భారత న్యాయ వ్యవస్థలో కుదుపు - సుప్రీంకోర్టులో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Supreme Court
భారత దేశ చరిత్రలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలిసారిగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో సమావేశమైన జస్టిస్ మదన్ లోకూర్, జిస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ గోగోయ్ సంయుక్తంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
దేశ న్యాయచరిత్రలో ఇది అరుదైన సమావేశమని వేరే గత్యంతరం లేకే ఈ దారి ఎంచుకున్నామని జస్టిస్ చలమేశ్వర్ మీడియాతో అన్నారు.
సుప్రీంకోర్టు నిర్వహణ సరిగా లేదని అది న్యాయవ్యవస్థ ప్రతిష్టనే దెబ్బతీస్తుందని చలమేశ్వర్ చెప్పారు. న్యాయవ్యవస్థ పతనం మొత్తం ప్రజాస్వామ్యాన్నే దెబ్బతీస్తుందని అన్నారు.
నలుగురు న్యాయమూర్తులు కలిసి ఇవాళ ఉదయం కూడా ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లి మాట్లాడినా ఫలితం లేకపోయిందని చలమేశ్వర్ మీడియాతో అన్నారు.
నలుగురి సంతకాలతో విడుదల చేసిన లేఖలో తీవ్రమైన అంశాలున్నాయి. ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించిన ప్రశ్నలున్నాయి.
ఒక రకంగా ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యవహారశైలిపై నలుగురు న్యాయమూర్తుల తిరుగుబాటు అనదగిన స్థాయిలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియాకు విడుదల చేసిన లేఖలో ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు.
1. సుప్రీంకోర్టు నిర్వహణ సరిగా లేదు!
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్వహణ దాని ప్రమాణాలకు తగినట్లుగా లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ విషయంపై మాట్లాడినా ఫలితం లేకపోయిందని ఆయన చెప్పారు.
గత్యంతరం లేక, వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని జస్టిస్ చలమేశ్వర్ వివరించారు.
2. కేసుల కేటాయింపు సరిగా లేదు
సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు సరిగా లేదని నలుగురు న్యాయమూర్తులు అన్నారు.
ఏ కేసు ఏ న్యాయమూర్తికి అప్పగించాలన్న విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చాలాసార్లు చర్చించాల్సి వచ్చిందని వారు అన్నారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఒప్పించడంలో తాము విఫలమయినట్లు నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్నారు.
3. ఇలాఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం
సుప్రీంకోర్టు నిర్వహణ ఇలాగే ఉంటే భారత దేశంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఆత్మలను అమ్ముకున్నామని కొందరు చెప్పే పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు.
భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి.
సుప్రీంకోర్టులో కొద్దినెలలుగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి








