లతా మంగేష్కర్: ‘చూస్తూండండి. సంగీత దర్శకులు, నిర్మాతలు ఈమె పాదాల మీద పడి, మాకు పాడండి అని ప్రాధేయపడే రోజులు వస్తాయి’

లతా మంగేష్కర్ 30 వేలకు పైగా పాటలను పాడారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లతా మంగేష్కర్ 30 వేలకు పైగా పాటలను పాడారు
    • రచయిత, మృణాళిని
    • హోదా, తెలుగు విభాగం అధిపతి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా

అది 1948. షహీద్ చిత్రం కోసం పాటల రికార్డింగ్ జరుగుతోంది. తన వద్దకు ప్రసిద్ధ సంగీత దర్శకుడు గులామ్ హైదర్ తీసుకువచ్చిన అమ్మాయి గొంతు విని, నిర్మాత శశధర్ ముఖర్జీ ‘మరీ సన్నటి గొంతు’ అని పెదవి విరిచాడు. ఒళ్లు మండిన గులామ్ హైదర్ ‘చూస్తూండండి. సంగీత దర్శకులు, నిర్మాతలు ఈమె పాదాల మీద పడి, మాకు పాడండి అని ప్రాధేయపడే రోజులు వస్తాయి’ అన్నాడు.

అంతటితో ఆగక, తనే అదే సంవత్సరం ‘మజ్‌బూర్’ చిత్రంలో ఆమె చేత ‘దిల్ మేరా తోడా తూనే కహీ కా న ఛోడా’ అనే పాట పాడించాడు. అలా హిందీలో ఆరంగేట్రం చేసిన లతా (మరాఠీలో అంతకు ముందే పాడింది) హైదర్ జోస్యాన్ని అతి త్వరలోనే నిజం చేసింది. గులామ్ హైదర్‌ని తన గాడ్‌ఫాదర్‌గా లతా ఆ తర్వాత ఇంటర్వ్యూలలో చెప్పుకుంది.

కానీ ఆమెకు తిరుగులేని పేరు తెచ్చిపెట్టిన పాట మాత్రం ఖేమ్‌చంద్ ప్రకాశ్ స్వరపరిచినది. మహల్ (1949) చిత్రంలో ‘ఆయేగా ఆనేవాలా’. లతా స్వరంలోని విస్తృతినీ, మాధుర్యాన్నీ, భావప్రకటనా ప్రతిభనూ సుస్పష్టం చేసిన ఈ పాటతో ఆమె త్వరలోనే హిందీ పాటల ప్రపంచాన్ని ఏలుతుందని ధృవపడింది.

శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో లతా మంగేష్కర్ జన్మించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో లతా మంగేష్కర్ జన్మించారు

లతామంగేష్కర్ తొలి రోజుల్లో నూర్జహాన్‌ని ఆరాధించేవారు. నౌషాద్ సంగీత దర్శకత్వంలో ‘అందాజ్’ (1949) లో ‘తోడ్ దియా దిల్ మేరా తూనే అరే బేవఫా’ విన్నపుడు నూర్జహాన్ కవళికలు అందులో బాగానే ధ్వనిస్తాయి. కానీ ఆ ప్రభావం చాలా తాత్కాలికం. త్వరలోనే తన ముద్రని హిందీ చలనచిత్రరంగంపై శాశ్వతంగా వేసి, భారత రత్న అయింది. పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహబ్ ఫాల్కే, ఎన్నో ఫిలిం ఫేర్, జాతీయ అవార్డులూ అందుకుంది.

తెలుగువారిని సైతం మురిపించి, మన సినీజాతి రత్నాలు ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల పేర్ల మీద పెట్టిన అవార్డులూ కైవసం చేసుకుంది. తను పోటీలో ఉన్నంతకాలం మరో గాయనికి ఫిలింఫేర్ రాకపోవచ్చుననే ఆత్మవిశ్వాసంతో ఇకపై ఫిలింఫేర్ పోటీలో నేనుండనని 1969లో ప్రకటించి, అందరినీ విస్తుపోయేలా చేసింది.

