బైకనూర్ కాస్మోడ్రోమ్: మనిషి విశ్వాన్వేషణ ప్రారంభించిన ఈ రహస్య అంతరిక్ష స్థావరాన్ని రష్యా వదులుకుంటోందా?

బైకనూర్

ఫొటో సోర్స్, VEGITEL

    • రచయిత, మేగాన్ ఈవ్స్
    • హోదా, బీబీసీ ట్రావెల్

ప్రపంచంలోని మొదటి, అత్యంత రహస్యమైన అంతరిక్ష స్థావరం బైకనూర్ కాస్మోడ్రోమ్.

ఇది విశాలమైన ఆసియా ఎడారిలో మాస్కోకు 2600 కిలోమీటర్లు ఆగ్నేయంగా, కజకిస్తాన్‌లోని రెండు ప్రధాన నగరాలు నూర్-సుల్తాన్, అల్మటీకి 1300 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పశ్చిమ మైదానంలో ఉన్న ఈ కేంద్రం నుంచే 1957లో సోవియట్ యూనియన్ తన మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ 1ను ప్రయోగించింది.

నాలుగేళ్ల తర్వాత 1961లో అంతరిక్ష యాత్ర చేసిన మొదటి వ్యోమగామిగా యూరీ గగారిన్ ఇక్కడే చరిత్ర సృష్టించారు. ఆయన వోస్టోక్ 1లో అంతరిక్షంలోకి వెళ్లారు.

అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన వాలంటీనా తెరెష్కోవా కూడా 1963లో ఇక్కడ నుంచే స్పేస్‌లోకి వెళ్లారు.

2011లో నాసా స్పేస్ షటిల్ కార్యక్రమం ముగిసిన తర్వాత, బైకనూర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ చేరుకోడానికి భూమిపై ఉన్న ఒకే ఒక ఆపరేషనల్ లాంచ్ సైట్‌గా మారింది.

యూరీ గగారిన్ మొదటిసారి అంతరిక్ష యాత్రకు వెళ్లిన 60 ఏళ్ల తర్వాత, ఇప్పటికీ ఇది ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష స్థావరంగా నిలుస్తోంది.

కానీ, కజకిస్థాన్‌లో పశ్చిమంగా దుమ్ముతో నిండిన ఒక ప్రాంతం అంతరిక్షంలోకి వెళ్లడానికి మానవాళికి ఒక ప్రవేశ ద్వారంలా ఎలా మారింది.

బైకనూర్

ఫొటో సోర్స్, VEGITEL

అంతరిక్షంలోకి వెళ్లే మార్గం

భూమిపైనుంచి అంతరిక్షంలోకి వెళ్లాలంటే రెండు చాలా అవసరం. ఒకటి ఆ ప్రాంతం జనావాసాలకు సుదూరంగా ఉండాలి. రెండోది భూమి తిరిగే వేగం నుంచి ప్రయోజనం పొందేలా అది భూమధ్యరేఖకు వీలైనంత దగ్గరగా ఉండాలి.

ఇక అమెరికా అంతరిక్ష కార్యక్రమం విషయానికి వస్తే, అది ఫ్లోరిడా తూర్పు తీరంలో అలాంటి ప్రాంతాన్ని గుర్తించింది. కెనెడీ స్పేస్ సెంటర్‌ను అక్కడే నిర్మించింది.

మరోవైపు సోవియట్ యూనియన్ అలాంటి స్థావరం నిర్మించడానికి తన సరిహద్దుల్లో కజక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లో ఉన్న ఒక మారుమూల ప్రాంతాన్ని గుర్తించింది. సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, రాకెట్లు ప్రయోగించడానికి అది అనువుగా ఉంది.

సోవియట్ 1920 నుంచీ రాకెట్లతో ప్రయోగాలు చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ వీ-2 రాకెట్ టెక్నాలజీ దాని సొంతమైంది. దీంతో అది తన కార్యకలాపాలను గణనీయంగా పెంచింది.

అధికారులు సిర్ దర్యా నది దగ్గర కజకిస్తాన్ మైదానాల్లో విశాలంగా ఉన్న ఒక ప్రాంతంలో టోరెటమ్ అనే ఒక చిన్న కాలనీని గుర్తించారు.

సోవియట్ యూనియన్ రాకెట్ ప్రయోగం

ఫొటో సోర్స్, RUSSIAN ARCHIVES, BBC

ఫొటో క్యాప్షన్, సోవియట్ యూనియన్ రాకెట్ ప్రయోగం

అక్కడ జనం రాకపోకలకు, వస్తువుల ఎగుమతులు, దిగుమతుల కోసం ఒక సాదాసీదా రైల్వే ప్లాట్‌ఫాం ఉంది. అప్పట్లో ఆ ప్రాంతంలో చమురు నిక్షేపాలను అన్వేషించే జియాలజిస్టులు వచ్చిపోవడానికి దాన్ని నిర్మించారు. అక్కడ అది తప్ప వేరే ఏం లేదు.

