నారా చంద్రబాబు నాయుడుతో బీబీసీ ఇంటర్వ్యూ: ‘వారం రోజులుగా ఇక్కడే ఉంటూ తిత్లీ బాధితులను ఆదుకుంటున్నాం’

బాధితులతో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఫొటో సోర్స్, facebook/NaraChandrababuNaidu

ఫొటో క్యాప్షన్, బాధితులతో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా అక్కడి ఉద్దానం ప్రాంతంలో లక్షలాది చెట్లను వేళ్లతో సహా పెకిలించి ప్రజల బతుకులను ఛిద్రం చేసింది. కొబ్బరి, జీడిమామిడి, పనస, మామిడి వంటి చెట్లపై ఆధారపడి జీవించే ప్రజల బతుకుతెరువును లేకుండా చేసింది.

తిత్లీ ధాటికి తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు.. ధ్వంసమైన రహదారి, సమాచార, విద్యుత్ వ్యవస్థలను చక్కదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారం రోజులుగా అక్కడే మకాం వేసి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

15 మంది రాష్ట్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో అధికారులు అక్కడే ఉంటూ పాలన అక్కడి నుంచే సాగిస్తున్నారు. ఈ సందర్భంగా 'బీబీసీ న్యూస్ తెలుగు' ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రత్యేకంగా మాట్లాడింది. నష్ట తీవ్రత, రాష్ట్ర ఆర్థిక స్థితిపై దీని ప్రభావం, బాధితులకు అందుతున్న సహాయం గురించి అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి బదులిచ్చారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ఏపీ సీఎం చంద్రబాబుతో బీబీసీ ఇంటర్వ్యూ

బీబీసీ తెలుగు: తిత్లీ తుపాను ప్రభావం ఇక్కడ 23 మండలాలపై ఉంది. వారం రోజులుగా సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయ చర్యలపై సంతృప్తిగా ఉన్నారా?

చంద్రబాబు: తిత్లీ తుపాను కారణంగా 160 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులు శ్రీకాకుళం జిల్లాలోని ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేశాయి. సుమారు 32 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ ప్రాంతం పేరే ఉద్దానం. అంటే ఉద్యానవనం అని అర్థం. అలాంటిచోట ఇప్పుడు చెట్లన్నీ పడిపోయాయి. అయితే, ప్రాణ నష్టం గణనీయంగా తగ్గించగలిగాం. తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్నది కచ్చితంగా అంచనా వేసి అప్రమత్తం చేయడంతో ఇది సాధ్యమైంది.

ఇంతకుముందు హుద్‌హుద్ కానీ, అంతకంటే ముందొచ్చిన తుపాన్లతో కానీ పోల్చితే తిత్లీ సందర్భంగా ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగాం.

ఎనిమిది రోజులుగా ఇక్కడే ఉన్నాను. వారం రోజుల్లో దెబ్బతిన్న రహదారులన్నిటినీ పునరుద్ధరించాం. నిరాశ్రయులైనవారికి భోజన సదుపాయం కల్పించాం. 300 జనరేటర్లు ఏర్పాటుచేసి నీరందిస్తున్నాం.

ఇన్ని చెట్లు పడిపోతాయని అనుకోలేదు. నేల కూలిన చెట్లను తొలగించడానికి తెచ్చిన మర రంపాలు చాలకపోవడంతో కొత్తగా మరో ఆరేడు వందల మర రంపాలు తెప్పించి పనులు వేగవంతం చేస్తున్నాం.

నేనిక్కడే ఉన్నాను కాబట్టి సహాయ పనులు వేగంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి అంచనాలను చేరుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగంలో అందరూ ఒకేలా పనిచేయరు. ఇక్కడ కిడ్నీ సమస్యలున్నాయన్న భయంతో కొందరు వెనుకాడుతున్నారు. వారం రోజుల్లో పరిస్థితులను సాధారణ స్థితికి తేగలిగాం. అక్టోబరు 29 నాటికి పరిస్థితులను పూర్తిగా గాడిలో పెడతాం. పరిహారాలు కూడా ఆ తేదీకి అందుతాయి. ఇంత త్వరగా ఇదంతా జరగడం చరిత్రలో ఎన్నడూ లేదు.

ఒక ముఖ్యమంత్రి పలాస వచ్చి, మంత్రులు, సీనియర్ సెక్రటరీలు అంతా ఇక్కడే ఉంటూ ఏకంగా సచివాలయమే కదిలొచ్చినట్లయింది. 15 మంది మంత్రులు ద్విచక్రవాహనాలపై గ్రామాల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

ఇంత తీవ్ర నష్టం వాటిల్లినా కేంద్రం స్పందించలేదు. సహాయం ప్రకటించలేదు. పూర్తి బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ కొన్ని పార్టీలు కూడా బాధ్యతారహితంగానే ప్రవర్తించాయి.

తిత్లీ తుపాను గాలులకు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో పూర్తిగా ధ్వంసమైన కొబ్బరి తోట
ఫొటో క్యాప్షన్, తిత్లీ తుపాను గాలులకు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో పూర్తిగా ధ్వంసమైన కొబ్బరి తోట

బీబీసీ తెలుగు: ప్రాణ నష్టం బాగా తగ్గించారు. కానీ, ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. కొబ్బరి, జీడిమామిడి తోటలు నష్టపోయారు. పరిహారం ప్రకటించారు. అయితే, ఇక్కడ జరిగిన నష్టం దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందనుకుంటున్నారా?

