డాక్టర్ ధనీరామ్ బారువా: ‘నేను పాతికేళ్ల కిందటే పంది గుండెను మనిషికి అమర్చాను. కానీ నన్ను జైల్లో పెట్టారు’

డాక్టర్ ధనిరామ్ బారువా

ఫొటో సోర్స్, BBC/DILIP KUMAR SHARMA

    • రచయిత, దిలీప్ కుమార్ శర్మ
    • హోదా, అస్సాం నుంచి బీబీసీ కోసం

‘‘పాతికేళ్ల కిందట పంది గుండెను మనిషికి అమర్చాను. ఆ సమయంలో నా పరిశోధనల ఆధారంగా పందిలోని ప్రతి భాగాన్ని మనిషి శరీరంలో అమర్చవచ్చని ప్రపంచానికి చెప్పాను. కానీ ఎవరూ నన్ను సపోర్ట్ చేయలేదు. ఇక్కడి ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టింది. ఇప్పుడు అమెరికా డాక్టర్ల పిగ్‌హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌ను ప్రపంచం ఒక గొప్ప ప్రయోగంగా చూస్తోంది. నేను మొదటిసారిగా ఈ పరిశోధన ప్రయోగం చేశాను’’ అంటూ డాక్టర్ ధనిరామ్ బారువా ఆవేశంగా బల్లమీద చరుస్తూ బిగ్గరగా అరవడం ప్రారంభించారు.

71 సంవత్సరాల బారువాకు 2016లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన స్పష్టంగా మాట్లాడ లేకపోతున్నారు.

ధనిరామ్‌తో చాలా ఏళ్లు కలిసి పని చేసిన దాల్మి బారువా ఆయన మాటలను అర్థం చేసుకుని వివరించారు. తన పరిశోధనలకు జరిగిన అన్యాయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు దాల్మి వెల్లడించారు.

ఇటీవల అమెరికా వైద్యుల బృందం జన్యుపరంగా మార్పు చేసిన పంది గుండెను మనిషికి అమర్చింది. ప్రపంచ శస్త్రచికిత్సల చరిత్రలోనే పంది గుండెను మనిషికి అమర్చడం తొలిసారని ఆ బృందం చెప్పుకుంది.

యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా ఈ తరహా సర్జరీ చేశారని, పంది గుండెను పొందిన డేవిడ్ బెన్నెట్ అనే 57 ఏళ్ల వ్యక్తి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని పేర్కొన్నారు.

అమెరికా వైద్యులు మనిషికి తొలిసారిగా పంది గుండె పెట్టినట్టు ప్రకటించుకున్నారని చెప్పిన వెంటనే డాక్టర్ బారువా అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత కాసేపటికి చిన్న నవ్వు నవ్వారు.

‘‘మొత్తానికి పంది గుండెను మనిషికి అమర్చవచ్చని ఈ ప్రపంచం పాతికేళ్ల తర్వాత అంగీకరించిందన్న మాట’’ అన్నారు బారువా.

పంది గుండె అమర్చిన రోగితో వైద్యుడు

ఫొటో సోర్స్, UNIVERSITY OF MARYLAND SCHOOL OF MEDICINE

1997లో ఆపరేషన్ చేసి జైలుకెళ్లారు

అస్సాంలోని సోనాపూర్‌లో ఉన్న డాక్టర్ ధనిరామ్ బారువా హార్ట్ సిటీ అండ్ సిటీ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ అనే మెడికల్ ఇనిస్టిట్యూట్‌ను నిర్వహిస్తున్నారు.

ఆయన అభిప్రాయం ప్రకారం అమెరికా వైద్యులు మనిషికి పంది గుండె అమర్చడం కొత్తేమీ కాదు. కొన్నేళ్ల క్రితం తన పరిశోధన ద్వారా పంది గుండె అమర్చడానికి ఉపయోగించిన టెక్నిక్ ఆధారంగా అమెరికన్ వైద్యులు ఈ ఘనత సాధించారని ఆయన పేర్కొన్నారు.

మానవ శరీరంలో పంది గుండె అమర్చడం గురించి బీబీసీతో జరిపిన సంభాషణలో ఆయన అనేక విషయాలు వెల్లడించారు.

