'ర్యాట్ హోల్ గనిలోని కార్మికులు బతికున్నారా, చనిపోయారా?': మేఘాలయ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ర్యాట్ హోల్ (ఎలుక బొరియలాంటి) బొగ్గు గనిలో చిక్కుకుపోయిన 15 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన చర్యలేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది.

''ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా లేవు. ఇన్ని రోజులైనా ఆ కార్మికులు ఏమయ్యారో తెలియడం లేదు. వారు బతికున్నారో, చనిపోయారో కూడా తెలియడం లేదు. సత్వర చర్యలు చేపట్టి ఉండాల్సింది. మీరు (రాష్ట్ర ప్రభుత్వం) సైనిక సాయాన్ని కోరకూడదా'' అని జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.

కార్మికులను రక్షించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని మేఘాలయ ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. 14 మంది నౌకాదళ సిబ్బంది, 72 మంది జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బంది, కోల్ ఇండియా సిబ్బంది డిసెంబరు 14 నుంచి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పింది.

ధర్మాసనం స్పందిస్తూ- ''మరి వాళ్ల చర్యలెందుకు ఫలితాన్ని ఇవ్వడం లేదు'' అని ప్రశ్నించింది. ఈ అంశంలో మధ్యంతర ఉత్తర్వు జారీ చేయాలనుకుంటున్నామని చెప్పింది.

ర్యాట్ హోల్ మైన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రమాదం జరిగిన గని మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఈస్ట్ జైంథియా హిల్స్ జిల్లా లుంథారీ గ్రామంలోని క్సాన్ ప్రాంతంలో ఉంది.

మేఘాలయలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, అశాస్త్రీయ విధానంలో జరిగే ర్యాట్‌ హోల్ మైనింగ్‌‌పై 2014లో జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) నిషేధం విధించింది. పర్యావరణ సమస్యలతోపాటు కార్మికుల ప్రాణాల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని నిషేధం విధిస్తున్నట్లు చెప్పింది. అయినా అక్కడ అక్రమంగా మైనింగ్ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)