దీపిక పదుకోణె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ... ఈ స్టార్లంతా కోట్లకు కోట్ల సంపాదనతో ఏం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, పరాగ్ ఛాపేకర్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లు బోలెడంత డబ్బు సంపాదిస్తుంటారని అంటారు. ఈ రోజుల్లో స్టార్లకు పారితోషికాలు కోట్లల్లో ఉంటున్నాయి. మరి అంత డబ్బును వాళ్లు ఏం చేసుకుంటారు? ఎక్కడ దాచుకుంటారు?
సినిమా తారలు చాలా మంది ఇళ్లు, ఇళ్ల స్థలాలు కొంటుంటారు. కొందరు రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో మన స్టార్లకు స్టార్టప్‌లపై ఆసక్తి పెరిగింది.
చాలామంది ప్రముఖ నటులు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. వీటిద్వారా లాభాలు కూడా మూటగట్టుకుంటున్నారు.
స్టార్టప్స్‌లో వీరి పెట్టుబడులు కోటి నుంచి 10 కోట్ల రూపాయల దాకా ఉంటున్నాయి. ఇలా కొత్త ఆలోచనతో మొదలవుతున్న కంపెనీల్లో సినీ నటులు పెట్టుబడులు పెట్టడం కొత్తేమీ కాదు. కానీ, గతంలో దీని గురించి వారు బహిరంగంగా మాట్లాడకపోయేవారు.
'ఆత్మ నిర్భర్ భారత్' కింద స్టార్టప్‌లకు అధిక ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభమయ్యాక, స్టార్టప్‌లపై సినీ తారలు ఆసక్తి పెంచుకోవడమే కాకుండా వాటి గురించి బహిరంగంగా మాట్లాడటం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టార్టప్‌లలో పెట్టుబడులు
సినిమా తారలకు స్టార్టప్‌లు, ఒక పెట్టుబడి మార్గంగా మాత్రమే కాకుండా వారి ఇమేజ్ బ్రాండింగ్‌తో కూడా ముడిపడి ఉంటాయి. అభిమానుల్లో తమ ఇమేజ్‌ను ఇనుమడింపచేసే ఉత్పత్తుల వైపే చాలామంది సినీ తారలు మొగ్గుతారు.
వినోద వ్యాపారంలో పెట్టుబడుల్ని స్టార్లు ఒక సురక్షితమైన డీల్‌గా పరిగణించరు. వివిధ రకాల స్టార్టప్‌లలో పెట్టుబడుల ద్వారా కచ్చితంగా రాబడులు వస్తాయని వారు భావిస్తారు.
ప్రతీ ఏడాది నాలుగు నుంచి అయిదు సినిమాల్లో నటిస్తూ సంపాదనలో అగ్రస్థానంలో ఉండే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ దాదాపు 12 కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తారు. కానీ ఆయన ఒక ఫిట్‌నెస్ కంపెనీని స్టార్టప్ పెట్టుబడిగా ఎంచుకున్నారు.
2014లో ఏర్పాటైన ముంబైకి చెందిన ఒక హెల్త్-టెక్ స్టార్టప్ కంపెనీలో అక్షయ్ కుమార్ పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీ ప్రజల రక్త పోటును, హృదయ స్పందన రేటును పర్యవేక్షించే ఫిట్‌నెస్ పరికరాలను తయారు చేస్తుంది.
టిక్ టాక్ యాప్ నిషేధానికి గురైన తర్వాత, దేశీయంగా తయారైన మరో యాప్‌కు విపరీత ప్రజాదరణ దక్కింది. ఈ కారణంగానే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అందులో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ఏం మారింది?
రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బును పెట్టుబడి పెట్టడం అనేది దాదాపు ప్రతీ బాలీవుడ్ స్టార్‌కు మొదటి ప్రాధాన్యం. పాత తరం స్టార్లు మొదలుకొని ఇప్పటి తరం వరకు బాలీవుడ్ ప్రముఖులు విలాస భవనాలు, విల్లాలు, ఫామ్ హౌస్‌లు, స్థలాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. నేటి తరం వారు కూడా ఈ పెట్టుబడులను సురక్షితమైనదివిగా భావిస్తున్నారు.
