ఇమ్రాన్ ఖాన్‌‌ను గురువారం ఉదయం 10 గంటల వరకు అరెస్ట్ చేయొద్దు: లాహోర్ హైకోర్టు

మద్దతుదారులతో ఇమ్రాన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, షుమేలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గురువారం ఉదయం 10 గంటల వరకు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయరాదని, ఆయన నివాసం జమాన్ పార్క్ వద్ద ఎలాంటి పోలీస్ చర్య చేపట్టరాదని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది.

తనపై జారీ అయిన అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ కోర్టును ఆశ్రయించగా.. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

ఈలోగా ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయకుండా గురువారం ఉదయం 10 గంటల వరకు పోలీస్ చర్యల నిలుపుదల ఆదేశాలిచ్చింది.

మరోవైపు మంగళవారం నాటి ఘటనల తరువాత ఇమ్రాన్ బుధవారం తన ఇంటి బయట మద్దతుదారులను కలిశారు.

వారినుద్దేశించి మాట్లాడడంతో పాటు వారితో ఫొటోలు దిగారు.

కాగా ఇమ్రాన్ అరెస్ట్ తాత్కాలికంగా ఆగినట్లు పంజాబ్ తాత్కాలిక సమాచార మంత్రి ఆమిర్ మీర్ కూడా ధ్రువీకరించారు.

లాహోర్‌లో ఓ క్రికెట్ టోర్నీ జరుగుతోందని.. ఇమ్రాన్ అరెస్ట్ ప్రయత్నాలు, దాన్ని పీటీఐ కార్యకర్తలు అడ్డుకోవడం వంటి కారణాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని, దీంతో మ్యాచ్ జరిగేందుకు వీలుగా ఇమ్రాన్ అరెస్ట్ ప్రయత్నాలను ఆపేలా కోర్టు ఆదేశించిందని ఆమిర్ తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Imran Khan/Twitter

ఇంతకుముందు ఏమైందంటే..

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌లోని ఆయన నివాసానికి పోలీసులు మంగళవారం వెళ్లారు. వారికి పీటీఐ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కార్యకర్తలు.. తమ నేతను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ పోలీసులతో ఘర్షణకు దిగారు.

ఈ ఘర్షణలో ఇస్లామాబాద్ డీఐజీ సహా అనేక మంది పోలీసులు గాయపడినట్లు అక్కడ ఉన్న బీబీసీ ప్రతినిధి తర్హాబ్ అస్ఘర్ తెలిపారు.

పీటీఐ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని అస్ఘర్ చెప్పారు.

ఈ ఘర్షణలో పీటీఐ కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో గాయపడినట్లు చెప్పారు.

గాయపడినవారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సులు అక్కడ చేరాయి.

ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద పోలీసులు

ఇమ్రాన్ ఖాన్ ఇల్లు ఉన్న వీధిలోకి పోలీసుల ప్రవేశం

ఇమ్రాన్ ఖాన్ ఇంటికి వెళ్లే మార్గాలలో పీటీఐ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఉండడంతో ఇప్పటివరకు ఆయన ఇంటికి చేరడమే పోలీసులకు కష్టమైంది.

కొద్దిసేపటి కిందట పోలీసులు ఇమ్రాన్ ఇల్లు ఉన్న వీధిలోకి చేరగలిగారు. అయినప్పటికీ ఇమ్రాన్ ఇంటివరకు వారు ఇంకా చేరుకోలేదని బీబీసీ ప్రతినిధి అస్ఘర్ చెప్పారు.

పాకిస్తాన్

‘నన్ను చంపినా మీ పోరాటం ఆపొద్దు’

కాగా ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశం విడుదల చేశారు.

