ప్రపంచంలో ఒంటరి తల్లులు ఎందుకు పెరుగుతున్నారు?

ఫొటో సోర్స్, Mam Issabre
వీర్యదాతలను ఉపయోగించుకుంటున్న మహిళల్లో సగం మందికి పైగా ఒంటరి మహిళలేనని.. వారు తమ పిల్లలను ఒంటరిగా పెంచాలనుకుంటున్నారని.. ప్రపంచంలో అతిపెద్ద స్పెర్మ్ బ్యాంక్ క్రైయోస్ ఇంటర్నేషనల్ తాజా సమాచారం చెప్తోంది.
దాతల వీర్యం, అండాలను ప్రపంచమంతటా 100 దేశాలకు పైగా సరఫరా చేస్తుంది క్రైయోస్. తమ క్లైంట్లలో గత ఏడేళ్లుగా ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోందని.. 2020లో వారు అత్యధికంగా 54 శాతం మందిగా ఉన్నారని ఆ సమాచారం వెల్లడిస్తోంది.
ప్రపంచంలో 10 కోట్ల మందికి పైగా ఒంటరి తల్లులు.. తమ పిల్లలను ఒంటి చేత్తో పెంచుతున్నారని యూఎన్ ఉమెన్ విభాగం అంచనా.
వారిలో ఐచ్ఛికంగా ఒంటరి తల్లులుగా ఉన్నవారు ఎందరు అనేదానిపై తగినంత సమాచారం లేదు. అయితే.. పిల్లలను ఒంటరిగానా పెంచాలని నిర్ణయించుకునే మహిళలు.. ఒంటరిగా కుటుంబాన్ని ప్రారంభించిన వెంటనే సామాజికంగా, సాంస్కృతికంగా, చివరికి చట్టపరంగా కూడా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది.
నలుగురు మహిళలతో వారు మాతృత్వానికి ప్రయాణం గురించి, భాగస్వామి లేకుండా పిల్లలను పెంచటంపై వారి ఆలోచనల గురించి మేం మాట్లాడాం.

ఫొటో సోర్స్, Mam Issabre
‘నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం’
ఫ్రాన్స్‌కు చెందిన మామ్ ఇసాబ్రి ఓ రేడియో హోస్ట్. తల్లిని కావాలని ఆమె కలలు కనేవారు. కొన్నేళ్ల పాటు ఆలోచించిన తర్వాత ఒంటరిగానే తల్లిని కావాలని రెండేళ్ల కిందట నిర్ణయించుకున్నారు.
‘‘దీని గురించి మా అమ్మతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అప్పటికి నాకు 38 ఏళ్లు. ఆ ప్రయత్నం చేయటానికి అదే మంచి సమయం కావచ్చునని ఆమె చెప్పారు’’ అని ఇసాబ్రి తెలిపారు.
‘‘డిసెంబర్‌లో నిర్ణయం తీసుకున్నాను. ఫిబ్రవరి కల్లా నేను గర్భం దాల్చాను’’ అని చెప్పారామె.
తొమ్మిది నెలల తర్వాత ఇసాబ్రి ఆరోగ్యవంతమైన చిన్నారి బాలికకు జన్మనిచ్చారు. ఆమెకు ఇమానీ అని పేరు పెట్టుకున్నారు.
ఇదంతా సాఫీగా సాగిపోయినట్లు అనిపిస్తుంది. కానీ తొలుత ఆమె ఓ పెద్ద అడ్డంకిని దాటాల్సి వచ్చింది: ఫ్రాన్స్‌లో ఆ సమయంలో ఒంటరి తల్లులకు సంతాన సాఫల్య చికిత్సలు అందుబాటులో లేవు.
గర్భంలో వీర్యం ప్రవేశపెట్టటానికి విదేశాలకు వెళ్లాలని ఆమె వైద్యులు సూచించారు. అయితే ఆ ప్రక్రియను నిర్వహించటానికి సంసిద్ధత తెలిపిన మరో వైద్యులను ఇసాబ్రి కలిశారు.
అయితే అది చట్టవ్యతిరేకమనే విషయం తనకు తెలియదని, దేశంలో ఆ ప్రక్రియను నిర్వహించటం సాధ్యం కాదని మాత్రమే తాను భావించానని ఆమె చెప్తున్నారు.