‘‘నేను 1997 జనవరి 1న 32 ఏళ్ల వ్యక్తి శరీరంలో పంది గుండెను అమర్చాను. ఈ శస్త్రచికిత్సకు ముందు, 100 మందికి పైగా పరిశోధన చేశాం. మానవ శరీరం పంది శరీరంలోని అనేక భాగాలను అంగీకరిస్తుందని అప్పుడే నిర్ధరణైంది.

గుండె మార్పిడి తర్వాత రోగి 7 రోజుల పాటు సజీవంగా ఉండటం ఈ ప్రయోగం విజయవంతమైందనడానికి నిదర్శనం అంటారాయన. అయితే, రోగికి అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఉండడంతో ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.

ఆ రోగికి జఠరిక (గుండె దిగువ గది)లో రంధ్రం ఉంది. దీనిని వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. దానివల్ల రోగికి అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చాయి.

డాక్టర్ ధనిరామ్ బారువా సోనాపూర్‌లోని తన హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో హాంకాంగ్‌కు చెందిన సర్జన్ డాక్టర్ జోనాథన్ హో కే-షింగ్‌తో కలిసి ఈ శస్త్రచికిత్స చేశారు.

దాదాపు 15 గంటలపాటు జరిగిన ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ బారువా ఆ రోగికి పంది గుండె, ఊపిరితిత్తులను అమర్చారు. అయితే పేషెంట్ చనిపోయిన తర్వాత ఈ మార్పిడి వ్యవహారంపై పెద్ద వివాదం తలెత్తింది.

ఈ సంఘటన గురించి స్థానిక మీడియాలో వార్తలు రావడంతో, ఇద్దరు వైద్యులపై హత్యానేరం, మానవ అవయవ మార్పిడి చట్టం 1994 కింద అరెస్టు చేశారు.

స్కాట్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ గ్లాస్గోలో కార్డియో సర్జరీ చదివిన డాక్టర్ ధనిరామ్ ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

‘‘ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పిగ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. అయితే, ఆ సమయంలో నన్ను జైలులో పెట్టారు. ఇనిస్టిట్యూట్‌ను ధ్వంసం చేశారు. నేను 40 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వంగానీ, వైద్య రంగంలో పని చేసేవారుగానీ, ఎవరూ నాకు సహాయం చేయలేదు. ఈ రోజుకు కూడా నాపై ఆ కేసు నడుస్తోంది’’ అన్నారాయన.

Dhaniram baruva

ఫొటో సోర్స్, BBC/DILIP KUMAR SHARMA

‘ఎన్నో మందులు కనిపెట్టాను...అయినా...’

‘‘గ్లాస్గోలో కార్డియో సర్జరీ చదువు పూర్తి చేసి యూకే, అబుదాబి సహా అనేక దేశాల్లో పనిచేశాను. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పిలుపు మేరకు నేను మా రాష్ట్రానికి తిరిగి వచ్చాను. కానీ ఆ సమయంలో ఇక్కడి అస్సాం గణపరిషత్ ప్రభుత్వం నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను పరిశోధన కొనసాగించాను. ఇప్పటి వరకు నేను గుండె, హెచ్‌ఐవీ, డయాబెటీస్ వంటి అనేక వ్యాధులకు ఉపయోగపడే 23 రకాల మందులను కనుగొన్నాను’’ అని బారువా వెల్లడించారు.

కొన్ని గుండె చికిత్సలకు ఆపరేషన్ అవసరం లేకుండానే ఇంజెక్షన్ ద్వారా నయం చేసే మందును కూడా డాక్టర్ బారువా తయారు చేశారు.

‘‘నేను తయారు చేసిన హార్ట్ మెడిసిన్‌తో మనిషి శరీరంలో పంది గుండె పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. గుండె జబ్బుకు గుండె మార్పిడి అవసరం ఉండదు. ఇంజెక్షన్ రూపంలో ఈ మందును తయారు చేశాను’’ అన్నారాయన.

అయితే, ఆయన కనిపెట్టిన ఔషధాల క్లినికల్ ట్రయల్స్ గురించి, సంబంధిత ఆరోగ్య సంస్థల నుండి అనుమతి గురించి అడిగినప్పుడు డాక్టర్ ధనిరామ్‌ వివరాలు చెప్పలేదు.

డాక్టర్ ధనిరామ్‌తో చాలాకాలం పాటు పని చేస్తున్న డాక్టర్ గీత కొన్ని వివరాలు చెప్పారు.