లండన్ ఆల్బర్ట్ హాల్‌లో గానం చేసిన తొలి భారతీయ గాయనిగా రికార్డు నెలకొల్పింది. ఇలా విదేశీ గౌరవాలు, జాతీయస్థాయి పురస్కారాలూ లెక్కలేనన్ని పొందిన లతాకు అసలైన చిరునామా మంచి సంగీతాన్ని ఆస్వాదించగల శ్రోతల హృదయాలే.

‘కంభఖ్త్, కభీ బేసురీ నహీ హోతీ’ అని ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్‌ని తన శృతిశుభగత్వంతో అబ్బురపరిచిన లతామంగేష్కర్ మొత్తం 36 భాషల్లో వేలకొద్దీ పాటలు పాడింది. ఆమె గానంలోని గుణాలు – మాధుర్యం, శ్రావ్యత, సంగీతజ్ఞత. సోదరి ఆశాలాగా సన్నివేశాన్ని, పాత్రను బట్టి స్వరంతో విన్యాసాలు చెయ్యకపోయినా, తోటి గాయకులు రఫీ, కిశోర్‌లలా పాటను దృశ్యమానం చేసేంత నాటకీయంగా పాడకపోయినా, ఆమెలోని అసాధారణమైన లక్షణం ఆ దేవుడిచ్చిన ‘వెంటాడే స్వరం’ (haunting voice).

లతా పాటలు విన్న తర్వాత కూడ మనల్ని ఎంతో సేపు వెంటాడతాయి. ఆ మాధుర్యం నుంచి ‘కోలుకోడానికి’ చాలా సమయం పడుతుంది. దానికి రెండు కారణాలు: అది మనల్ని వదిలిపోదు. దాన్ని వదిలించుకోవాలని మనకు తోచదు. ఆయుర్వేద వైద్యంలో వాడే ‘అతిమధురం’ మనకు లతా స్వరంలో దొరుకుతుంది. ఆ రకంగా ఆ కంఠస్వరం అందరికీ దివ్యౌషధమే.

రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయురాలు లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయురాలు లతా మంగేష్కర్

లతామంగేష్కర్‌కు నూర్జహాన్ ఒకసారి ‘నువ్వేమైనా చెయ్యి గానీ, శాస్త్రీయ సంగీతసాధన వదిలిపెట్టకు’ అని చెప్పింది. దాన్ని త్రికరణశుద్ధిగా పాటించడం వల్లనే ఆమె, దిలీప్ కుమార్ అన్నట్టు ‘భగవంతుడు సృష్టించిన ఒక అద్భుతంగా’ తనని తాను మలచుకోగలిగింది.

1929లో జన్మించిన లతకు తండ్రి దీనానాథ్ మంగేష్కరే తొలి సంగీత గురువు. ఆయన నాటకాల్లో తన అయిదో యేటే పాడిన లతాకు ఒకరకంగా ‘గాయకవృత్తి’ అప్పుడే ప్రారంభమైందని చెప్పవచ్చు. తర్వాత ఉస్తాద్ అమన్ అలీ ఖాన్ శిష్యరికంలో హిందుస్తానీ సంగీతాన్ని క్షుణ్ణంగా అభ్యసించింది. ఆ శిక్షణ ఆమెకు ఎలాంటి స్వరరచననైనా క్షణంలో పాడేయగల సామర్ధ్యాన్ని అలవరిచింది.

లతామంగేష్కర్ పలకలేని గమకం లేదు. పలికించలేని శాస్త్రీయ రాగం లేదు. ఏ ‘నోట్’ పలికినా అది ఆమె స్వంతమైపోతుంది. ఎంత క్లిష్టమైన పాటైనా లతా పాడగలదనే నమ్మకం ఏర్పడ్డాక, లతామంగేష్కర్ ప్రతిభకు తగ్గ స్వరరచన చెయ్యాలని సంగీత దర్శకులే ఉబలాటపడ్డారు. అలాంటి వాళ్లల్లో అనిల్ బిశ్వాస్, సి.రామచంద్ర, నౌషాద్, మదన్ మోహన్, ఎస్.డి.బర్మన్, శంకర్ జైకిషన్ వంటి వారున్నారు.