ఫ్రాన్స్‌లో అప్పటివరకూ సంతాన సాఫల్య చికిత్సలు పొందేందుకు కేవలం స్త్రీ-పురుష దంపతులకు మాత్రమే అనుమతి ఉంది. ఒంటరి తల్లులు, స్వలింగ సంపర్క జంటలు కూడా ఈ చికిత్స పొందేందుకు అనుమతించే అంశంపై రెండేళ్ల పాటు పార్లమెంటులో చర్చించిన అనంతరం.. ఆ అనుమతినిస్తూ స్తూ గత ఏడాది జూన్‌లో చట్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
‘దేవుడిచ్చిన వరం’
ఇసాబ్రి తల్లయి ఏడాది గడచిపోయింది.
‘‘నా కూతురిని నా చేతుల్లో ఎత్తుకున్న తొలిసారే నేను తల్లినని నాకు అర్థమైంది. ఆ రోజు నేను ఎంతగానో ఏడ్చాను. చాలా భావోద్వేగానికి లోనయ్యాను. నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయమది’’ అని చెప్తారామె.
వీర్యం కోసం గుర్తుతెలియని దాతను ఎంచుకున్నారు ఇసాబ్రి. అందుకు కారణం.. తన కూతురు తిరస్కారానికి గురికాకుండా రక్షించటం.
‘‘తన తండ్రి.. తనను తాను కేవలం ఒక దాతగా మాత్రమే పరిగణించే వ్యక్తి అనే భావన నా కూతురుకు కలగకుండా ఉండాలని’’ అంటూ ఆమె వివరించారు.
‘‘ఈ నిర్ణయం నాకు, నా కూతురుకు మేలు చేస్తుందని నేను ఆశిస్తున్నా. ఆమెకు తగనింత వయసొచ్చినపుడు నేను మొత్తం వివరిస్తాను’’ అని చెప్పారు.
‘‘నలుగురైదుగురు పిల్లలు కావాలన్నది నా కల. కానీ నాకు వయసు మీదపడుతోంది. ఈ ఒక్క బిడ్డే దేవుడిచ్చిన మంచి వరం అనుకుంటాను’’ అన్నారామె.

ఫొటో సోర్స్, Anne Marie Vasconcelos
‘వాడే నా ప్రపంచం.. వాడి ప్రపంచం నేనే అనిపించింది’
అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఆన్ మేరీ వస్కాన్జెలోజ్ వయసు 44 ఏళ్లు. ఫెడరల్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఆమె తల్లి కావటానికి చేసిన ప్రయాణం సుదీర్ఘంగా కష్టంగా సాగింది.
పదేళ్ల కిందట.. ఆమెకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నట్లు వైద్యపరీక్షల్లో గుర్తించారు. మహిళల్లో అండాశయాలు పనిచేసే తీరుమీద ప్రభావం చూపే ఆరోగ్య సమస్య ఇది. సంతాన సాఫల్యానికి సమస్యలు సృష్టించగలదు.
ఈ అంశంతో పాటు, అప్పుడే ఆమె తండ్రి చనిపోవటంతో.. ఆమె తన జీవితాన్ని మార్చివేసే నిర్ణయం తీసుకున్నారు.
‘‘నా వైద్య పరీక్షల రిపోర్టుల ప్రకారం.. నాకు పిల్లలు పుట్టటంలో సమస్యలు వస్తాయని ఎండోక్రినాలజిస్ట్ చెప్పారు. నేను కావాలనుకుంటే పిల్లలను ఆ పని చేయాలని సూచించారు’’ అని ఆమె తెలిపారు.
కానీ అప్పటికి 34 ఏళ్ల వయసున్న మేరీ.. ఒంటరి మహిళగా మిగిలారు. కాబట్టి తల్లినవ్వటం కష్టసాధ్యంగా అనిపించింది.
‘‘నాకు పెళ్లి కాలేదని ఆమెతో చెప్పాను. పిల్లలను కనటానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె నాతో అన్నారు. ఇలాంటి దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు’’ అని ఆమె వివరించారు.
