కోహ్లీకి కోపం ఎందుకు వచ్చింది?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, భరత్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జనవరి 5కు ముందు ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో భారత్‌కు 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందని ప్రకటనలు ప్రసారమయ్యాయి. మళ్లీ మళ్లీ సిరీస్ కోల్పోయిన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశమిది. బహుశా ఎన్నడూ రాదేమో. అయితే దక్షిణాఫ్రికాతో జనవరి 5న ప్రారంభమైన టెస్ట్ సిరీస్‌లో బుధవారం రెండో టెస్టు ముగిసేసరికి ఆ ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత్ కోల్పోయిందని తెలిసిపోయింది.
ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో దక్షిణాఫ్రికాకు సిరీస్ కోల్పోయింది.
సిరీస్ ప్రారంభానికి ముందు భారత్ వైపు ప్రత్యర్థి జట్టుకు చెందిన 20 వికెట్లనూ తీసే బౌలర్లు ఉన్నారని, అందువల్ల మనకే విజయావకాశాలు ఉన్నాయని అన్నారు.
మొదట అనుకున్న దానిలో సగం నిజమైంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బౌలర్లు చక్కగా రాణించారు.
భారత్‌ను తిరిగి పోటీలోకి తీసుకురావడమే కాకుండా మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశారు. అయితే తమపై పెట్టుకున్న నమ్మకాన్ని బ్యాట్స్‌మెన్ వమ్ముచేశారు.
ఇది కెప్టెన్ కోహ్లీకి చాలా పెద్ద దెబ్బ. సెంచూరియన్ టెస్ట్‌లో ఓడిపోయిన తర్వాత కోహ్లీ, "మరోసారి బౌలర్లు తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు కానీ బ్యాట్స్‌మెన్ మాత్రం చాలా నిరాశపరిచారు. అందుకే ఓడిపోవాల్సి వచ్చింది" అన్నాడు.
ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ను పక్కన పెట్టడంపై, మొదటి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ శర్మకు మరో అవకాశం ఇవ్వడంపై కోహ్లీ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
కోహ్లీకి ఎందుకు కోపం వచ్చింది?
మ్యాచ్ ఓడిపోయాక ఈ రెండు ప్రశ్నలు తన ముందుకు వచ్చినపుడు కోహ్లీ తన కోపాన్ని అణచుకోలేకపోయాడు. టెస్ట్ మ్యాచ్ టీమ్‌లో స్థిరత్వం ఉండాలి. కానీ ఇప్పటి వరకు కోహ్లీ తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లోను టీమ్‌లో మార్పులు చేశాడు.
దీనిపై ప్రశ్నించినపుడు కోహ్లీ కోపంగా, "మేం 30 మ్యాచ్‌లలో 21 మ్యాచ్‌లలో గెలిచాం. రెండే మ్యాచ్‌లు ఓడిపోయాం" అన్నాడు.
అయితే వాటిలో భారత్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడారని విలేకరులు ప్రశ్నించగా, "ఎక్కడ ఆడినా తేడా ఉండదు. మేం ప్రతిసారీ గెలవాలనే ఆడతాం. నేను ఇక్కడికి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వచ్చా, కొట్లాడేందుకు కాదు" అని సమాధానం ఇచ్చాడు.
ప్రతి మ్యాచ్‌ను గెలవాలనుకునే ఆటగాడిగా కోహ్లీ కోపాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకోసం అతను తన వైపు నుంచి సర్వశక్తులూ ఒడ్డుతాడు. అది అతని బ్యాటింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీలో ప్రతిఫలిస్తుంది.
సెంచూరియన్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఒక్కడే 153 పరుగులు చేస్తే, మిగతా బ్యాట్స్‌మెన్ అంతా కలిసి 142 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేశాడు. భారత్ 135 పరుగుల తేడాతో ఓడిపోయింది.
కోహ్లీకి విలేకరుల ప్రశ్నలతో కోపం వచ్చి ఉండవచ్చు కానీ అతను వాటిని నిర్లక్ష్యం చేయలేడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని గణాంకాలు కూడా నిరూపిస్తున్నాయి.
గత ఎనిమిదేళ్ల గణాంకాలను చూస్తే.. భారత్ 2010-11లో దక్షిణాఫ్రికాలో పర్యటించినపుడు 1-1 తో సిరీస్‌ను డ్రా చేయగలిగింది. 2013-14లో 1-0 తేడాతో సిరీస్ ఓడిపోయింది.
