టీడీపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌లకు నిధులు ఇలా వచ్చాయ్

ఫొటో సోర్స్, Facebook
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగుదేశం పార్టీ ఆదాయం ఏడాదిలో 356 శాతం పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషణ చెప్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల ఆదాయం ఏడాది కాలంలో సగానికి పైగా తగ్గింది.
దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీలలో.. 2016-17 ఆర్థిక సంవత్సరపు ఆదాయ వ్యయాల నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 32 పార్టీల వివరాలను క్రోడీకరించి ఏడీఆర్ విశ్లేషించింది. ఈ విశ్లేషణ నివేదికను తాజాగా విడుదల చేసింది.
ఈ ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) రూ. 82.76 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉండగా.. రూ. 72.92 కోట్ల ఆదాయంతో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. అన్నా డీఎంకే రూ. 48.88 కోట్లతో మూడో స్థానంలో ఉంది.
మొత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయంలో.. అగ్రభాగాన ఉన్న ఈ మూడు పార్టీల ఆదాయమే 63.72 శాతం (మొత్తం రూ. 204.56 కోట్లు)గా ఉంది.

ఫొటో సోర్స్, TDP/Facebook
ఆదాయంలో టీడీపీ టాప్.. వైసీపీ లాస్ట్...
ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో.. ఆదాయం పరంగా చూస్తే రూ. 72.92 కోట్లతో టీడీపీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మజ్లిస్, టీఆర్ఎస్‌లు ఉండగా.. వైసీపీ రూ. 0.94 కోట్లతో చివరి స్థానంలో ఉంది.
- తెలుగుదేశం పార్టీకి 2016-17లో రూ. 72.92 కోట్ల ఆదాయం లభించింది. ఇది 2015-16 సంవత్సరపు ఆదాయం రూ. 15.978 కోట్లకన్నా రూ. 56.94 కోట్లు ఎక్కువ.
- అలాగే.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆదాయం 2015-16 సంవత్సరంలో రూ. 8.908కోట్లుగా ఉంటే.. 2016-17లో ఆదాయం రూ. 3.79 కోట్లకు తగ్గిపోయింది. అంటే ముందటి ఏడాది కన్నా రూ. 5.118 కోట్లు (57.45 శాతం) తగ్గింది.
- ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాయం కూడా అంతకు ముందలి సంవత్సరంతో పోలిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో 50.79 శాతం తగ్గింది. ఆ పార్టీకి 2015-16లో రూ. 1.91 కోట్లు ఆదాయం లభిస్తే.. మరుసటి ఏడాది రూ. 0.94 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
- అయితే.. మజ్లిస్ పార్టీ (ఏఐఎంఐఎం) ఆదాయం గణనీయంగా 120 శాతం పెరిగింది. 2015-16 సంవత్సరంలో ఆ పార్టీ ఆదాయం రూ. 3.36 కోట్లుగా ఉంటే.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 7.42 కోట్ల ఆదాయం లభించింది. అంటే.. ఆ ఏడాది రూ. 4.06 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది.

ఫొటో సోర్స్, TRS/Facebook
టీడీపీ, మజ్లిస్‌లకు మిగులు.. టీఆర్‌ఎస్, వైసీపీలకు లోటు...
2016-17 ఆర్థిక సంవత్సరంలో.. టీడీపీ, మజ్లిస్‌లు ఆదాయం కన్నా తక్కువ వ్యయం చేసినట్లు ప్రకటించగా.. టీఆర్ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువ వ్యయం చేసినట్లు చెప్పాయి.
- తెలుగుదేశం పార్టీకి ఆ సంవత్సరంలో రూ. 72.92 కోట్ల ఆదాయం లభిస్తే.. అందులో రూ. 24.32 కోట్లు వ్యయం చేసినట్లు ప్రకటించింది. ఆదాయంలో రూ. 48.59 కోట్లు (67 శాతం) ఖర్చుకాకుండా మిగిలాయి.
- మజ్లిస్ పార్టీ తనకు రూ. 7.42 కోట్ల ఆదాయం లభించగా అందులో రూ. 0.50 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని తెలిపింది. అంటే.. ఆదాయంలో 93 శాతం రూ. 6.92 కోట్లు మిగిలు ఉంది.
- ఇక తెలంగాణ రాష్ట్ర సమితికి రూ. 3.79 కోట్ల ఆదాయం రాగా రూ. 6.49 కోట్లు ఖర్చు చేసింది. ఇది ఆదాయం కన్నా రూ. 2.70 కోట్లు అధికం. అంటే 71 శాతం నిధులు ఆదాయం కన్నా అదనంగా ఖర్చు చేసింది.
- అలాగే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు రూ. 0.94 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించగా.. ఖర్చు మాత్రం రూ. 1.23 కోట్లు అయ్యాయని చెప్పింది. ఇది ఆదాయం కన్నా 0.29 కోట్లు (31 శాతం) ఎక్కువ.