క్యాథలిక్‌ను పాటించే తను కృత్రిమ గర్భధారణ ద్వారా ఒంటరి తల్లిని కావటమనేది కొన్ని నైతిక అంశాలను ముందుకు తెచ్చిందని.. వాటిని అధిగమించటానికి తన గురువుతో మాట్లాడటం సాయపడిందని మేరీ చెప్పారు.
‘‘ఈ దారిలో నేను వెళితే.. నా పిల్లలకు బాప్తిజం ఇవ్వవచ్చునని ఆయన నాకు భరోసా ఇచ్చారు. నా సంతాన సాఫల్య పద్ధతులకు ఆయన మద్దతివ్వనప్పటికీ.. నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఆయన తప్పొప్పులు ఎంచరు’’ అని వివరించారు.
రెండేళ్ల పాటు గర్భం దాల్చటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం ఎదురయ్యాయి.
‘‘ఐదుసార్లు కృత్రిమ గర్భధారణలు, రెండుసార్లు విట్రో ఫెర్టిలైజేషన్ చికిత్సల తర్వాత నా పెద్దబ్బాయి కడుపులో పడ్డాడు’’ అని ఆమె చెప్పారు.
‘‘అందుకోసం 95,000 డాలర్లు ఖర్చయ్యాయి. ఇందులో ఏదీ బీమా కవరేజీలో లేదు. దీంతో నేను దాచుకున్న డబ్బులతో పాటు, రిటైర్‌మెంట్ రుణాలు తీసుకున్నాను, మళ్లీ ఇల్లు తాకట్టు పెట్టి అప్పు చేశాను’’ అని వివరించారు మేరీ.

ఫొటో సోర్స్, Anne Marie Vasconcelos
‘నమ్మలేకపోయాను’
మేరీ మొదటి కొడుకు విలియం 2016లో పుట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు రెండో కొడుకు వ్యాట్ పుట్టాడు. ఈ ఇద్దరు పిల్లలనూ ఒకే వీర్యదాత నుంచి సేకరించిన వీర్యాన్ని ఉపయోగించి, ఐవీఎఫ్ పద్దతిలో ఆమె గర్భం దాల్చారు. ఇద్దరు పిల్లలనూ సమయానికి ముందే సిజేరియన్ ద్వారా ప్రసవించారు.
‘‘విలియం పుట్టినపుడు అతడి ప్రాణాలు పోయినంతపనైంది. కృత్రిమ శ్వాస అందించి, వెంటనే రక్తం ఎక్కించాల్సి వచ్చింది’’ అని ఆమె తెలిపారు.
తొమ్మిది రోజులు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించిన తర్వాత వారిద్దరినీ ఇంటికి పంపించారు.
‘‘నా లోకమంతా వాడే అనిపించింది. వాడి ప్రపంచం మొత్తం నేనే అనిపించింది’’ అని ఆనందంగా నవ్వుతూ చెప్పారు మేరీ.

ఫొటో సోర్స్, Anne Marie Vasconcelos
‘నాకు తెలిసిపోయింది’
ఆర్ట్ క్యురేటర్ సారా (ఆమె అసలు పేరు కాదు) తాను తల్లిని కావాలని ఎంతగానో కోరుకునేది.
‘‘నేను తల్లినవుతానా లేదా అనే అనుమానం నాకు జీవితంలో ఎప్పుడూ ఏ క్షణమూ కలగలేదు. నేను తల్లినవుతానని నాకు తెలుసు’’ అని 36 ఏళ్ల సారా చెప్పారు.
ఇక ఏమాత్రం నిరీక్షించాల్సిన అవసరం లేదని కరోనావైరస్ తనకు స్పష్టం చేసిందంటారామె.
‘‘అమ్మను కావాలనే నా ఆకాంక్షను సాకారం చేసుకోవటానికి ఈ మహమ్మారి వీలు కల్పించింది. నేను ఒక ఫ్రెండ్‌ను అడిగాను. అతని బిడ్డను నేను కంటాననే ప్రతిపాదనను అతడు అంగీకరించాడు’’ అని ఆమె వివరించారు.
తొలి ప్రయత్నం తర్వాత తాను గర్భందాల్చానని ఆగస్టులో సారా గుర్తించారు.