అది ఒక చదునుగా ఉన్న బంజరు భూమి. చెట్లే లేని ఆ ప్రాంతంలో వాతావరణం తీవ్రంగా ఉంటుంది. తరచూ ధూళి తుపానులు వస్తుంటాయి. ఉష్ణోగ్రతలు వేసవిలో 50 డిగ్రీల సెల్సియస్‌కు పైగా, చలికాలంలో మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతుంటాయి.

అక్కడ ఉన్న రైల్వే లైన్ ఉపయోగించుకున్న సోవియట్ యూనియన్ ఆ ప్రాంతంలో రాకెట్ లాంచ్ పాడ్స్ ఏర్పాటుకు, అవసరమైన భవనాలు నిర్మాణానికి వేలాది కార్మికులను తీసుకొచ్చింది.

అది భూమిపై అతిపెద్ద కృత్రిమ బిలం నిర్మాణానికి కూడా కారణమయ్యింది. 250 మీటర్ల పొడవు, వంద మీటర్ల వెడల్పు 45 మీటర్ల లోతు ఉండే ఈ బిలంను ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ను లాంచ్ చేసినపుడు, దాని నుంచి వెలువడే మంటలను తట్టుకోగలిగేలా రూపొందించారు.

రాకెట్ లాంచ్ జరిగే ప్రాంతానికి దక్షిణంగా 30 కిలోమీటర్ల దూరంలో టురాటమ్ నగరం ఉంది. అది నదితోపాటూ అభివృద్ధి చెందింది.

దాంతో, అమెరికా ప్రత్యర్థులను గందరగోళానికి గురిచేయడానికి సోవియట్ ఈ ప్రాంతం పేరు మార్చేసింది. తమ మరో నగరం పేరును దీనికి పెట్టింది. అదే బైకనూర్.

బైకనూర్

ఫొటో సోర్స్, VEGITEL

బైకనూర్ అంతా అత్యంత రహస్యం

జనావాసాలు లేని ఈ ప్రదేశం వ్యోమగాములు భూమిని వదిలే ముందు చూసే చివరి ప్రాంతమే కాదు.. అంతరిక్షం నుంచి కిందికి దిగగానే భూమిపై చూసే మొదటి ప్రాంతం కూడా.

"బైకనూర్‌ అంతరిక్షానికి సగం దూరంలో ఉన్న ఒక నివాసం" అని ఐఎస్ఎస్‌లో ఏడాది పాటు ఉండి రికార్డు సృష్టించిన నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీ తన 'ఎ ఇయర్ ఇన్ స్పేస్' డాక్యుమెంటరీలో వర్ణించారు.

"ఒక విధంగా ఇలాంటి ప్రాంతానికి రావడంలో అర్థం ఉంది. ఇది మనం మామూలుగా చూసే ప్రాంతాల్లా కాకుండా ఒంటరిగా ఉంటుంది. మరింత ఒంటరిగా ఉండే ప్రాంతానికి(అంతరిక్షానికి) వెళ్లడానికి మొదటి మెట్టులా ఉంటుంది. అంటే, ఒక మారుమూల ప్రాంతం నుంచి మరో మారుమూల ప్రాంతానికి వెళ్లడానికి" అన్నారు.

"అంతరిక్షంపై నియంత్రణ అనేది దాని అన్వేషణతోపాటూ సైనికపరంగా కూడా ముఖ్యమైనది" అని స్టీఫెన్ వాకర్ తన 'బియాండ్-ది అమేజింగ్ స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ హ్యూమన్ టు లీవ్ అవర్ ప్లానెట్ అండ్ ట్రావెల్' అనే పుస్తకంలో రాశారు.

రాకెట్లను మొదట అంతరిక్షంలోకి వెళ్లేలా అభివృద్ధి చేశారు. కానీ ఆ రాకెట్లు తమ శత్రు భూభాగాల్లో బాంబుల వర్షం కురిపించే బాలిస్టిక్ మిసైళ్లను కూడా తీసుకెళ్లగలవని కొన్ని ప్రభుత్వాలు గుర్తించాయి.

భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు కొమ్ములు తిరిగిన గూఢచారులు కూడా చేరుకోలేనంత కష్టంగా ఉండే ప్రాంతాల దృశ్యాలు అందించగలవు.

