పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్, సైన్యం చెబుతున్న వాదనలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ హిందీ
మార్చి 31న పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంలో అమెరికా పేరును ప్రస్తావించారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా కుట్ర పన్నుతోందని అన్నారు. అమెరికా పేరును ప్రస్తావించిన తర్వాత, ఇమ్రాన్ ఖాన్ తప్పు చేసినట్లుగా భావించారు. ఆ తర్వాత నవ్వుతూ.. ఒక దేశం అని ఆయన పేర్కొన్నారు.
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. విదేశీ ఎజెండా ఇప్పుడు విఫలమైందని ఆయన అన్నారు.
నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నుంచి కొన్ని పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. దీంతో తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి పశ్చిమ దేశాలు కుట్ర పన్నాయని ఆయన అన్నారు. అయితే, అమెరికా ఈ ఆరోపణలను ఖండించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పాకిస్తాన్ సైన్యాధిపతి ఏమంటున్నారు?
తనకు వ్యతిరేకంగా అమెరికా కుట్ర పన్నుతోందని మార్చి 31న ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అయితే, ఏప్రిల్ 2న ఇస్లామాబాద్ సెక్యూరిటీ చర్చల్లో పాక్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ భజ్వా మాట్లాడారు. అమెరికా-పాకిస్తాన్‌ల మధ్య మంచి సంబంధాలున్నాయని, పాకిస్తాన్ ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్ అని చెప్పారు.
బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కూడా పాకిస్తాన్ ప్రయోజనాలకు చాలా ముఖ్యమని అన్నారు. రష్యా యుక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధం దురదృష్టకరమని, అదొక పెద్ద విషాదమని కూడా ఆయన అన్నారు.
అమెరికాతో పాటు పశ్చిమ దేశాల గురించి ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యానాలన్నిటికీ వ్యతిరేకంగా జనరల్ భజ్వా మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ ఏం చేసినా కూడా పాకిస్తాన్ సైన్యం అంగీకరించదు.
ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి ఆఖరి వారంలో రష్యా పర్యటనకు వెళ్లారు. ఆయన ఫిబ్రవరి 24న రష్యాకు చేరుకున్నారు. అదే రోజున రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించారు.
పశ్చిమ దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ రష్యాకు వెళ్లడం పట్ల ప్రతికూల అభిప్రాయాలు వినిపించాయి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో పాకిస్తాన్ అమెరికా వైపున ఉంది.
అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత బైడెన్.. ఇమ్రాన్ ఖాన్‌కు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగంగానే చెప్పింది. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మోయీద్ యూసఫ్ కూడా ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు.
అమెరికా తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం వెనుక పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందా?
"ఇమ్రాన్ ఖాన్ అమెరికా పేరును తీసుకుని దేశ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం పరిణితి లేని నాయకుడు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారు" అని పాకిస్తాన్‌లోని ఆర్ధికవేత్త కైసర్ బెంగాలీ బీబీసీతో అన్నారు.
పాకిస్తాన్‌కి అమెరికా చాలా ముఖ్యం అనే విషయాన్ని సైన్యాధిపతి చెప్పారు.
సైన్యాధిపతి చేసిన ప్రకటన కానీ, ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన కానీ పాకిస్తాన్ చేసిన అధికారిక ప్రకటనగా భావించడానికి వీలులేదని కైసర్ బెంగాలీ అన్నారు.
"ఇటువంటి ప్రకటనల వల్లే సాధారణంగా విదేశీ నాయకులు సైన్యం చేసే ప్రకటనలకు ప్రాముఖ్యత ఇస్తారు. పాకిస్తాన్ నాయకులు ఏదైనా మాట్లాడేస్తారని భావిస్తారు. అందుకే, సైన్యంతోనే వారు సంప్రదింపులు జరపాలని చూస్తారు. ఇమ్రాన్ ఖాన్ సొంతంగా అమెరికా పేరును ప్రస్తావించారు. ఇలా మాట్లాడే ముందు ఆయన విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించి ఉండరని నా అభిప్రాయం" అని ఆయన అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కాపాడుకోవడం కోసం ఇస్లాం, అమెరికా వ్యతిరేక భావనలను వాడుకోవాలని చూస్తున్నారా?
"పాకిస్తాన్‌లోని నాయకులు ఎప్పటి నుంచో పదవిని పొందడం కోసం మతాన్ని వాడుకుంటున్నారు. కానీ, ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని అనుకున్న ఇమ్రాన్ ఖాన్ ఇస్లాం పట్ల దృష్టిని పెట్టడం లేదు" అని కైసర్ అన్నారు.
