ఇండోనేషియా: మహిళకు తొలిసారి పట్టం కట్టనున్న యోగ్యాకార్తా రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెబెక్కా హెన్ష్‌కే
- హోదా, బీబీసీ ఇండోనేషియా ఎడిటర్
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో యోగ్యాకార్తా సింహాసనం రాజకీయంగా, మతపరంగా చాలా బలమైనది. అలాంటి సింహాసనం మీద తొలిసారిగా ఒక మహిళ కూర్చోబోతోందా?
తన పెద్ద కూతురిని తన వారసురాలిగా ప్రకటించేందుకు యోగ్యాకార్తా సుల్తాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండోనేషియాలో అంతర్భాగమైన యోగ్యాకార్తాలో ఇప్పటికీ రాజరిక పాలన కొనసాగుతోంది. ఈ ప్రావిన్స్‌ను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారు.
అయితే ఈ ద్వీపరాజ్యంలో ఇప్పుడు తొలిసారి ఒక మహిళను వారసురాలిగా ప్రకటించడాన్ని సుల్తాన్ బంధువులే వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామం కుటుంబ కలహాలకూ దారితీసింది.
''గతంలో సుల్తాన్‌కు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. అప్పుడు రాజకుమారుడిని ఎన్నుకోవడంలో సమస్య ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. అయినా, జావా కుటుంబాల్లో పెత్తనం అంతా మహిళలదే కదా'' అని నవ్వుతూ అన్నారు ఒక రాజ సేవకుడు. అక్కడ పని చేసే 1,500 మంది సేవకుల్లో ఆయన ఒకరు.

ఫొటో సోర్స్, Getty Images
సుల్తాన్ వయసు 72. ఈ మధ్యనే తన పెద్ద కూతురుకు 'విశ్వ విజేత' గా అధికారిక నామం ఇచ్చారు. సమయం ఆసన్నమైనపుడు.. యోగ్యాకార్తా సింహాసనాన్ని అధిష్టించే వారిలో యువరాణి ముందు వరుసలో ఉంటారు.
ఆమె బిరుదు గురించి ప్రస్తావిస్తూ.. మీపై చాలా బాధ్యతలుంటాయిగా అని అడిగితే ఆమె నవ్వేశారు.
''మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. అన్ని కుటుంబాల్లోలాగే నా చెల్లెళ్ల కంటే నాకే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. కానీ భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం మా నాన్నే'' అన్నారు.

తన వారసత్వం గురించి ఆమె చాలా అరుదుగా మాట్లాడతారు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా కూడా వ్యవహరిస్తారు.
''ఇలాంటి విషయాలను ఆలోచిస్తూ నేను పెరగలేదు. జీవితాన్ని ఆనందంగా గడపడం మాత్రమే నాకు తెలుసు. కానీ ఇండోనేషియాలోని 'ఆఛే', ఇతర ముస్లిం రాజ్యాలను మగవారేకాదు.. ఆడవాళ్లు కూడా పరిపాలించారని మాత్రం చెప్పగలను'' అని యువరాణి అన్నారు.
కానీ ఈమె చిన్న చెల్లెలు 'గుస్తి కాన్జెంగ్ రతు హయు' మాత్రం తన అక్కకు లభించిన అవకాశం గురించి చాలా ధైర్యంగానే మాట్లాడతారు.
ఈ అక్కాచెల్లెళ్లు యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో చదువుకున్నారు. ప్రస్తుతం.. రాజభవనంలో వివిధ పదవుల్లో ఉన్నారు. ఈ పదవులన్నీ.. గతంలో పురుషులు నిర్వహించినవే.
''నువ్వు ఆడపిల్లవి.. అది నీపని కాదు.. అంటూ నా తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. ఆడపిల్లలు ఇంటికే పరిమితం అయ్యే పాత కాలం కాదిది అని నాన్న అంటుంటారు. అలాంటి తల్లిదండ్రులు దొరకడం నా అదృష్టం'' అంటారామె.