అయితే, 80, 90లలోని స్టార్ల తరహాలో ఒకే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీరు ఇష్టపడటం లేదు. ఒక ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేసుకొని కేవలం సినిమా, వెబ్ సిరీస్‌లలోనే పెట్టుబడులు పెట్టాలని అనుకోవట్లేదు. అనేక రంగాల్లో వారు పెట్టుబడుల్ని ప్రారంభించారు.
పిల్లలకు సంబంధించిన అమ్యూజ్‌మెంట్ పార్కులతో పాటు అనేక క్రీడలకు చెందిన ప్రీమియర్ లీగ్‌లలో జట్ల కొనుగోలు నుంచి రెస్టారెంట్ల వరకు ఇలా అనేక రంగాల్లో వారు డబ్బులు కుమ్మరిస్తున్నారు.
డిస్కో కింగ్ మిథున్ చక్రవర్తి గతంలో ఊటీలో హోటల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఆయనకు ఆదాయాన్ని తెచ్చి పెడుతోన్న వాటిలో ఈ వ్యాపారానిదే అగ్రస్థానం.
అందుకే, స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఫిట్‌నెస్ స్టార్టప్‌లపై ఆసక్తి కనబరిచారు. సల్మాన్ ఖాన్‌కు చెందిన 'బీయింగ్ హ్యుమన్' బ్రాండ్ గురించి అందరికీ తెలుసు.
అమితాబ్ బచ్చన్ కూడా 1995లో ఏబీసీఎల్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. కానీ 'మిస్ వరల్డ్' ఈవెంట్ సమయంలో ఆయన దివాలా తీసినంత నష్టాల పాలయ్యారు.
గతం కంటే బాలీవుడ్ ఇప్పుడు మరింత కార్పొరేట్ హంగుల్ని అద్దుకుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. రెండు దశాబ్దాల క్రితం పెట్టుబడులు పెట్టేందుకు బాలీవుడ్ తారలు హోటళ్లు లేదా బిల్డర్ల వద్దకు వెళ్లేవారు. ఎందుకంటే ఆదాయం, పన్నులకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పటిలా ఉండేవి కావు. ఇప్పుడు వీటిలో చాలా మార్పులు వచ్చాయి.
''బాలీవుడ్ వాళ్ల దగ్గర చాలా డబ్బు ఉంది. కొన్నింటిలో పెట్టుబడులు నష్టపోయినా వారికి పెద్ద విషయమేం కాదు. మంచి రాబడులు పొందేందుకే వారు పనిచేస్తారు. వారి మేనేజర్లు కూడా ఈ అంశంపై పెట్టుబడులు పెడుతుంటారు'' అని ఎడల్‌వాయిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ మెహతా అన్నారు.
''నిజానికి స్టార్టప్ ఫండింగ్‌లో చాలా అభివృద్ధి ఉంది. ఇప్పుడు అందరూ దీని బాటే పడుతున్నారు. ఒక స్టార్ వద్ద రూ. 25-30 కోట్లు ఉంటే, దాన్ని ఒక అయిదు నుంచి పది స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెడితే... వారికి పూర్తి స్థాయిలో లాభాలు వస్తాయి'' అని రోహిత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కేవలం అక్షయ్ కుమార్ ఒక్కరే కాదు...
దీపిక పదుకోణెకు స్టార్టప్‌లపై ఉన్న ప్రేమ అక్షయ్ కుమార్ కన్నా ఎక్కువ. ఆమె చాలా స్టార్టప్‌లలో పెట్టుబడులు చేశారు. ఇటీవల రిటైల్ వినియోగదారుల వస్తువులను విక్రయించే స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.
