చైనా మూన్ మిషన్: చంద్రుని ‘అంధకార ప్రాంతం’పై విజయవంతంగా దిగిన అంతరిక్ష వాహనం

రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్

ఫొటో సోర్స్, CNSA/CLEP

ఫొటో క్యాప్షన్, చంద్రుని మీద మనకు కనిపించని వైపున దిగిన చైనా అంతరిక్ష వాహనం

చంద్రుడి ఆవలి వైపున, భూమిని ఎన్నడూ చూడని ప్రదేశం మీద తమ రోబోటిక్ అంతరిక్ష వాహనం చాంగీ-4 విజయవంతంగా దిగిందని చైనా ప్రకటించింది.

దీనిని అంతరిక్ష పరిశోధనలో ఘనవిజయంగా భావిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం ఇంతవరకు ఏ దేశమూ చేయలేదు.

భారతీయ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటల 56 నిమిషాలకు మానవ రహిత చాంగీ-4, రోవ చంద్రుని దక్షిణ ధృవంపై సురక్షితంగా దిగిందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది.

వీడియో క్యాప్షన్, చంద్రుని ‘అంధకార ప్రాంతం’పై దిగిన చైనా అంతరిక్ష వాహనం

చాంగీ-4 చంద్రుని అంతర్భాగంలో పరిశోధనలు నిర్వహిస్తుంది. ఇప్పటికే అది చంద్రుని ఉపరితల ఫొటోలను భూమి పైకి పంపింది.

అయితే, వాటిని సరాసరి భూమి పైకి పంపే అవకాశం లేనందువల్ల వాటిని మరో అంతరిక్ష వాహనానికి, అక్కడి నుంచి భూమికి పంపింది.

యుటు రోవర్

ఫొటో సోర్స్, CNSA

ఫొటో క్యాప్షన్, చాంగీ-3 మిషన్‌లో భాగంగా చైనా 2013లో ఉపయోగించిన యుటు రోవర్

ఈ ల్యాండింగ్ మిగతా వాటికన్నా ఎందుకు భిన్నమైంది?

గతంలోని చంద్రయానాలన్నీ భూమికి ఎదురుగా కనిపించే వైపునే జరిగాయి. చంద్రునికి అవతలి వైపు అంధకారంలో ఉన్న ప్రాంతానికి ఇంత వరకు ఏ వాహనమూ చేరుకోలేదు.

చాంగీ-4ని డిసెంబర్ 7న ప్రయోగించగా అది డిసెంబర్ 12న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది.

చాంగీ ప్రధానంగా చంద్రునిపై ఉన్న 'వాన్ కర్మన్' బిలాన్ని పరిశోధిస్తుంది.

ఈ బిలం సుమారు 2,500 కిలోమీటర్ల వ్యాసం, 13 కిలోమీటర్ల లోతు ఉంది. దీనిని చంద్రునిపై ఉన్న అతి పెద్ద బిలంగా భావిస్తున్నారని సర్రేలేని ములార్డ్ స్పేస్ సైన్స్ లేబరేటరీకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆండ్రూ కోట్స్ తెలిపారు.

చంద్రుడు ఏర్పడిన కొత్తలో ఏదైనా గుద్దుకోవడం వల్ల ఈ బిలం ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు.

ఆ బిలంపై ఉన్న రాతి ముక్కలను, ధూళిని పరిశీలించడం ద్వారా చంద్రుడు ఎలా ఏర్పడ్డాడన్న దానికి సమాధానాలు లభించవచ్చు.

భూమి వైపు కనిపించే (ఎడమ), అవతలి వైపు (కుడి) కనిపించే చంద్రుడు

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, భూమి వైపు కనిపించే (ఎడమ), అవతలి వైపు (కుడి) కనిపించే చంద్రుడు

ఇంతకూ చంద్రునిపై ఒక 'అంధకార ప్రాంతం' ఉందా?

నిజానికి చంద్రునిపై 'అంధకార ప్రాంతం' అంటూ ఏమీ లేదు. ఇంతవరకూ ఎవరూ చూడలేదు కాబట్టి దానిని అంధకార ప్రాంతం అని పిలుస్తున్నారు.

'టైడల్ క్లాకింగ్' అనే లక్షణం కారణంగా మనం కేవలం చంద్రుని ఒక వైపును మాత్రమే చూడగలం. దీనికి కారణం చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం, సరిగ్గా అది భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయంతో సమానం.

సైంటిస్టులు చాంగీ-4 రోవర్‌ను ఎలా ట్రాక్ చేస్తారు?

నిజానికి 'అంధకార ప్రాంతాన్ని' భూమి నుంచి చూడలేం కాబట్టి, రోవర్‌తో సరాసరి రేడియో లింక్ ఏర్పాటు చేసుకోవడం కష్టమని చైనా యూనివర్సిటీ ఆఫ్ జియోసైన్సెస్‌కు చెందిన డాక్టర్ లాంగ్ షియావో తెలిపారు. అందువల్ల చైనా గత మేలో భూమి నుంచి చెచియావో అనే ఒక రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

చెచియావో చైనాతో పాటు అర్జెంటీనా లాంటి దేశాలలోని గ్రౌండ్ స్టేషన్లకు కనిపిస్తూ పరిభ్రమిస్తుంటుంది.