‘‘నేను పనిమీద బయట ఉన్నాను. చాలా వేడిగా ఉంది. నాకు తెలుస్తోంది. నాకు తెలిసిపోయింది’’ అని చెప్పారామె.
ఇప్పుడామె ఆరు నెలల గర్భవతి. తను ఈ నిర్ణయం తీసుకోవటానికి తన చిన్నప్పటి పరిస్థితులు ఎలా ప్రభావం చూపాయనేది ఆమె గుర్తుచేసుకున్నారు.
‘‘లెబనాన్‌లో అంతర్యుద్ధం మధ్య పెరిగాను నేను. యుద్ధం అత్యంత క్రూర దశలో ఉన్నపుడు 1985లో పుట్టాను. చిన్నప్పుడు సంతోషంగానే పెరిగాను. కానీ ఎంతో వేదన కూడా అనుభవించాను’’ అని చెప్పారు.
ఆమె తల్లిదండ్రులకు పెళ్లయి 40 ఏళ్లయింది. కానీ ‘‘వారు చాలా కాలం పాటు ఒకే ఇంట్లో విడిపోయి జీవించారు. వాళ్ల మద్య సంబంధం గొప్పగా లేదు. వారి సంబంధం కలుషితంగా ఉండేదనే చెప్తాను. అది నా నిర్ణయం మీద బాగా ప్రభావం చూపింది’’ అని తెలిపారామె.
‘‘నా తల్లిదండ్రుల సంబంధం నన్ను వేదనకు గురిచేసిందని నేను అనుకుంటాను’’ అన్నారు.

ఫొటో సోర్స్, Sarah
‘నేను చేసిన దాంట్లో సాహసమేమీ లేదు’
తన దేశపు పరిస్థితి, తన ఆప్తుల మరణాలు కూడా తన నిర్ణయం మీద చాలా ప్రభావం చూపాయని సారా చెప్తారు.
ఒంటరి తల్లిని కావటమనేది తనవరకూ సాహసోపేతమైన నిర్ణయమేమీ కాదంటారు సారా.
‘‘నేను చేసిన పనిలో ఏదో ప్రత్యేకత కానీ, సాహసోపేతమైనది కానీ ఏమీ లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే సంబంధాల్లో ఉన్న మహిళలు, పెళ్లయిన మహిళలు కూడా పిల్లల పెంపకాన్ని తామే చూసుకుంటారు’’ అంటారామె.
అయితే తన సంప్రదాయవిరుద్ధమైన తన నిర్ణయాన్ని ఆమోదించటానికి తన కుటుంబం ధైర్యంగా ముందుకు వచ్చిందని ఆమె చెప్పారు.
‘‘తండ్రి ఎవరు అనే దాని గురించి వాళ్లు ఎలాంటి ప్రశ్నలూ అడగకపోవటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మొదట్లో దాని గురించి మాట్లాడటానికి నేను సిద్ధంగా లేనని వాళ్లు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఈమధ్యే ఆ విషయం వారితో చెప్పా’’ అని సారా వివరించారు.
‘‘కానీ వారు నా విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని బంధుమిత్రులకు ప్రకటించటంలో వారు చాలా ధైర్యంగా ప్రవర్తించారని నేను అనుకుంటున్నా’’ అని నవ్వుతూ చెప్పారు.

ఫొటో సోర్స్, Sarah
‘నేను ప్రేమించటానికి ఒకరు కావాలి’
ఒంటరి తల్లులుగా పిల్లలను కనటాన్ని ఎంచుకునే మహిళల సంఖ్య పెరుగుతుండటం.. తల్లీ-తండ్రితో కూడిన కుటుంబ వ్యవస్థ పట్ల మారుతున్న వైఖరిని సూచిస్తుండవచ్చు.
అయితే.. తనకు వేరే మార్గమేదీ లేకపోవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్తున్నారు 37 ఏళ్ల సెక్యూరిటీ గార్డ్ న్యాక్నో ఒకోకోన్.
‘‘కావాలనే ఒంటరి తల్లిగా ఉన్నానని నేను చాలా మామూలుగా చెప్తాను. ఎందుకంటే నాకు వేరే అవకాశం లేదు. అది నా తలరాత. దానిని అంగీకరించటం నేర్చుకోవాలి’’ అన్నారామె.
