ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అమ్మకం: ఇండోనేషియాలో నలుగురి అరెస్టు

ఫొటో సోర్స్, Instagram
సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకొని చిన్నారులను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఇండొనేషియా పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
కుటుంబ సంక్షేమ ఏజెన్సీ పేరుతో ఉన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గర్భిణుల ఫొటోలు, అల్ట్రాసౌండ్ స్కాన్, పసిపిల్లల చిత్రాలు ఉంచారు. శిశువులను కొనుక్కోవాలనుకొనేవారు వాట్సప్‌లో సంప్రదించాలంటూ ఒక ఫోన్ నంబరు ఇచ్చారు.
సెప్టెంబరు 3న జరగాల్సిన ఒక లావాదేవీ గురించి తాము తెలుసుకొన్నామని సురబయలో పోలీసులు బుధవారం చెప్పారు. ఇలా అమ్మేసిన శిశువుల్లో కనీసం ఒక్కరినైనా గుర్తించేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు.
చిన్నారులను 'దత్తత' తీసుకోవాలనుకొనేవారు ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగిస్తున్నారని, లావాదేవీని వాట్సప్ ద్వారా జరిపారని సురబయ ముఖ్య డిటెక్టివ్ సుదమీరన్ తెలిపారని వార్తా వెబ్‌సైట్ డెటిక్ వెల్లడించింది. కుటుంబ సమస్యల పరిష్కారానికి కన్సల్టెన్సీ సేవలను అందిస్తామని ఈ ఖాతాలో చెప్పారని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఖాతాను తొలగించిన ఇన్‌స్టాగ్రామ్
ఈ విషయం తమ దృష్టికి రాగానే 700 మందికి పైగా ఫాలోయర్లు ఉన్న ఈ ఖాతాను తొలగించినట్లు ఇన్‌స్టాగ్రామ్ ‘బీబీసీ’కి తెలిపింది.
చిన్నారుల ముఖం కనిపించకుండా బ్లర్ చేసిన చిత్రాలను, వారి వయసును, వారి ప్రాంతం, మతం వివరాలను ఈ ఖాతాలో పొందుపరిచారు.
కొనుగోలుదారులు, లావాదేవీలు నిర్వహించేవారి మధ్య జరిగిన సంభాషణలను తెలిపే స్క్రీన్‌షాట్లనూ పోస్ట్ చేశారు.
తాను ఏడు నెలల గర్భిణిని అని, ఈ విషయం తమ కుటుంబానికి తెలియకూడదని అనుకొంటున్నానని ఒక స్క్రీన్‌షాట్‌లో ఓ మహిళ చెప్పారు.
మరో పోస్టులో, ఒక గర్భిణి చిత్రాన్ని, ఆమె ఎక్కడివారనే వివరాలను ఉంచారు. ''ఈమె గర్భిణి. చిన్నారిని దత్తత తీసుకోవాలనుకొనేవారు ఈ ఫోన్ నంబరులో సంప్రదించండి'' అని రాశారు.
ఏ పోస్టులోనూ శిశువుల అమ్మకం లేదా కొనుగోలు గురించి నేరుగా ప్రస్తావన లేదు.
గత నెల్లో 22 ఏళ్ల ఒక మహిళ తన 11 నెలల శిశువును అమ్మడానికి యత్నించారని పోలీసులు వెల్లడించారు. ఆమె పేరును 'ఎల్‌ఏ'గా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
శిశువు కొనుగోలుదారు ఎల్‌ఏకు రూ.72,500 (కోటిన్నర ఇండోనేషియా రూపియాలు) ఇవ్వాల్సి ఉంది. బ్రోకర్‌కు సుమారు రూ.24 వేలు (50 లక్షల ఇండోనేషియా రూపియాలు), ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సొంతదారుగా చెబుతున్న ఆల్టన్ ఫినండిటాకు దాదాపు రూ.12 వేలు (25 లక్షల ఇండోనేషియా రూపియాలు) చెల్లించాల్సి ఉంది.
ఈ లావాదేవీలతో ప్రమేయమున్న నలుగురిని అరెస్టు చేశామని, బాలల సంరక్షణ హక్కులను ఉల్లంఘించినందుకు వీరికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని పోలీసులు తెలిపారు.
శిశువుల విక్రయం కేసులు ఇండోనేషియాలో ఇంతకుముందు కూడా ఉన్నాయని, అయితే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారని ఇండోనేషియా బాలల సంరక్షణ కమిషన్ వైస్ ఛైర్మన్ రీటా ప్రాణవతి ‘బీబీసీ’తో చెప్పారు.
శిశువుల కొనుగోలుదారుల ఉద్దేశంపై స్పష్టత లేదని ఆమె తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం శిశువులను దత్తత తీసుకోలేని కొందరు ఇలా చేస్తుండొచ్చని చెప్పారు. బాల్యంలోనే వ్యభిచారం చేయించేందుకు కూడా చిన్నారులను దత్తత తీసుకొన్న సందర్భాలు ఉన్నాయని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- తిత్లీ తుపాను: ప్రభావిత ప్రాంతాలలో ముమ్మరంగా సహాయచర్యలు
- ఇండోనేషియా: గ్రామాలను ముంచేసిన బురద.. ప్రజల్ని ఆదుకోలేకపోతున్న ప్రభుత్వం
- ఇండోనేషియా: మహిళకు తొలిసారి పట్టం కట్టనున్న యోగ్యాకార్తా రాజ్యం
- రిపబ్లిక్ డే పరేడ్: ఆసియాన్ ఎందుకంత ప్రత్యేకం?
- #MeToo: ఏది వేధింపు? ఏది కాదు?
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మరింత పేదరికంలోకి ప్రపంచం: ఐఎంఎఫ్
- జన్యుపరీక్ష: ‘రూ.4వేలతో మీకు ‘గుండెపోటు’ వస్తుందా లేదా ముందే తెలుసుకోవచ్చు’
- ప్రపంచయుద్ధంలో మునిగిన చమురు ట్యాంకర్‌తో ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