ఇదే కాకుండా ఫర్నీచర్ బ్రాండ్లు, అలంకరణ ఉత్పత్తులకు సంబంధించిన బ్రాండ్లలో కూడా ఆమె పెట్టుబడులు ఉన్నాయి. ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీతో ఫ్యాన్లను ఉత్పత్తి చేసే కంపెనీలో కూడా ఆమె ఇన్వెస్ట్ చేశారు.
బాంబే ఐఐటీకి చెందిన విద్యార్థులు ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ పద్ధతిలో తయారయ్యే ఫ్యాన్లతో గృహోపయోగ విద్యుత్‌లో దాదాపు 65 శాతం వరకు ఆదా చేయవచ్చు. ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ కూడా ఎడ్‌టెక్ రంగంలో పెట్టుబడులు చేశారు.
మరో స్టార్ నటి అనుష్క శర్మ, మాంసానికి ప్రత్యామ్నాయ ఆహార వస్తువులకు సంబంధించిన స్టార్టప్ కంపెనీతో జత కూడారు. ఇందులో ఆమెతో పాటు ఆమె భర్త, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా భాగస్వామ్యం అయ్యారు. బెంగళూరుకు చెందిన టెక్నాలజీ కంపెనీలో కూడా వారు పెట్టుబడులు పెట్టారు.
ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠికి మొదటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. ఆయన అగ్రిటెక్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీకి 30 లక్షల రైతులతో నెట్‌వర్క్ ఉంది. మొదటి నుంచి బ్రాండింగ్, ప్రకటనల విషయంలో ఆచితూచి ఎంపిక చేసుకుంటానని త్రిపాఠి అన్నారు. తన ఇష్టాలకే అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
''ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు నన్ను కలిశారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని, వాటికి తగిన సమాధానాలు రైతులకు చేరలేకపోతున్నట్లు నాతో చెప్పారు. వారిద్దరూ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానంలో దీనిపై పనిచేస్తున్నారు. నేను కూడా ఒక రైతునే. అందుకే వ్యవసాయం, రైతుల గురించి నేను ఆందోళన చెందాను. కాబట్టి నాకు అవకాశం రాగానే, వ్యవసాయాన్ని ఎన్నుకున్నాను'' అని పంకజ్ త్రిపాఠి చెప్పారు.
''మొదట్లో నాకు ఫండింగ్ చేసేంత పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు నా ఆసక్తి ప్రకారం రంగాన్ని ఎంచుకున్నా. సామాజిక కారణం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన రంగం ఏదైనా ఉంటే అందులో కూడా పెట్టబడులు పెట్టడానికి నేను సిద్ధమే. ఆన్‌లైన్‌లో నటనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలంటూ చాలాసార్లు నన్ను అడిగారు. కానీ అది సరైనదని నేను అనుకోవట్లేదు'' అని పంకజ్ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
ప్రియాంక చోప్రా నుంచి అమీర్ ఖాన్ వరకు
హృతిక్ రోషన్ దుస్తులు, యాక్సెసరీస్‌కు చెందిన స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేశారు. హెల్త్, ఫిటెనెస్ స్టార్టప్‌లో ఆయన పెట్టుబడులు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి.
నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత అమెరికాలో స్థిరపడిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చాలా రకాల స్టార్టప్‌లను ఎన్నుకున్నారు. మొదట కాలేజ్ విద్యకు సంబంధించిన ఒక స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత డేటింగ్ యాప్‌ల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు.
ఆమీర్ ఖాన్‌కు ఆన్‌లైన్ ఫర్నీచర్ రెంటల్ ప్లాట్‌ఫామ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. అలాగే ఒక పేమెంట్ గేట్‌వే సంస్థకు కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
భారత్‌లో తొలి ఆన్‌లైన్ స్టయిలింగ్ ప్లాట్‌ఫామ్‌గా పరిగణించే ఒక సంస్థలో ఆలియా భట్ 2017లో పెట్టుబడులు పెట్టారు. కొంతకాలం క్రితం ఐఐటీ కాన్పూర్‌కు అనుబంధంగా ఉన్న ఒక స్టార్టప్‌లో కూడా ఆమె ఇన్వెస్ట్ చేశారు.