మూడు దశాబ్దాలు చలనచిత్ర నేపథ్యగానాన్ని ఏలిన లతా సహజంగానే అన్ని రకాల పాటలూ పాడింది. కానీ విషాదగీతాల్లో ఆమె ప్రతిభే వేరు. విషాదమాధుర్యం అనే పదం లతా కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా 1948 నుంచి ఒక దశాబ్దం పాటు ఆమె పాడిన పాటల్లో ఇలాంటివి ఇన్నేళ్ల తర్వాత విన్నా శరీరం గగుర్పొడుస్తుంది. అలాంటి వాటిలో... అనిల్ బిశ్వాస్ స్వరరచనలో యాద్ రఖ్‌నా చాంద్ తారో ఇస్ సుహానీ రాత్ కో (అనోఖా ప్యార్, 1948), తుమ్హే బులానే కో జీ చాహ్తాహై (లాడ్లీ, 1949), ఎక్ పల్ రుక్ జానా ఓ జానేవాలీ రాహీ (రాహీ, 1953), రూఠ్ కే తుమ్ జో చల్ దియే (జల్తీ నిషానీ, 1957), సీనేమే సులగ్‌ తే హై అర్‌మా (తరానా, 1951)... కొన్ని ఆణిముత్యాలు.

అలాగే సి.రామచంద్ర సంగీత దర్శకత్వంలో తుమ్ క్యా జానో తుమ్హారీ యాద్ మే హమ్ కిత్‌నా రోయే (షిన్ షినాకీ బుబ్లా బూ, 1952), ముఝ్‌పే ఇల్జామె బేవఫాయీహై (యాస్మిన్, 1955), కైసే ఆవూ జమునా కె తీర్ (బహురానీ, 1963), యే జిందగీ ఉసీకీ హై జో కిసీకా హోగయా (అనార్కలీ, 1953) వంటివి.

ఎస్.డి.బర్మన్‌తో లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, TWITTER / @ MANGESHKARLATA

ఫొటో క్యాప్షన్, ఎస్.డి.బర్మన్‌తో లతా మంగేష్కర్

ఇక ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో లతా టాప్ టెన్‌లలో ఒకటని చెప్పదగిన ‘తుమ్ న జానే కిస్ జహామే ఖోగయే’ (సజా, 1951) కాక, ఎన్నో మధురమైన గీతాలు ఆలపించింది. బందినీలో మోరా గోరా రంగ్ దేదే, ఘర్ నంబర్ చవ్వాలీస్‌లో ఫైలీ హుయీహై సప్‌నోంకీ బాహే, నౌజవాన్‌లో ఠండీ హవాయే లెహరాకే ఆయే, మదన్ మోహన్‌కు పాడిన వాటిలో లగ్‌జా గలే (వో కౌన్ థీ), ఉన్ కో యె షికాయత్ హై కే హమ్ (అదాలత్), హమ్ ప్యార్ మే జల్‌నే వాలోంకో, శంకర్ జై కిషన్ సంగీతంలో ప్రీత్ యే కైసే బోల్ రే దునియా (దాగ్, 1952), రసిక్ బలమా (చోరీచోరీ), సజన్ సంగ్ కాహే నేహా లగాయే (మై నషే మే హూ, 1958), సలీల్ చౌధురికి ఓ సజ్‌నా, బర్‌ఖా బహార్ ఆయీ, రోజ్ అకేలీ ఆయే, జారే జారె ఉడ్‌జారే పంఛీ, ఆజారే పర్‌దేశీ, నౌషాద్‌కు ‘మొహె భూల్ గయే సావరియా (బైజూ బావ్‌రా), ప్యార్ కియాతో డర్‌నా క్యా (మొగలె ఆజమ్), ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ (పాల్ కీ), ఆర్.డి.బర్మన్‌కు ఘర్ ఆజా ఘిర్ ఆయీ (ఛోటే నవాబ్), రైనా బీత్ జాయే (అమర్ ప్రేమ్) మొదలైనవి.

