సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రశ్నించిన ఆ నలుగురు న్యాయవాదులు ఎవరు?

ఫొటో సోర్స్, SUPREME COURT
భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు నలుగురు మీడియా ముందుకు వచ్చి.. న్యాయ వ్యవస్థను సంరక్షించుకోలేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం విఫలం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నలుగురు న్యాయమూర్తుల వివరాలివీ...
జస్టిస్ జాస్తి చలమేశ్వర్

పదవీ కాలం: 10-10-2011 నుంచి 22-06-2018
జస్టిస్ చలమేశ్వర్ విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు లభించింది. 1995 అక్టోబర్ 30వ తేదీన అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు. 2007 మే 3వ తేదీన గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఆయన కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2010 మార్చి 17న కేరళ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2011 అక్టోబర్ 10వ తేదీన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చలమేశ్వర్ నియమితులయ్యారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానంలో రెండో సీనియర్ న్యాయమూర్తి ఆయన.

ఫొటో సోర్స్, PTI
ముఖ్యమైన తీర్పులు:
వాక్‌స్వాతంత్ర్యం (2012): ఇంటర్నెట్‌లో 'తీవ్ర' వ్యాఖ్యలను పోస్టు చేయటం మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధంచగల నేరంగా పేర్కొన్న చట్టాన్ని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రోహిన్టన్ ఫాలీ నారిమన్‌లు కొట్టివేశారు.
గోప్యత హక్కు (2017): గోప్యత అనేది ప్రాధమిక హక్కు అని ప్రకటించిన తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో జస్టిస్ చలమేశ్వర్ కూడా ఉన్నారు. రాజ్యంగ ధర్మాసనం 2017లో ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చింది.
జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) తీర్పు (2015): ఎన్‌జేఏసీ తీర్పు (2015)లో జస్టిస్ చలమేశ్వర్ విభేదిస్తూ వెల్లడించిన అభిప్రాయంలో.. న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ ''ఆశ్రతపక్షపాతానికి అలంకారం''గా మారిందని.. అక్కడ ప్రతిభలేనితనాన్ని ప్రోత్సహించటం జరుగుతోందని, రాజ్యంగ ఉల్లంఘన దూరంగా ఉన్నట్లు కనిపించదని విమర్శించారు.
జస్టిస్ మదన్ భీమారావ్ లోకూర్

పదవీ కాలం: 04-06-2012 నుంచి 30-12-2018
జస్టిస్ లోకూర్ 1977లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి. డిగ్రీ పొందారు. ఆయన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, రెవెన్యూ, సేవల చట్టాల్లో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 1998 జూలై 14న ఆయన అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 1999 ఫిబ్రవరి 19న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు. అదే ఏడాది జూలై 5న ఢిల్లీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 ఫిబ్రవరి 13 నుంచి మే 21 వరకూ ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. జస్టిస్ లోకూర్ 2012 జూన్ 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ముఖ్యమైన తీర్పులు, నిర్ణయాలు..
మణిపూర్‌లో బూటకపు ఎన్‌కౌంటర్ హత్యలు: గత దశాబ్ద కాలంలో మణిపూర్‌లో జరిగిన 98 పోలీస్ ఎన్‌కౌంటర్ హత్యలపై సీబీఐ దర్యాప్తు జరపాలని జస్టిస్ లోకూర్, జస్టిస్ ఉదయ్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం 2017 జూలైలో ఆదేశించింది.
మైనారిటీ ఉప-కోటా: వెనుకబడిన తరగతుల (27 శాతం రిజర్వేషన్) కోటాలో మైనారిటీలకు 4.5 శాతం ఉప కోటా ఇవ్వాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజినల్ బెంచ్ కొట్టివేసింది. ఈ సబ్-కోటా మత ప్రాతిపదికన ఇచ్చారని ధర్మాసనం అందుకు కారణంగా పేర్కొంది.
జస్టిస్ రంజన్ గొగోయ్