చాంగీ-4లో ఉపయోగించిన లూనార్ ప్రోబ్ నమూనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాంగీ-4లో ఉపయోగించిన లూనార్ ప్రోబ్ నమూనా

ఈ మిషన్ ద్వారా మనకు ఇంకా ఏమేం తెలుస్తాయి?

చాంగీలో రెండు కెమెరాలు ఉన్నాయి. ఒకటి జర్మనీ నిర్మించి ఇచ్చిన ఎల్‌ఎన్‌డీ. దీనిని రేడియేషన్ పరీక్షల కోసం ఉపయోగిస్తారు. రెండో కెమెరా ద్వారా తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాల పనితీరును పరిశీలిస్తారు.

3 కిలోల బరువున్న బంగాళాదుంపలు, అరబిడాప్పిస్ అనే పూల మొక్క విత్తనాలు, పట్టుపురుగు గుడ్లను కూడా చాంగీ పరిశోధనల నిమిత్తం చంద్రునిపైకి మోసుకెళ్లింది.

చంద్రుడి మరోవైపు

ఫొటో సోర్స్, EPA/CNSA

ఫొటో క్యాప్షన్, భూమి మీద నుంచి కనిపించని చంద్రుని అంధకార ప్రాంతం

చాంగీలో ఇవి కూడా ఉన్నాయి:

  • ఒక పనోరమా కెమెరా
  • చంద్రుని అంతర్భాగాన్ని పరశోధించడానికి ఒక రాడార్
  • ఖనిజాలను గుర్తించడానికి ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్
  • సౌరగాలులను పరిశీలించడానికి అవసరమైన పరికరాలు

చంద్రునిపై పరిశోధనల్లో భాగంగా చైనా మొదటి, రెండు చాంగీ మిషన్స్‌లో చంద్రుని కక్ష్య నుంచి సమాచారాన్ని సేకరించింది. రెండు, మూడో మిషన్స్‌లో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు నిర్వహించి, ఐదు, ఆరో మిషన్స్ ద్వారా చంద్రునిపై ఉన్న రాతి, నేల ముక్కలను భూమిపైకి తరలిస్తారు.

చైనా స్పేస్ స్టేషన్ నమూనా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చైనా స్పేస్ స్టేషన్ నమూనా

అంతరిక్షంలో చైనా వ్యూహం ఏమిటి?

అంతరిక్ష పరిశోధనలో అమెరికా, రష్యాలతో పాటు తాను కూడా ఒక ముఖ్యమైన శక్తిగా ఎదగాలని చైనా భావిస్తోంది.

చంద్రునిపైకి 2017లో అంతరిక్ష యాత్రికులను పంపాలనకుంటున్నట్లు చైనా వెల్లడించింది.

అంతేకాకుండా, వచ్చే ఏడాదిలో అది అంతరిక్షంలో తన సొంత స్పేస్ స్టేషన్‌ను నిర్మించడం ప్రారంభిస్తుంది. ఇది 2022 నుంచి పని చేస్తుంది.

అంతరిక్ష రంగంలోకి చైనా చాలా ఆలస్యంగా ప్రవేశించినా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. 2003లో ఆ దేశం తన మొదటి రోదసి యాత్రికుణ్ని అంతరిక్షంలోకి పంపింది.

చంద్రుని ఆవలి వైపు పరిశోధనలు మానవాళికి ఒక గొప్ప విజయమని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అభివర్ణించింది.

చైనా మీడియా ప్రశంసలు

చైనా ప్రభుత్వ మీడియా, ఇంటర్నెట్ యూజర్లు చాంగీ-4 చంద్రునిపై దిగడాన్ని 'అంతరిక్ష పరిశోధనల్లో గొప్ప మైలురాయి'గా అభివర్ణించారు.

చాంగీ-4 ల్యాండ్ అయిన కొద్ది గంటల తర్వాత చైనా సెంట్రల్ టెలివిజన్ వాటి ఊహాచిత్రాలను విడుదల చేసింది. రోవర్ దగ్గర నుంచి తీసిన చిత్రాలను విడుదల చేసిన ఆ సంస్థ, ఎన్నాళ్లుగానో ఉన్న అంతుచిక్కని ముసుగు తొలగిపోయిందని వ్యాఖ్యానించింది.

చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక.. గతంలో అమెరికా, రష్యాల అంతరిక్ష పరిశోధనలు ఒక దేశంపై మరో దేశం ఆధిపత్యం కోసం జరిగితే.. చైనా అంతరిక్ష పరిశోధనలు బహిరంగంగా, సహకార విధానంలో కొనసాగాయని ప్రస్తుతించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)