వాళ్లను వెళ్లగొడతాం: సుల్తాన్ బంధువులు
సుల్తాన్ సోదరులూ, అక్కాచెల్లెళ్లు ఆయన నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుల్తాన్‌తో మాట్లాడ్డం కూడా మానేశారు. రాజభవనంలో జరిగే ఉత్సవాలకు కూడా హాజరుకావడం లేదు.
‘‘మాది ఇస్లామిక్ రాజ కుటుంబం. ఇక్కడ సింహాసనం మగవాళ్లకే సొంతం. రేపు ఆవిడను ఏమని పిలవాలి? మహారాణి అనా? అది అసంభవం'' అంటూ సుల్తాన్ సోదరుడు నవ్వారు.
వందల సంవత్సరాలుగా వస్తోన్న సంప్రదాయాన్ని సుల్తాన్ కాలరాస్తున్నారని, సుల్తాన్ కుటుంబానికి పదవీ కాంక్ష పట్టుకుందని ఆయన సోదరుడు ఆరోపిస్తున్నారు.
''ఇప్పుడున్న పరిస్థితుల్లో సుల్తాన్‌తో మేం వాదించం. కానీ ఆయన మరణించాక మాత్రం, ఆయన భార్యను, కూతుళ్లను ఇక్కడి నుంచి వెళ్లగొడతామని ప్రజలతో ఒప్పందం చేసుకున్నాం. వాళ్లు ఇక ఎప్పటికీ మా కుటుంబంలో భాగం కారు'' అని సుల్తాన్ సోదరుడు హెచ్చరించారు.

ఇద్దరు రాణులు
అయితే రాజకుటుంబం తీసుకునే నిర్ణయాన్ని అంగీకరిస్తామని ప్రజలు చెబుతున్నారు.
జావనీస్ రాజుల పాలన 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. చాలామంది ఇండోనేషియా ప్రజల్లాగానే రాజ కుటుంబీకులు కూడా ముస్లిం మతానికి చెందిన వారు. కానీ వీరి ఆచార వ్యవహారాల్లో హిందూ, బౌద్ధ మతం ఆనవాళ్లు కనిపిస్తాయి.
తమ పురాణాల్లో 'కాన్జెంగ్ రతు లోరో కిదుల్'ను సముద్ర దేవతగా అభివర్ణిస్తారు. ఈ దేవతను జావనీస్ సుల్తాన్ తన భార్యగా, రాణిగా స్వీకరిస్తారు. వారిద్దరూ కలిసి తమను, తమ ప్రజలను అన్ని విధాలుగా కాపాడుతారని వీరి విశ్వాసం.

