చెన్నంపల్లి కోటలో నిధి నిక్షేపాల ఆచూకీ తెలిసిందా?

- రచయిత, డి. ఎల్. నరసింహ
- హోదా, బీబీసీ కోసం
కర్నూలు జిల్లాలోని చెన్నంపల్లి కోటలో ఇప్పటివరకూ రెండు, మూడు చోట్ల తవ్వకాలు జరిపారు. అయినప్పటికీ గుప్తనిధుల జాడమాత్రం బయటపడలేదు.
కనీసం విలువైన ఖనిజ నిక్షేపాల ఆచూకీ కూడా లభించలేదు. కానీ స్థానిక మీడియా మాత్రం అదిగో.. ఖనిజాలు.. ఇదిగో గుప్త నిధులు అంటూ కథనాలు ప్రసారం చేసింది.
మరి కోటలో అసలు ఏముంది.. తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆ విశేషాలతో ఈ రియాల్టీ చెక్.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన రాజకోటలో దాదాపు నెల రోజులుగా రెవెన్యూ.. పోలీసు అధికారుల పర్యవేక్షణలో మైనింగ్ శాఖ తవ్వకాలు జరుపుతోంది.
జియెలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు కూడా అత్యాధునిక స్కానింగ్ పరికరాలతో రెండు రోజులపాటు కోట అంతటినీ పరిశీలించారు.
నిధి నిక్షేపాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పాతాళగంగలో ఉబికివస్తున్న నీటిని పూర్తిగా తోడటానికి వీలుకాకపోవటంతో అక్కడ సర్వే చేయలేకపోయామని, తమ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని మాత్రమే గురువారం జీఎస్ఐ అధికారులు తెలిపారు.

అయితే.. తాజాగా స్థానిక మీడియాలో మాత్రం చెన్నంపల్లి కోటలో నిక్షేపాల ఆచూకీ దొరికిందని.. విలువైన సంపద బయటపడనుందని వార్తా కథనాలు ప్రసారమయ్యాయి.
మైనింగ్ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ నటరాజన్ ఈ విషయాన్ని దృవీకరించారని ఓ ఛానల్ ప్రసారం చేసింది. దాంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని తేలింది. మైనింగ్ ఏడీ నటరాజన్, తహశీల్దారు గోపాలరావు, కొందరు గ్రామ కమిటీ సభ్యులను బీబీసీ సంప్రదించింది.
వాళ్లంతా మీడియాలో వస్తున్న కథనాలను కొట్టిపారేశారు. అంతా అవాస్తవమని చెప్పారు.
విలువైన ఖనిజాలు ఎలా ఉంటాయని స్థానిక విలేఖర్లు అడిగితే, అవి ఎలా ఉంటాయో వివరించానేగాని, తాను ఎలాంటి ప్రకటనా చేయలేదని నటరాజన్ స్పష్టంచేశారు.
ఇక్కడ తవ్వకాలు రహస్యంగా జరపటంలేదని, అంతా పారదర్శకంగానే జరుగుతోందని ఆయన తెలిపారు.
ప్రకటనలేవైనా చేస్తే బహిరంగంగా అన్ని మీడియా సంస్థల ప్రతినిధులకూ చెప్తాం కదా? అని ఆయన ప్రశ్నించారు.

తాజాగా కోటలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు పూజలు చేసినట్లుగా తెలుస్తోంది.
కర్నూలుకు చెందిన ఓ మాంత్రికుడు వచ్చి కోట బురుజులో పూజలు చేసినట్లుగా చెన్నంపల్లి గ్రామస్థులు చెబుతున్నారు.
మరి ఈ పూజలు ఎవరు చేయించారు? ఎందుకు చేయించారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పూజలు జరిగిన సమయంలో మైనింగ్ అధికారులతో పాటు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది కోటకు వెళ్లకపోవటం ఈ అనుమానాలకు తావిస్తోంది.

ఫొటో సోర్స్, DL Narasimha
ఈ ఘటనపై తహశీల్దారు, ఆర్డీవోలను బీబీసీ సంప్రదించగా.. ఆ సమయంలో తామంతా జన్మభూమి కార్యక్రమంలో ఉన్నామని, పూజలు జరిగిన విషయం తమకు తెలియదని చెప్పారు.
పూజలకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలకు మీడియా వారినే వివరణ అడగాలని ఆర్డీవో ఓబులేసు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