గత ఏడాది శ్రద్ధ కపూర్ ఒక బ్యూటీ బ్రాండ్‌తో జతయ్యారు. 2017లో ఏర్పాటైన ఈ కంపెనీ ఆన్‌లైన్‌లో బ్యూటీ ఉత్పత్తులను వినియోగదారుల ఇళ్లకు చేర్చుతుంది.
సొంతంగా మేకప్ బ్రాండ్‌ను రూపొందించిన కరీన కపూర్ ఖాన్, ఇటీవలే ఐపీఓకి వచ్చిన ఒక ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్‌లో పెట్టుబడులు పెట్టారు.
ఆమె అక్క కరిష్మా కపూర్ ఆన్‌లైన్ బేబీ ప్రోడక్ట్స్ కంపెనీలో, ఆమె స్నేహితురాలు మలైకా అరోరా జ్యూస్‌లు ఇతర ఉత్పత్తులకు సంబంధించిన స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేశారు.
ఐశ్వర్యరాయ్, ఆమె తల్లితో కలిసి బెంగళూరు చెందిన గాలి నాణ్యతను కొలిచే పరికరాలను తయారుచేసే స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు.
ఆయుష్మాన్ ఖురానా, పురుషులకు సంబంధించిన గ్రూమింగ్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీతో టై అప్ అయ్యారు. ఈ కంపెనీ 2015లో గురుగ్రామ్‌లో ఏర్పాటైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఫిట్‌నెస్‌పై వ్యామోహం
జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జ్యూస్‌లు తయారు చేసే ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.
మాంసాహార ప్రియుల కోసం అనిల్ కపూర్‌తో కలిసి అర్జున్ కపూర్ 'హోం ఫుడ్ డెలివరీ' కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు.
సునీల్ శెట్టి ఒక ఆన్‌లైన్ ఫిట్‌నెస్ కమ్యూనిటీ స్టార్టప్‌తో కలిసి పని చేస్తున్నారు. కరోనా మహమ్మారితో లాక్‌డౌన్ విధించిన సమయంలో ఆరోగ్య రక్షణకు సంబంధించిన సప్లిమెంట్‌లు, వాటిపై అవగాహన ప్రచార కార్యక్రమాల్లో ఆయన పనిచేశారు.
తరచుగా యోగా ప్రాక్టీస్ చేసే శిల్పా శెట్టి నాలుగేళ్ల క్రితం ఒక బేబీకేర్ స్టార్టప్‌లో రూ. 1.5 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
కోవిడ్ కాలంలో పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేసిన సోనూ సూద్, రూరల్ ఫిన్‌టెక్ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు.
ఈ కంపెనీ, దేశానికి చెందిన కోటి మంది గ్రామీణ వ్యాపారవేత్తలకు ఆర్థికంగా, డిజిటల్‌గా స్వావలంబన అందించడం గురించి మాట్లాడుతుంది.
సినీతారలకు పెట్టుబడులు పెట్టడానికి స్టార్టప్ కంపెనీల రూపంలో మంచి అవకాశం దక్కింది. ఇప్పుడు వారు, ఈ కంపెనీల్లో పెట్టుబడుల గురించి హాయిగా పైకి చెప్పుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రతిపక్షానికీ మధ్య జరుగుతున్న యుద్ధంలో సైన్యం ఎటు వైపు?
- యుక్రెయిన్ మీద యుద్ధానికి రష్యాకు ఎంత ఖర్చవుతోంది?
- లేపాక్షి ఆలయాన్ని కట్టించిన వ్యక్తి కళ్లను విజయనగర రాజు పొడిపించేశారా?
- చైనా: పగలంతా ఆఫీసులో పని.. రాత్రి అక్కడే స్లీపింగ్ బ్యాగ్‌లో నిద్ర
- ఒక అనాథ ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