''హిందూ మహాసముద్రాన్ని, మా నగరానికి దగ్గర్లో ఉన్న అగ్నిపర్వతాన్ని మేం కొలుస్తాం. సుల్తాన్, సముద్ర దేవత కలిసి మమ్మల్ని ఈ అగ్నిపర్వతం నుంచి కాపాడుతారని మా విశ్వాసం. కానీ.. సింహాసనంపై మహిళను కూర్చోబెడితే, అప్పుడు ఇద్దరు రాణులవుతారు. వాళ్లిద్దరూ ఎలా ఒక్కటవుతారు? అది అసాధ్యం'' అని ఒక టూర్ గైడ్ మాతో అన్నారు.
అయితే.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సుల్తాన్ సరైన నిర్ణయం తీసుకుంటారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇండోనేషియాలో అక్కడ మాత్రమే రాచరికం
డచ్ వలసవాదులతో పోరాడి ఇండోనేషియా స్వాతంత్ర్యం పొందింది.
అయితే.. స్వాతంత్ర్య పోరాటంలో యోగ్యాకార్తా రాజ్యం చేసిన సాయానికి కృతజ్ఞతగా, ఆ ప్రాంతంలో రాచరికం కొనసాగించేలా ఇండోనేషియా ప్రభుత్వం అనుమతించింది.
దేశం మొత్తం మీద.. యోగ్యాకార్తా ప్రాంతంలో మాత్రమే పాలకుడిని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకోరు. 2010లో యోగ్యాకార్తాలో రాజకుటుంబ పాలనను రద్దు చేసేందుకు ఇండోనేషియా ప్రభుత్వం ప్రయత్నించింది.
కేంద్ర ప్రయత్నానికి వ్యతిరేకంగా యోగ్యాకార్తా వీధుల్లో ప్రజలు నిరసనలు తెలిపారు. ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే సుల్తాన్ కుటుంబం అనుసరించే మితవాద ఇస్లాం సంప్రదాయానికి పెను సవాళ్లు ఎదురయ్యే సమయం ఆసన్నమైంది.
జావా ప్రజల్లో.. ఇస్లాం మతానికి చెందిన సున్నీ సంప్రదాయంలో 'వహ్హబీ' పోకడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే.. సుల్తాన్ కుటుంబం అనుసరిస్తున్న విగ్రహారాధన, బహుదేవతారాధనలు వహ్హబీ పద్దతులకు విరుద్ధమైనవి.
''మా సంప్రదాయాలకు కొన్ని కారణాలున్నాయి. అవి ఖురాన్‌లో చెప్పినట్లుగా ఉండకపోవచ్చు. అంతమాత్రాన మేం తప్పు దోవలో వెళుతున్నట్లు కాదు. ఇది ఇస్లాం రాజ్యం. కానీ మధ్య ప్రాచ్య దేశాల్లాగ ఉండదు. మా ప్రతి చర్యలోనూ ఇస్లాం అంతర్భాగంగా ఉంటుంది'' అని యువరాణి గుస్తీ హయు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవైపు ముస్లిం యువతుల్లో హిజాబ్ సంప్రదాయం పట్ల మక్కువ పెరుగుతున్నా, హిజాబ్ వేసుకుని రాజభవనంలోకి ప్రవేశించడం పట్ల నిషేధం ఇంకా కొనసాగుతూ ఉంది.
''చాలా మంది మహిళలు రాజభవనంలోకి వచ్చినపుడు స్వచ్ఛందంగానే హిజాబ్ తీసేస్తారు. తిరిగి బయటికెళ్లాక ధరిస్తారు. ఇది మతానికి సంబంధించినది కాదు. మా సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించడమే. ఈ విషయాన్ని సమాజం అర్థం చేసుకుంది. సుల్తాన్ అన్నవాడు మతాలకంటే గొప్పవాడు'' అని మహారాణి కాన్జెంగ్ రతు హెమాస్ అన్నారు.

జాతీయ పార్లమెంట్‌లో సెనేటర్‌గా ఉన్న మహారాణి ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారన్న ఆరోపణలూ రాజకుటుంబంపై ఉన్నాయి.
తన కూతుళ్లను.. ఒకరి మీద ఆధారపడకుండా, స్వతంత్రంగా బతికేలా పెంచానని, వారిలో.. మేం పురుషులతో సమానం అనే విశ్వాసాన్ని నింపానని మహారాణి అన్నారు.
''నా కూతుళ్లకు 15 సంవత్సరాలొచ్చాక, రాజభవనం వీడి బయటి ప్రపంచంలోకి వెళ్లాలని, ఎంతో నేర్చుకోవాలని చెప్పాను'' అన్నారు.
"నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలని చెప్పారా?" అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా..
''ఆ నిర్ణయం సుల్తాన్ చేతుల్లో ఉంది. రక్తసంబంధీకులే వారసత్వం పొందుతారు. కాబట్టి, ఈ విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా.. అధికారం కోసం ఘర్షణలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి'' అని మహారాణి కాన్జెంగ్ రతు హెమాస్ ముంగించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