"ఇమ్రాన్ ఖాన్ తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం ఆపాలి. పాకిస్తాన్‌లో అమెరికా పట్ల ఉన్న భావన 1980 దశకంలో మాదిరిగా లేదు. ఇమ్రాన్ ఖాన్ కేవలం ఇలాంటి ప్రకటనలు చేసి తన పదవిని కాపాడుకోలేరు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా కుట్ర చేస్తోందన్న ప్రశ్నకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
అమెరికా ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతోందని మీ ప్రభుత్వమే అంటోంది. మీరు కూడా "అమెరికా ముర్దాబాద్" (అమెరికా నశించాలి) అనే నినాదాలు చేస్తారా? అని విలేఖరులు ఆయనను ప్రశ్నించారు.
"నేనొక బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటూ అటువంటి బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయను" అని ఖురేషీ సమాధానమిచ్చారు.
పాకిస్తాన్ జర్నలిస్ట్ హస్సన్ జైదీ ఖురేషీ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ, పాకిస్తాన్ ప్రధాని బాధ్యతాయుతమైన పదవిలో లేరా? అని ప్రశ్నించారు.
అంతకు ముందే, పాకిస్తాన్ చరిత్రలోనే మొదటిసారి పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఒకే మాటపై ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేశారు. కానీ, ప్రస్తుతం సైన్యం, ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనలను చూస్తుంటే ఇద్దరూ ఒకే తాటిపై నడుస్తున్నట్లు కనిపించటం లేదని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌కు హాని చేస్తున్నారా?
"విదేశాంగ విధానం గురించి ఇలా బహిరంగంగా చర్చించడం దేశానికే ముప్పు. ప్రభుత్వ వైఖరి పాకిస్తాన్‌కు హాని తలపెట్టేదిగా ఉంది. దౌత్యపరమైన నియమాలున్నాయి. ఇలాంటి వ్యాఖ్యానాలను ఏ దేశమూ, ప్రభుత్వంపై కూడా చేయకూడదు" అని భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్‌గా ఉన్న అబ్దుల్ బాసిత్ జర్మనీ బ్రాడ్‌కాస్టర్ డీడబ్ల్యూకి చెప్పారు.
అమెరికా వ్యతిరేక సెంటిమెంటును వాడుకుని ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కాపాడుకోవడానికి చూస్తున్నారని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.
"దౌత్యపరమైన మార్గాలను రాజకీయ సాధనంగా వాడుకోవాలని చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ దేశాల వ్యతిరేకతను ఒక అంశంగా వాడుకోవాలని ఇమ్రాన్ చూస్తున్నారు" అని పాకిస్తాన్ రాజకీయ విశ్లేషకుడు ముషర్రఫ్ జైదీ రాశారు.
ఇమ్రాన్ ఖాన్ సైన్యం సహాయంతోనే పదవిలోకి వచ్చారని అంటూ ఆయనను ఎంపిక చేసిన ప్రధాని అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బిలావల్ భుట్టో ఇమ్రాన్ ఖాన్‌ను ఎంపిక చేసిన ప్రధాని అని అంటూ వస్తున్నారు.
లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుంని ఐఎస్ఐ చీఫ్‌గా నియమించడం పట్ల గత ఏడాది నవంబరులో సైన్యానికి, ప్రభుత్వానికి మధ్య గొడవలు మొదలైనట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ బాధ్యతలను నదీమ్ అంజుంకి అప్పగించడం పట్ల ఇమ్రాన్ ఖాన్ సుముఖంగా లేరని తెలిసింది. కానీ, ఆ తర్వాత ఆయన ఆ నిర్ణయాన్ని ఆమోదించాల్సి వచ్చింది. కానీ, ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది.
అక్టోబరు 6న పాకిస్తాన్ సైన్యం నదీమ్‌ను ఐఎస్ఐ చీఫ్‌గా నియమిస్తూ ప్రకటన చేసింది.
కానీ, ఈ ప్రకటన చేసిన మూడు వారాల వరకూ ఆయన అపాయింట్మెంట్‌ను ధృవీకరించే నోటిఫికేషన్ రాలేదు. మరోవైపు ఈ నియామకంపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఈ పదవి గురించి నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికుందనే విషయంపై కూడా చాలా చర్చ జరిగింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రతిపక్షానికీ మధ్య జరుగుతున్న యుద్ధంలో సైన్యం ఎటు వైపు?
- దీపిక పదుకోణె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ... ఈ స్టార్లంతా కోట్లకు కోట్ల సంపాదనతో ఏం చేస్తున్నారు?
- రష్యా యుద్ధ ఖైదీలను యుక్రెయిన్ సైనికులు మోకాళ్లపై షూట్ చేశారా... వైరల్ వీడియో నిజమెంత? :BBC Reality Check
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











