మనం పుట్టడమే మంచివాళ్లుగా పుడతామా? చెడ్డవాళ్లుగా పుడతామా?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, టామ్ అగ్లెట్టీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పుట్టుకతోనే మనం ఒక నైతిక దిక్సూచితో పుడతామా లేక పెరిగి పెద్దగయ్యే క్రమంలో పరివర్తన చెందుతామా?
మనుషులు పుట్టుకతోనే మంచివారు లేదా చెడ్డవారుగా పుడతారా అన్న అంశంపై తత్వవేత్తలు శతాబ్దాలుగా చర్చిస్తున్నారు.
మానవులు పుట్టినపుడు ఎలాంటి నైతికత ఉండదని, నైతికతను నేర్చుకోవాల్సి ఉంటుందని అరిస్టాటిల్ వాదించారు.
నైతికత విషయానికి వస్తే.. పుట్టిన పిల్లలు నైతికంగా ఏమీ రాయని పలక వంటి వారని సిగ్మండ్ ఫ్రాయిడ్ భావించారు.

ఫొటో సోర్స్, BSIP
మనిషి స్వతహాగా మంచివాడా? చెడ్డవాడా?
ఈ చర్చలో థామస్ హాబ్స్, జీన్ జేక్స్ రూసోలవి మరో రెండు ప్రముఖ వ్యతిరేక దృక్పథాలు.
మానవులు దుష్టులు, క్రూరమైన వారని.. మానవాభివృద్ధికి, వారి ప్రవృత్తిని నియంత్రించడానికి సమాజం, సామాజిక నియమాలు అవసరం అని హాబ్స్ వాదిస్తారు.
రూసో దీనిని విమర్శిస్తూ.. సమాజంలో ఏర్పడిన వర్గాల కారణంగా దురాశ లేకుంటే మనిషి చాలా మంచివాడని, స్వచ్ఛమైన వాడని వాదించారు.
ఇటీవలి మానసిక శాస్త్ర పరిశోధనలను బట్టి, మనిషిలో సాధారణంగానే కొంచెం 'మంచి' ఉంటుందని (మరీ సాంకేతికంగా చెప్పాలంటే.. చిన్న వయసులోనే పిల్లలు నైతికతను అలవర్చుకుంటారని) వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల్లో సహాయపడే తత్వం
ఇలాంటి ఒక పరిశోధనలో పిల్లలు ఏ వయసులో 'సత్పవర్తన' వైపు మొగ్గుతారో అని పరిశీలించారు.
దీనిలో భాగంగా, ఒక ఏడాదికన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల ఎదుట వివిధ రంగులలో ఉన్న బొమ్మలను ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలో బొమ్మలను నైతికంగా మంచి, చెడు అని స్పష్టంగా విభజించారు.
దీనిలో ఒక ఎర్రని వృత్తం కొండను ఎక్కేందుకు శ్రమ పడుతుంటే, మరో 'చెడ్డ' నీలం చతురస్త్రం దానిని కిందికి తోసేయడానికి ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో మరో 'మంచి' పసుపుపచ్చ త్రికోణం ఎర్రని వృత్తం పైకి ఎక్కడానికి సహాయం చేస్తుంటుంది.
ఈ బొమ్మలాట తర్వాత పిల్లలను ఏ ఆకారంతో ఆడుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు. చెడ్డదైన నీలం రంగులోని చతురస్త్రంతోనా లేదా మంచిదైన పసుపుపచ్చ త్రికోణంతోనా? ఊహించినట్లుగానే పిల్లలంతా సహాయపడే తత్వము, లాభాపేక్ష లేని త్రికోణాన్నే ఎంపిక చేసుకున్నారు. ఏడు నెలల పిల్లల విషయంలో కూడా ఇదే జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల ‘పరోపకార బుద్ధి’
2010లో యేల్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైన విషయాలను ఇది బలపరుస్తోంది. యేల్ పరిశోధనలో పిల్లలు బొమ్మలను వాటి రంగు లేదా రూపంలాంటి వాటికన్నా, వాటి చర్యల ద్వారానే ఎంపిక చేసుకుంటారని వెల్లడైంది.
ఈ ప్రదర్శనలో ఆయా రూపాల గుణాన్ని మార్చినపుడు కూడా పిల్లలు 'సాయం చేసే రూపాల'నే ఎంపిక చేసుకున్నారు.
2017లో క్యోటో యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఇవే ఫలితాలను నిర్ధరించారు.
ఇతర పరిశోధనల్లో కూడా పిల్లలు తమ పరోపకార బుద్ధిని ప్రదర్శించారు.
హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన 'బిగ్ మదర్ స్టడీ'లో, పిల్లలను రహస్యంగా గమనించినప్పుడు కూడా వాళ్లు ఇతర పిల్లల పట్ల మంచిగా ప్రవర్తించి వాళ్లకు సహాయం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మంచితనం ‘అంతర్గత స్వభావం’
దీనిని బట్టి పిల్లలు కేవలం శిక్షను తప్పించుకోవడానికో, తమను గమనిస్తున్నారని తెలిసినప్పుడు మాత్రమే మంచిగా ఉండడం కాకుండా.. మంచిగా ఉండడం అనేది వారిలోని ఒక అంతర్గత స్వభావం అని తేలింది.
ఈ పరిశోధనలు ఫ్రాయిడ్ లేదా హాబ్స్‌ల నిరాశాపూరిత దృక్పథం పూర్తిగా తప్పని తేల్చకున్నా, పిల్లల్లో సహజంగానే పరుల హితం కోరుకునే స్వభావం ఉంటుందని వెల్లడించాయి.
పిల్లల స్వభావం గురించి తల్లిదండ్రులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ పరిశోధనలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- రోడ్డు మీద వదిలేసిన పాపకు అర్ధరాత్రి వెళ్లి పాలిచ్చిన కానిస్టేబుల్
- ట్రంప్‌కు కిమ్ న్యూ ఇయర్ వార్నింగ్: ఆంక్షలు కొనసాగిస్తే అడ్డం తిరుగుతా
- జనవరి 1నే కొత్త సంవత్సర వేడుకలు ఎందుకు జరుపుకొంటాం?
- కొత్త ఏడాది తీర్మానాలు చేసుకుంటున్నారా? అయితే, ఈ 5 విషయాలు మరచిపోవద్దు
- ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ
- E69: ప్రపంచం డెడ్ ఎండ్.. ఇక ముందుకు వెళ్లలేం.. ఇక్కడ సూర్యుడూ అస్తమించడు
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








