. సోవియట్ యూనియన్ పతనం నాడు ఉన్ననాటికన్నా అధికంగా అసంఘటితమవుతుంది. రష్యా వద్ద భారీ స్థాయిలో ఉన్న అణ్వాయుధాలను భద్రపరచడం చాలా కష్టంగా మారుతుంది’’ అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
విడిపోయిన చరిత్ర రష్యాది..
ప్రస్తుతానికి రష్యా విచ్ఛిన్నమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రొఫెసర్ మైఖేల్ కిమ్మేజ్ చెబుతున్నప్పటికీ ఒక చరిత్రకారునిగా మాత్రం అందుకుగల అవకాశాలను కొట్టిపారేయడం లేదు.
బీబీసీతో ఆయన మాట్లాడుతూ ‘‘ఇది నిజంగా జరిగే అవకాశం ఉంది. ఇందుకు చరిత్రలో రెండు ఉదాహరణలను మీరు చూడొచ్చు. మొదటిది 1991లో చోటుచేసుకుంది. అఫ్గానిస్తాన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఓడిపోయిన అనంతరం సోవియట్ విచ్ఛిన్నం కావడాన్ని మీరు గమనించవచ్చు’’ అని అన్నారు.
‘‘సోవియట్ యూనియన్ ముక్కలయింది. మాస్కోలో ప్రభుత్వం మారడమే కాదు, నిజానికి దేశం మ్యాపునే కొత్తగా రాయాల్సి వచ్చింది. సోవియట్ యూనియన్ 15 ప్రత్యేక స్వతంత్ర దేశాలుగా విడిపోయింది.
ఇంతకన్నా బలమైన ఉదాహరణ 1917లో ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా పూర్తిగా పరాజయం పాలు కాలేదు. కానీ చాలా కష్టాలను ఎదుర్కొంది. అవి 1917 విప్లవానికి దారి తీశాయి.
ఆ విప్లవం అంతర్యుద్ధంగా మారింది. దాని వల్ల రష్యన్ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలకపోయినా కొత్త సిద్ధాంతాలు అమల్లోకి వచ్చాయి’’ అని వివరించారు.
ఈ సందర్భంగా రష్యన్ వ్యవహరాల నిపుణుడు, రచయిత జానుస్జ్ బుగాజ్స్కీ ఇతర దేశాలను ఉదాహరణగా చూపించారు. 1990 తొలినాళ్లలో యుగోస్లావియా విభజనను గుర్తు చేశారు. అది ఒకేసారి కాకుండా క్రమేణా జరిగిందని చెప్పారు.
‘‘దేశంలో చాలా చోట్ల హింస నెలకొంది. కానీ రిపబ్లిక్ ల్లో ఉండేది కాదు. హింసాత్మక సంఘటనల్లో చిక్కుకున్న ఈ మినీ సామ్రాజ్యాన్ని ఐకమత్యంగా ఉంచడానికి బెల్ గ్రేడ్ (అధికార కేంద్రం) ప్రయత్నాలు చేసింది. కానీ సాధ్యం కాలేదు.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమాన్ సామ్రాజ్యం ఓడిపోయిన కారణంగా 1918 నుంచి 1922 వరకు గల కాలంలో తుర్కియే ముక్కచెక్కలయింది’’ అని వివరించారు.
రష్యన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రష్యన్ ఫెడరేషన్ విచ్ఛిన్నం తప్పించుకోలేనిది. అయితే అది క్రమేణా జరుగుతుంది.
రచయిత జానుస్జ్ బుగాజ్స్కీ బీబీసీతో మాట్లాడుతూ ‘‘సమయం విషయానికి వస్తే అది రాత్రికి రాత్రే జరగదు. కొంత కాలం పడుతుంది. యుగోస్లావియా విభజనకు పదేళ్లు పట్టింది. అదింకా పూర్తికాలేదని కొందరు వాదిస్తున్నారు. దేశ విభజన చాలా పెద్ద ప్రక్రియ. చాలా కాలం పాటు కొనసాగేది. మనం చాలా పెద్ద దేశం గురించి మాట్లాడుకుంటున్నామని గుర్తించుకోవాలి.
