జపాన్ తీరంలో మృత్యు నౌకలు

ఫొటో సోర్స్, Reuters
గత కొన్నేళ్లుగా జపాన్ పడమటి తీరాల్లో ఘోస్ట్ షిప్స్ కనిపిస్తున్నాయి. మొదట్లో అందరూ ఇవి ఉత్తర కొరియా జాలర్లు వాడే పడవలని భావించారు. వీటిలోని చాలా పడవల్లో మనషుల మృతదేహాలు ఉంటున్నాయి.
ఈ మధ్యకాలంలో కొన్ని పడవల్లో మనుషులు కూడా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఉత్తర కొరియా నుంచి వచ్చిన వారని తేలింది.
'ఘోస్ట్ షిప్స్' అంటే ఏమిటి?
జపాన్ పశ్చిమ తీరాలకు కొట్టుకువచ్చే ఈ పడవలు ఖాళీగా ఉంటాయి. కొన్నిట్లో మనుషుల శవాలు కూడా ఉంటాయి.
2017లో కొన్ని పడవలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇందులో కొందరు మనుషులు కూడా ఉన్నారు.
నవంబర్‌లో ఇలాంటి ఓ బోటును అధికారులు గుర్తించారు. అందులో 8 మంది ఉన్నారు.
తామంతా ఉత్తర కొరియా నుంచి వేటకు వచ్చిన జాలర్లమని, సముద్రంలో తప్పిపోయామని చెప్పారు.
జపాన్ కోస్టు గార్డులు గుర్తించిన మరో పడవలో 10 మంది దాకా ఇలాంటి వారున్నారు.
ఈ బోట్లన్నీ చాలా పాతవి. ధృడంగా లేనివి. వీటిలో అన్నీ పాతకాలం నాటి ఇంజిన్లే.. కనీసం దారి చూపేందుకు నేవిగేషన్ పరికరాలు కూడా అందులో లేవు.

ఫొటో సోర్స్, TBS Japan
ఈ పడవలన్నీ ఎక్కడివి?
తీరానికి కొట్టుకువచ్చిన చాలా పడవల్లో దాదాపు అన్నిట్లోనూ శవాలే కనిపించాయి. వారంతా ఎవరు అనే విషయం మొదట్లో అర్థం కాలేదు.
అయితే.. వీరంతా ఉత్తర కొరియా నుంచి వచ్చిన జాలర్లని, సాండ్ ఫిష్, కింగ్ క్రాబ్, స్క్విడ్ రకం చేపల కోసం గాలిస్తారని కొందరు ఊహించారు.
పడవలపై కొరియా భాషలో కొన్ని అక్షరాలు కనిపించాయి. దీన్ని బట్టి వీరంతా ఉత్తర కొరియా ప్రాంతానికి చెందినవారని అధికారులు గుర్తించారు.. ఆ ప్రాంతంలో చేపల పరిశ్రమలు భారీగా ఉన్నాయి.
ఈ మధ్య.. మనుషులతో పాటు ఒడ్డుకు కొట్టుకువచ్చిన పడవలో వ్యక్తులు తాము ఉత్తర కొరియాకు చెందినవారమని చెప్పారు. నవంబర్‌లో కనిపించిన బోటులో కూడా ఓ బోర్డు దొరికింది. ఆ బోర్డు ఆధారంగా ఈ పడవ ఉత్తర కొరియా మిలిటరీకు చెందినదని గుర్తించారు. దీంతో ఈ పడవలపై అనుమానాలు పెరిగాయి.
మరోవైపు.. తమ పడవలు గల్లంతయ్యాయని కానీ, కనిపించడంలేదని కానీ ఉత్తర కొరియా ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు.

