ఒడిశా: పేకాటలో భార్యను పణంగా పెట్టి ఓడిపోయిన భర్త

- రచయిత, సందీప్ సాహు
- హోదా, బీబీసీ కోసం, భువనేశ్వర్ నుంచి
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఒక షాకింగ్ ఘటనలో ఒక భర్త జూదంలో తన భార్యనే పణంగా పెట్టి ఓడిపోయాడు.
పేకాటలో ఓడిపోయాక ఆ వ్యక్తి తన భార్యను గెలిచిన వ్యక్తికి అప్పగించాడనీ, ఆ తర్వాత అతడు ఆమెపై భర్త ఎదుటే అత్యాచారం చేశాడని ఆరోపణలున్నాయి.
బాధితురాలి ఫిర్యాదుపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు ఒడిశా పోలీసులు బీబీసీకి తెలిపారు. ప్రస్తుతం ఆమె భర్త, అతడితో పేకాట ఆడిన మరో వ్యక్తి ఇద్దరూ పరారీలో ఉన్నారు.

ఫొటో సోర్స్, RAJKISHORE BEHERAA/BBC
అత్యాచారం జరిగిన తర్వాతే తెలిసింది నన్ను పందెం కాశాడని...
"బాధితురాలిని వైద్య పరీక్ష కోసం బాలేశ్వర్ పంపించాం. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు సోదాలు నిర్వహిస్తున్నాం" అని పోలీసు అధికారి తెలిపారు.
నిందితులపై బలాత్కారంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తనపై జరిగిన దారుణం గురించి బాధితురాలు బీబీసీతో మాట్లాడుతూ, "గత 23వ తేదీ రాత్రి నా భర్త రాత్రి దాదాపు 11 గంటలకు ఇంటికి వచ్చాడు. తనతో రావాలంటూ నన్ను తీసుకెళ్లాడు. ఎక్కడికి అని అడిగితే అతడు జవాబు చెప్పలేదు" అన్నారు.
"నన్ను బలవంతంగా ఊరి బయటకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే అతడి దోస్తులున్నారు. వాళ్లను నేను భయ్యా అని పిలుస్తాను. వాళ్లు నన్ను చెయ్యి పట్టుకొని లాగారు. నేను వాళ్లను అడ్డుకున్నాను. కానీ నా భర్తే నా ఒంటి మీది నుంచి చీర లాగేసి వాళ్లకు అప్పజెప్పాడు."
"పేకాటలో గెల్చిన వ్యక్తి నన్ను కొద్ది దూరం లాక్కెళ్లి నాపై అత్యాచారం చేశాడు. నా భర్త పేకాటలో నన్నే పందెం కాసి ఓడిపోయిన విషయం నాకు తర్వాతే తెలిసింది" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసులు మొదట కేసు నమోదు చెయ్యలేదు..
మరుసటి రోజు ఉదయం బాధితురాలి కుమార్తె తన తాతకు(తల్లి తండ్రి) ఫోన్ చేసి జరిగిన ఘోరం గురించి చెప్పింది. ఆయన తన కుమారుడిని వెంటబెట్టుకొని కూతురి అత్తవారింటికి వచ్చారు.
బాధితురాలి తండ్రి బీబీసీతో మాట్లాడుతూ, "మేం దీని గురించి వియ్యంకుడితో, అల్లుడితో మాట్లాడితే ఇద్దరూ దీని గురించి తమకేమీ తెలియదన్నారు. ఆ తర్వాత గ్రామ పెద్దతో మాట్లాడాం" అని చెప్పారు.
"ఆయన ఊళ్లోని ఇతర పెద్దమనుషులతో మాట్లాడారు. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధి కావాలని అడిగారు. దాంతో చేసేదేమీ లేక మేం మా కూతురినీ, ఇద్దరు పిల్లలనూ తీసుకొని మా గ్రామానికి వచ్చేశాం."
"మే 27న మేం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేయించాలని అనుకున్నాం. కానీ పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరిస్తూ, తమ కూతురి భర్తతో రాజీ కుదుర్చుకోవాలని అన్నారు. బుధవారం నాడు మేం ఎస్‌పీ కలిసిన తర్వాతే కేసు నమోదైంది."

ఫొటో సోర్స్, RAJKISHORE BEHERAA/BBC
దిక్కుతోచని స్థితిలో తండ్రి
అయితే బాధితురాలి తండ్రి ఆరోపణలను పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తోసిపుచ్చారు. నేను సెలవులో ఉన్నాను. రెండు పక్షాలూ ఒక రాజీ ప్రతిపాదిన చేసినట్టు తిరిగి వచ్చాక నాకు తెలిసింది. కానీ ఆ తర్వాత ఎస్‌పీ ఆదేశాలు రాగానే మేం వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించాం.
మరోవైపు, కేసు నమోదు చేసిన తర్వాత కూడా పోలీసులు తనను వేధిస్తున్నారని బాధితురాలి తండ్రి అన్నారు. ఈరోజు కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో నాలుగు గంటల సేపు కూర్చోబెట్టారు. నా కూతురిని అసభ్యకరమైన ప్రశ్నలడిగారు. తప్పు ఆమె భర్తది కాదు, ఆమెదే అన్నట్టుగా ఉంది వారి తీరు" అని ఆయన వాపోయారు.
ఆయన తన గోడు వెళ్లబోసుకుంటూ ఏడ్చారు. అయితే తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