పర్యటకులు ఇక్కడ లైవ్ లాంచ్‌ చూడవచ్చు

ఫొటో సోర్స్, VEGITEL

ఫొటో క్యాప్షన్, పర్యటకులు ఇక్కడ లైవ్ లాంచ్‌ చూడవచ్చు

1960ల ప్రారంభంలో మనిషిని అంతరిక్షంలోకి పంపించాలని అమెరికా అభాసుపాలయ్యింది. అమెరికా తమ అంతరిక్ష ప్రయోగాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సమయంలో ప్రెస్, దేశ ప్రజల ముందు విషాదం జరిగింది.

అదే సమయంలో యూఎస్ఎస్ఆర్ కార్యక్రమం ద్వారా సోవియట్ యూనియన్ ప్రయోజనం పొందింది.

సోవియట్ యూనియన్ తమ అంతరిక్ష కార్యక్రమాన్ని అప్పటికప్పుడే, మరింత వేగంగా చేయడానికి రహస్యంగా ఉండే బైకనూర్ ప్రాంతం అవసరమైన స్వేచ్ఛను అందించింది.

"సోవియట్ తమ క్షిపణి సైట్‌ను, ఆర్ 7 మిసైల్‌ సాంకేతికతను, యూరీ గగారిన్ అంతరిక్షానికి వెళ్లినప్పటికి, ప్రపంచంలోనే అతిపెద్దదైన ఐసీబీఎంను కాపాడుకుంటోంది. అది ఆ రహస్యాలను కాపాడుకోవాల్సుంటుంది. ఆ టెక్నాలజీ అమెరికన్ల చేతికి చిక్కిందేమోనని సోవియట్స్ భయపడ్డారు. వాస్తవానికి చివరికి అదే జరిగింది" అని వాకర్ నాకు చెప్పారు.

సోవియట్ యూనియన్ పతనం

1991 డిసెంబర్‌లో సోవియట్ యూనియన్ పతనంతో కజకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. దాంతో రష్యాకు అత్యంత కీలకమైన అంతరిక్ష స్థావరం విదేశీ భూభాగంలో ఉండిపోయింది.

కానీ, ఏడాదికి దాదాపు 1 బిలియన్ డాలర్లు చెల్లించి బైకనూర్‌ను ఉపయోగించుకోడానికి రష్యా 1994లో కజకిస్థాన్‌తో ఒక లీజ్ ఒప్పందం చేసుకుంది.

అంతరిక్ష ప్రయోగాలు, ముఖ్యంగా ఐఎస్ఎస్ దగ్గరికి వ్యోమగాములను పంపించే మిషన్స్ చూడ్డానికి బైకనూర్‌ వచ్చే పర్యటకుల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. కానీ ఆ కేంద్రం గురించి గోప్యతను మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు.

ఈ రష్యా నగరం చుట్టూ కజకిస్తాన్ మధ్యలో ఉన్న బైకనూర్ అతరిక్ష స్థావరాన్ని రష్యా అంతరిక్ష ఏజెన్సీ రోస్‌కాస్మోస్ నిర్వహిస్తోంది.

ఇక్కడికి వెళ్లానుకునేవారికి చాలా ఆంక్షలు ఉంటాయి. బైకనూర్ అంతరిక్ష కేంద్రం చూడాలనుకునే పర్యటకులు సర్టిఫైడ్ టూర్ ఆపరేటర్స్ నిర్వహించే గైడెడ్ టూర్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

బైకనూర్‌లో పర్యటకులు

ఫొటో సోర్స్, VEGITEL

ఫొటో క్యాప్షన్, బైకనూర్‌లో పర్యటకులు

బైకనూర్ చాలా రకాలుగా 1960ల్లోని సోవియట్‌ యూనియన్‌కు ఒక సంపూర్ణ అవశేషంలా మిగిలింది.

ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికులు, ఏరోస్పేస్ ఇంజనీర్లు, వారి కుటుంబాలు నివసించిన అపార్ట్‌మెంటు గోడలు, తలుపులపై అంతరిక్షంలో నవశకాన్ని ప్రారంభించిన తమ సహచరులను హీరోల్లా వర్ణించే చిత్రాలు ఇప్పటికీ కనిపిస్తాయి.

అంతరిక్ష స్థావరం లోపల యూరీ గగారిన్ లాంటి మొదటి వ్యోమగాములు పడుకున్న చిన్న క్యాబిన్ల పక్కనే శిథిలమైన హ్యాంగర్స్ ఉన్నాయి.