‘పోలీసులు నన్ను జైలులో పెట్టేందుకు వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్తే దేశం పడుకుంటుందని వారు అనుకుంటున్నారు. వారు అనుకుంటున్నది తప్పని మీరు నిరూపించండి. ఇది ఒక సజీవ దేశమని మీరు నిరూపించండి’ అంటూ ఆయన ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

‘మీరు మీ హక్కుల కోసం పోరాడడానికి బయటకు రావాలి. ఇమ్రాన్ ఖాన్‌కు అల్లా అన్నీ ఇచ్చారు. నేను మీ కోసం పోరాడుతున్నాను. నా జీవితమంతా మీకోసం పోరాడాను. ముందుముందు కూడా పోరాడుతాను’

‘ఒకవేళ నాకు ఏదైనా జరిగినా, జైలులో నన్ను చంపేసినా కూడా మీరు పోరాడాలి. ఇమ్రాన్ ఖాన్ లేకపోయినా ఈ దొంగలకు బానిసత్వం చేయడానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పోరాడాలి. ప్రధాని షాబాజ్ షరీఫ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని ఏమాత్రం ఆమోదించకండి’ అంటూ ఆయన తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్‌పై అరెస్ట్ వారెంట్

తోశ్‌ఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు జారీచేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేయాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పీటీఐ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.

ఇంతకుముందు ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ లాయర్ వాదనలు వినడానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ అమీర్ ఫారూఖ్ తిరస్కరించారు.

కాగా బుధవారం ఈ కేసు విచారణకు వస్తోందని ఇమ్రాన్ ఖాన్ లాయర్ అలీ బుఖారీ చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ ఇంటివద్ద పరిస్థితి

ఇంతకీ ఏమిటీ తోశఖానా కేసు?

విదేశాలకు వెళ్లినప్పుడు, విదేశీ అతిథులు వచ్చినప్పుడు వారి నుంచి పాకిస్తాన్ నేతలు, అధికారులకు అందే బహుమతులను దాచే ఖజానాను తోశఖానా అంటారు.

ఇలా పొందిన బహుమతులలో కొన్నిటికి ఈ తోశఖానాకు అప్పగించకుండా ఇమ్రాన్ తన వద్దే ఉంచుకున్నారన్నది ఆరోపణ.

విదేశీ ప్రతినిధులు బహుకరించిన మూడు వాచీలను విక్రయించడం వల్ల 3.6 కోట్ల డాలర్ల మొత్తం సంపాదించారని ఇమ్రాన్‌పై ఆరోపణలున్నాయి.

ఈ కేసులో ఇమ్రాన్‌కు స్థానిక కోర్టు ఒకటి జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు మార్చ్ 13 వరకు సస్పెండ్ చేసింది. ఆ గడువు ముగియడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లడంతో ఇప్పుడు ఘర్షణలు జరుగుతున్నాయి.

లాహోర్‌లోని జమాన్ పార్క్‌లో ఉన్న ఇమ్రాన్ ఇంటికి వెళ్లేందుకు లాహోర్, ఇస్లామాబాద్ పోలీసులు ప్రయత్నించగా పీటీఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఏ కేసులోనూ దోషిగా తేలలేదని.. కోర్టుకు హాజరుకానందుకే ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీటీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇమ్రాన్ ఖాన్‌పై 80కి పైగా కేసులు పెట్టారు.

ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద ఉద్రిక్తత
ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్దకు పోలీసులు చేరుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది

అరెస్ట్ వారెంట్ ఉపసంహరణ కోరుతూ హైకోర్టుకు

కాగా ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు జారీ చేసిన వారెంట్ ఉపసంహరించుకోవాలంటూ పీటీఐ నేత, మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

కొద్దిసేపటిలో కేసు విచారిస్తారని.. సిబలే ఫరాజ్, న్యాయవాది గోహర్ ఇప్పటికే ఇస్లామాబాద్ కోర్టుకు చేరుకున్నారని ఫవాద్ చౌదరి ట్వీట్ చేశారు.

మరోవైపు మాజీ మంత్రి షా మహమూద్ ఖురేశీ దీనిపై మాట్లాడుతూ అరెస్ట్ చేయడానికి వీల్లేకుండా ఇమ్రాన్‌కు కోర్టు నుంచి రక్షణ ఉందని చెప్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రత్యర్థి, పీఎంఎల్-ఎన్ నేత మరియం నవాజ్ మాట్లాడుతూ.. ఈ ఘర్షణల్లో పోలీసులు ఎవరైనా గాయపడితే అందుకు ఇమ్రాన్ ఖాన్‌దే బాధ్యత అన్నారు.

రెండు వారాల కిందట కూడా ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా అక్కడ ఆయన లేరని చెప్పడంతో తిరిగివచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)