2019లో అంతరిక్ష అందాలను కళ్లకు కట్టిన అత్యద్భుత ఛాయా చిత్రాలు ఇవి
2019లో పలు అద్భుత అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు జరిగాయి. టెలీస్కోప్‌లు, అంతరిక్ష నౌకలు ఎన్నో కొత్త విషయాలను కనిపెట్టాయి. ఆ సమయంలో అంతరిక్షం నుంచి అత్యద్భుత ఛాయా చిత్రాలు కొన్ని భూమి మీదికి వచ్చాయి. ఆ ఫొటోలలో కొన్నింటిని చూద్దాం.
సుడులు తిరిగిన మేఘాలు

ఫొటో సోర్స్, NASA/JPL-Caltech/SwRI/MSSS/Kevin M. Gill
నాసా పంపిన జూనో అంతరిక్ష నౌక 2016లో బృహస్పతి గ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఆ గ్రహానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను భూమి మీదికి పంపుతోంది.
2019 మే 29న నాలుగు ఛాయా చిత్రాలను పంపింది. పాలరాతిపై అద్భుతమైన పెయింటింగ్ వేసినట్లుగా ఉన్న పై చిత్రం వాటిలో ఒకటి.
బృహస్పతి గ్రహానికి 18,600 కిలోమీటర్ల నుంచి 8,600 కిలోమీటర్ల మధ్య దూరంలో జూనో ప్రయాణిస్తుండగా... సుడులు తిరుగుతున్న మేఘాలు ఇలా కనిపించాయి.



ఫొటో సోర్స్, Kevin McGill/NASA/JPL-Caltech/SwRI/MSSS
బృహస్పతిపై గాలులు అత్యంత వేగంగా వీచే ప్రాంతం (జెట్ స్ట్రీమ్ ప్రాంతం)లో సుడులు సుడులుగా తిరుగుతున్న మేఘాలను పై చిత్రంలో చూడొచ్చు.
'స్నో మ్యాన్'

ఫొటో సోర్స్, NASA/JHUAPL/SWRI/T. Appere
2015లో ప్లూటోపై అన్వేషణ చేసిన తర్వాత, న్యూ హోరైజన్స్ అంతరిక్ష నౌకను నెప్ట్యూన్ కక్ష్యకు వెలుపల సుదూరాన ఉన్న క్యూపర్ బెల్ట్‌లోని మరో లక్ష్యం వైపు పంపించింది నాసా.
సౌర వ్యవస్థ ఆరంభానికి సంబంధించిన ఆధారాలను తెలిపే వేలాది పురాతన, మంచు లాంటి పదార్థాలతో ఆ బెల్టు నిండి ఉంది.
2014లో కనుగొన్న 'యంయూ 69' పదార్థం పరిమాణం, ఆకృతి గురించి శాస్త్రవేత్తలు ఒక నిర్ధరణకు వచ్చారు. వేరుశెనగ కాయ లేదా స్నో మ్యాన్ ఆకారంలో ఉండే యంయూ 69 (తర్వాత దీనికి అల్టిమా టూలే అని పేరు పెట్టారు. ప్రస్తుతం అర్రోకోత్ అని పిలుస్తున్నారు) 33 కిలోమీటర్ల పొడవు ఉందని తెలుసుకున్నారు.
రెండు వేర్వేరు మంచు ముద్దలు తక్కువ వేగంతో పరస్పరం తాకడంతో అది ఏర్పడిందని గుర్తించారు. థోలిన్స్ అనే కర్బన సమ్మేళనాల వల్ల దాని ఉపరితలం ఎర్రగా మారిందని నిర్ధరించారు.

ఫొటో సోర్స్, NASA/Esa/N. Smith/J. Morse
సూర్యుడి కంటే అధిక శక్తి
ఎటా కారినే... 7,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్ర వ్యవస్థ. ఇందులో కనీసం రెండు నక్షత్రాలు ఉన్నాయి. అవి సూర్యుడి కంటే ఐదు మిలియన్ రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి.
అందులో ఒక నక్షత్రం వేడి వాయువును విడుదల చేస్తోంది. ఆ వాయువు ఒక రెండు బెలూన్లలా వ్యాప్తి చెందింది.
ఆ నక్షత్రం బాణసంచా మాదిరిగా వెలుగులు వెదజల్లుతున్న తాజా చిత్రం 2019లో శాస్త్రవేత్తలకు అందింది. దీనిని హబుల్ స్పేస్ టెలిస్కోప్‌లో ఉన్న వైడ్ ఫీల్డ్ కెమెరా 3 తీసింది.