ఫొటో సోర్స్, Reuters
వీరంతా ఎలా చనిపోయారు?
ఈ పడవలు శవాల గుట్టలతో ఒడ్డుకు కొట్టుకువచ్చినపుడు సాధారణంగా పోలీసులు ఆ శవాలను పరీక్షిస్తారు. కానీ ఆ శవాలు చాలా భాగం కుళ్లిపోవడంతో ఈ మరణాలకు కారణాలు కనుక్కోవడం కష్టమయ్యింది.
బోటులో ప్రయాణించేటపుడు వెంటతెచ్చుకున్న ఆహారం తక్కువవడం.. ఆకలి, వణికించే చలి.. ఈ కారణాలతోటే బహుశా వీరందరూ మరణించి ఉండొచ్చు.
పడవలు పాతవి కావడం, బలహీనంగా ఉండడం.. సముద్రంలో చాలా దూరం పోయాక పాడవడం.. ఇలాంటి కారణాలతో కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి.
ఎ.ఎఫ్.పి. వార్తా సంస్థ ప్రకారం 2017లో 40 మంది ఉత్తర కొరియా జాలర్లను కాపాడారు.

ఫొటో సోర్స్, Reuters
వీరు వలసదారులా? లేక గూఢచారులా??
వీరంతా దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నించిన ఉత్తర కొరియా పౌరులని కొందరి అభిప్రాయం.
కానీ.. ప్రాణాలతో బయటపడ్డ వారు మాత్రం తమను తిరిగి ఉత్తర కొరియాకు పంపాలని కోరారు.
జపాన్‌కు పడవలో చేరుకునే దారి చాలా ప్రమాదకరమైనది. వారు దేశం వదిలి పారిపోవాలనుకుంటే దక్షిణ కొరియాకు వెళ్లడం చాలా సులువు.
కొందరు ప్రాణాలతో బయటపడినా.. ఇంకా చాలా బోట్లు తీరానికి కొట్టుకువస్తూనే ఉన్నాయి. ఆ పడవల నిండా మృతదేహాలే!
నవంబర్‌లో జపాన్ కోస్ట్‌గార్డులు ఓ బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు వీరంతా ఆ సముద్ర తీరంలోనే ఓ చోట ఆశ్రయం పొందారు.
అక్కడ పోర్టులో ఆపివున్న ఓ జపాన్ బోటులోకి చొరబడి టీవీ, రైస్ కుక్కర్, ఇతర వంటింటి సామాగ్రిని తమ బోటులోకి తరలించారని స్థానిక మీడియా తెలిపింది. ఈ దొంగతనాలు చేసినట్టు చివరకు ఆ నావికులే ఒప్పుకున్నారని కూడా మీడియా ధృవీకరించింది.

ఫొటో సోర్స్, KRT
జాలర్లు ఇలాంటి సాహసమెందుకు చేస్తారు?
న్యూక్లియర్, క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలు ఆంక్షలను విధించాయి. ఈ ఒత్తిడిలో వ్యవసాయం, ఆహార సరఫరా విషయంపై ఉత్తర కొరియా దృష్టి కేంద్రీకరించడంలేదు.
ఓ జపాన్ పత్రిక ఒక ఊహాత్మక కథనాన్ని ప్రచురించింది. ఉత్తర కొరియా తమ జాలర్లపై ఒత్తిడి పెడుతుండటంతోటే వారు రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళుతున్నారని ఆ కథనంలో తెలిపింది.
గత సంవత్సరం.. తమ పరిధిలోని కొంత భాగం సముద్ర జలాల్లో చేపలు పట్టుకునే హక్కులను ఉత్తర కొరియా చైనాకు అమ్మేసింది.
దీంతో జాలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన సముద్ర జలాల్లోనే వేటాడాల్సి వస్తోంది. తమ అవసరాలు తీరకపోవడంతో ఈ జాలర్లు సముద్రం లోపలకు వెళుతున్నారు.
ఉత్తర కొరియా తమ దేశపు జాలర్లకు లక్ష్యాలను విధిస్తుంది. ఆ లక్ష్యాలకు తగ్గకుండా చేపలను సమకూర్చాలి.
కొందరు జాలర్లు ఆ లక్ష్యాలకు మించి అదనపు నిల్వలను తమ వద్ద ఉంచుకుంటారు. ఈ అదనపు నిల్వలు వీరికి కాస్త ఆర్థిక లాభం చేకూరుస్తాయి.
జీవన స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి ఈ జాలర్లు ఇలాంటి సాహసాలకు పాల్పడుతున్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