ఫొటో సోర్స్, ysrcongress.com
నాలుగు పార్టీల ఆదాయ మార్గాలివీ...
టీడీపీకి ఫీజులు, సబ్‌స్క్రిప్షన్లు: టీడీపీ ఆదాయం రూ. 72.92 కోట్లలో అత్యధిక భాగం (83.31 శాతం) రూ. 60.75 కోట్లు ఫీజులు, సబ్‌స్క్రిప్షన్ల ద్వారా లభించినట్లు పేర్కొంది. ఇక స్వచ్ఛంద విరాళాల ద్వారా రూ. 6.858 కోట్లు (9.40 శాతం), బ్యాంకు డిపాజిట్లపై వడ్డీలు, ఆదాయ పన్ను వాపసుల రూపంలో రూ. 5.29 కోట్లు (7.25 శాతం), ఇతరత్రా ఆదాయం రూ. 2.2 లక్షలు (0.03 శాతం) లభించినట్లు పేర్కొంది.
ఎంఐఎం ఆదాయ వనరు అద్దె: మజ్లిస్ పార్టీ తన ఆదాయం 7.42 కోట్లలో సింహ భాగం (84.23 శాతం) రూ. 6.25 కోట్లు అద్దె ద్వారా లభించినట్లు చెప్పింది. బ్యాంకు డిపాజిట్ల మీద వడ్డీ రూపంలో ఇంకో రూ. 1.01 కోట్లు (13.61 శాతం) లభించగా.. దారుస్సలాం ఆదాయంలో వాటా రూపంలో రూ. 13 లక్షలు, ఇతరత్రా ఆదాయం రూ. 3 లక్షలు లభించాయని వివరించింది.
టీఆర్ఎస్ ఆదాయం ఫీజులు, విరాళాలు: టీఆర్‌ఎస్ తన ఆదాయం రూ. 3.79 కోట్లలో అత్యధికంగా (85.41 శాతం) సభ్యత్వ ఫీజులు, విరాళాల రూపంలో రూ. 3.237 కోట్లు వచ్చినట్లు తెలిపింది. డిజాజిట్లు తదిరాలపై వడ్డీల రూపంలో రూ. 48.8 లక్షలు (12.88 శాతం) లభించాయని, ఎన్నికల వ్యయం వాపసు రూపేణా రూ. 6.5 లక్షలు వచ్చాయని లెక్క చెప్పింది. ఇతరత్రా మార్గాల్లో వచ్చిన ఆదాయం సున్నాగా చూపింది.
వైసీపీ ఆదాయమంతా విరాళాలే: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆదాయం రూ. 94.1 లక్షలకు గాను.. రూ. 94 లక్షలు (99.89 శాతం) విరాళాల రూపంలోనే వచ్చాయని నివేదించింది. మిగతా లక్ష రూపాయలు రద్దు అమ్మగా వచ్చాయని చూపింది. వడ్డీలు కానీ, ఇతరత్రా రూపాల్లో కానీ ఆదాయం సున్నాగా పేర్కొంది.

ఫొటో సోర్స్, asadowaisi.com
‘తెలయని వనరులు’ అంటే.. రూ. 20,000 కన్నా తక్కువ మొత్తం రూపంలో వచ్చే విరాళాలు.. ఈ విరాళాల ఆదాయానికి ఆధారాలను రాజకీయ పార్టీలు తమ ఐటీ రిటర్నుల్లో చూపవు. ఇందులో కూపన్ల విక్రయం, సహాయ నిధి, విరాళాలు, సమావేశాలు, సభల్లో విరాళాలు వంటివి ఉంటాయి.
‘తెలిసిన వనరులు’ అంటే.. పార్టీలకు రూ. 20,000 కన్నా ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు, వివరాలను వెల్లడిస్తాయి.
‘ఇతర వనరులు’ అంటే.. స్థిర, చరాస్తులు, పాత వార్తా పత్రికలు, సభ్యత్వ రుసుములు, ప్రతినిధి ఫీజులు, బ్యాంకు వడ్డీలు, ప్రచురణల విక్రయాలు తదితర మార్గాల్లో వచ్చే ఆదాయం. వీటి వివరాలు పార్టీల ఆదాయ వ్యయ పద్దుల్లో లభ్యమవుతాయి.