ఫొటో సోర్స్, NASA/JPL-Caltech/MSSS
అంగారకుడిపై సెల్ఫీ
నాసా పంపిన 'క్యూరియాసిటీ' రోవర్ (రోబో) 2012 నుంచి అంగారకుడి మీద ప్రచండగాలుల గురించి పరిశోధిస్తోంది. అక్కడి షార్ప్ పర్వతం వాలులో అన్వేషణ చేస్తూ 2019 డిసెంబర్‌లో ఆ రోబో ఈ సెల్ఫీ తీసుకుంది.

ఫొటో సోర్స్, CLEP
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్
2019 జనవరి 3న, చైనా ప్రయోగించిన చంగీ-4 అంతరిక్ష నౌక చుంద్రుడి మీద సాఫ్ట్‌లాండ్ అయ్యింది. చంద్రుడి మీద సాఫ్ట్‌లాండ్ అయిన మొట్టమొదటి మిషన్ అదే.
ఈ మానవ రహిత రోబో చంద్రుని దక్షిణ ధృవంపై దిగింది. దీనిని అంతరిక్ష పరిశోధనలో ఘనవిజయంగా భావిస్తున్నారు.
చాంగీ-4 చంద్రుని అంతర్భాగంలో పరిశోధనలు నిర్వహిస్తుంది. చంద్రుడి మీద దిగాక తర్వాత కొన్ని రోజుల నుంచి అక్కడ ఫొటోలు తీసి పంపుతోంది.

ఫొటో సోర్స్, CLEP
చాంగీలో రెండు కెమెరాలు ఉన్నాయి. ఒకటి జర్మనీ నిర్మించి ఇచ్చిన ఎల్‌ఎన్‌డీ. దీనిని రేడియేషన్ పరీక్షల కోసం ఉపయోగిస్తారు. రెండో కెమెరా ద్వారా తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాల పనితీరును పరిశీలిస్తారు.

ఫొటో సోర్స్, ESA/Hubble & NASA, A. Seth et al.
పాలపుంతను పోలిన మరో గెలాక్సీ
13 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హబుల్ టెలీస్కోప్ ఒక గెలాక్సీని కనుగొంది. ఆ గెలాక్సీని ఎన్‌జీసీ 772 అని పిలుస్తున్నారు. దాని చిత్రాన్ని 2019 నవంబర్ 11 నాసా విడుదల చేసింది.
ఈ గెలాక్సీ చాలావరకు మనం ఉన్న పాలపుంతతో పోలి ఉంది.

ఫొటో సోర్స్, Planetary Society
ఆకాశంలో సెయిలింగ్
'ది ప్లానెటరీ సొసైటీ' అనే స్వచ్ఛంద సంస్థ లైట్ సెయిల్ పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. భూమి సమీప కక్ష్యలో ప్రయాణం ఎలా ఉంటుందో చూపించడం దీని ఉద్దేశం.
జూన్ 25, 2019న లైట్సెయిల్-2ను ప్రారంభించారు. జూలై 23న నౌకను పంపిన తర్వాత తీసిన చిత్రం ఇది.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంలో వ్యర్థాలను ఎలా తొలగించొచ్చు?
- చంద్రయాన్-2: ‘విక్రమ్ ల్యాండర్ దొరికింది.. కనిపెట్టింది నేనే’
- అంతరిక్షంలో ఎక్కువ ఇబ్బంది పడేది పురుషులా.. మహిళలా?
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా వ్యోమగాముల స్పేస్ వాక్
- అత్యధిక చందమామల రికార్డు బ్రేక్ చేసిన శని గ్రహం
- చంద్రయాన్-2: 'ఇస్రో ప్రయోగం విఫలమైందనడం సరి కాదు...'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









