యుగాండా: ఆకాశంలో 35 వేల అడుగుల ఎత్తున విమానంలో ‘మిరకిల్’ బేబీ జననం

ఫొటో సోర్స్, AISHA KHATIB
- రచయిత, మ్యాక్స్ మట్జా
- హోదా, బీబీసీ న్యూస్
యుగాండాకు ప్రయాణిస్తున్న విమానంలో ఒక మహిళకు కాన్పు చేసిన కెనడా డాక్టర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
టొరంటో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఐషా ఖాతిబ్... దోహా నుంచి ఎంతెబె వెళ్లే ఖతర్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో ప్రయాణికులలో ఒకరికి డాక్టర్ అవసరం ఉందంటూ విమాన సిబ్బంది నుంచి అత్యవసర ప్రకటన వినిపించింది.
తన తొలి బిడ్డకు జన్మనివ్వనున్న యుగాండా వలస కార్మికురాలు అదే విమానంలో సౌదీ అరేబియా నుంచి ఇంటికి వెళ్తున్నారు. ప్రయాణంలో ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.
35 వారాల గర్భిణి అయిన ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. శిశువు పూర్తి ఆరోగ్యంతో జన్మించింది. కాన్పు చేసిన డాక్టర్ పేరు మీదుగా ఆ పాపకు 'మిరకిల్ ఐషా' అనే పేరును పెట్టారు.
టొరంటోలో కరోనా విజృంభణ సమయంలో నిరంతరాయంగా పనిచేసిన డాక్టర్ ఖాతిబ్ ప్రస్తుతం విరామం తీసుకుని సెలవులను ఆస్వాదిస్తున్నారు.
విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని ఇంటర్‌కమ్‌లో విమాన సిబ్బంది అడిగినప్పుడు ఆమె చొరవ తీసుకున్నారు.
''రోగి చుట్టూ ప్రజలు గుమిగూడి ఉండటం నేను చూశాను. హార్ట్‌ఎటాక్ లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యేమో అని తొలుత అనుకున్నా'' అని బీబీసీ న్యూస్‌తో డాక్టర్ ఖాతిబ్ చెప్పారు.
''మరింత దగ్గరకు వెళ్లేసరికి సీటులో ఒక మహిళ కనిపించింది. ఆమె కాళ్లు కిటికీ వైపు ఉన్నాయి. కడుపులోని బిడ్డ బయటకు వస్తోంది'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, AISHA KHATIB
డాక్టర్ ఖాతిబ్‌కు మరో ఇద్దరు ప్రయాణికులు సహాయం చేశారు. వారిలో ఒకరు అంకాలజీ నర్సు కాగా మరొకరు పీడీయాట్రిషియన్ (పిల్లల వైద్య నిపుణులు).
బేబీ బిగ్గరగా ఏడ్చినట్లు ఐషా చెప్పారు. శిశువును మరింత బాగా పరిశీలించేందుకు పీడీయాట్రిషియన్‌కు అందించానని అన్నారు.
''తల్లీబిడ్డలిద్దర్నీ చూశాను. వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో కంగ్రాచ్యులేషన్ మీకు పాప పుట్టింది అని చెప్పాను. వెంటనే విమానంలో ఉన్న ప్రయాణికులంతా చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేశారు. అప్పుడు నాకు మేం విమానంలో ఉన్నాం. అందరూ మమ్మల్ని చూస్తున్నారన్న సంగతి గుర్తొచ్చింది'' అని ఐషా వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''ఈ కథలో చెప్పుకోవాల్సిన మరో విషయమేంటంటే, పాపకు నా పేరు పెట్టాలని ఆమె తల్లి నిర్ణయం తీసుకున్నారు'' అని డాక్టర్ ఐషా చెప్పారు.
తన పేరు పెట్టినందుకు బహుమతిగా... అరబిక్‌లో 'ఐషా' అని రాసి ఉన్న తన మెడలోని బంగారు గొలుసును 'మిరకిల్ ఐషా'కు డాక్టర్ అందజేశారు.
''నేను ఆ గొలుసును పాపకు ఇవ్వాలనుకున్నా. తనకు పురుడు పోసిన డాక్టర్ గుర్తుగా దాన్ని ఆమెకు ఇచ్చేశా. 35వేల అడుగుల ఎత్తులో, నైలు నది మీద ప్రయాణిస్తోన్న సమయంలో తనకు పురుడు పోశాను. అందుకే నా గుర్తుగా ఆ పాప దగ్గర గొలుసు ఉంటుంది'' అని ఆమె చెప్పారు.
నిజానికి ఈ డెలివరీ డిసెంబర్ 5న జరిగింది. కానీ అప్పటినుంచి డాక్టర్ ఐషా ఖాతిబ్, టొరంటోలో కరోనా రోగులకు చికిత్స అందించడంలో చాలా బిజీ అయ్యారు. డెలివరీకి సంబంధించిన చిత్రాలను ఆమె ఈ వారమే షేర్ చేశారు.
యుగాండాలో స్థానిక సిబ్బందికి శిక్షణ ఇస్తోన్న ఆమెను, డిసెంబర్ 18న కెనడా రావాల్సిందిగా కోరారు.
ఆమె ఇంటికి వెళ్తోన్న విమానంలోనూ వైద్య నిపుణుల అవసరం ఉందంటూ మరోసారి విమాన సిబ్బంది ఇంటర్‌కమ్‌లో పిలిచారు.
''అదృష్టవశాత్తు, విమానంలో అప్పుడు మరో వైద్యుడు ఉన్నారు.''
''ఈసారికి మీరే వైద్యం చేయాలి. రెండు వారాల క్రితమే నేను ఒక పాపకు పురుడు పోశాను. మీకేదైనా సహాయం కావాలంటే నేను 25ఎ సీటులో ఉంటాను. నన్ను అడగండి'' అని చెప్పినట్లు ఐషా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- రాజ్ కపూర్‌ను కలిసేందుకు పాకిస్తానీ సైనికులు వచ్చినప్పుడు ఏమైందంటే
- సముద్రంలో భారీ అగ్నిపర్వత విస్పోటం, పలు దేశాలకు సునామీ హెచ్చరిక
- ఆంధ్రప్రదేశ్: 'గుడిసె' ఉన్నట్లుండి సినిమా షూటింగ్ స్పాట్ ఎలా అయింది... జనాలెందుకు అక్కడికి క్యూ కడుతున్నారు?
- సెక్స్ కోరికలు వయసు పెరుగుతుంటే తగ్గిపోతాయా...
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ముస్లింలు ఎటు వైపు... బీజేపీ పాలనపై వారు ఏమంటున్నారు?
- చిరంజీవి ‘రాజ్యసభ సీటు ఆఫర్’ వార్తలపై ఏమన్నారంటే... – ప్రెస్‌రివ్యూ
- సరైన పద్ధతిలో ఉపవాసం ఎలా ఉండాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి?
- పాతికేళ్ల కిందట పంది గుండెను మనిషికి అమర్చిన భారతీయ వైద్యుడిని జైలులో ఎందుకు పెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