ఫొటో సోర్స్, TDP/Facebook
2016-17లో నాలుగు పార్టీల వ్యయం ఇలా...
టీడీపీకి నిర్వహణ ఖర్చే ఎక్కువ: టీడీపీ రూ. 24.34 కోట్లు వ్యయం చేయగా.. అందులో రూ. 20.5 కోట్లు (82.37 శాతం) నిర్వహణ, సాధారణ ఖర్చులకే అయ్యాయని లెక్క చెప్పింది. ఎన్నికల వ్యయం కింద రూ. 1.748 కోట్లు (7.18 శాతం) చూపగా.. ఉద్యోగ ఖర్చుల కింద రూ. 1.7 కోట్లు (6.98 శాతం), ఇతర ఖర్చుల కింద రూ. 84.2 లక్షలు (3.46 శాతం) చూపింది.
సభ్యులకు బీమా కోసం టీఆర్‌ఎస్ వ్యయం: టీఆర్ఎస్ రూ. 6.49 కోట్లు ఖర్చు చేయగా.. అందులో సభ్యుల గ్రూప్ ఇన్సూరెన్స్ (బీమా) ప్రీమియం కోసం రూ. 5.438 కోట్లు (83.79 శాతం) వ్యయమైనట్లు చెప్పింది. శిక్షణ, సమీక్ష సమావేశాల ఖర్చులు రూ. 30 లక్షలు (4.62 శాతం), విరాళాలు రూ. 15 లక్షలు (2.31 శాతం), ఇతర ఖర్చులు రూ. 60.2 లక్షలు (9.28 శాతం) గా వివరించింది.
వైసీపీకీ నిర్వహణ ఖర్చే అధికం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ. 1.23 కోట్లు ఖర్చు చేయగా.. అందులో రూ. 92.8 లక్షలు (75.45 శాతం) నిర్వహణ, సాధారణ ఖర్చులుగా చూపింది. ఉద్యోగ వ్యయం కింద రూ. 13.5 లక్షలు (10.98 శాతం), కార్యాలయ నిర్వహణకు రూ. 9 లక్షలు (7.32 శాతం), ఇతర ఖర్చు రూ. 7.7 లక్షలు (6.26 శాతం) అయినట్లు లెక్క చెప్పింది.
మజ్లిస్ ప్రయాణ ఖర్చు: ఏఐఎంఐఎం రూ. 50 లక్షలు ఖర్చు పెట్టగా.. అందులో రూ. 26.5 లక్షలు (53 శాతం) ప్రయాణ చార్జీలుగా పేర్కొంది. ఎన్నికల ఖర్చు కింద రూ. 7 లక్షలు (14 శాతం), కోచింగ్, శిక్షణకు సహాయం కింద రూ. 6.4 లక్షలు (12.80 శాతం), ఇతర ఖర్చులు రూ. 10.1 లక్షలు (20.20 శాతం) గా వివరించింది.

ఫొటో సోర్స్, YSRCP/Facebook
2004-05 నుంచి 2014-15 మధ్య ఆదాయాలు ఇలా...
టీడీపీ ఆదాయం 2004-05లో రూ. 7.43 కోట్లుగా ఉండగా.. 2014-15 నాటికి అది రూ. 81.6 కోట్లకు పెరిగింది. అదే కాలంలో టీఆర్ఎస్ ఆదాయం 0.16 కోట్ల నుంచి రూ. 24.59 కోట్లకు చేరింది.
ఇక 2011లో స్థాపించిన వైసీపీ ఆదాయం తొలి ఏడాది రూ. 1 లక్షగా ఉండగా.. 2014-15 నాటికి రూ. 7.44 కోట్లకు పెరిగింది.
మజ్లిస్ పార్టీ ఆదాయ వివరాలు 2014-15 సంవత్సరానివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ ఏడాది ఆ పార్టీ ఆదాయం రూ. 2.47 ఉంది.

ఫొటో సోర్స్, TRS/Facebook
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








