పొగాకు వ్యతిరేక దినోత్సవం: అందరికంటే ఎక్కువగా పొగ తాగే దేశాలివే

ఫొటో సోర్స్, Getty Images
ధూమ పాన సమస్య ప్రపంచమంతటా ఉన్నదే. కానీ ఫ్రాన్స్‌లో చేపట్టిన రకరకాల చర్యల కారణంగా అక్కడ ఆ సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ సంస్థ ప్రకారం 2016-2017మధ్య ఆ దేశంలో దాదాపు పది లక్షల మంది ధూమపానం మానేశారు.
కానీ ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పొగ తాగే వారి సంఖ్య మాత్రం పెరిగిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
1. కిరిబాటి
ఇదో చిన్న దీవి. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక శాతం పొగరాయుళ్లు ఉన్నారు. ఇక్కడ మూడులో రెండొంతుల మంది మగవాళ్లు ధూమపానానికి అలవాటుపడ్డారు. మూడొంతుల మంది ఆడవాళ్లు కూడా పొగతాగుతున్నారు.
కిరిబాటి జనాభా కేవలం 1.3లక్షలు. ఇక్కడ సిగరెట్లపై పన్నులతో పాటు పొగాకు నివారణ చర్యలు కూడా తక్కువే.

ఫొటో సోర్స్, Getty Images
2. మాంటెనెగ్రో
యూరప్‌లోని ఈ దేశంలో 46శాతం మంది ప్రజలకు పొగతాగే అలవాటుంది. 6.3లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో పెద్దవాళ్లు ఏడాదికి సగటున 4,124 సిగరెట్లు తాగుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించినప్పటికీ అక్కడ పరిస్థితి మాత్రం మారట్లేదు.
3. గ్రీస్
గ్రీస్‌లో 50శాతం మంది మగవాళ్లు, 35శాతం మంది ఆడవాళ్లు ధూమపానం చేస్తారు. 2008 నుంచి అక్కడ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించినా, ఇప్పటికీ చాలామంది బహిరంగంగానే పొగతాగుతూ కనిపిస్తారు.
అక్కడ సిగరెట్ల అక్రమ రవాణా కూడా ఎక్కువే. దానివల్ల దేశానికి చాలా పన్ను నష్టం కూడా వాటిల్లుతోంది.
4. ఈస్ట్ తైమూర్
ప్రపంచంలోనే అత్యధికంగా ఈస్ట్ తైమూర్‌లో 80శాతం మంది మగవాళ్లు పొగ తాగుతారు. కానీ 6శాతం మంది ఆడవాళ్లకు మాత్రమే ఆ అలవాటుంది. అందుకే జాబితాలో ఆ దేశానిది 4వ స్థానం.
అక్కడ ప్రతి సిగరెట్ డబ్బాపైన హెచ్చరికలు ఉన్నప్పటికీ నిరక్షరాస్యత కారణంగా 50శాతం మంది వాటిని చదవలేరు.

ఫొటో సోర్స్, Getty Images
5. రష్యా
రష్యాలో 15ఏళ్లు పైబడిన మగవాళ్లలో 60శాతం మంది పొగ తాగుతున్నారు. 23శాతం మంది మహిళలకు ఆ అలవాటుంది.
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం ఉన్నప్పటికీ పొగాకు సంస్థలు ప్రకటనల కోసం కూడా అక్కడ భారీగా ఖర్చు చేస్తున్నాయి.
రష్యా సిగరెట్ మార్కెట్ విలువ 1.4లక్షల కోట్ల పైమాటే.
తక్కువగా పొగతాగే దేశాలు
ఘనా, ఇథియోపియా, నైజీరియా, ఎరిత్రియా, పనామా... ఈ ఐదు దేశాలూ అతి తక్కువగా పొగ తాగే దేశాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి.
ఆఫ్రికాలో 14శాతం మంది మాత్రమే పొగ తాగుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచ సగటు 22శాతం.
అక్కడ పొగతాగే వాళ్లలో దాదాపు 85శాతం మగవాళ్లే ఉన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం తక్కువగా ఉండటంతో పాటు ఆడవాళ్లు పొగ తాగడాన్ని చాలా చోట్ల అనైతికంగా భావించడం కూడా అక్కడ మహిళల్లో ఆ అలవాటు తక్కువగా ఉండటానికి కారణమని చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికాలో 'ఖాట్' అనే మొక్క ఆకుల్ని ఎక్కువగా నముల్తాంటారు. స్ట్రాంగ్ కాఫీ తాగిన భావనను ఆ ఆకులు కలిగిస్తాయి. దానివల్ల కూడా పొగకు చాలామంది దూరంగా ఉంటారని చెబుతారు.
కఠినమైన నిబంధనలు, అవగాహన, పన్నుల కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ధూమపానం తగ్గుముఖం పట్టింది. దాంతో పొగాకు సంస్థలు అభివృద్ధి చెందుతోన్న దేశాలనే లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా పొగాకును ఉత్పత్తి చేసేది, వినియోగించేది చైనానే. ఆ దేశంలో దాదాపు 30కోట్ల మంది ప్రజలు పొగ తాగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్క డెన్మార్క్‌లో మాత్రమే పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో మహిళా స్మోకర్లు ఉన్నారు. అక్కడ 18.9శాతం మంది పురుషులు, 19.3శాతం మహిళలు పొగతాగుతున్నారు.
మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 110కోట్ల మంది పొగతాగుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఏటా పొగాకు కారణంగా 70లక్షల మంది మరణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








