పాకిస్తాన్: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. దీంతో ఆయన పదవీచ్యుతులయ్యారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓటింగ్ జరిగింది.
విపక్షాలన్నీ కలిసి ఆయనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మొదట డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు.
అనంతరం నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని దేశ అధ్యక్షుడికి ఇమ్రాన్ ఖాన్ సిఫార్సు చేశారు. ఈ సిఫార్సును అధ్యక్షుడు కూడా ఆమోదించారు.
అయితే, ఈ నిర్ణయాలను తిరస్కరిస్తూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు పార్లమెంటును పునరుద్ధరించింది.
విపక్షాలు ఏర్పాటుచేసే ప్రభుత్వాన్ని తాను గుర్తించబోనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తనని అధికారం నుంచి దించేందుకు అమెరికా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై ఆయన ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు.
ఇప్పుడు కొత్త ప్రధాన మంత్రిని నేషనల్ అసెంబ్లీ ఎన్నుకోనుంది.

ఫొటో సోర్స్, Reuters
మొదట స్పీకర్ రాజీనామా..
కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం 2023 అక్టోబరు వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తారు.
స్థానిక కాలమానం ప్రకారం, ఆదివారం 11 గంటల్లోగా ప్రధాని పదవికి బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సమర్పించాలని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని నడిపించిన అయాజ్ సాదిఖ్ చెప్పారు.
పాకిస్తాన్‌లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఓడిపోయి పదవిని కోల్పోయిన తొలి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖానే.
అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకోవడం, పార్లమెంటును రద్దు చేయడం లాంటి చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమని పాక్ సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది.
మరోవైపు విపక్షాలు కూడా పార్లమెంటును రద్దు చేసి ఇమ్రాన్ ఖాన్ దేశద్రోహానికి పాల్పడ్డారని విమర్శించాయి.
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా, ఇమ్రాన్ ఖాన్‌కు సన్నిహితుడు, స్పీకర్ అయిన అసద్ ఖైసర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ సభ్యులు పార్లమెంటు భవనాన్ని వదిలివెళ్లిపోయారు. విదేశీ కుట్రకు ఇమ్రాన్ బలవుతున్నారని వారు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, EPA
174 ఓట్లతో నెగ్గిన అవిశ్వాసం
342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 174 ఓట్లు వచ్చాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతులయ్యారు.
అనంతరం ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ ఓ ట్వీట్ చేశారు. ఎట్టకేలకు సంక్షోభం నుంచి విముక్తి లభించిందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు ఇమ్రాన్ చాలా హుందాగా పదవి నుంచి దిగిపోయారని, ఆయన ఎవరికీ తలవంచలేదని పీటీఐ సెనేటర్ ఫైసల్ జావెద్ ఖాన్ వ్యాఖ్యానించారు.
''ఇమ్రాన్ హయాంలో పాకిస్తాన్ ఉన్నత శిఖరాలకు చేరుకుంది''అని ఆయన అన్నారు.
2018లో అధికారంలోకి
పాకిస్తాన్‌కు చెందిన మాజీ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ 2018లో అధికారంలోకి వచ్చారు. అవినీతిపై పోరాడతానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ఆయన హామీ ఇచ్చారు.
కానీ ఆ హామీలన్నీ హామీలుగానే మిగిలిపోయాయి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది.
గత మార్చిలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నడుమ ఇమ్రాన్ ప్రభుత్వం ఆధిక్యాన్ని కోల్పోయింది.
పాకిస్తాన్ సైన్యం సాయంతోనే ఇమ్రాన్ అధికారంలోకి వచ్చారని ఇక్కడి రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తుంటారని బీబీసీకి చెందిన సికెందర్ కిర్మాణీ అన్నారు. ఇప్పుడు ఇమ్రాన్, సైన్యాల మధ్య విభేదాలున్నాయని ఆయన చెప్పారు.
విదేశాలతో విపక్షాలు చేతులు కలిపి తనను పదవి నుంచి దించేందుకు కుట్ర పన్నుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ పదేపదే చెప్పారు. మరోవైపు రష్యా, చైనాల విషయంలో మాట విననందుకు అమెరికా తనను దించేసేందుకు ప్రయత్నిస్తోందని కూడా వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని అమెరికా ఖండించింది. ఇమ్రాన్ ఎలాంటి ఆధారాలూ బయటపెట్టకుండా ఆరోపణలు చేస్తున్నారని అమెరికా నేతలు వ్యాఖ్యానించారు.
యుక్రెయిన్‌పై దాడి జరిగినప్పుడు రష్యాలో
యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టిన రోజు ఇమ్రాన్ ఖాన్ రష్యాలో ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆయన కలిశారు. అంతేకాదు ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికాలోని ఇదివరకటి బుష్ ప్రభుత్వాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.
ఇమ్రాన్‌ను గద్దె దించేందుకు గత వారం ప్రతిపక్ష నేతలంతా కలిసి నేషనల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
అయితే, ఈ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి తిరస్కరించారు. విదేశాల జోక్యం వల్లే ఈ తీర్మానం ప్రవేశపెట్టారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని సూరి అన్నారు.
ఆ తర్వాత పార్లమెంటును ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రద్దుచేసింది. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ఇమ్రాన్ ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించి ఇమ్రాన్ ఖాన్ దేశద్రోహానికి పాల్పడ్డారని వారు వ్యాఖ్యానించారు.
ఈ విషయంపై ప్రతిపక్ష నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
దీంతో నేషనల్ అసెంబ్లీని సుప్రీం కోర్టు పునరుద్ధరించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.
అయినప్పటికీ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే వచ్చింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్‌కు సన్నిహితుడైన స్పీకర్ అసద్ ఖైసర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అవిశ్వాసంపై ఓటింగ్‌కు మార్గం సుగమమైంది.
ఇవి కూడా చదవండి:
- `గని` రివ్యూ: బాక్సింగ్ రింగ్‌లో తడబడ్డ... హీరోయిజం
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్‌లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