రెండోది యుక్రెయిన్ యుద్ధం తప్పకుండా విభజన ప్రక్రియను తప్పకుండా వేగవంతం చేస్తుంది. సైనికులు, ముఖ్యంగా పేద ప్రాంతాల వారు, రష్యన్ల చేతిలో వివక్షకు గురయ్యే నాన్-రష్యన్ జాతుల సైనికులు అధిక సంఖ్యలో గాయాలపాలయితే విభజన ఆలోచనలు కలుగుతాయి’’ అని చెప్పారు.
ఈ అభిప్రాయంతో ప్రొఫెసర్ పట్నాయక్ ఏకీభవించడం లేదు. అక్కడక్కడా ఉదాహరణలుగా చూపిన ఆయా దేశాల పరిస్థితులు ప్రత్యేక సందర్భాలని చెప్పారు.
‘‘యుగోస్లావియా విభజన వెనుక యూరోపియన్ యూనియన్, నాటోల పాత్ర ఎంతో ఉంది. నిజానికి 1917లో రష్యా..పశ్చిమ దేశాలతో కలిసి యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో ఓడిపోవడానికి ఆర్థిక పరిస్థితులే కారణం. సైనికులకు బూట్లు, యూనిఫారాలు కూడా లేవు. 1991లో సోవియట్ యూనియన్ విడిపోవడానికి యుద్ధం కారణం కాదు. రష్యా, బెలారుస్, యుక్రెయిన్‌లు దానిని విడగొట్టాయి. రాత్రికి రాత్రే అవి సోవియట్ నుంచి విడిపోయాయి’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా పతన సూచన చైనాకు శుభవార్తా?
రష్యన్ ఫెడరేషన్ పతనంగానీ, బలహీనపడడంగానీ చైనాకు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. సెంట్రల్ ఆసియా దేశాల్లో దాని ప్రభావాన్ని పెంచుకొవడానికి ఉపకరిస్తుందని అమెరికా రక్షణ శాఖలో పనిచేసిన కేథలిక్ యూనివర్సిటి ప్రొఫెసర్ మైఖేల్ కిమ్మేజ్ అన్నారు.
చైనా ఇఫ్పటికే సెంట్రల్ ఆసియాలో ప్రభావాన్ని పెంచుకొందని ఆయన చెప్పారు. వాటితో కలిసి పనిచేయడానికి చైనాకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు.
‘‘చైనా ఆకాంక్షలు ఏపాటివో తెలియదు కానీ, వాటిని నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు’’ అని చెప్పారు.
‘‘ఈ యుద్ధం చైనాకు మేలు చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది చైనాపై మరింతగా ఆధారపడే పరిస్థితులను రష్యాకు కలిగించింది. మరోవైపు యుక్రెయిన్ యుద్ధం కోసం యూరోప్, అమెరికాలు పెద్దయెత్తున వనరులను కుమ్మరిస్తున్నాయి. నిజానికి ఆ వనరులన్నీ చైనా ఆధిపత్యానికి కట్టడి చేయడానికి ఉద్దేశించినవి’’ అని మైఖేల్ కిమ్మేజ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
రచయిత జానుస్జ్ బుగాజ్స్కీ నమ్మకం ప్రకారం రష్యా బలహీనతలను చైనా ఉపయోగించుకుంటుంది.
‘‘చైనా దృష్టి కేవలం సెంట్రల్ ఆసియా దేశాలపైనే లేదు. రష్యాకు చెందిన తూర్పు, పసిఫిక్ ప్రాంతాలపైనా ఉంది. సరిహద్దులో ఉన్న ఆ ప్రాంతం 19వ శతాబ్దం వరకు చైనాలో భాగంగా ఉండేది. చైనా చాలా బలహీనంగా ఉన్న సమయంలో అవన్నీ రష్యా సామ్రాజ్యం అధీనంలోకి వచ్చాయి.