బైకనూర్ అంతరిక్ష స్థావరానికి వచ్చే చాలా మంది పర్యటకులు ముఖ్యంగా ఇక్కడ జరిగే రాకెట్ లాంచ్ చూడ్డానికే వస్తారు.

బైకనూర్ చారిత్రక, సాంస్కృతిక గొప్పతనం కూడా దానిని ఒక ఆసక్తికరమైన పర్యటక కేంద్రంగా మార్చాయని ప్రత్యేకంగా గత సోవియట్ యూనియన్ ప్రాంతాలు చూపించే సోవియట్ టూర్స్ స్థాపకుడు, డైరెక్టర్ గాన్లుకా పర్డేలీ చెప్పారు.

కజకిస్తాన్ ఎడారిలోని మైదానాల్లో ఎక్కడో మారుమూల తన నగరం పేరుతో మరో నగరాన్ని సృష్టించడం అనేది సోవియట్ యూనియన్ ప్లానింగ్‌కు ఉదాహరణగా నిలుస్తోంది అన్నారు.

బైకనూర్ స్పెషల్ టూర్‌లో భాగంగా రాకెట్ లాంచ్ జరిగే ప్రాంతాలతోపాటూ, యూరీ గగారిన్ మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లిన లాంచ్‌పాడ్ కూడా చూపిస్తారు. ఇక్కడున్న కాస్మోడ్రోమ్ మ్యూజియం బైకనూర్ కథను చెబుతుంది.

"ఇక్కడున్న కొన్ని మీకు ఎక్కడా, ప్రపంచంలోని ఏ స్పేస్ మ్యూజియంలోనూ కనిపించవు. సోవియట్ యూనియన్ స్సేస్ ప్రోగ్రాం ఒక వెలుగు వెలిగిన కాలానికి సంబంధించిన కళాఖండాలు, వింత వస్తువులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి" అని పర్డేలీ చెప్పారు.

ఎలాన్ మస్క్ క్రూ డ్రాగన్

ఫొటో సోర్స్, SPACEX

అనిశ్చితిలో బైకనూర్ పరిస్థితి

2020 నవంబరులో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ సాయంతో అమెరికా తన మొదటి క్రూ డ్రాగన్ మిషన్ లాంచ్ చేసింది. ఫ్లోరిడాలోని నాసా కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఐఎస్ఎస్‌కు సిబ్బందిని పంపింది.

అమెరికా 2010లో డిస్కవరీ స్పేస్ షటిల్ ద్వారా మొదటి మానవ సహిత స్పేస్ మిషన్ లాంచ్ చేసింది.

రష్యా కూడా ఇప్పుడు తూర్పున సుదూరంగా 'వొస్టోచ్నీ కాస్మోడ్రోమ్' పేరుతో తన సొంత కొత్త అంతరిక్ష స్థావరం నిర్మిస్తోంది. కానీ, బైకనూర్‌లో ఆపరేషన్లు ఎప్పటికీ కొనసాగుతాయని కూడా అది ఆశగా ఉంది.

కొత్తగా వోస్టోచ్నీ అంతరిక్ష స్థావరాన్ని నిర్మిస్తున్నంత మాత్రాన బైకనూర్‌లో తమ స్పేస్ ఆపరేషన్స్ తగ్గవని రాస్‌కాస్మోస్ చెప్పింది.

"రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ సహకారంతో రష్యా బైకనూర్‌లో కొత్తగా బైటెరిక్ స్పేస్ రాకెట్ కాంప్లెక్స్ నిర్మిస్తోంది. ఆధునిక లాంచ్ వెహికల్ ఆపరేషన్ల కోసం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూరీ గెగారిన్ మొదటి లాంచ్ పాడ్‌ను సూయజ్-2గా ఆధునికీకరించడం మేం చేపట్టిన మరో ముఖ్యమైన ప్రాజెక్ట్" అని అది చెప్పింది.

రష్యా భవిష్యత్తులో ఎక్కడ అంతరిక్ష కార్యకలాపాలు కొనసాగింనా, సోవియట్ యూనియన్ చరిత్రకు, మానవ సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా నిలిచిన బైకనూర్ గురించి ఒకటి మాత్రం వాస్తవం..

లండన్, పారిస్, బీజింగ్, వాషింగ్టన్ లాంటి ఎన్నో నగరాలు గతంలో, ప్రస్తుతం సామ్రాజ్యాలకు కేంద్రంగా ఉండవచ్చు.

కానీ కజకిస్తాన్ మైదానాల మధ్యలో దుమ్ముపట్టిన ఒక రైల్వే ప్లాట్‌ఫాం నుంచే మానవుడు మొట్టమొదట అంతరిక్షంలో తన అన్వేషణను ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)