చంద్రబాబు: ఈ ప్రభావం కొంత ఉంటుంది. ధైర్యంగా సాగాలి. ఏపీలో విభజన సమయంలో రెండు ప్రధాన సమస్యలపై అంతా భయపడ్డారు. కోస్తా ప్రాంతంలో తుపానులు, రాయలసీమలో కరవు. ఎలా బతకాలి. పెట్టబడులన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి అనుకుంటూ ఆందోళన చెందారు. అదే ఏడాది హుద్‌హుద్ తుపాను విశాఖను నాశనం చేసింది. రాయలసీమలో తక్కువ వర్షపాతం ఉంది. కానీ, దీర్ఘకాలిక ప్రణాళికలతో వీటిని ఎదుర్కొంటున్నాం. రాయలసీమకు కృష్ణా నీరు తీసుకెళ్లి, కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లిచ్చి.. పట్టిసీమ పూర్తిచేసి తాగడానికే కాకుండా పంటలు కాపాడే పరిస్థితికొచ్చాం. కోస్తాలో తుపానులొచ్చినా ప్రాణ నష్టం తగ్గించడంలో సఫలీకృతులయ్యాం. తుపాను తీవ్రత ఆధారంగా పంట నష్టం ఉంటుంది కాబట్టి అది మన చేతుల్లో ఉండదు. అలాంటి నష్టం వచ్చినప్పుడు ఎలా ఆదుకున్నామన్నది మన చేతుల్లో ఉంటుంది.

అందుకే ఇప్పుడు నష్టపోయిన రైతులకు ఒక కొబ్బరి చెట్టుకు రూ. 1500 పరిహారం.. చెట్టును తొలగించడానికి రూ. 240 చొప్పున ఇచ్చాం. జీడిమామిడికి హెక్టారుకు రూ. 30 వేలు, జీడిచెట్లు తొలగించడానికి రూ. 300 చొప్పున ఇచ్చాం. కొబ్బరి, జీడిమామిడి, మామిడి మూడింటికీ ఒక్కో హెక్టారుకు మూడేళ్లకు గాను రూ. 40 వేలు ఇస్తూ మళ్లీ పంటలు వేసుకోమంటున్నాం. అంతరపంటలను ప్రోత్సహిస్తున్నాం. బోర్లు వేయించి, విద్యుత్ ఇచ్చి భూగర్భ జలాలను ఉపయోగించుకుని మళ్లీ తోటలు వేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

ఈ జిల్లాలో మేం చేసిన పనుల వల్ల వ్యవసాయం పెరిగింది. ఏపీలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల తరువాత వరి ఎక్కువగా పండేది శ్రీకాకుళం జిల్లాలోనే. ఇక్కడ నాగావళి, వంశధార, బాహుదా వంటి నదులున్నా ఇంతవరకు ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. మా గత పాలనలో, ఇప్పుడు ఇక్కడ నీటిపారుదల పనులు పూర్తిచేశాం. వంశధార, బాహుదాలు కలుపుతాం. అది పూర్తయితే ఈ జిల్లాలో ప్రతి ఎకరాకూ సాగు నీరందుతుంది.

తిత్లీ తుపాను బాధితులతో మాట్లాడుతున్న చంద్రబాబు

ఫొటో సోర్స్, facebook/NaraChandraBabuNaidu

బీబీసీ తెలుగు: శ్రీకాకుళం మొదటి నుంచీ వెనుకబడిన ప్రాంతం.. ఈ తుపాను నష్టం ఆర్థికంగా ఎలాంటి ప్రభావం చూపనుంది?

చంద్రబాబు: ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాం కాబట్టి, రాష్ట్ర ఆర్థికస్థితిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండదు. కానీ, ఈ ప్రాంత ప్రజలపై మాత్రం చాలా ప్రభావం ఉంటుంది. తిత్లీ వల్ల 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయారు. మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే, వారిలో ధైర్యం నింపేలా చర్యలు చేపడుతున్నాం.

సోంపేట మండలం గొల్లగండి కాలనీలో పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు
ఫొటో క్యాప్షన్, సోంపేట మండలం గొల్లగండి కాలనీలో పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు

బీబీసీ తెలుగు: తుపానుపై ముందుగా పూర్తి సమాచారం లేకపోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని ప్రజలు చెబుతున్నారు.. ?

చంద్రబాబు: నా దృష్టికీ ఈ సమస్య వచ్చింది. విపత్తు సహాయ బృందాలను ముందే మోహరిస్తే బాగుండేది. అలా చేస్తే ప్రజలకు జరిగిన నష్టం తగ్గేది. నేను అయిదుసార్లు టెలికాన్ఫరెన్సులు పెట్టినా ప్రాసెస్‌లో అధికారులు చేయలేకపోయారు. ఎందుకిలా జరిగిందో విచారణ చేయిస్తున్నాం.

తుపాను వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రజలు, అధికారులు ఏం చేయాలన్నది చెప్పేలా వచ్చే అక్టోబరు నుంచి 'సైక్లోన్ డే' నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తాం.

ధ్వంసమైన కొబ్బరి తోటలు

బీబీసీ తెలుగు: వాతావరణ మార్పులే విపత్తులకు కారణమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేలా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?

చంద్రబాబు: ఏపీలో 50 శాతం పచ్చదనం ఉండాలని, కలుషిత జలాలు సముద్రంలోకి విడిచిపెట్టకుండా చర్యలు తీసుకుంటున్నాం. 2150 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని పెంచి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం. గ్రామీణ, పట్టణ పారిశుద్ధ్యం విషయంలోనూ ముందున్నాం. దేశంలోని అన్ని ప్రపంచ దేశాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అంతా దీనిపై శ్రద్ధ చూపితే వాతావరణ సమస్యను అధిగమించగలుగుతాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)