వీడియో క్యాప్షన్, లతా మంగేష్కర్ సంగీత ప్రస్థానం ఇలా సాగింది

లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌కు సునో సజ్‌నా (ఆయీ దిన్ బహార్ కే), శీషా హో యా దిల్ హో ఆఖిర్ టూట్ జాతాహై (ఆశా), జానె క్యూ లోగ్ మొహబ్బత్ (మెహబూబ్ కీ మెహందీ) మొదలైనవి. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతుండదు.

లతా గులామ్ హైదర్ నుంచి రెహమాన్ వరకూ అన్ని తరాల సంగీత దర్శకులకూ పాడింది. అందరికంటే ఎక్కువ పాటలు శంకర్ జైకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌ల సంగీత దర్శకత్వంలో పాడింది. తండ్రీకొడుకులకు పాడిన ఘనత ఆమెది. ఎస్.డి.బర్మన్ - ఆర్.డి.బర్మన్, సర్దార్ మల్లిక్ - అనూ మల్లిక్, చిత్రగుప్త్ - ఆనంద్ మిళింద్, రోశన్ - రాజేశ్ రోశన్‌లకు ఆమె పాడింది. అన్నితరాల సంగీత దర్శకులకీ ఒకటే కల. లతామంగేష్కర్ తమ పాటలు పాడాలని.

మొహమ్మద్ రఫీతో లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, TWITTER / @ MANGESHKARLATA

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ రఫీతో లతా మంగేష్కర్

1940 దశకంలో పాడుతున్నప్పుడు ఉన్నంత మాధుర్యం 1980ల వరకూ ఆమెలో చెక్కు చెదరలేదు. 80ల తర్వాత స్వరంలో కొంత మార్పు వచ్చినప్పటికీ ఆమె గానంలో నాణ్యత ఎక్కడా మసకబారలేదు. ఈ దశకంలో ఏక్ దూజే కేలియే, ప్రేమ్ రోగ్, ఖుద్‌రత్, రామ్ తేరీ గంగా మైలీ, మైనే ప్యార్ కియా వంటి చిత్రాల్లో ఆమె అన్ని తరాలవారినీ ఆకట్టుకోగలిగింది.

గాయక నటిగా సినీ రంగంలోకి ప్రవేశించిన లతామంగేష్కర్ మధుబాల నుంచి మాధురీ దీక్షిత్ వరకూ, నర్గీస్ నుంచి జీనత్ అమన్ వరకూ ఎందరో నటీమణులకు పాడింది. లతా తమకు పాడుతోందంటే ముఖ్యంగా 1980ల తర్వాతి హీరోయిన్లు ఉబ్బిపోయేవారు. ఎప్పుడూ కథానాయికలకే తప్ప, ప్రతినాయికలకూ, డాన్సర్లకూ ఆమె పాడిన సందర్భాలు చాలా తక్కువ. అవి ఎక్కువగా చెల్లెలు ఆశా వంతుగా మిగిలేవి. తక్కిన ఇద్దరు సోదరీమణులు మీనా, ఉషా కూడ ప్రతిభావంతులే అయినా, అక్కల వెలుగుల్లో వీళ్లు మసకబారక తప్పలేదు.

లతామంగేష్కర్ సినిమాల్లో తేలిక గీతాల నుంచి శాస్త్రీయరాగాల పాటలు ఎంత సునాయాసంగా పాడిందో, సినిమాయేతర గీతాల్లో భజనలు, గజళ్ళు, శ్లోకాలు, భావగీతాలు అంతే శ్రావ్యంగానూ ఆలపించింది. లతా పాడలేని సంగీత ప్రక్రియ అంటూ ఏదీ లేదు. మరాఠీ నేపథ్యంతో హిందీ ప్రపంచంలోకి అడుగుపెట్టినపుడు, ఉర్దూ పై పట్టు ఉండడం కష్టం. కానీ అతి త్వరలోనే దాన్ని సాధించి, నౌషాద్, దిలీప్ కుమార్ వంటి వారి ప్రశంసలు అందుకుంది.

