శబరిమల: బీజేపీ హిందుత్వ వాదాన్ని సీపీఎం ఎదుర్కోగలదా?

శబరిమల

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బాలసుబ్రమణియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వివాదం నంచి రాజకీయంగా లబ్ధి పొందడంలో బీజేపీ విజయవంతం అవుతుందా?

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ వెళ్లి పూజలు చేసుకోవచ్చంటూ 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని విడనాడేది లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు, ఏ ఆలయంలోకి అయినా వెళ్లి పూజలు చేసుకునే హక్కు మహిళలకు ఉందంటూ మరికొందరు అంటున్నారు.

అనేక పరిణామాల తర్వాత ఎట్టకేలకు 2019 జనవరి 2న ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు.

శబరిమల

ఫొటో సోర్స్, A.S. SATHEESH/BBC

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో 'లింగ సమానత్వానికి మద్దతుగా' మహిళలతో 620 కిలోమీటర్ల మేర మానవ హారాన్ని కేరళ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. ఆ మరుసటి రోజే అదే రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లారు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ ఆలయ ద్వారాలు తొలుత అక్టోబర్‌లో తెరుచుకున్నాయి. కానీ, బీజేపీతో పాటు దాని అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ కొండ మీదకు మహిళలు వెళ్లకుండా అడ్డుకున్నాయి.

కోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం ఆహ్వానించింది. పోలీసు బలగాల సాయంతో ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించేసింది. కానీ, ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను మాత్రం అప్పుడు అనుమతించలేదు.

శబరిమల

ఆలయాన్ని సందర్శించేందుకు హైదరాబాద్‌కు చెందిన మహిళా పాత్రికేయురాలు జక్కల కవిత ప్రయత్నించారు. భారీ భద్రతతో ఆలయానికి కొద్ది దూరం వరకూ వెళ్లారు. కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె వెనక్కి వచ్చేలా చేసింది.

రెహానా ఫాతిమా అనే మరో మహిళ కూడా పోలీసుల భద్రతతో ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమెను కూడా వెనక్కి రావాలని కోరారు.

"శబరిమల ఆలయం ఉద్యమాలకు వేదిక కాదు" అని కేరళ మంత్రి సురేంద్రన్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో కేరళ ప్రభుత్వానికున్న నిబద్ధత పట్ల అనుమానాలు రేకెత్తించింది.

సీపీఐ(ఎం)పై హిందూ వ్యతిరేక ముద్ర

దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్న వాస్తవాన్ని పక్కనపెట్టి, కేరళలో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం) మీద బీజేపీ విమర్శలు చేస్తోంది. అది హిందూ వ్యతిరేక ప్రభుత్వమని, హిందూ ఆలయాలను, మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది.

ఇప్పటివరకూ తనకు పెద్దగా పట్టులేని కేరళలో తన ప్రాబల్యం పెంచుకునేందుకు శబరిమల అంశాన్ని ఒక అవకాశంగా బీజేపీ చూస్తోందన్నది విమర్శకుల మాట.

దక్షిణ భారతదేశంలో శబరిమల బీజేపీకి మరో అయోధ్యలా మారుతుందేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

శబరిమల

ఫొటో సోర్స్, CV LENIN

ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని సీపీఎ(ఎం) ప్రభుత్వం సమర్థిస్తున్నా... లోలోపల విముఖతతో ఉంది.

ఒకవేళ సీపీఐ(ఎం) హిందూ వ్యతిరేకి అన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సఫలమైతే... రాష్ట్రంలో అధికార పార్టీకి నష్టమే.

వాస్తవం ఏమిటంటే, మహిళల ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ, దాని అనుబంధ సంస్థలు పెద్దఎత్తున ఆందోళను చేస్తున్నాయి. కానీ, మహిళల ఆలయ ప్రవేశానికి అనుకూలంగా అంతటి స్థాయిలో ఉద్యమాలు జరగడంలేదు.

మహిళలందరూ అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ, అది ప్రజల్లో అంత బలంగా లేదు.

తాజా పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సీపీఐ(ఎం), రాజకీయంగా మాత్రం వెనక్కి తగ్గలేదు.

విజయవంతంగా భారీ మానవహారం నిర్వహించిన తర్వాత బుధవారం పోలీసుల భద్రతతో అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు వెళ్లేలేందుకు కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

లక్షల మంది మహిళలు మానవహారంలో పాల్గొన్నారు. దాని ద్వారా ఆచారాలు, సంప్రదాయాల పేరుతో మహిళల పట్ల వివక్ష చూపడం సరికాదని, లింగ సమానత డిమాండ్‌ చాలా పెద్దదని నిరూపించారు.

శబరిమల

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

కేరళకు చెందిన రచయిత పాల్ జకారియా బీబీసీతో మాట్లాడుతూ, "సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించినప్పటి నుంచీ దాన్ని అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూస్తూ దాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోంది. మానవ హారంలో దాదాపు అరకోటి మంది పాల్గొనడం ద్వారా ప్రభుత్వానికి భరోసా కలిగింది. ఇక కోర్టు తీర్పును అమలు చేయవచ్చని భావించింది. రాజకీయంగా మద్దతు కోసం చూడటం ఏ ప్రభుత్వానికైనా సహజమే" అన్నారు.

మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లిరావడం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ "బీజేపీ నేతలు రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసనలు తెలుపుతున్నారు. కానీ, ప్రజల నుంచి వారికి పెద్దగా స్పందన రావట్లేదని కనిపిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ కనీసం ఒక్క సీటు గెలుచుకోగలిగినా, శబరిమల అంశంలో ఆ పార్టీ విజయం సాధించినట్లే లెక్క" అని వివరించారు.

"ప్రస్తుతం సమాజంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. చరిత్రలోకి వెళ్లి చూస్తే మూఢ ఆచారాలను, నమ్మకాలను దూరం చేయడం ద్వారానే సమాజం ముందుకు పోతోంది. బాబ్రీ మసీదు కూల్చివేసిప్పుడు కూడా మతతత్వానికి వ్యతిరేకంగా కేరళలో భారీ మానవహారం నిర్వహించారు. అలాంటి ఉద్యమాల కోసం సీపీఐ(ఎం) ప్రభుత్వం లక్షల మందిని ఏకతాటిపైకి తీసుకురాగలదు. కానీ, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది" అని ఫ్రంట్‌లైన్ పత్రిక సంపాదకులు విజయశంకర్ అన్నారు.

శబరిమల నిరసనలు

ఫొటో సోర్స్, KAVIYOOR SANTOSH

శబరిమలకు మహిళలు వెళ్లకుండా బీజేపీ హింసాత్మక ఆందోళనలు చేసిన తర్వాత కూడా కేరళ ప్రభుత్వం పలుచోట్ల సభలు నిర్వహించింది. సమాజంలో రావాల్సిన మార్పులను సానుకూలంగా చూడాలన్న అవగాహనను ప్రజల్లో పెంచేందుకు ప్రయత్నించింది.

ఈ అంశంలో బీజేపీ హిందుత్వ వాదాన్ని ఎత్తుకుంది. సీపీఐ(ఎం) మాత్రం స్త్రీవాదాన్ని పైకి తీసుకొచ్చింది. వీటిలో రాజకీయంగా ఏది పనిచేస్తుంది? అన్న ప్రశ్నకు విజయశంకర్ స్పందిస్తూ, "ఇక హిందుత్వ వాదాన్ని వాడుకునే స్థితిలో బీజేపీ లేదు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారందరినీ దేశ ద్రోహులుగా చిత్రీకరించాలన్నదే ఆ పార్టీ వ్యూహం" అని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)