అసాని తుపాను: ఒకటో నంబరు, రెండో నంబరు, మూడో నంబరు.. ఈ హెచ్చరికలకు అర్థం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రవిశంకర్ లింగుట్ల
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇప్పుడు అసాని, మొన్న నివర్ ఇంతకుముందు ఆంఫన్, పెథాయ్, తిత్లీ, అంతకుముందు హుద్‌హుద్- పేరు ఏదైనా తుపాను ముప్పు సమయంలో వివిధ హెచ్చరికల గురించి వింటుంటాం. ''తుపాను నేపథ్యంలో ఓడరేవుల్లో ఫలానా నంబరు హెచ్చరిక జారీచేశారు'' అని చదువుతుంటాం. ఇంతకూ ఏ హెచ్చరిక ఎప్పుడు చేస్తారు? ఎందులో ఏ సందేశం ఉంటుంది?
రాష్ట్ర ప్రభుత్వాలకు తుపాను హెచ్చరికలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) నాలుగు దశల్లో జారీచేస్తుంది. ఈ హెచ్చరికలకు అనుగుణంగా పాలనా యంత్రాంగం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
మొదటి దశ హెచ్చరిక(ప్రిసైక్లోన్ వాచ్): తీర ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా మారడానికి 72 గంటల ముందు ఈ హెచ్చరిక చేస్తారు.
హిందూ మహాసముద్రం ఉత్తర భాగంలో, తుపాను ఏర్పడేందుకు దారితీయగల కల్లోల పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇందులో ఉంటుంది.
తీర ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉండొచ్చనే సందేశం ఇందులో ఉంటుంది. భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఈ హెచ్చరిక జారీచేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండో దశ హెచ్చరిక(సైక్లోన్ అలర్ట్): తీర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటాని కంటే కనీసం 48 గంటల ముందు ఈ హెచ్చరిక జారీచేస్తారు.
తుపాను కదలిక, తీవ్రత, ఏయే తీర జిల్లాలపై ప్రభావం ఉండొచ్చు, మత్స్యకారులకు, సాధారణ ప్రజలకు, మీడియాకు, విపత్తు సహాయ చర్యల అధికారులకు సూచనలు ఇందులో ఉంటాయి.
ఈ హెచ్చరికను ప్రాంతీయ తుపాను హెచ్చరిక కేంద్రం(ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్-ఏసీడబ్ల్యూసీ)/తుపాను హెచ్చరిక కేంద్రం (సైక్లోన్ వార్నింగ్ సెంటర్-సీడబ్ల్యూసీ), వాతావరణశాఖ ప్రధాన కార్యాలయంలోని తుపాను హెచ్చరిక విభాగం(సైక్లోన్ వార్నింగ్ డివిజన్-సీడబ్ల్యూడీ) జారీచేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
మూడో దశ హెచ్చరిక(సైక్లోన్ వార్నింగ్): తీర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటాని కంటే కనీసం 24 గంటల ముందు ఈ హెచ్చరిక జారీచేస్తారు.
తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే అంచనా ఇందులో ఉంటుంది. ఈ హెచ్చరికను ప్రతి మూడు గంటలకోసారి ఏసీడబ్ల్యూసీ/సీడబ్ల్యూసీ, సీడబ్ల్యూడీ జారీచేస్తాయి.
తుపాను కదలిక, దాని తీవ్రత, ఎప్పుడు, ఎక్కడ తీరం దాటొచ్చు, గాలి వేగం, కురవబోయే వర్షం, మత్స్యకారులకు, సాధారణ ప్రజలకు, మీడియాకు, విపత్తు సహాయ చర్యల అధికారులకు సూచనలు ఈ హెచ్చరికల్లో ఉంటాయి.

నాలుగో దశ హెచ్చరిక(పోస్ట్ ల్యాండ్‌ఫాల్ ఔట్‌లుక్): తుపాను తీరం దాటడానికి కనీసం 12 గంటల ముందు ఏసీడబ్ల్యూసీ/సీడబ్ల్యూసీ, సీడబ్ల్యూడీ ఈ హెచ్చరిక జారీచేస్తాయి.
