పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Janasena party/Facebook

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాజకీయ భవితవ్యం కోసం ఏడాది క్రితం బీజేపీ అధిష్టానం వైపు చూస్తున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి స్వరం మార్చారు.

ఒంటరిగానైనా పోటీ చేస్తాననడం ద్వారా బీజేపీకి దూరంగా జరుగుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. తాను చెప్పిన కార్యక్రమాలను అనుసరించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీ వైపు కాకుండా బీజేపీ-జనసేన వైపు మళ్లి ఉండేదని ఆయన అన్నారు.

‘‘బీజేపీ జాతీయ స్థాయి నాయకులు చెప్పిన దానికి భిన్నంగా ఇక్కడ జరుగుతోంది. అమరావతి రాజధాని అంశం నుంచి ప్రతి విషయంలోనూ అలానే జరిగింది. తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల నుంచి మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ మద్దుతుగా నిలిచినా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు’’ అని పవన్ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన రాజకీయ విధానానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ చేశారు. మచిలీపట్నం కేంద్రంగా జరిగిన సభలో ఆయన దాదాపుగా గంటా ఇరవై నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు.

పవన్ కల్యాణ్‌

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

విమర్శల పదును తగ్గించి...

గతానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ మచిలీపట్నం సభలో మాట్లాడారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తుండడం చూస్తుంటాం. కానీ ఈసారి అందుకు భిన్నంగా పరివర్తన కోసమే తాను ఈ సభ పెట్టినట్టు ఆయనే చెప్పుకున్నారు.

వైసీపీ నాయకుల ప్రతి మాటకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత శిస్తు కట్టిస్తామని అంటూనే పలుమార్లు ముఖ్యమంత్రిని మినహా ఇతరుల పేర్లను ప్రస్తావించకపోవడం విశేషం.

"వైసీపీని, వ్యక్తులను విమర్శించి ప్రయోజనం లేదు. ఈ మీటింగ్ పరివర్తన కోసమే. మీరు ఓట్లు అమ్ముకోవడం మానుకోకపోతే విలువలు మాట్లాడే నాలాంటి నాయకులు ఓడిపోతూనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం మాకు అండగా నిలవండి. ఒక్కసారి జనసేనను చూడండి. కులాన్ని దాటి ఆలోచించండి" అంటూ జనసేన అధినేత విజ్ఞప్తి చేశారు.

పవన్ కల్యాణ్‌

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

కులం, మతం చుట్టూనే..

ఆవిర్భావ దినోత్సవ సభకు ముందు, పవన్ కల్యాణ్ తన కార్యాలయంలో వరుసగా బీసీలు, కాపు సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. వాటికి కొనసాగింపు అన్నట్టుగా మచిలీపట్నం సభలో ఎక్కువ సమయం కులాలకు సంబంధించిన అంశాలే ప్రస్తావించారు.

కుల రాజకీయాల గురించి మాట్లాడారు. వంగవీటి రంగా నుంచి ప్రస్తుత ప్రభుత్వంలో పదవుల కేటాయింపు వరకూ అనేక అంశాలు ప్రస్తావించారు.

"నేను సమాజాన్ని విశాల దృష్టితో చూస్తాను. ఒక కులం, ఒక మతంతో సమాజాన్ని నడపలేం. కులాన్ని వాడుకుని కొంతమంది వ్యక్తులే లాభపడుతున్నారు. ఏ కులాన్నీ గద్దెనెక్కించేందుకు నేను లేను.

వంగవీటి రంగాతో నాకు పరిచయం ఉంది. ఆయన కూడా కమ్మవారి ఆడపడుచుని చేసుకున్నారు. వాళ్లకి లేని బాధ మీకెందుకు? కులం పట్టుకుని వేలాడడం ఎందుకు?" అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

యువత మూలాలు తెలుసుకోవాలని అన్నారు. కాపులు ఎదగడానికి కమ్మవారితో గొడవలు అవసరం లేదన్నారు. ఇతర కులాలతోనూ వివాదాలు అక్కర్లేదన్నారు. కులాల ఉచ్చులో పడవద్దని, కులాలు చూసి ఓటు వేయవద్దని యువతకు ఆయన సూచించారు.

జనసేన పార్టీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

'రెడ్డి సీఎంకి ఊడిగం చేస్తారా?'

ఓవైపు కుల ప్రస్తావన లేని రాజకీయాలే తమ లక్ష్యం అని చెబుతూ, మరోవైపు తనను విమర్శించే కాపు నేతల మీద పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

తాను కాపు కులాన్ని తాకట్టుపెడుతున్నానంటూ విమర్శలు చేసేవాళ్లకి రెడ్డి ముఖ్యమంత్రికి ఊడిగం చేయడం ఓకేనా అని ప్రశ్నించారు.

"రాష్ట్రంలో చివరకు ఉద్యోగ సంఘాల నాయకుడు కూడా ముఖ్యమంత్రి కులస్తుడేనా.. ఇతర కులాల వారు పనికిరారా? ఒకే కులానికి అన్ని పదవులు ఇస్తారా? రెడ్డి కులస్తులు కూడా అర్థం చేసుకోవాలి.

