‘ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే.. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది’

మీ ఆలోచన, మీ ప్రవర్తనపై మీరు ఎంత అదృష్టవంతులు అనేది ఆధారపడి ఉంటుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీ ఆలోచన, మీ ప్రవర్తనపై మీరు ఎంత అదృష్టవంతులు అనేది ఆధారపడి ఉంటుంది

రిచర్డ్ వైజ్‌మన్ అనే ఒక సైకాలజిస్ట్ అదృష్టవంతులు, దురదృష్టవంతులను వేరు చేసే నాలుగు కీలక అంశాలను చెప్పారు. మన అదృష్టాన్ని పెంచే ఒక చిట్కాను బయటపెట్టారు.

మిగతా అందరి కంటే కొంతమంది మాత్రమే అదృష్టవంతులు ఎందుకు అవుతున్నారు?

మిమ్మల్ని మీరు ఇదే ప్రశ్న వేసుకుంటుంటే, దాని గురించి మీరు ఇంకోసారి ఆలోచించాల్సి ఉంటుంది.

సైకాలజిస్ట్ రిచర్డ్ వైజ్‌మన్ మాటల్లో చెప్పాలంటే "ప్రజలు స్వయంగా తమ మంచి, చెడు భవిష్యత్తును సృష్టించుకుంటారు".

'అదృష్టం పాత్ర, ప్రజల జీవితాలపై దాని ప్రభావం' అనే అంశం గురించి వైజ్‌మన్ అధ్యయనం చేస్తున్నారు.

ఆయన దాన్ని ఒక 'శాస్త్రీయ పరిశోధన'గా చెప్పుకుంటారు.

ఈ అధ్యయనం అదృష్టవంతులు, దురదృష్టవంతులు అని చెప్పుకునే వారి మధ్య వ్యత్యాసాలను చూపిస్తోందని చెప్పారు.

అయితే దీనికి ముగింపు ఎలా ఉండాలి?

అదృష్టం అనేది "మంత్రం వేసినట్టు అలా జరిగిపోయే అద్భుతం కాదు. అనుకోకుండా మనల్ని ముంచెత్తేదీ కాదు". అది పూర్తిగా "మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా ప్రవర్తిస్తాం" అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది.

ముఖ్యంగా, మనం అదృష్టవంతులు అని పిలుచుకునే ఆ 'లక్కీ గైస్', నిజానికి ఈ నాలుగు పనులనూ సరిగ్గా చేస్తుంటారు.

అదృష్టానికి స్వాగతం పలకండి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అవకాశం అందిపుచ్చుకోండి, అదృష్టానికి స్వాగతం పలకండి

1.కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం

అదృష్టవంతులని అనుకునే అందరూ అవకాశాలను గుర్తించి సరైన సమయంలో వాటిని ఒడిసిపట్టుకునేలా ఉంటారు.

ముందుకెళ్లడానికి ఒక కొత్త మార్గం వారికి కనిపించినపుడు, సంతోషంగా ఆ దిశలో వెళ్లాలనుకుంటారు.

దురదృష్టవంతులు మాత్రం దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో వెళ్తుంటారు అని వైజ్‌మన్ చెబుతారు.

"వాళ్లు అప్పటికే ఉన్న ఒక జాడలో వెళ్తుంటారు. దారిలో ఏదైనా ఒక అవకాశం వచ్చినా దానిని అందిపుచ్చుకోడానికి చాలా భయపడిపోతారు".

మీ మనసు మాట వినండి, సానుకూల కోణాలనే చూడండి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీ మనసు మాట వినండి, సానుకూల కోణాలనే చూడండి

2.మనసు మాట వినడం

మనలో కలిగే భావనలను అనుసరించడం వల్లే మనం చాలావరకూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలం.

అలా చేయడానికి అదృష్టవంతులు ఎప్పుడూ భయపడరు

ఏదైనా చేయడం ఒప్పు అనిపిస్తే, వాళ్లు దాన్ని నమ్మి అందులోకి దూకుతారు, ముందుకు కొనసాగుతారు.

కానీ దురదృష్టవంతులు అనుకునేవారి స్వభావం అతి-విశ్లేషణాత్మకతతో ఉంటుంది. పరిస్థితి గురించి వారు అతిగా ఆలోచిస్తారు. అదే చివరికి వారికి ఒక పెద్ద ప్రతికూలత అవుతుంది.

"అలాంటి వారికి ఏదైనా చేయాలన్నా తరచూ ఎక్కువ సమయం పడుతుంటుంది. వాళ్ల ఆలోచనలు అంత పనికొచ్చేలా ఉండవు" అంటారు వైజ్‌మన్.

