ఇమ్రాన్ ఖాన్‌‌ మీద దాడి ఘటనతో పాకిస్తాన్‌ ఉద్రిక్తం... ఇస్లామాబాద్‌లో పాఠశాలలు బంద్

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లాహోర్ నుంచి టారుబ్ అస్ఘర్, సింగపూర్ నుంచి ఫ్రాన్సెస్ మావో
    • హోదా, బీబీసీ న్యూస్

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీద తుపాకీ కాల్పులతో దాడి చేయటాన్ని ప్రపంచ నేతలు ఖండించారు. ఆయనను హత్య చేసేందుకే ఈ దాడి జరిగిందని ఇమ్రాన్ మద్దతుదారులు అంటున్నారు.

వజీరాబాద్‌లో గురువారం రాత్రి నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ మీద తుపాకీతో కాల్పులు జరగటంతో ఆయన కాలికి తూటా గాయమైంది. ఆ దాడిలో ఒక వ్యక్తి చనిపోగా, మరో 10 మంది గాయపడ్డారు.

ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లో ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని ఆయన శిబిరం చెప్పింది.

ఇమ్రాన్ ఖాన్ మీద దాడి 'నీచమైన హత్యా ప్రయత్నం' అంటూ పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఖండించారు. ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ ఈ దాడి మీద తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

దేశంలో శాంతి పాటించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పిలుపునిచ్చారు. ''రాజకీయాల్లో హింసకు చోటు లేదు. అన్ని పక్షాలూ హింసకు, వేధింపులకు, బెదిరింపులకు దూరంగా ఉండాలని మేం కోరుతున్నాం'' అన్నారాయన.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, RAHAT DAR/EPA-EFE/REX/Shutterstock

ఇమ్రాన్ ఖాన్ మీద దాడి ఉదంతంతో పాకిస్తాన్ ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం ప్రార్థనల తర్వాత దేశ వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పిలుపునిచ్చింది. రాజధాని ఇస్లామాబాద్‌లో పాఠశాలలు మూసివేశారు.

రాజకీయ నాయకుడిగా మారిన క్రికెట్ స్టార్ ఇమ్రాన్ ఖాన్‌కు ఓటర్లలో చాలా ఆదరణ ఉంది. అయితే గత ఏప్రిల్ నెలలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంతో పదవీచ్యుతుడయ్యారు.

అప్పటి నుంచీ అధికారంలోకి తిరిగి రావటానికి ఆయన పోరాడుతున్నారు. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో పీటీఐ విజయాలతో ఉత్సాహంగా ఉన్న ఇమ్రాన్.. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌తో 'లాంగ్ మార్చ్' పేరుతో నిరసన ప్రదర్శన చేపట్టారు.

ప్రధాని పదవి నుంచి తనను తొలగించటం రాజకీయ కుట్ర అని ఆయన అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని, సైనిక నాయకులను తీవ్ర స్వరంతో విమర్శిస్తున్నారు. ఇటీవలి అవినీతి కేసుల్లో కోర్టులు ఆయనను దోషిగా నిర్ధారించాయి. అయితే ఆ తీర్పులు రాజకీయ ప్రేరేతిమని ఇమ్రాన్ విభేదిస్తున్నారు.

పాకిస్తాన్‌కు రాజకీయ హింస చరిత్ర ఉంది. మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో 2007లో హత్యకు గురయ్యారు. ఇమ్రాన్ ఖాన్ మీద దాడి నేపథ్యంలో ఆమె హత్యను చాలా మంది గుర్తు చేస్తున్నారు.

పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో, విధ్వంసకరమైన వరదల్లో చిక్కుకుని ఉంది.

దాడిలో గాయపడిన ఇమ్రాన్ ఖాన్‌ను సహాయకులు కారులోకి తీసుకు వెళుతున్న దృశ్యం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దాడిలో గాయపడిన ఇమ్రాన్ ఖాన్‌ను సహాయకులు కారులోకి తీసుకు వెళుతున్న దృశ్యం

ఇమ్రాన్ ఖాన్ మీద దాడి ఎలా జరిగింది?

ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ గురువారానికి ఏడో రోజుకు చేరుకుంది. వచ్చే వారంలో ఆ ప్రదర్శన ఇస్లామాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది.

గురువారం రాత్రి లాహోర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని వజీరాబాద్‌లో.. ఒక ఓపెన్ ట్రక్‌లో తన సహాయకులు, ఇతర పార్టీ సభ్యుల మధ్య నిలుచుని ఉన్నపుడు కాల్పులు మొదలయ్యాయి.

ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులకు చేయి ఊపుతూ అభివాదం చేస్తున్నారని, జనాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతుండగా కాల్పుల మోత వినపడిందని.. ఆ కాన్వాయ్‌లో కాల్పుల నుంచి బయటపడిన వారు బీబీసీకి చెప్పారు.

''కంటెయినర్ పైనుంచి మేం దాడిచేసిన దుండగుడిని స్పష్టంగా చూడగలిగాం'' అని పార్టీ కార్యకర్త ముయీజుద్దీన్ తెలిపారు.

''తుపాకీలో ఒక మేగజీన్ మొత్తం ఖాళీ అయ్యేవరకూ కాల్పులు జరిపాడు.. మరో మేగజీన్ లోడ్ చేస్తుండగా వెనుక నుంచి ఒక అబ్బాయి అతడిని గట్టిగా పట్టుకున్నాడు'' అని ఆయన వివరించారు.

''అది ఎంత అకస్మాత్తుగా జరిగిందంటే.. ఏం జరుగుతోందో అర్థం చేసుకోవటానికి నాకు కాస్త టైం పట్టింది'' అని చెప్పారాయన.

వీడియో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్‌పై దాడి - ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే

జనం గుంపులో ఉన్న ఒక దుండగుడు ఇమ్రాన్ ఖాన్ కాన్వాయి మీదకు ఒక పిస్టల్‌ను గురిపెట్టి ఉండగా, ఇమ్రాన్ మద్దతుదారులు అతడిని పట్టుకుంటున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టయ్యాయి. అయితే ఈ వీడియోల విశ్వసనీయతను తనిఖీ చేయలేదు.

మొదటి కాల్పుల తర్వాత ఇమ్రాన్ ఖాన్, ఆయన చుట్టూ ఉన్నవాళ్లు కాల్పుల నుంచి తప్పించుకోవటానికి కిందికి వంగారని ముయీజుద్దీన్ చెప్పారు. ఇమ్రాన్‌కు తుపాకీ తూటా తగిలినపుడు ఆయన మౌనంగా ఉన్నారని, ఆయన భద్రతా సిబ్బంది ఆయనకు ప్రధమ చికిత్స చేశారని తెలిపారు.

ఆ తర్వాత ఇమ్రాన్‌ను బులెట్‌ప్రూఫ్ కారులో ఎక్కించి, లాహోర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు ముయీజుద్దీన్ తెలిపారు.

కంటెయినర్ మీది నుంచి ఒక సెక్యూరిటీ గార్డు కూడా కాల్పులు జరుపుతున్నట్లు.. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు సూచిస్తున్నాయి.

ఈ దాడిలో ఒకరికన్నా ఎక్కువమంది దుండగులు ఉండి ఉండవచ్చునని పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి సూచించారు.

''దాడి జరిగినపుడు ఘటనా స్థలంలో పట్టుకున్న దుండగుడు కుడివైపు ఉంటే.. ఇమ్రాన్ ఖాన్‌ కాలిలోకి ముందువైపు నుంచి కాల్పులు జరిపారు'' అని ఆయన పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, దేశంలోని సగానికి పైగా భూభాగంలో నీట మునిగిన పంటలు

దాడి వెనుక కారణాలపై వివాదం

ఈ కాల్పులు జరిగిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు కొందరు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ నేతలు - ప్రధాని షరీఫ్, హోంమంత్రి, ఒక సైనిక జనరల్ ఈ దాడి వెనుక ఉన్నట్లుగా ఇమ్రాన్ భావిస్తున్నట్లు చెప్పారు.

ఇమ్రాన్‌ఖాన్‌ను ''భౌతికంగా తుదముట్టించటానికి ప్రయత్నించింద''ని ఆయన అధికార ప్రతినిధి రావూహ్ హసన్ బీబీసీ న్యూస్‌హవర్ ప్రోగ్రాంకు చెప్పారు.

ఈ ఆరోపణల మీద పాకిస్తాన్ ప్రభుత్వ నేతలు ఇంకా స్పందించలేదు.

ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేయటానికి ప్రయత్నించిన వ్యక్తి అంటూ ఒక పురుషుడి వాంగ్మూలం అంటూ ఒక వీడియోను పోలీసులు గురువారం రాత్రి విడుదల చేశారు.

ఆ ఇంటర్వ్యూను ఏ పరిస్థితుల్లో నిర్వహించారనే దానిపై స్పష్టత లేదు. అయితే ఎందుకు కాల్పులు జరిపావు అనే పోలీసుల ప్రశ్నకు సమాధానంగా.. ''ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయనను చంపాలని నేను అనుకున్నాను. ఆయనను చంపటానికి ప్రయత్నించాను'' అని ఆ వీడియోలని వ్యక్తి చెప్పారు.

ఈ వీడియోను 'నిజాలను దాచేయటానికి' చేసిన ప్రయత్నంగా ఇమ్రాన్ ఖాన్ సహచరులు కొట్టివేశారు.

పోలీసుల అదుపులో ఒక అనుమానితుడు ఉన్నారు. కానీ ఇంకా అభియోగాలేవీ నమోదు చేయలేదు.

వీడియో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్: మేటి క్రికెటర్ నుంచి పదవీచ్యుత ప్రధాని వరకు.. పదవీచ్యుత నేత ప్రస్థానం ఇది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)