తీరం దాటిన తర్వాత తుపాను గమనం ఎలా ఉండొచ్చో, ప్రభావిత ప్రాంతాల్లో వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉండొచ్చో ఈ హెచ్చరిక స్పష్టం చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఐఎండీ వెట్‌సైట్‌లోని సమాచారం ప్రకారం వివిధ దశల తుపాను హెచ్చరికల బులెటిన్లకు వేర్వేరు సంకేత రంగులు వాడతారు.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సూచనల మేరకు 2006 రుతుపవన కాలం తర్వాతి నుంచి వీటిని వినియోగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత నౌకాదళానికీ హెచ్చరికలు
సముద్రంలో కల్లోలంపై ఐఎండీ భారత నౌకాదళానికి కూడా 'ఫ్లీట్ ఫోర్‌కాస్ట్' పేరుతో హెచ్చరికలు పంపుతుంది.
వాతావరణం సాధారణంగా ఉంటే రోజుకు నాలుగుసార్లు మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరికలు వెళ్తాయి. వాతావరణం ప్రతికూలంగా ఉంటే నాలుగు దశల్లో ఉండే తుపాను హెచ్చరికలకు అనుగుణంగా మూడు గంటలకోసారి జాలర్లకు హెచ్చరికలు వెళ్తాయి.

ఓడరేవుల్లో హెచ్చరికలు
బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో కల్లోలం ఏర్పడినప్పుడు ప్రభావితమయ్యే ఓడరేవులకు కూడా సంబంధిత ఏసీడబ్ల్యూసీలు లేదా సీడబ్ల్యూసీలు హెచ్చరికలు పంపిస్తాయి. తుపాను తీవ్రతకు తగిన హెచ్చరికలను సూచించాలని చెబుతాయి.
ఈ హెచ్చరికల్లో తుపాను కదలిక, తీవ్రత, వేగం, నౌకాశ్రయంలో ఏర్పడగల పరిస్థితుల సమాచారం ఉంటుంది.
ఈ హెచ్చరికలకు అనుగుణంగా నౌకాశ్రయ అధికారులు సిగ్నల్ మాస్ట్‌లపై దూరం నుంచే కనిపించేలా సంకేతాలు చూపిస్తారు. మత్య్సకారులు సహా సముద్రంలోకి వెళ్లే అందరికీ ఈ సంకేతాల అర్థం తెలిసే ఉంటుంది. తెలియనివారికి నౌకాశ్రయ అధికారులు వివరిస్తారు.
ఓడరేవుల వద్ద జారీచేసే వివిధ హెచ్చరికల గురించి ఆదివారం విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ హైమారావుతో బీబీసీ తెలుగు మాట్లాడింది.
ఈ హెచ్చరికల చిహ్నాలు పగటి సమయంలో చూపించేవి ఒకలా, రాత్రి వేళ చూపించేవి ఇంకోలా ఉంటాయి.
పదకొండో నంబరు హెచ్చరిక ఎప్పుడు అవసరమవుతుందో హైమారావు వివరిస్తూ- తుపాను హెచ్చరికల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఫోన్ పనిచేయకపోవడం లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ''తుపాను హెచ్చరికల కేంద్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థ విఫలమైంది'' అనే సందేశాన్ని అవసరమైనవారికి పంపేందుకు ఈ హెచ్చరిక జారీ చేస్తారని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రలో మొన్న తిత్లీ, నేడు పెథాయ్ తుపాను
- "బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉంటే, పిల్లల పెంపకంపై ప్రకటనలు చూపిస్తారా?"
- రాహుల్ గాంధీ యువతను ఎందుకు సీఎం చేయలేదు
- పెథాయ్ : వేగం పుంజుకున్న తుపాను
- తిత్లీ తుపాను: ‘శ్రీకాకుళం జిల్లాను 20 ఏళ్లు వెనక్కి నెట్టింది’
- చంద్రబాబు నాయుడుతో బీబీసీ ఇంటర్వ్యూ
- ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా, ఉండదా
- ఎండోమెట్రియాసిస్: లక్షణాలు ఏంటి.. ఎంత ప్రమాదకరం?
- ఆసియాన్ ఎందుకంత ప్రత్యేకం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