సానుకూల అంచనాలు, సానుకూల ఫలితాలనూ అందించగలవు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సానుకూల అంచనాలు, సానుకూల ఫలితాలనూ అందించగలవు

3.విజయం దక్కుతుందనే ఆశ

ఆశావాదంతో ఉండే అదృష్టవంతులు ప్రతి లక్ష్యంలో విజయం దక్కుతుందనే ఆశిస్తారు.

తాము చేసేవి బాగా జరుగుతాయని, తమ నమ్మకాలను స్వయంగా నిజం చేయగలమని భావిస్తారు అని వైజ్‌మన్ చెప్పారు.

"అది ప్రతిసారీ పనిచేయకపోవచ్చు. కానీ ఒక సానుకూల వైఖరి ఉండడం వల్ల, అది వారిని కఠిన పరిస్థితుల్లో కూడా ముందుకు నడిచేలా చేస్తుంది. ఆ గుణానికి తరంగాల్లాంటి ఒక ప్రభావం ఉంటుంది. మిగతా వారిని అది ఆకట్టుకుంటుంది".

దురదృష్టవంతులను వారి నిరాశావాదంతో ఉండే స్వభావం అదుపు చేస్తుంది.

ఫలితంగా వారు తమకు తాముగా అవకాశాల నుంచి తప్పుకోవాలని చూస్తారు. ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ చాలా దిగులుగా ఉంటారు అంటారు వైజ్‌మన్.

అదృష్టవంతులు సానుకూలంగా ఉంటారు, చెడును, మంచిగా మార్చేస్తారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అదృష్టవంతులు సానుకూలంగా ఉంటారు, చెడును, మంచిగా మార్చేస్తారు

4.ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండడం

సానుకూల దృక్పథం అనేది చాలా కీలకం

కష్టకాలం అనేది మనకు అందరికీ వస్తూనే ఉంటుంది. కానీ పరిస్థితుల నుంచి తాము నేర్చుకున్న అనుభవంతో అదృష్టవంతులు వాటి నుంచి 'బౌన్స్ బ్యాక్' అవుతారు. మళ్లీ ముందుకు కొనసాగుతారు.

అది దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మారుస్తుంది.

కానీ తమను దురదృష్టవంతులుగా భావించేవారు చిన్న చిన్న ప్రతికూల అంశాలకు కూడా కుంగిపోతుంటారు.

భవిష్యత్తు నిస్తేజంగా ఉండబోతోందని, దానికోసం ప్రయత్నించడంలో అర్థం లేదని తమకు తామే నచ్చజెప్పుకుంటారు..

సానుకూల వైఖరి పెంచుకోవడం కోసం మీకు జరిగిన మంచిని గుర్తించండి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సానుకూల వైఖరి పెంచుకోవడం కోసం మీకు జరిగిన మంచిని గుర్తించండి

మీరూ అదృష్టవంతులు కావాలనుకుంటున్నారా?

అదృష్టవశాత్తూ 'ఆశ' అనేది చాలా బలమైనది.

"ఎవరైనా సరే, కొన్ని పద్ధతులు అనుసరిస్తే, అదృష్టవంతుడిలా ఆలోచించడానికి, ప్రవర్తించడానికి సాయం అవుతుంది" అని రిచర్డ్ వైజ్‌మన్ చెబుతారు.

వాటిలో ముఖ్యమైన ఒక పద్ధతి, రోజూ 'లక్కీ డైరీ' రాసుకోవడం. అలా చేస్తే అది, మీ అదృష్టాన్ని మెరుగుపరచుకోడానికి సాయం అవుతుంది.

ఎంత చిన్నవైనా ఫర్వాలేదు, ఆరోజు జరిగిన సానుకూలమైనవి, లక్కీ అనిపించే విషయాలు, ఘటనలన్నీ అందులో రాయండి.

ఇది ప్రతికూలతను తగ్గించి, మన జీవితంలోని సానుకూల కోణాలపై దృష్టి పెట్టడానికి సాయం అవుతుంది.

మనకు జరిగే కొన్ని ఘటనలు మన నియంత్రణ లేకుండానే జరుగుతాయనేది ముమ్మాటికీ నిజం. కానీ లక్కీ డైరీలో రాస్తూ ఉండడం అనేది 'హుషారైన వైఖరి' ఏర్పడడానికి సాయం అవుతుంది.

"అది అప్పటికప్పుడే జరగకపోవచ్చు. కానీ ఒక వారం లేదా కొన్ని రోజుల తర్వాత అది జనాలపై అసలు సిసలు ప్రభావం చూపించడం మొదలవుతుంది" అంటారు వైజ్‌మన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)