‘‘ఈ మందులు సుదీర్ఘ పరిశోధన తర్వాత తయారు చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహా ఇతర ఏజెన్సీలను సంప్రదించాలి. కానీ, ఈ అనుమతులకు సుదీర్ఘకాలం పడుతుంది. మేం కరోనా వ్యాక్సీన్‌ను కూడా సిద్ధం చేశాం. అనుమతి కోసం ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేశాం. కానీ, వెయిట్ చేయమని చెప్పారు’’ అని అన్నారు డాక్టర్ గీత.

ముంబయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుండి పోస్ట్-డాక్టరేట్ చేసిన డాక్టర్ గీత, ‘‘ డాక్టర్ ధనిరామ్ హెచ్‌ఐవీకి కూడా మెడిసిన్‌ తయారు చేశారు. దీనిని రోగి 10 రోజుల కోర్సులాగా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత ఆ రోగి ఎలాంటి ఇతర ఔషధాల అవసరం లేకుండా మిగిలిన జీవితాన్ని గడపవచ్చు. 25శాతం కేసులలో చికిత్స తర్వాత రోగికి టెస్టుల్లో నెగెటివ్ వస్తుంది’’ అని వెల్లడించారు.

డాక్టర్ ధనిరామ్, ఆయన బృందం పదుల సంఖ్యలో రోగుల పేర్లను చెబుతూ, వారు ఈ మందులు వాడి పూర్తి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పారు.

ధనీరామ్ బారువా

బారువా వాదనలపై అనుమానాలు

అయితే, డాక్టర్ బారువా చేస్తున్న వాదనలు ఇంతకుముందులాగే సందేహాస్పదంగా ఉన్నాయి. డాక్టర్ ధనిరామ్ బారువా దగ్గర హెచ్‌ఐవీ చికిత్స తీసుకున్న తర్వాత రాష్ట్రంలో నలుగురు మరణించారని అస్సాంకు చెందిన హెచ్‌ఐవీ ఎయిడ్స్ కార్యకర్త జాహ్నవి గోస్వామి ఆరోపించారు.

‘‘డాక్టర్ ధనిరామ్ బారువా పరిశోధనను నేను ప్రశ్నించదలచుకోలేదు. అయితే, మీరు మీ హెచ్‌ఐవీ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపాలని మేం చాలాసార్లు చెప్పాం. ఐసీఎంఆర్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని చెప్పాం. కానీ, ఆయన మా మాట వినలేదు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తరపున, డాక్టర్ బారువా తయారు చేసిన హెచ్ఐవీ మందుపై విచారణ జరపాలని మేం అస్సాం ప్రభుత్వాన్ని కోరాం’’ అని జాహ్నవి చెప్పారు.

నౌగావ్‌లో ఒక రోగి డాక్టర్ బారువా తయారు చేసిన హెచ్‌ఐవీ ఇంజెక్షన్ తీసుకొని మరణించారు. ఆర్థికంగా వెనుకబడిన వారిలో చాలామంది తమ బంధువుల ఎయిడ్స్ మరణాన్ని వివాదం చేయడానికి సుముఖంగా ఉండరు. సమాజం నుంచి వివక్ష ఎదురవుతుందని భయపడతారు.

డాక్టర్ ధనిరామ్ బారువా ఇనిస్టిట్యూట్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ ధనిరామ్ బారువా ఇనిస్టిట్యూట్

భారీ భద్రత మధ్య పరిశోధన

సోనాపూర్‌లో ఉన్న డాక్టర్ ధనిరామ్ బారువా హార్ట్ సిటీ అండ్ సిటీ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ఇనిస్టిట్యూట్ బయట కనీసం సైన్ బోర్డు కూడా లేదు.

ఈ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో డాక్టర్ ధనిరామ్ అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించలేరు.

ఆయన ఇనిస్టిట్యూట్‌లో 200 కంటే ఎక్కువ కుక్కలు ఉన్నాయి. అవి ఏ అపరిచితుడిని లోపలికి రానివ్వవు.

అయితే, కుక్కల గురించి అడిగినప్పుడు డాక్టర్ ధనిరామ్ చిరునవ్వు నవ్వుతూ..‘‘వైద్యశాస్త్ర ప్రపంచంలో నిత్యం కొత్త పరిశోధనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి రక్షణ లభించలేదు. ఇప్పుడు ఈ కుక్కలే నన్ను కాపాడుతున్నాయి’’ అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)