మహిళల క్రికెట్: డబుల్ సెంచరీతో కొత్త రికార్డు సృష్టించిన ఎలిస్ పేరీ

ఫొటో సోర్స్, Twitter
యాషెస్ సిరీస్... ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగే పోరు అంటేనే రసవత్తరంగా ఉంటుంది. మహిళలైనా, పురుషులైనా.. ఈ రెండు చిరకాల ప్రత్యర్థి జట్ల మధ్య ఆట నువ్వా, నేనా అన్నట్టుగానే సాగుతుంది.
శనివారంనాడు సిడ్నీలోని ఓవల్ స్టేడియంలో మహిళల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా జట్టు క్రీడాకారిణి ఎలిస్ పేరీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నారు. అప్పుడు ఆమె వ్యక్తిగత స్కోరు 193. మరో ఏడు పరుగులు చేస్తే రికార్డు సృష్టించొచ్చు. ఇంకా రెండే వికెట్లు మిగిలి ఉన్నాయి.
ఇంతలో తొమ్మిదో వికెట్ పడిపోయింది. జట్టు మొత్తం షాక్‌కి గురయ్యింది. ఈ మ్యాచ్‌లోనే ఎలిస్ పేరీ అప్పటికే తన తొలి శతకాన్ని పూర్తి చేశారు. ఆమె డబుల్ సెంచరీ చేయగలరా, లేదా అని స్టేడియంలో అందరూ ఆలోచనలో పడ్డారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఆ తర్వాత ఓవర్‌లో ఎలిస్ పేరీ ఒక్క పరుగు మాత్రమే సాధించారు. ఆమె స్కోరు 194కి చేరింది. ఒక సిక్స్ కొడితే ఆమె డబుల్ సెంచరీని చేరుకుంటారు. స్టేడియం అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అప్పుడే ఎలిస్ పేరీ ఓ భారీ షాట్ కొట్టారు. రెప్పపాటులోనే బంతి స్టేడియం వైపు వెళ్ళింది.
స్టేడియం అంతా ఉత్సాహం! ఎలిస్ పేరీ కూడా డబుల్ సెంచరీ చేశాననే సంతోషంలో మునిగిపోయారు. కానీ అంతలోనే అంపైర్ అది ఫోర్ అని అన్నారు. ఆ తర్వాత ఎలిస్ పేరీ మరో పరుగు చేశారు. స్కోరు 199కి చేరింది.

ఫొటో సోర్స్, Twitter
ఆ తర్వాతి ఓవర్‌లో ఎలిస్ పేరీ స్ట్రైకింగ్‌లో ఉన్నారు. ఓ వైపు డబుల్ సెంచరీ చేయాలి, మరోవైపు వికెట్ కూడా కాపాడుకోవాలి. ఎలిస్ పేరీ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు.
మొదటి రెండు బంతుల్లో ఆమె ఒక్క పరుగు కూడా చేయలేదు. కానీ మూడో బంతిని భారీ షాట్‌తో ఫోర్ కొట్టి డబుల్ సెంచరీ మార్క్ దాటేశారు. స్టేడియం అంతా హోరెత్తిపోయింది. మహిళా క్రికెట్ చరిత్రలో మూడో టాప్ స్కోరర్‌గా నిలిచారు.
అదే ఓవర్‌లో ఎలిస్ పేరీ ఒక సిక్స్, ఫోర్ కొట్టారు. దీంతో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లకు 448 పరుగుల స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
27 ఏళ్ల ఎలిస్ పేరీకి అది తన కెరీర్‌లో 7వ టెస్ట్ మ్యాచ్. ఆమె మొత్తం 374 బంతుల్లో 27 ఫోర్లు, ఒక సిక్స్‌తో 213 పరుగులు చేశారు.

ఫొటో సోర్స్, Twitter
ఆల్‌రౌండర్‌గా తనదైన మార్కు!
అంతకు ముందు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎలిస్ పేరీ తన 21 ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 280 పరుగులు చేసింది.
మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన ఎలిస్ పేరీ మొత్తం తన టెస్ట్ కెరీర్లో 27 వికెట్లు తీశారు. 94 వన్డేల్లో మొత్తం 126 తీశారు. టీ20 మ్యాచుల్లో కూడా ఆమె పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. మొత్తం 82 మ్యాచుల్లో 77 వికెట్లు పడగొట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా!
ఎలిస్ పేరీ ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఫుట్‌బాల్ జట్టులో కూడా ఆడారు. 2011లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో కూడా ఆడారు. కానీ ఇప్పుడు ఎలిస్ పేరీ ఫుట్‌బాల్ ఆడటం లేదు.

ఫొటో సోర్స్, Twitter
16ఏళ్లకే జట్టులోకి..
ఎలిస్ పేరీ 16 ఏళ్లకే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. అంత తక్కువ వయసులో ఆస్ట్రేలియా టీంలో చోటు సంపాదించుకున్న రికార్డు కూడా ఆమె పేరు మీదే ఉంది.
ఆమె మూడుసార్లు టీ20 ప్రపంచకప్ జట్టులో ఆడారు. 2015లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆమె 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్నారు. ఆ సిరీస్‌లో 264 పరుగులు చేసి 16 వికెట్లు పడగొట్టారు.
మొదటి డబుల్ సెంచరీ సాధించిన తర్వాత "డబుల్ సెంచరీకి ముందు నేను సిక్స్ కొట్టానని అనుకున్నా, కానీ అది ఫోర్ అని తేలింది. అప్పుడు కాస్త నిరుత్సాహపడ్డా" అని ఎలిస్ పేరీ తెలిపారు.
"నేడు డబుల్ సెంచరీ చేశాక, ఒక మహిళా క్రికెటర్‌గా ఇదో గొప్ప విజయమని భావిస్తున్నా" అని ఎలిస్ పేరీ ఆనందం వ్యక్తం చేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