పదవీ కాలం: 23-04-2012 నుంచి 17-11-2019
అస్సాం మాజీ ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర గొగోయ్ కుమారుడైన రంజన్ గొగోయ్ 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. 1978లో న్యాయవాదిగా చేరి ప్రధానంగా గువాహటి హైకోర్టులో పనిచేశారు. 2001 ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 సెప్టెంబర్ 9న పంజాబ్ - హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011 ఫిబ్రవరి 12న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ఫొటో సోర్స్, PTI
ముఖ్యమైన తీర్పులు..
రాజకీయ నాయకుల ఉచిత కానుకల హామీలు: ''ఉచిత కానుకలనేవి.. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలను మొదలుకంటా సడలిస్తాయి'' అని జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం జూలై 2013న పేర్కొంది. ఈ విషయంపై.. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి మార్గదర్శకాలను రూపొందించాలని ఎన్నికల కమిషన్‌కు నిర్దేశించింది. ఈ అంశంపై ప్రత్యేక చట్టం అవసరమని చెప్పింది.
ఎన్నికల సంస్కరణలు: నామినేషన్ అఫిడవిట్ దాఖలు చేయటంలో సంస్కరణలను అప్పటి ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం, జస్టిస్ రంజనా పి. దేశాయ్, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు తీసుకొచ్చింది. ఓటు వేసే సమయంలో పౌరులు ఒక నిర్ణయం తీసుకోవటానికి వీలుగా.. అభ్యర్థులు పూర్తి సమాచారాన్ని అందించటం తప్పనిసరి అని ధర్మాసనం తీర్పు చెప్పింది. నామినేషన్ పత్రాల్లో ఏవైనా ఖాళీలుంటే వాటిని పూరించాల్సిందిగా అభ్యర్థులను రిటర్నింగ్ అధికారి కోరవచ్చునని పేర్కొంది.
జస్టిస్ కురియన్ జోసెఫ్

పదవీ కాలం: 08-03-2013 నుంచి 29-11-2018
జస్టిస్ కురియన్ జోసెఫ్ తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1979లో కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 జూలై 12న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006 నుంచి 2008 వరకూ కేరళ జ్యుడీషియల్ అకాడమీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. లక్షద్వీప్, కేరళల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీకి అధిపతిగానూ పనిచేశారు. కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రెండు పర్యాయాలు వ్యవహరించారు. 2010 ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చి 7 వరకూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2013 మార్చి 8న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ఫొటో సోర్స్, Twitter
ముఖ్యమైన తీర్పులు...
ట్రిపుల్ తలాక్: ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ కురియన్ కూడా ఉన్నారు. ''ఇది పాపమని దేవుడు గుర్తించిన దానిని న్యాయమేనని మనుషులు చట్టం ద్వారా సమర్థించగలరా?'' అని ఆయన ఆ తీర్పులో ప్రశ్నించారు.
బొగ్గు కుంభకోణం కేసు: బొగ్గు కేటాయింపు కుంభకోణం కేసును విచారించిన ధర్మాసనంలో జస్టిస్ ఆర్.ఎం.లోథా, జస్టిస్ మదన్ లోకూర్‌లతో పాటు జస్టిస్ కురియన్ కూడా ఉన్నారు. ఆ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను దోషిగా నిర్ధారించిన ధర్మాసనం ఆయనకు శిక్ష విధించింది.
పార్లమెంటుపై దాడి కేసు: ఆ కేసులో.. ముద్రణపత్రాలు, సీడీలను ఎలాంటి నిర్ధారణ లేకుండా ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణించటాన్ని సమర్థిస్తూ 2005లో ఇచ్చిన తీర్పును ముగ్గరు సభ్యుల ధర్మాసనం తిరగరాసింది. ఆ తీర్పును జస్టిస్ కురియన్ రాశారు. పార్లమెంటు దాడి కేసులో 2005 నాటి తీర్పు చట్టపరంగా సరైనది కాదని అందులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- విస్తృత ధర్మాసనానికి 'స్వలింగ సంపర్కం' కేసు
- మతాబులకి మతానికి సంబంధం ఉందా?
- ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఎవరేమన్నారు?
- 'నా జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు నాకు లేదా?'
- ఆరుషి కేసు: ఈ 7 ప్రశ్నలకు బదులేది?
- న్యాయం కోసం 26 ఏళ్లుగా..
- ‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలివే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