ఎన్ని భాషల్లో పాడినా, ఆయా భాషల మెలకువలు తెలుసుకోవడం వల్ల బెంగాలీల నుంచి కన్నడిగుల వరకూ అందరూ లతాకు అభిమానులే అయ్యారు. తెలుగువారికి ఆమె అందించిన రసగుళిక ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం)ను చాలామంది గుర్తుచేసుకుంటారు. ఆ తర్వాత కూడా తెలుగులో మరో పాట పాడారు కానీ లత తెలుగు పాట అనగానే ఇప్పటికీ నిదురపోరానే గుర్తుకొస్తుంది.

రఫీ, ముఖేశ్‌లతో లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, NIYOGI BOOKS

ఫొటో క్యాప్షన్, రఫీ, ముఖేశ్‌లతో లతా మంగేష్కర్

లతా, గాయకులూ

చితల్కర్, మహమ్మద్ రఫీ, ముఖేశ్, తలత్ మహమూద్, హేమంత్ కుమార్, కిశోర్ కుమార్, మన్నాడే, సుబీర్ సేన్‌లు మొదలుకుని, సోనూ నిగమ్, అమిత్ కుమార్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంల వరకూ అన్ని తరాల గాయకులతోనూ ఆమె పాడింది. మరే గాయకుడూ, గాయనీ చేయని పని లత చేసింది. తన సమకాలీన గాయకుల పాటలను తను పాడి రికార్డు చేయడం. సైగల్ ఆల్బమ్ తనే పాడి, బాల్యంలో తన అభిమాన గాయకుణ్ణి కలవలేకపోయిన లోటును తీర్చుకుంది. (బాగా చిన్నప్పుడు సైగల్‌ని పెళ్లి చేసుకోవాలని కూడ లతా ఆశించిందట.) అలాగే ‘శ్రద్ధాంజలి’ అనే ఆల్బమ్ లో తన సహగాయకులు రఫీ, కిశోర్, ముఖేశ్, హేమంత్ కుమార్‌ల పాటల్లో తనకిష్టమైవి పాడింది.

ఇలాంటి అరుదైన ఆలోచనలు వచ్చిన ప్రతిభావంతురాలు లతామంగేష్కర్. కిశోర్ కుమార్ ‘వో శామ్ కుఛ్ అజీబ్ ధీ’ (ఖామోషీ), రఫీ ‘మనరే తూ కాహేన ధీర్ ధరే’ (చిత్రలేఖ), ముఖేశ్ ‘కహీ దూర్ జబ్ దిన్ ఢల్‌జాయే’ (ఆనంద్), హేమంత్ కుమార్ ‘తుమ్ పుకార్‌లో (ఖామోషీ) వంటివి పాడి, మరణించిన తన సహగాయకులకు అరుదైన నివాళి సమర్పించింది.

యుగళగీతాల్లో లత ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. చెల్లెలు ఆశాభోంస్లే లాగా పోటీ పెట్టుకున్న చందాన పాడడం లత పద్ధతి కాదు. (ఆశా ప్రత్యేకించి కిశోర్, రఫీలతో పాడినపుడు సవాలు చేస్తున్నట్టు పాడేది). ఏ గాయకుడితో పాడినా, రెండు స్వరాలు ఏకమౌతున్నట్టుగా అనిపించడం, రెండు గళాలు సమాంతరంగా కాక, ఒకదానిలో ఒకటి ఒదిగినట్టుగా కలిసిపోవడం లత గానంలోని ప్రత్యేకత. ముఖ్యంగా రఫీ, లతాల యుగళగీతాలు వింటున్నపుడు శ్రోత మరో లోకంలోకి, ద్వంద్వాతీతమైన ఆనందజగత్తులోకి వెళ్లిపోతాడు.

దోఘడీ వో జో పాస్ ఆ బైఠే (గేట్ వే ఆఫ్ ఇండియా), సాజె దిల్ ఛేడ్ దే (పాస్ పోర్ట్), ఆప్ నే యాద్ దిలాయా (ఆర్తీ), వోజబ్ యాద్ ఆయే (పారస్మణీ), జిందగీ భర్ నహీ భూలేగీ (బర్సాత్ కీ రాత్), కుహూ కుహూ బోలే కోయలియా (సువర్ణ సుందరి), ఆజా కే ఇంత్‌జార్ మే (హలాకూ), యాద్ ఆనే లగీ (దామన్) వీటిలో చాలా కొన్ని మాత్రమే.