ఇప్పటికీ బీజింగ్‌లో ఈ విషయమై చాలా అసంతృప్తి నెలకొంది. రష్యా బలహీనపడిన వెంటనే ఇది తెరపైకి వస్తుంది.
చైనా కేవలం తూర్పు ప్రాంతాలపైనే కాకుండా వనరులు అధికంగా ఉన్న సైబీరియా, దూర ప్రాచ్యం, ఉత్తర సముద్ర మార్గాలపైనా దృష్టి పెట్టింది’’ అని వివరించారు.
చైనాను కట్టడి చేయడానికి పశ్చిమ దేశాలకు భారత్ అవసరం ఎంతో ఉందని జానుస్జ్ బుగాజ్స్కీ చెప్పారు.
‘‘ఎలాంటి హింస, ఘర్షణ లేకుండా చైనా ఆకాంక్షలను ఎలా కట్టడి చేయాలన్నది పెద్ద సవాలు. అయితే ఈ ప్రాంతంలో మనకు చాలా మంది మిత్రులు ఉన్నారు. చాలా దేశాలు ఉన్నాయి. మిత్ర దేశంగా ఇండియాను కూడా జత చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంత సుస్థిరత కోసం పశ్చిమ దేశాలకు భారత్ ఎంతో సాయం చేయగలదు’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రోఫెసర్ అజయ్ పట్నాయక్ అభిప్రాయం ప్రకారం గత 20 ఏళ్లుగా సెంట్రల్ ఆసియాలో ఉన్న అయిదు దేశాల్లో చైనా పాత్ర బాగా పెరిగింది. ‘‘చైనా ఆర్థిక శక్తి అధికమయింది. ఆ దేశాల్లోని మౌలిక వసతుల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆర్థికంగా ఆ దేశాల్లో బాగా చొచ్చుకుపోయింది. ప్రెసిడెంట్ ఎల్సిన్ హయాంలో సెంట్రల్ ఆసియాను రష్యా పూర్తిగా విస్మరించింది. పుతిన్ వచ్చిన తరువాత ఆ ప్రాంతంపై మళ్లీ శ్రద్ధ పెట్టారు.
ఆ ప్రాంతానికి నమ్మకమైన భాగస్వామిగా రష్యా మారింది. 1991లో సోవియట్ యూనియన్ విడిపోయిన తరువాత అఫ్గాన్-తజిక్ సరిహద్దును రష్యా సైనికులే కాపలా కాస్తున్నారు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ పాత్ర ఏ మేరకు?
ఒకవేళ యుద్ధంలో రష్యా ఓడిపోయి, రష్యన్ ఫెడరేషన్ విచ్ఛిన్నమయిన తరువాత దాని ప్రభావం భారత విదేశీ విధానంపై ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్య విస్తరణకు భారత్ సహకరిస్తుందని కొందరు నిపుణులు సమాధానం చెబుతున్నారు.
ప్రొఫెసర్ పట్నాయక్ మాత్రం మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘బయటవారు ప్రజాస్వామ్యాన్ని రుద్దే ప్రయత్నాలు చేస్తే అందుకు సెంట్రల్ ఆసియాలోని అయిదు దేశాలు అంగీకరించవు. తమ బాగోగులు చూసుకునే బలమైన నాయకులు ఉండాలని అక్కడి ప్రజలు కోరుకుంటారు.
ఆ దేశాలతో భారత్ సంబంధాలను బలపరుచుకొంది. అన్ని సెంట్రల్ ఆసియా దేశాలు ఆర్థిక పరంగా ఇండియాకు ముఖ్యమైనవే. సెంట్రల్ ఆసియా, యురేసియా దేశాలకు భారత్ నుంచి ట్రాన్స్ పోర్ట్ కారిడార్ అందుబాటులో లేదు.
