జపాన్‌లో 18 ఏళ్లుదాటినా పెద్దవారు కాదు

ఫొటో సోర్స్, AFP
జపాన్‌లో ఇప్పటి వరకూ 20 ఏళ్లు దాటితేనే పెద్దవారుగా పరిగణిస్తారు. దీన్ని సవరించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
ఇకపై 18 ఏళ్లు దాటినవారు అందరినీ పెద్దవాళ్లుగా గుర్తించాలని ప్రతిపాదించింది.
ఈ మార్పులు అమల్లోకి వస్తే.. ఇక్కడ 18 ఏళ్లు దాటిన వారు పెళ్లి చేసుకొనే వీలుంటుంది.
పలు ఒప్పందాలపై సంతకాలు చేయొచ్చు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా రుణాలు తీసుకోవచ్చు.
ధూమపానం.. మద్యపానం.. జూదమాడేందుకు మాత్రం 20 ఏళ్లు నిండాల్సిందే.
ఈ వయసు సవరణ బిల్లుకు జపాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. 2022 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. 1876 తర్వాత వయసుకు సంబంధించిన మొదటి మార్పు ఇదే అవుతుంది.
ప్రస్తుత చట్టం ప్రకారం ఇక్కడ 18 ఏళ్ల యువకులు, 16 ఏళ్లు దాటిన యువతులు పెళ్లి చేసుకోవాలంటే తమ తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
కొత్త చట్టం అమల్లోకి వస్తే.. 18 ఏళ్లు దాటిన వారు అందరూ తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. ఈ మేరకు క్యోడో న్యూస్ సర్వీస్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రాన్స్‌లోనూ ‘వయసు’పై సవరణ
మరోవైపు లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే చట్టబద్ధ వయసును 15 సంవత్సరాలుగా నిర్ణయించే దిశగా ఫ్రాన్స్ చర్యలు చేపడుతోంది. దీనర్థం అంతకన్నా తక్కువ వయసున్న వారితో సెక్స్ చేయటాన్ని అత్యాచారంగా పరిగణిస్తారు.
డాక్టర్లు, న్యాయ నిపుణుల సలహాల మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని లింగ సమానత్వ శాఖ సహాయ మంత్రి మార్లీన్ షియాపా ఆహ్వానించారు.
ప్రస్తుతం.. పదిహేనేళ్ల లోపు వయసున్న వారితో ఎవరైనా సెక్స్ చేసినట్లయితే.. అది రేప్ అని అభియోగం నమోదు చేయాలంటే బలాత్కారం జరిగిందని ప్రాసిక్యూటర్లు రుజువు చేయాల్సి ఉంటుంది.
ఇటీవల 11 ఏళ్ల వయసున్న బాలికలతో పురుషులు సెక్స్ చేసిన కేసుల మీద తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో చట్టంలో ఈ మార్పు తీసుకురావాలని నిర్ణయించారు.
ప్రస్తుతమున్న చట్టం ప్రకారం.. హింస కానీ, బలవంతం చేసినట్లు కానీ నిరూపణ కాకపోతే.. మైనర్‌పై లైంగిక దోపిడీ అభియోగాలు మాత్రమే నిందితుల మీద నమోదవుతాయి కానీ రేప్ అభియోగం నమోదు కాదు. ఆ నేరానికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, సుమారు రూ. 6.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