దిలీప్ కుమార్‌తో లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, TWITTER / @ MANGESHKARLATA

ఫొటో క్యాప్షన్, దిలీప్ కుమార్‌తో లతా మంగేష్కర్

రఫీ తర్వాత ముఖేశ్, తలత్ మహమూద్‌లతో లత యుగళగీతాలు శ్రవణపేయంగా ఉంటాయి. ముఖేశ్‌తో దమ్ భర్ జో ఉధర్ మూ ఫేరే (ఆవారా), ఓ మేరే సనమ్ (సంగమ్), ఎక్ ప్యార్ కా నగ్‌మా హై (షోర్), కహీ కర్‌తో హోగీ మేరా ఇంతజార్ (ఫిర్ కబ్ మిలోగీ), సావన్ కే మహీనేమే (మిలన్), ఫూల్ తుమ్హే భేజాహై (సరస్వతీ చంద్ర) వంటివి బోలెడు.

తలత్ మహమూద్‌తో ‘ఇత్‌ నా న ముఝ్‌ సే తూ ప్యార్ బఢా’ (ఛాయా), వో దిల్ దార్ బోలో ఎక్ బార్ (స్కూల్ మాస్టార్), రిమ్ ఝిమ్ కె యే ప్యారే (ఉస్నే కహాథా), మేరే దిల్ కీ ధడకన్ క్యా బోలే (అన్‌హోనీ), సీనేమే సులగ్‌ తే హై అర్‌మా (తరానా), యే మేరే అంధేరే ఉజాలే నహోతే (ప్రేమ్ పత్ర్), దిల్ మే సమాగయే సజన్ (సంగ్ దిల్) ఇంకా ఎన్నో.

ముఖేశ్ తో యుగళాలు ఎక్కువగా శంకర్ జైకిషన్, కల్యాణ్ జీ ఆనంద్ జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌ల సంగీత దర్శకత్వంలో ఉండగా, తలత్‌తో సలీల్ చౌధరి, వసంత్ దేశాయ్, సి.రామచంద్ర వంటి వారి సంగీతంలో వచ్చాయి.

హేమంత్ కుమార్‌తో పాడిన ఆణిముత్యాల్లో కొన్ని – యాద్ కియా దిల్ నే కహా హో తుమ్ (పతిత), ఎక్ బార్ జరా ఫిర్ కెహదే (బిన్ బాదల్ బర్‌సాత్), ఛుపాలూ యూ దిల్ మే ప్యార్ మేరా (మమత), ఆ నీల్ గగన్ తలే ప్యార్ హమ్ కరే (బాద్ షా).

కిశోర్ కుమార్‌తో లతా యుగళగీతాల్లో గొప్పవి – లిఖాహై తేరీ ఆంఖోమే (తీన్ దేవియాన్), తేరే బినా జిందగీసే కోయీ శిక్‌వా (ఆంధీ), ఆప్ కీ ఆంఖోమే కుఛ్ (ఘర్), తేరే మేరే మిలన్ కీ యే రైనా (అభిమాన్) ఇత్యాదులు.

ఏ కాలం గాయకుడితో గళం కలిపినా, అదే తాజాదనంతో ఉండడం లతా కంఠస్వరంలోని మహిమ. అందుకే చితల్కర్‌తో పాడిన ‘కిత్‌నా హసీహై మౌసమ్’ (అల్‌బేలా)లో ఎంత శ్రావ్యంగా ఉందో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో పాడిన ‘దిల్ దీవానా హై’ (మైనే ప్యార్ కియా)లో అంతే శ్రావ్యంగా ఉంది లతా స్వరం.

లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, NIYOGI BOOKS

మకుటం లేని మహారాణి - వివాదాలు

లతా అన్ని విధాలా హిందీ చలనచిత్ర సంగీత రంగానికి మకుటం లేని మహారాణిగా వెలిగింది.