బహుభార్యత్వం గల తండ్రితో 20 పిల్లల కుటుంబంలో పెరిగారు న్యాక్నో. ఆమె తండ్రికి ఆమె తల్లి నాలుగో భార్య.
‘‘మేం మా సొంతంగా బతకటానికి కష్టపడ్డాం. కాబట్టి మాకు మంచి చదువు దొరకలేదు. కేవలం కనీస ప్రాధమిక, మాధ్యమిక స్కూలు చదువు మాత్రమే దక్కింది. అందుకు వారిని తప్పుపట్టను. అది వారి మనస్తత్వం’’ అని బీబీసీకి తెలిపారు న్యాక్నో.
ఆమె నైజారియా నుంచి ఆరేళ్ల కిందట మెరుగైన జీవితం కోసం దుబాయ్ వచ్చారు.
రోజూ 12 గంటల షిఫ్టులో పనిచేస్తారు. కొత్త వారిని కలవటానికి, వారితో అనుబంధం పెంచుకోవటానికి తనకు సమయం లేదంటారు.
కానీ ఈ సంవత్సరం ఒక బిడ్డను కనాలని, అందుకు ఏం చేయాల్సి వచ్చినా చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.
‘‘నేను పిల్లలను పోషించగలిగితే, ప్రేమించగలిగితే, మంచి చదువు ఇప్పించగలిగితే.. నేను తల్లిని కాకుండా అడ్డుకునేదేమీ లేదని నాకు అర్థమైంది’’ అని చెప్పారామె.
‘‘నేను ప్రేమించటానికి ఒకరు కావాలి. నాకు ఒక బిడ్డ లేకపోతే నేను చాలా మొద్దుబారిపోతానని అనిపిస్తుంది’’ అని న్యాక్నో చెప్పారు.
‘‘ఆఫ్రికాలో సంరక్షణ గృహాలు లేవు. మేం ముసలివాళ్లమై, బలహీనమైపోయినప్పుడు మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటారు. కాబట్టి నాకు ఒక బిడ్డ ఉంటే.. అది సంతోషంతో పాటు భవిష్యత్తుకు ఒక ఆశనిస్తుంది’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Nyakno Okokon
సంప్రదాయ విరుద్ధమైన ప్రణాళికలు
సహజంగా గర్భం ధరించాలని న్యాక్నో ఆలోచిస్తున్నారు. అది వీలుకాకపోతే అప్పుడు ఐవీఎఫ్ కానీ సరోగసీ కానీ ప్రయత్నస్తానని చెప్పారు.
అయితే.. తాను గర్భందాల్చేవరకూ పుట్టబోయే బిడ్డ తండ్రికి ఆ విషయం చెప్పాలని ఆమె ఆలోచించటం లేదు.
‘‘అది న్యాయమే. ఎందుకంటే అతడికి నేను ఎలాంటి బాధ్యతనూ ఇవ్వబోవటం లేదు. అతడికి సొంత జీవితం, ప్రణాళికలు ఉంటాయి కాబట్టి ఇది అతడిని భయపెడుతుంది’’ అన్నారామె.
సంప్రదాయ విరుద్ధమైన ప్రణాళికను తన కుటుంబం అర్థం చేసుకుందని, ఒంటరి తల్లిగా తనకు తన కుటుంబం మద్దతిస్తుందని న్యాక్నో చెప్తున్నారు.
‘‘పాత రోజుల్లో పెళ్లి కాకుండా గర్భందాల్చటం పెద్ద పాపం. అలాంటి మహిళను చీత్కరించుకునేవారు. ఆమెకు కట్టుబాట్లు లేవని భావించేవారు. కానీ ఇప్పుడలా లేదు’’ అన్నారామె.
యాబై ఏళ్ల వయసులో తన జీవితం ఎలా ఉంటుందనేదే తనకు ముఖ్యమన్నారు.
‘‘నా కుటుంబం నాకు మద్దతివ్వటానికి కారణం.. నా వయసు తగ్గటం లేదని వారికి తెలుసు. ఇది నాకు సంతోషాన్నిస్తుందని వారికి తెలుసు’’ అన్నారామె.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











