కల్వకుంట్ల చంద్రశేఖరరావు: ప్రధాన మంత్రి పదవికి పోటీ పడతారా? - అభిప్రాయం

ఫొటో సోర్స్, NArendraModi/KCR/FACEBOOK
- రచయిత, డబ్ల్యు. చంద్రకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక అవి జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే సమయం ఆసన్నమైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ విషయానికి వస్తే అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. అన్ని గొంతులూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయి - ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది.
ఎందుకంటే, రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కేసీఆర్ లేదా కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే తన ఆలోచనను ఇప్పటికే స్పష్టం చేశారు.
నిజానికి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా ఆయన రాష్ట్ర హద్దులను దాటి చూడాలనుకుంటున్నట్లు తన కోరికను మళ్లీ చెప్పారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రులందరినీ ఏకం చేయడం మాత్రమే కాదు, రెవెన్యూ పంపకాలు, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు, వాటి వెనుక ఉన్న సూత్రాలను ప్రశ్నించడం, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, ఇంత పెద్ద దేశానికి ఒకే సుప్రీంకోర్టు ఉండడం లాంటి అంశాలను లేవనెత్తుతూ కొంతకాలం క్రితమే ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభించానని కేసీఆర్ చెప్పారు.

ఫొటో సోర్స్, trspartyonline/facebook
హంగ్ వస్తే.. కింగ్ మేకర్
కేంద్రం ఔదార్యంపై ఆధారపడడం వల్ల తమ స్థాయిని తగ్గిస్తోందని, ప్రతిదానికీ కేంద్రం వైపు చూడ్డానికి బదులు రాష్ట్రాలకు విశేష అధికారాలు ఉండాలని భావిస్తున్న మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ లాంటి కొందరు ముఖ్యమంత్రులను కేసీఆర్ వాదన మరింత ఆకర్షించవచ్చు.
మరో విషయం ఏంటంటే.. మాయావతి, అఖిలేష్ లాంటి నేతలు కూడా తమను ఒక మూలకే ఉంచి, రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేసే కాంగ్రెస్ నాయకత్వానికి చోటు లేకుండా తమకంటూ గుర్తింపు ఉండే కూటమితో కలిసి వెళ్లడానికి సంతోషంగా ఉంటారు. తను చెబుతున్నట్టు ముఖ్యమంత్రులు, భవిష్యత్ ముఖ్యమంత్రులతో ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో కేసీఆర్ విజయం సాధిస్తే, ఆ ఫ్రంట్ అధీనంలో దాదాపు 165 మంది, ఇంకా ఎక్కువ ఎంపీలే ఉంటారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈ సంఖ్య కీలకమవుతుంది.
ఇక హంగ్ లాంటి పరిస్థితి వచ్చి, కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీలే సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటే, అప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్న ఇదే ఫ్రంట్ కింగ్ మేకర్ అవుతుంది. అది ఆయన్ను దేవెగౌడ, చరణ్ సింగ్ లాంటి వారితో సమానంగా ప్రధాని పదవికి పోటీపడేలా చేస్తుంది.
కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇప్పటికే నిరూపించుకోవడంతో మిగతా నేతలు కూడా చంద్రబాబు కంటే ఆయనవైపే ఎక్కువ మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అలా మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న "సేవ్ డెమొక్రసీ" ప్రచారానికి ప్రత్యామ్నాయంగా తన డిమాండ్లు ప్రాధాన్యం ఉన్నవని, మరింత సమర్థవంతమైనవని కేసీఆర్ తన ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు.

ఫొటో సోర్స్, Telangana CMO/Facebook
ముందస్తు ఎన్నికలను గెలిచిన మొదటి ముఖ్యమంత్రి
ఇక తెలంగాణ విషయానికి వస్తే, కేసీఆర్ సాధించిన విజయం చాలా ప్రభావవంతమైనది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ముఖ్యమంత్రి ఆయనొక్కరే కాదు.
అంతకు ముందు విజయభాస్కర రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ ఓడిపోయారు.
కేసీఆర్ ఒక తరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా పరాజయం పాలయ్యేలా చేశారు. ఓడిపోయిన వారిలో ఎంతోమందికి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకునే మార్గం చూపారు.

ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్
కేసీఆర్ టీఆర్ఎస్‌ను తెలంగాణలో బలంగా నాటుకుపోయేలా కూడా చేశారు.
ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీని ఎలా పాతుకుపోయేలా చేశారో, అలాగే తెలంగాణ స్థానిక రాజకీయాల్లో సుదీర్ఘ కాలంపాటు టీఆర్ఎస్ కేంద్రం కానుంది.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలాగే ప్రతిపక్ష స్థానాన్ని అడ్డుకుని బీజేపీని ఒక మూలకే పరిమితం చేశారు.
చంద్రబాబుపై ప్రభావం
దానికి తోడు 'రిటర్న్ గిఫ్ట్' ఇవ్వాలని నిశ్చయించుకున్న కేసీఆర్..చంద్రబాబుకు వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి ఏపీ రాజకీయాల్లో కూడా కచ్చితంగా కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు.
జగన్, పవన్, కేసీఆర్‌లను నిలువరించే ప్రయత్నాలలో మునిగిపోయే చంద్రబాబుకు ఇప్పుడు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జాతీయ లక్ష్యాలను సాధించాలంటే సమయం తక్కువే ఉంటుంది.
(రచయిత ది హన్స్ ఇండియాకు నేషనల్ అఫైర్స్ ఎడిటర్)
ఇవి కూడా చదవండి:
- ‘ఫెడరల్ ఫ్రంట్’ వెనుక కేసీఆర్ వ్యూహాలేమిటి? ఇది మోదీని పడగొట్టడానికా? మరింత బలపర్చడానికా?
- అభిప్రాయం: అసలు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడే దేశ కాల పరిస్థితులున్నాయా? కెసిఆర్ ఉద్దేశం ఏంటి?
- కేసీఆర్ ఖమ్మం సభ: 'ఒక కులం వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ కులంలో మొత్తం దరిద్రం పోతదా?'
- ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?
- కేసీఆర్ ప్రెస్‌మీట్: ''చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు.. నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా''
- మమతా బెనర్జీ మంతనాలు దేని కోసం?
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- అభిప్రాయం: ‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