ఒక సందర్భంలో రఫీ అన్నట్టు ఆమెది ‘మహారాణి’ మనస్తత్వం. అది పాటల ఎంపికలోనూ, తను ఎవరితో పాడాలన్నది శాసించడంలోనూ, సంగీత దర్శకులతో, సహగాయకులతో వివాదాల్లోనూ బయటపడేది. అభిప్రాయాల్లో ఖచ్చితత్వం, రాజీ పడని తనం ఉన్న లతా అపుడపుడూ వివాదాల్లో చిక్కుకోవడం ఆశ్చర్యమేమీ కాదు.

పధ్నాలుగవ యేట తండ్రి మరణించగా, కుటుంబ బాధ్యతను నెత్తిన వేసుకుని, వ్యక్తిగత ఆకాంక్షలను పక్కన పెట్టిన లతా మంగేష్కర్ వ్యక్తిత్వం గొప్పది. ముగ్గురు చెల్లెళ్లను, తమ్ముడిని అపురూపంగా పెంచింది. కానీ పెద్ద చెల్లెలు, ఆశా, చలనచిత్రరంగంలో తనదైన ముద్రతో దూసుకుపోవడమే కాక, వ్యక్తిగత జీవితంలో అక్క ఉపదేశాలను ధిక్కరించి 16వ యేటే పారిపోయి పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి భగ్నమయ్యాక, ఇతర అనుబంధాల్లో చిక్కుకోవడం లతాకు నచ్చని పనులు.

హిందీ సినిమాల్లోనే అత్యంత ప్రతిభావంతులైన ఈ అక్కచెల్లెళ్లు పైకి ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నా, బహుశా వృద్ధాప్యంలో ఒకర్నొకరు అర్థం చేసుకుని, క్షమించుకున్నా, వాళ్ల మధ్య ఏకీభావం తక్కువేనని ఎవరికైనా అర్ధమవుతుంది.

ఓపి నయ్యర్‌కు లతా పాడకపోవడం వల్ల (దీనికి ఎవరికి తోచిన కారణాలు వాళ్లు చెప్తారు) అటు అతనికి గానీ, లతాకు గానీ ఏ నష్టమూ జరగలేదు. ఆశా లాభపడింది. కనక అక్కడ అంతా మంచి జరిగినట్టే లెక్క. ఆశా విషయంలో మరో ఉదంతం ఉంది. లతాను సర్వజనావళికీ చేరువ చేసిన దేశభక్తిగీతం ‘ఏ మేరే వతన్ కీ లోగో’. దాని స్వరకర్త సి.రామచంద్ర ఉద్దేశంలో ఈ పాట లతా, ఆశాల యుగళగీతంగా ఉండాల్సింది. కానీ లతా, ఆశాను అందులో పాడిస్తే తను పాడనని భీష్మించుకోవడం వల్ల రామచంద్ర తలవంచి ఆమె చేతే మొత్తం పాడించాడని విశ్వసనీయ కథనం (రాజూ భరతన్)

లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, Getty Images

తర్వాత మహమ్మద్ రఫీతో రాయల్టీ విషయంలో వచ్చిన అభిప్రాయభేదాలు అయిదేళ్ల పాటు ఇద్దరూ కలిసి పాడకపోవడంలో పర్యవసించింది. ఇక్కడ కూడ రఫీకి, లతాకు ఏ నష్టమూ జరగలేదు. సుమన్ కల్యాణ్‌పూర్, శారద వంటి గాయనులు లాభపడ్డారు. అంతే.

తను ఎంతో అభిమానించి, గొప్ప పాటలు పాడిన సంగీత దర్శకులతోనూ లతా అపుడపుడూ గొడవపడి వాళ్లకు పాడడం మానేసింది. వారిలో ఎస్.డి.బర్మన్, సి.రామచంద్ర కూడ ఉన్నారు. అక్కడ కూడా ఈ విభేదాల వల్ల గీతాదత్, ఆశాభోంస్లే లాభపడ్డం ఎవరికైనా ఆనందం కలిగించే విషయమే. వాళ్లిద్దరూ గొప్ప గాయనిలు కనక.

