తిత్లీ తుపాను: ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 2,25,000 కుటుంబాలపై తీవ్ర ప్రభావం

తుపాను తరువాత పలాస పట్టణం ఇలా..

ఫొటో సోర్స్, facebook/SrikakulamDistrict

తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా తీర ప్రాంతం ఉన్న జిల్లా కావడం.. తుపాను ఈ జిల్లాలోనే తీరం దాటడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. 193 కిలోమీటర్ల తీరరేఖ ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 18 మండలాలు తిత్లీ ప్రభావానికి విలవిలలాడాయి. విజయనగరం జిల్లాలోనూ తుపాను నష్టం కలిగించింది.

తుపాను వర్షాలకు నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్రతనయ నదులకు వరద రావడంతో జనజీవనం అల్లకల్లోలమైంది.

వరద నీటిలో వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు

ఫొటో సోర్స్, facebook/Andhra Pradesh CM

ఫొటో క్యాప్షన్, వరద నీటిలో వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు

నష్టం ఇలా..

* తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు.

* శ్రీకాకుళం జిల్లాలో 18 మండలాల్లోని 202 గ్రామాల్లో 9,06,125 మంది ప్రజలపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. అంటే జిల్లాలో మూడో వంతు ప్రజలు ఈ తుపాను ప్రభావానికి లోనైనట్లు.

* మొత్తం 2,25,000 కుటుంబాలు తుపాను ప్రభావానికి లోనయ్యాయి.

* అక్టోబరు 10 నుంచి 12వ తేదీల మధ్య కుంభవృష్టి కురవడంతో నదులు పోటెత్తి వరదలొచ్చి లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు.

* శ్రీకాకుళం జిల్లాలో మందస, పోలాకి, జలుమూరు మండలాలు వరద ముంపులో ఉన్నాయి.

* మహేంద్రతనయ నది నుంచి భారీగా వరద వస్తుండడంతో మెళియాపుట్టి, శ్రీనివాసపురం, గోపాలపురం, ముకుందాపురం, పుచ్చపాడు, ఎం.గంగువాడ గ్రామాలు నీటమునిగి ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

* రెండు జిల్లాల్లో 8,962 ఇళ్లు దెబ్బతిన్నాయి.

* శ్రీకాకుళం జిల్లాలో 6 పట్టణాలు, 4,319 గ్రామాలు అంధకారంలో చిక్కుకోగా విజయనగరం జిల్లాలో 6 మండలాల్లోని 358 గ్రామాలు తుపాను కారణంగా చీకట్లో మగ్గాయి.

తుపాను తరువాత ఉద్దానంలోని ఒక గ్రామంలో పరిస్థితి

ఫొటో సోర్స్, Ram Mohan Naidu Kinjarapu

ఫొటో క్యాప్షన్, తుపాను తరువాత ఉద్దానం ప్రాంతంలోని ఒక గ్రామంలో పరిస్థితి

పంట నష్టాలు..

* శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 1,39,844 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 1,36,531 హెక్టార్లలో వరి పంటను రైతులు నష్టపోయారు.

* 14,378 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ఒక్క కొబ్బరి పంటే 12 వేల హెక్టార్లలో తీవ్రంగా నష్టపోయింది. మొత్తం 2,98,750 కొబ్బరి చెట్లు నేలకూలాయి.

* విజయనగరం జిల్లాలో మొత్తం 308 హెక్టార్లలో వరి, చెరకు, కాటన్, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 2,424 హెక్టార్లలో అరటితోటలు ధ్వంసమయ్యాయి.

తుపాను నష్టాన్ని సీఎంకు వివరిస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు

ఫొటో సోర్స్, RamMohanNaiduKinjarapu

ఫొటో క్యాప్షన్, తుపాను నష్టాన్ని సీఎంకు వివరిస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు

మత్స్యకారులకు కష్టాలు

* తిత్లీ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు రూ.9.35 కోట్ల విలువైన బోట్లు, వలలు వంటి సామగ్రి కోల్పోయారు.

* విశాఖ జిల్లా మత్స్యకారులకు రూ.1.9 కోట్ల నష్టం వాటిల్లింది.

* శ్రీకాకుళం జిల్లాలో 80 చెరువులు దెబ్బతిన్నాయి.

సహాయ శిబిరాల్లో బాధితులకు భోజన ఏర్పాట్లు పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు

ఫొటో సోర్స్, facebook/Andhra Pradesh CM

సహాయ చర్యలు ఇలా..

* శ్రీకాకుళం జిల్లాలో 15 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులను ఆదుకున్నారు.

* ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కూలిపోయిన చెట్లను తొలగించి రహదారులను రాకపోకలకు అనువుగా మారుస్తున్నాయి.

* విద్యుత్ శాఖ 148 బృందాలుగా ఏర్పడి విద్యుత్ వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతోంది.

* వరద తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో సహాయ బృందాలున్నాయి.

(ఆధారం: ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రాథమిక నివేదిక)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)