రష్యా, కజక్ స్తాన్, కిర్గిస్తాన్, బెలారస్, ఆర్మేనియాలు కలిసి యురేసియా యూనియన్ గా ఏర్పాటయ్యాయి. ఈ దేశాల మధ్య స్వేచ్ఛగా సరకులు రవాణా చేసుకోవచ్చు. ట్రాన్స్ పోర్ట్ కారిడార్ ద్వారా ఈ దేశాల మార్కెట్ కు చేరుకోవాలని భారత్ కోరుకుంటోంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి’’ అని వివరించారు.
కేథలిక్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లోని హిస్టర్ ప్రొఫెసర్ మైఖేల్ సి కిమ్మేజ్ అభిప్రాయం ప్రకారం తటస్థంగా వ్యవహరించక తప్పని పరిస్థితి భారత్ ముందు ఉంది. అయితే ఇండియా, ఇతర దేశాలు యుక్రెయిన్ కు మద్దతు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వ యంత్రాంగం కోరుకుంటోంది.
‘‘ఇండియా తప్పు చేసినట్టు యూఎస్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను ఇప్పటికే మనం విన్నాం. యుక్రెయిన్ ఘర్షణలకు సంబంధించి ముఖ్యమైన విషయం ఒకటుంది. రానున్న ఏళ్లు, దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఆర్డర్ ఎలా ఉండాలనేదాన్ని అది నిర్ణయిస్తుంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పుతిన్ ను చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటుంది?
రచయిత జానుస్జ్ బుగాజ్స్కీ అయితే రష్యన్ ఫెడరేషన్ ను ముక్కలు చేసిన వ్యక్తిగా పుతిన్ గుర్తుండిపోతారని అన్నారు. ‘‘ఆయన అధ్యక్షునిగా ఉన్నప్పుడే రష్యా ముక్కలయి కొత్త స్వంతత్ర దేశాలు ఏర్పాటయినట్టు గుర్తు పెట్టకుంటారు. యుక్రెయిన్, పొరుగు దేశాల వారయితే నియంతగా గుర్తించుకుంటారు’’ అని చెప్పారు.
ప్రొఫెసర్ మైఖేల్ సి కిమ్మాజ్ మాత్రం పుతిన్ ను దేశాన్ని ఒక తరం వెనక్కి తీసుకెళ్లిన నాయకునిగా గుర్తు పెట్టుకుంటారని తెలిపారు.
‘‘రష్యాను నియంతృత్వం వైపు పుతిన్ తీసుకెళ్లారు. అక్కడ రాజ్యాంగం పనిచేయడం లేదు. ఆయన వారసుడు ఎవరో ఎవరికీ తెలియదు. నా అభిప్రాయం వరకయితే రష్యాను ఒక తరం వెనక్కి తీసుకెళ్లారు’’ అని అన్నారు.
ప్రొఫెసర్ పట్నాయక్ అయితే..చరిత్రను ఎవరు రాస్తున్నారనేదాన్ని బట్టి పుతిన్ ను ఎలా గుర్తించుకోవడం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు.
‘‘ప్రస్తుతమయితే రష్యా, పశ్చిమ దేశాల మధ్య సమాచార యుద్ధం నడుస్తోంది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు బలమైన ప్రచారం చేసుకుంటున్నారు. రష్యాకు అనుకూలంగా అక్కడ మీడియా సమాచారం అందిస్తోంది.
పశ్చిమ దేశాల మీడియా ప్రకారమయితే పుతిన్ ఏదో తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారు. రష్యా కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది.
కానీ, పుతిన్ చాలా దృఢంగా ఉన్నారు. రష్యా యుద్ధంలో ఓడిపోవడం లేదు’’ అని చెప్పారు.
యుక్రెయిన్ యుద్ధంలో విజయం సాధించే వారే చరిత్ర రాస్తారని ప్రొఫెసర్ పట్నాయక్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?