ఇతర దేశాల విషయానికి వస్తే, 2011లో ఇంగ్లండ్ చేతిలో4-0 తేడాతో, 2011-12లో ఆస్ట్రేలియా చేతిలో 4-0 తేడాతో, 2013-14లో 1-0 తేడాతో న్యూజీలాండ్ చేతిలో, 2014లో 3-1తో ఇంగ్లండ్ చేతిలో, 2014-15లో ఆస్ట్రేలియా చేతిలో 2-0 తేడాతో ఓటమి పాలైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా బయట చెత్త రికార్డు
2015 నుంచి భారత టీమ్ శ్రీలంకతో ప్రారంభించి వరుసగా తొమ్మిది సిరీస్‌లలో గెలిచింది. కానీ సెంచూరియన్‌లో పరిస్థితి మారింది. ఆసియా బయట భారత ఓటమి పరంపర కొనసాగుతోంది. వెస్టిండీస్‌ను పక్కనపెడితే, భారత్.. ఆసియా బయట ఎనిమిది సిరీస్‌లు ఆడితే, వాటిలో ఒక్కటీ గెలవలేదు.
ఈ సిరీస్ గురించి మాట్లాడితే, సెంచూరియన్‌లో కోహ్లీ 153 పరుగులు మినహా, ఏ ఒక్క స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. టాప్ ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ల సగటు 20.45 పరుగులు. దీనిలో నుంచి కోహ్లీ 153 పరుగులను తీసేస్తే అది 14.08 పరుగులకు పడిపోతుంది.
గతంలో భారత టాప్ బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ దక్షిణాఫ్రికాలో ఇంతగా విఫలం కాలేదు.
1992-93లో ఈ సగటు 24.42 అయితే, 2013-14లో 44.78.

ఫొటో సోర్స్, Getty Images
రహానే రికార్డు ఏం చెబుతోంది?
కోహ్లీ టీమ్ సెలెక్షన్‌పై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు మ్యాచ్‌లలో కూడా అజింక్య రహానేను తీసుకోవడానికి బదులు రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చారు. స్వదేశంలో రోహిత్ వన్డే గణాంకాలు చాలా బాగానే ఉండొచ్చు కానీ, బయట మాత్రం అంతంతే.
రోహిత్ విదేశాల్లో 16 టెస్టులు ఆడితే వాటిలో అతని సగటు 25.35. అదే స్వదేశంలో ఆడిన 9 టెస్టుల్లో అతని సగటు 85.44. మరోవైపు రెండు మ్యాచ్‌లలోను అవకాశం లభించని రహానే స్వదేశాలలో 19 టెస్టులు ఆడితే వాటిలో అతని సగటు 33.63. అదే విదేశాలలో అతని సగటు 53.44. అతను స్వదేశంలో 3 టెస్టు సెంచరీలు చేస్తే, విదేశాల్లో 6 సెంచరీలు చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
నిర్లక్ష్యం కూడా ఓటమికి కారణమా?
సునీల్ గవాస్కర్ కూడా భువనేశ్వర్‌ను బయట కూర్చోబెట్టడం, రహానేకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు.
కానీ కోహ్లీ కోపాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అతను చెప్పినట్లు ప్రతి కెప్టెన్ మైదానంలోకి తన అత్యుత్తమమైన ఆటగాళ్లనే తీసుకువెళ్లాలనుకుంటాడు. అయితే మ్యాచ్ ముగిశాక 'బెస్ట్ టీమ్'పై ప్రశ్నలు లేవనెత్తడం ఇబ్బందిగానే ఉంటుంది.
సిరీస్ ఓటమికి అతని సహచరులకూ భాగస్వామ్యం ఉంది. ద్రవిడ్‌కు వారసుడిగా భావించే ఛతేశ్వర్ పుజారా సెంచూరియన్ మ్యాచ్‌లో రెండు సార్లూ రనౌట్ కావడం, నేలపై కాలు కానీ, బ్యాటు కానీ మోపకుండా హార్ధిక్ పాండ్యా అవుటైన విధానం చూస్తే, కెప్టెన్ నిర్ణయాలతో పాటు ఆటగాళ్లు కూడా తమ ఆటతీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








