‘తాలిబాన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా? అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది?

అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్లు, నల్లమందు

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, దావూద్ అజామీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అఫ్గానిస్తాన్‌లో ప్రధాన తిరుగుబాటు బృందమైన తాలిబాన్లలో (2019 నాటికి) సుమారు 60 వేల మంది ఉన్నారు.

అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వానికి అమెరికా మిలటరీ, ఆర్థిక సహకారం అందిస్తున్నా.. తాలిబాన్లకు, అఫ్గాన్ బలగాలకు మధ్య పోరు ఉధృతంగా, తీవ్రంగా కొనసాగింది.

(2021 ఆగస్టు 15వ తేదీ) ఆదివారం కాబుల్ నగరంలోకి ప్రవేశించిన తాలిబాన్ దళాలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని నగరం కాబుల్‌తో పాటు అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలు తమ ఆధీనంలోకి వచ్చాయని, యుద్ధం ముగిసిందని తాలిబాన్లు ప్రకటించారు.

నిజానికి తాలిబాన్లు తమ తిరుగుబాటును కొనసాగించడానికి దేశం లోపల నుంచి, బైటి నుంచి వారికి చాలా పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి.

మరి తాలిబాన్లకు ఈ నిధులు ఎక్కడి నుంచి లభించాయి? 2019లో బీబీసీ ప్రతినిధి దావూద్ అజామీ రాసిన కథనం..

అఫ్ఘానిస్తాన్‌, తాలిబాన్లు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, తాలిబాన్ల కారణంగా అఫ్గాన్ బలగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి

తాలిబాన్లు ఎంత ధనవంతులు?

1996 నుంచి 2001 వరకు అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు పాలించారు. ఆ సమయంలో షరియా చట్టాలను కఠినంగా అమలు చేశారు.

అయితే అధికారం కోల్పోయిన నాటి నుంచి వాళ్లు తీవ్రమైన తిరుగుబాటు చేస్తున్నారు.

బీబీసీ అఫ్గానిస్తాన్‌ లోపల, బయట విస్తృతంగా నిర్వహించిన ఇంటర్వ్యూల ద్వారా తాలిబాన్లు తమ తిరుగుబాటు కార్యకలాపాల కోసం ఆధునికమైన ఆర్థిక నెట్‌వర్క్, పన్నుల వ్యవస్థను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

2011 నుంచి 2019 వరకు తాలిబాన్ల వార్షికాదాయం సుమారు రూ.2,800 కోట్లు. కానీ ఇటీవలి కాలంలో అది సుమారు లక్ష కోట్ల రూపాయలకు చేరినట్లు భావిస్తున్నారు.

అఫ్గానిస్తాన్‌, అమెరికా ప్రభుత్వాలు తాలిబాన్ల నెట్‌వర్క్‌ను నియంత్రించడానికి ప్రయత్నించాయి. 2018వ సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం తాలిబాన్లకు చెందిన డ్రగ్ లేబరేటరీలపై బాంబు దాడులు చేయడానికి ఒక వ్యూహం రచించింది.

2012లో ఐక్యరాజ్య సమితి తాలిబాన్ల ప్రధాన ఆదాయం నల్లమందు ద్వారానే వస్తున్నట్లు గుర్తించింది. అయితే, ఇప్పుడు తాలిబాన్లకు ఆదాయం కేవలం మాదక ద్రవ్యాల వ్యాపారం నుంచి మాత్రమే లభించడం లేదు.

అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్లు

ఫొటో సోర్స్, Getty Images

నల్లమందు, పన్నులు, బలవంతపు వసూళ్లు

అఫ్గానిస్తాన్‌ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా నల్లమందును ఉత్పత్తి చేస్తున్న దేశం. ఆ దేశం ఏటా సుమారు 1-2 లక్షల కోట్ల రూపాయల నల్లమందు ఎగుమతి చేస్తోందని భావిస్తున్నారు.

తాలిబాన్ల ఆధీనంలోని ప్రాంతాలలో నల్లమందును ఎక్కువగా పండిస్తున్నారు. తాలిబాన్లు పలు దశలలో నల్లమందుపై పన్నుల రూపేణా వసూలు చేస్తున్నారు.

నల్లమందును పండించే రైతుల నుంచే మొదట 10 శాతం పన్ను వసులు చేస్తున్నారు. ఆ తర్వాత ఓపియమ్‌ను నల్లమందుగా మార్చే లేబరేటరీల నుంచి, వాటిని డ్రగ్ రూపంలో స్మగ్లింగ్ చేసే వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు.

మాదక ద్రవ్యాల నుంచి తాలిబాన్లకు సుమారు రూ.700-2800 కోట్ల వరకు వార్షికాదాయం లభిస్తోందని భావిస్తున్నారు.

అయితే తాలిబాన్లు మాత్రం నార్కోటిక్స్‌తో తమకు ఏ మాత్రం సంబంధం లేదని.. తాము పాలనలో ఉండగా, 2000 నుంచే దాని పెంపకంపై నిషేధం విధించినట్లు చెబుతున్నారు.

అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్లు

ఫొటో సోర్స్, Getty Images

లేబరేటరీలపై బాంబుల దాడులు

అఫ్గానిస్తాన్‌లో తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా గతంలో ట్రంప్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. వాటిలో భాగంగా తాలిబాన్ల ఆర్థిక నెట్‌వర్క్, ఆదాయ వనరులను లక్ష్యంగా చేసుకుంది.

తాలిబాన్ల ఆదాయంలో సుమారు 60 శాతం మాదకద్రవ్యాల ద్వారానే లభిస్తున్నట్లు చెబుతున్న అమెరికా సైన్యం.. వాటిని తయారు చేసే లేబరేటరీలను లక్ష్యంగా చేసుకుంది. 2018, ఆగస్టు నాటికి అఫ్గానిస్తాన్‌లోని 400-500 లేబరేటరీలలో సుమారు 200 లేబరేటరీలను ధ్వంసం చేసినట్లు అమెరికా చెబుతోంది. దీని వల్ల తాలిబాన్ల ఆదాయంలో పావుభాగానికి గండి పడింది.

అయితే లేబరేటరీల పునర్నిర్మాణం చాలా సులభం కాబట్టి, ఈ దాడుల దీర్ఘకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్ధకం.

అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఇంకా ఎక్కడెక్కడి నుంచి..?

తాలిబాన్ల ఆదాయ వనరులు నల్లమందు వ్యాపారంపై పన్నులు విధించడంతో ఆగిపోలేదు.

2018 ప్రారంభంలో బీబీసీ చేపట్టిన ఒక పరిశోధనలో అఫ్గానిస్తాన్‌లోని 70 శాతం ప్రాంతాలలో తాలిబన్లు ఉన్నట్లు గుర్తించారు.

ఈ ప్రాంతాలలో తాలిబాన్లు పన్నులు వసూలు చేస్తున్నారు.

2019 ప్రారంభంలో బీబీసీ చేతికి అందిన ఒక లేఖ ప్రకారం.. తాలిబాన్ ఆర్థిక కమిషన్ తమ ఆధీనంలోని ప్రాంతాలలో సరుకు రవాణా చేసేటప్పుడు తమకు పన్నులు చెల్లించాలని హెచ్చరించింది.

అంతే కాకుండా తాలిబాన్లు టెలికమ్యూనికేషన్స్, మొబైల్ ఫోన్ ఆపరేటర్ల నుంచీ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాలలో తాలిబాన్లు 2019 ప్రారంభంలో విద్యుత్ వినియోగదారుల నుంచి సుమారు రూ.14 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అఫ్గానిస్తాన్‌ విద్యుత్ సంస్థ వెల్లడించింది.

అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్లు, మైనింగ్
ఫొటో క్యాప్షన్, మైనింగ్‌పై పన్నుల ద్వారా తాలిబాన్లు చెప్పుకోదగ్గ ఆదాయాన్ని పొందుతున్నారు

ఖనిజాలు

ఖనిజాలు, విలువైన రాళ్లపరంగా అఫ్గానిస్తాన్‌ సుసంపన్నమైనది. దేశంలోని మైనింగ్ పరిశ్రమ వార్షిక విలువ సుమారు రూ.7 వేల కోట్లు.

అయితే మైనింగ్ ఎక్కువభాగం అక్రమంగానే జరుగుతోంది.

ఖనిజ ప్రాంతాలను ఆక్రమించుకున్న తాలిబాన్లు అక్కడ జరిగే మైనింగ్ కార్యకలాపాల ద్వారా భారీ ఎత్తున బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.

2014లో ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి తాలిబాన్లు దక్షిణ హెల్మండ్ ప్రాంతంలోనే ఏటా సుమారు రూ.70 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల నుంచి తాలిబాన్లు సుమారు రూ.350 కోట్ల ఆదాయం పొందుతున్నారు.

అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్లు

ఫొటో సోర్స్, NOORULLAH SHIRZADA

విదేశీ నిధులు

పాకిస్తాన్, ఇరాన్, రష్యా ప్రభుత్వాలు తాలిబాన్లకు ఆర్థిక సాయం చేస్తున్నాయని అఫ్గాన్, అమెరికా అధికారులు ఎన్నేళ్లుగానో ఆరోపిస్తున్నా, ఆయా ప్రభుత్వాలు దానిని తోసిపుచ్చుతున్నాయి.

పాకిస్తాన్‌తో పాటు, గల్ఫ్ దేశాలకు చెందిన అనేక మంది పౌరులు పెద్ద ఎత్తున తాలిబాన్లకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

2008లో సీఐఏ నివేదిక ఒకటి.. విదేశాలు, మరీ ప్రత్యేకించి గల్ఫ్ దేశాల నుంచి తాలిబాన్లు రూ.740 కోట్లు అందుకున్నట్లు వెల్లడించింది.

ఒక అంచనా ప్రకారం తాలిబాన్ల వార్షికాదాయం 2019 నాటికి సుమారు రూ.3,500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.

రియాలిటీ చెక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)