అనంతర కాలంలో వచ్చిన వివాదం వాణీ జయరామ్, అనూరాధా పౌడ్వాల్ వంటి వారిని ఎదగనీయకుండా చేసింది లతా అని. వాళ్లు ఆ విషయాలు స్పష్టంగానే చెప్పారు. లతామంగేష్కర్ తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఖండించింది. కానీ ఆ మచ్చ కొద్దో గొప్పో ఆమెకు, ఆమె సోదరికీ కూడ అంటుకునే ఉంది.

క్రికెట్‌నూ, సచిన్ టెండూల్కర్‌నూ ఎంతో అభిమానించే లతామంగేష్కర్ తన ఇంటర్వ్యూలలో సాధారణంగా ఖచ్చితమైన అభిప్రాయాలనే ప్రకటించింది. అందులో ఒకటి ‘రీమిక్సు’లపై విరుచుకుపడడం. హిందీ చలనచిత్ర సంగీతాన్ని అభిమానించే ఏ శ్రోత అయినా లతా అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తారు.

రఫీ, కిశోర్, ముఖేశ్, తలత్, హేమంత్, మన్నాడే, సురయ్య, షంషాద్ గీతాలను పోగొట్టుకున్న హిందీ పాటల ప్రపంచం లతా, ఆశాలతో ఇంకా బతికే ఉందని ఊరడిల్లుతోంది. హిందే పాటల స్వర్ణయుగం ఎప్పుడో అంతరించింది. ఇప్పుడు కొన్ని పాటలను వెతికి పట్టుకుని, బాగానే ఉన్నాయని ఆనందిస్తూ ఉన్నంతలో సంతృప్తి చెందుతున్నాం.

లతామంగేష్కర్

ఫొటో సోర్స్, Getty Images

లతామంగేష్కర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలం? మన నిత్య జీవితంలో అన్ని కాలాలను ఆనందంతో, పారవశ్యంతో నింపగల విశిష్ట గాయని. తొలి రోజుల్లో కుటుంబం కోసం త్యాగాలు చేసి, వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టినా, తనకు నచ్చిన రీతిలో జీవించిన అపురూపమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. బతికుండగానే లెజెండ్ అనిపించుకున్న పురుషులు ఉండవచ్చుగానీ, స్త్రీలు కొందరే. ఒక ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఒక లతామంగేష్కర్ మాత్రమే దాన్ని సాధించారు.

భక్తిభావాన్ని ఎ మాలిక్ తేరే బందే హమ్, అల్లా తేరో నామ్‌ లతో; ప్రేమలో అర్పణను హమ్ తేరే ప్యార్ మే సారా ఆలమ్, తుమ్హీ మేరీ మంజిల్, తుమ్హీ మేరీ పూజా లతో; ఆనందాన్ని ముఝే తుమ్ మిల్‌ గయే హమ్ దమ్, యే సమా సమాహై యే ప్యార్‌ కీ లతో; అల్లరి తనాన్ని మై క్యా కరూ రామ్ ముఝే బుఢ్ఢా మిల్ గయా, తూనే ఓ రంగీలీ కైసా జాదూ కియా లతో; విరహాన్ని కైసే దిన్ బీతే, కైసే బీతీ రతియా, ఉన్ ఆంఖోమే నీంద్ కహా లతో; ఉద్వేగాన్ని ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై తో; అణచిపెట్టుకున్న దుఃఖాన్ని వో భూలీ దాస్తా ఫిర్ యాద్ ఆగయీ, అజీబ్ దాస్తా లతో; వియోగాన్ని యే శామ్ కీ తన్హాయియా, ఐసే మే తేరా గమ్, తుమ్హే యాద్ కర్ తే కర్‌ తే లతో... ఇలా అన్ని మానసిక స్థితులనూ పరిపూర్ణమైన ఆలాపనలో రంగరించి, మన హృదయాలను ఆర్ధ్రం చేసి, ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే వందలాది రసగుళికలను మనకందించిన లతాకు నివాళులర్పిస్తూ...

‘గుజరా హువా జమానా ఆతా నహీ దోబారా/హాఫిజ్ ఖుదా తుమ్హారా’.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)