నేను ఆ కులానికి వ్యతిరేకం కాదు. నాకు చాలామంది రెడ్డి మిత్రులు ఉన్నారు. కానీ ఒకే కులానికి, మిగిలిన ఆన్ని కులాలు ఊడిగం చేయలంటే దానికి మేం వ్యతిరేకం" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

అన్ని కులాలకు జనసేన సమాన గౌరవం ఇస్తుందన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిలా ఒకే కులం కోసం పనిచేయబోమన్నారు.

జనసేన కార్యకర్తలు

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

'బీసీ, ఎస్సీ , మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం'

కాపులకు రాజకీయంగా అధికారం రావడం లేదని, దాని గురించి అందరూ ఆలోచించాలని పవన్ కల్యాణ్‌ అన్నారు. అదే సమయంలో, కాపులు అందరినీ కలుపుకుని పోయేందుకు తగ్గట్టుగా ఆలోచించాలన్నారు.

"నేను పుట్టిన కులాన్ని నేనెందుకు వదిలేస్తాను? రాజకీయాల్లో కాపులు పెద్దన్న పాత్ర వహించాలి. నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి మిగిలిన కులాలకు భయపడడు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వబోమని చెప్పినా ఓట్లు వేశారు.

కాపులు.. బీసీలు, దళిత సోదరులు, మైనార్టీలు అందరినీ కలుపుకుని పోవాలి. కాపులు అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ , మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం" అని హమీలు ఇచ్చారు.

'చంద్రబాబు సమర్థుడని గౌరవం'

చంద్రబాబు మీద తనకు ప్రత్యేక ప్రేమ, అభిమానం లేవని, కానీ సమర్థుడైన ముఖ్యమంత్రిగా గౌరవం ఉందని పవన్ స్పష్టం చేశారు.

"రాష్ట్రంలో క్రిమినల్ రాజకీయాలు పోవాలి. మేం ఎన్ని సీట్లకు పోటీ చేయాలో మాకు తెలుసు. కొందరు వైసీపీ నేతలు దమ్ము, మగతనం అంటూ మాట్లాడుతున్నారు. తొడగొట్టిన దుర్యోధనుడిని భీముడు ఏం చేశాడో తెలుసు కదా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బుద్ధి చెబుతాం" అంటూ హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీతో పొత్తుల గురించి మాత్రం సూటిగా చెప్పకుండానే.. ఏం చేయాలో తనకు తెలుసునని, తనను అనుమానించేవారితో తనకు అవసరం లేదని అన్నారు. తనను నమ్మేవారందరినీ తనవారిగా చూస్తానంటూ పవన్ తెలిపారు.

పవన్ కల్యాణ్‌

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

'మీరు కోరుకున్నది జరుగుతుంది'

తాను ఓపెన్ గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని, కానీ ముఖ్యమంత్రి బీజేపీతో ఎలా కలిసి ఉన్నది మైనార్టీలు అర్థం చేసుకోవాలని పవన్ సూచించారు.

పొత్తుల గురించి మాట్లాడుతూ సీఎం, సీఎం అని అరిస్తే ఉపయోగం ఉండదని అంటూనే, "మీ మనసులో ఏముందో తెలుసు. అది జరుగుతుంది. జనసేన సత్తా చాటుతాం. ఓటు వేస్ట్ కానివ్వం. పవన్ కల్యాణ్ సహా పోటీ చేసిన అభ్యర్థులంతా గెలిచేలా చూస్తాం. అసెంబ్లీలో అడుగుపెట్టేలా ప్రణాళిక ఉంటుందని"వెల్లడించారు.

ఈసారి గెలిచాక, వచ్చే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. తనను నమ్మాలని, అండగా ఉండాలని ఆయన కోరారు.

పవన్ కల్యాణ్‌

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

ఆరు గంటల ఎదురుచూపులు

సభకు ముందు పవన్ కల్యాణ్‌ విజయవాడ నుంచి వారాహి వాహనంలో యాత్ర నిర్వహించారు. ఆటోనగర్ నుంచి ఇది ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొదలయిన యాత్ర మచిలీపట్నం సభా స్థలానికి చేరేందుకు దాదాపుగా అరు గంటలకు పైనే పట్టింది. దాంతో సభా ప్రాంగణంలో జనసేన శ్రేణులు ఎదురుచూడాల్సి వచ్చింది.

విజయవాడ నుంచి పెనమలూరు, గుడివాడ, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఆయన యాత్ర పొడవునా వేలాదిగా అభిమానులు, పార్టీ శ్రేణులు కదిలారు. అడుగడుగునా నీరజనాలు పలికారు.

ప్రసంగానికి ముందు పవన్ కల్యాణ్‌, మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు పార్టీ తరుపున సహాయం కింద లక్ష రూపాయల చొప్పున అందించారు. అనేక మంది పార్టీలు పెట్టినా ఓటమి తర్వాత పార్టీలు మూసుకున్నారని, తాము ఓడిన తర్వాత కూడా బలపడుతున్నామంటూ పవన్ ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ ప్రసంగం మీద వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.

వైఎస్ జగన్, కాపు నాయకులు, తనను తిట్టడమే పవన్ పని అని.... కాపులను చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)