వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి.. ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టు - ప్రెస్ రివ్యూ

యష్ ధుల్

ఫొటో సోర్స్, Getty Images

అండర్‌-19 వరల్డ్‌కప్‌ను భారత్‌ దిగ్విజయంగా ముగించింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో నెగ్గిన కుర్రాళ్లు.. రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ముందుగా భారత పేసర్లు రాజ్‌ బవా (5/31), రవి కుమార్‌ (4/34)ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ 44.5 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. జేమ్స్‌ రూ (95) ఒక్కడే పోరాడాడు.

ఛేదనలో భారత్‌ 47.4 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసి గెలిచింది.

తెలుగు క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ (50) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, నిశాంత్‌ సింధు (50 నాటౌట్‌), రాజ్‌ బవా (35) ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు.

చివరి రెండు బంతుల్లో సిక్స్‌లు కొట్టిన వికెట్ కీపర్ దినేష్ బానా మరో 14 బంతులు మిగిలి ఉండగానే భారత్‌కు విజయాన్ని అందించాడు. సిక్స్‌తో ప్రపంచకప్ సాధించిన మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేశాడు.

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాజ్‌ బవా నిలిచాడు.

అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ విజేత టీమిండియా

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్‌: 44.5 ఓవర్లలో 189 ఆలౌట్‌ (జేమ్స్‌ రూ 95, జేమ్స్‌ సేల్స్‌ 34 నాటౌట్‌, జార్జ్‌ థామస్‌ 27, రాజ్‌ బవా 5/31, రవికుమార్‌ 4/34)

భారత్‌: 47.4 ఓవర్లలో 195/6 (షేక్‌ రషీద్‌ 50, రాజ్‌ బవా 35, నిషాంత్‌ సింధు 50 నాటౌట్‌, హర్నూర్‌ సింగ్‌ 21, యశ్‌ ధుల్‌ 17, దినేశ్‌ బనా 13 నాటౌట్‌, జోషువా బోయ్డెన్‌ 2/24, జేమ్స్‌ సేల్స్‌ 2/51, థామస్‌ అస్పిన్‌వాల్‌ 2/42).

బాలకృష్ణ

ఫొటో సోర్స్, prajasakti

అవసరమైతే సీఎంను కలుస్తా - బాలకృష్ణ

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఇదే అంశమై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలుస్తానని తెలిపారని ప్రజాశక్తి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన శనివారం హిందూపురం నుంచి అనంతపురం చేరుకొని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌కు వినతిపత్రం అందజేశారు.

అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని రకాల వసతులు హిందూపురం పట్టణంలో ఉన్నాయని తెలిపారు. కావున ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తమ భవిష్యత్తు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, తదితరులు పాల్గొన్నారు.

దేవేంద్ర ఫడణవీస్ భార్య

ఫొటో సోర్స్, ANI

ట్రాఫిక్ సమస్యతో విడాకులు

ట్రాఫిక్‌ కారణంగానే ముంబైలో మూడు శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ అన్నారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆర్థిక రాజధానిలో రోడ్ల పరిస్థితిని గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వాదనను వినిపించారు. ‘‘నేను దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అనే విషయం మరచిపోండి. ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను. గుంతలు, ట్రాఫిక్‌తో నేను వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడ్డాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ ట్రాఫిక్‌ కారణంగానే కుటుంబంతో గడిపే సమయం లేకపోవడంతో చాలామంది విడాకులు తీసుకుంటున్నారని చెప్పారు.

దీంతో శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఆమె పేరు ఎత్తకుండానే సోషల్‌ మీడియా వేదికగా ఆమె స్టేట్‌మెంట్‌పై విరుచుకుపడ్డారు. అంతేకాదు ట్రాఫిక్‌ కారణంగా విడాకులు తీసుకుంటున్నారన్న మహిళకు ది బెస్ట్‌ లాజిక్ ఆఫ్ ది డే అవార్డును అందజేయాలంటూ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు.

జంగారెడ్డి

ఫొటో సోర్స్, facebook/BJP4Telangana

బీజేపీ నేత జంగారెడ్డి మృతి

బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి (87) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి శనివారం హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో తుదిశ్వాస విడిచారని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

జంగారెడ్డికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. జంగారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు.

18 నవంబర్‌ 1935లో పరకాలలో జన్మించిన జంగారెడ్డి కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చారు.

1967ఎన్నికల్లో భారతీయ జనసంఘ్‌ తరఫున పరకాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978, 1983లో జనతాపార్టీ తరఫున శాయంపేట నుంచి విజయం సాధించారు.

1984లో హనుమకొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పీవీ నరసింహారావుపై భారీ మెజారీటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)