కోపం అంతగా ఎందుకొస్తుంది? దాన్ని అదుపు చేయడం ఎలా?

ఫొటో సోర్స్, Youtube grab
కోపం ఎవరికైనా సరే ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. రావాల్సిందే! ఎందుకంటే అదొక సహజమైన ఆరోగ్యకరమైన భావోద్వేగం. కానీ, సందర్భాన్ని బట్టి దాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
కోపాన్ని ప్రదర్శించడంలోనూ కొందరు ఆనందాన్ని ఆస్వాదిస్తారని పరిశోధకులు చెప్పే మాట. కానీ, అదే పనిగా కోప్పడుతూ ఉండటం మాత్రం చాలా ప్రమాదకరం.
మనుషుల మధ్య దూరాన్ని పెంచడంతోపాటు, పలు రకాల ఆరోగ్య సమస్యలకూ దారి తీస్తుంది.
కోప్పడే వారికి తలనొప్పి వస్తుంది, రక్త పోటు(బ్లడ్ ప్రెషర్) అధికంగా ఉంటుంది, శ్వాస వేగంగా ఆడుతుంది.
సాధారణంగా ప్రశాంతంగా ఉండే వారితో పోల్చితే కోపిష్టుల్లో ఆందోళన, వ్యాకులత ఎక్కువగా ఉంటుంది.
వయసు పెరిగేకొద్దీ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలన్నది కూడా నేర్చుకుంటాం.
ఇప్పుడు కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో చెప్పే కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు అలా అవుతుంది?
ఆధునిక ప్రపంచంలో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులొచ్చాయి. దాంతో రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలే చాలావరకు మనలో కోపానికి కారణమవుతున్నాయి.
కుటుంబ కలహాలు కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఇలా అనేక అంశాలు మనిషిలో కోపాన్ని పెంచేస్తున్నాయి.
పరీక్షల పేరుతో పిల్లలపై ఒత్తిడి తీవ్రమవుతోంది. దాంతో చిన్నప్పటి నుంచే చాలామంది కోపిష్టులుగా మారిపోతున్నారు.
అలా మాటిమాటికీ కోపంతో ఊగిపోవడానికి "మోనోమైన్ ఆక్సిడేస్ ఎ(MAOA)" అనే ఎంజైమ్ కూడా ఓ కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ ఎంజైమ్ ఒక్కో వ్యక్తిలో ఒక్కో మోతాదులో ఉంటుంది. తక్కుత మోతాదు ఉన్నవారు ఎక్కువగా కోప్పడతారన్న అభిప్రాయం ఉంది.
ఇలాంటి లక్షణాలు క్రీడాకారుల్లో, మిలటరీ సిబ్బందిలో అధికంగా కనిపిస్తాయని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ యాంగర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ మైక్ ఫిషర్ వివరించారు.

ఫొటో సోర్స్, Science Photo Library
కోపం అదుపు చేసేందుకు ఏం చేయాలి?
ప్రథమంగా చేయాల్సిన పని, మనకు కోపం దేనివల్ల వస్తోంది? అన్నది గుర్తించడం. తర్వాత దాని గురించి సన్నిహితులతో చర్చించడం మంచిది.
స్నేహితులు, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యుడు, స్కూలు టీచర్.. ఇలా ఎవరితోనైనా సరే ఆ విషయాన్ని పంచుకోవాలి. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి. దాంతో తమను కోపోద్రిక్తులను చేస్తున్న పరిస్థితులను ఎలా అధిగమించాలో ఓ అవగాహన వస్తుంది. అలా సులువుగా కోపాన్ని అదుపులో పెట్టేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Thinkstock
ఇవిగో చిట్కాలు..
కోపాన్ని అదుపు చేసేందుకు చాలా మార్గాలు ఉన్నాయి.
- మనసును శాంతింపజేసేందుకు దీర్ఘ శ్వాస తీసుకుంటూ 10 వరకు అంకెలను లెక్కపెట్టాలి.
- కాసేపు ప్రశాంతంగా నడవాలి.
- బాగా ఇష్టమైన ప్రశాంతమైన సంగీతం వినాలి. దాంతో మెదడుపై ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
- ఆల్కహాల్, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు తీసుకోవడం ఆపేయాలి.
- కంటి నిండా నిద్రపోతున్నారా లేదో చూసుకోవాలి.
- మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయండి.
- సాధ్యమైతే నృత్యం చేయాలి, గంతులు వేయండి, నచ్చిన పాటకు స్టెప్పులేయండి.
- పుస్తక పఠనం, చిత్రలేఖనంతోనూ మనసును ప్రశాంతపరచుకోవచ్చు.
- యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి.
- ఎవరూ లేని గదిలో లేదా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతంలో గట్టిగా అరవాలి. కేకలు వేయాలి.
- బెడ్ మీద దిండును పిడికిలితో కొట్టాలి.
- ఇంకా మరింత సాయం కావాలనుకుంటే వైద్యున్ని సంప్రదించండి. కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో చెప్పే 'యాంగర్ మేనేజ్‌మెంట్ కోర్సులు', కౌన్సెలింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








