ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు: కొనుగోలుదారుల చెవుల్లో రివ్యూ పూలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాన్ బాక్స్, సచిన్ క్రోకర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఈ రోజుల్లో వినియోగదారులు ఏవైనా ఉత్పత్తులను ఆర్డర్ చేసే ముందు ఆన్‌లైన్‌లో వాటి రివ్యూలను చూడడం సర్వసాధారణంగా మారింది. సరిగ్గా దీనినే పెట్టుబడిగా మార్చుకున్న కొందరు ఇంటర్నెట్‌లో నకిలీ ఆన్‌లైన్ రివ్యూ రేటింగ్‌లను విక్రయిస్తున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.
ఒక ప్రసిద్ధ వెబ్‌సైట్ 'ట్రస్ట్‌పైలెట్' ద్వారా బీబీసీ ప్రతినిధులు ఇలాంటి నకిలీ ఫైవ్ స్టార్ రేటింగ్‌లను కొనుగోలు చేయగలిగారు.
కొన్ని ఆన్‌లైన్ ఫోరమ్‌లు అమెజాన్ ఉత్పత్తులను రివ్యూ చేస్తే వారికి పూర్తి రిఫండ్ ఇస్తామని కూడా ప్రలోభపెడుతున్నట్లు బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ రివ్యూ సైట్ల ప్రాధాన్యత పెరుగుతోంది. వాణిజ్య సంస్థలు, వినియోగదారులు కూడా ఇటీవల రివ్యూలను ఎక్కువగా నమ్ముకుంటున్నారు. బ్రిటన్‌లో ఈ రివ్యూలు దాదాపు రూ. 2.3 లక్షల కోట్ల అమ్మకాలను ప్రభావితం చేస్తాయని ఒక అంచనా.
సంప్రదాయ ప్రకటన స్థానాన్ని ఆన్‌లైన్ రివ్యూలు ఆక్రమించేశాయని బ్లాక్‌పూల్‌లో యార్క్‌షైర్ ఫిషరీస్ చిప్ షాప్ యజమాని మరియా మెనెలావ్ చెప్పారు.
''రివ్యూల వల్ల చాలా మంది కొత్త కస్టమర్లు వస్తారు. నిజంగా దీనివల్ల చాలా లాభముంది. రివ్యూల కారణంగా మేం ఎలాంటి ప్రకటనలూ ఇవ్వకుండానే వ్యాపారం జరుగుతోంది'' అని ఆమె తెలిపారు.
చార్టెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మార్కెటింగ్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. ఆన్‌లైన్ రివ్యూ వెబ్‌సైట్లను చూసేవారిలో సగం మంది అవి నకిలీ రివ్యూలనే భావిస్తున్నారు.
రివ్యూ సైట్ల వల్ల చాలా లాభాలు ఉండడంతో వీటి సంఖ్య పెరిగిపోతోందని అమెరికాలో ఆన్‌లైన్ రివ్యూలను సమీక్షించే 'రివ్యూమెటా' వెబ్‌సైట్ నిర్వాహకుడు టామీ నూనన్ పేర్కొన్నారు.
''నాణ్యత లేని బ్లూటూత్ హెడ్‌సెట్‌కు మంచి రివ్యూ ఇస్తే.. దాని వల్ల చాలా సంపాదించుకోవచ్చు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

రివ్యూలతో రిఫండ్‌లు
ఇటీవల అమెజాన్ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిపై మంచి రివ్యూలు రాసిన వారికి పూర్తి రిఫండ్ ఇస్తామంటూ ప్రోత్సహించే కొన్ని ఫేస్‌బుక్ గ్రూపులు ఏర్పడ్డాయి.
బీబీసీ పరిశోధనలో అలాంటి పలు ఫేస్‌బుక్ గ్రూపులు వెలుగులోకి వచ్చాయి. కొత్త వాళ్లు వాటిలో చేరిన వెంటనే అమెజాన్ ఉత్పత్తులపై పాజిటివ్ రివ్యూలు రాస్తే పూర్తి రిఫండ్ చేస్తామంటూ వారికి ఆఫర్లు వెల్లువెత్తాయి.
ఈ ఆఫర్లు చేసే వారిని వ్యక్తిగతంగా కలవడానికి బీబీసీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
అయితే తాము ఇలా రిఫండ్ చేసే రివ్యూలను ప్రోత్సహించబోమని అమెజాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు కానీ, అమ్మకందార్లు కానీ రివ్యూ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. లేని పక్షంలో అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇలా ఆన్‌లైన్ రివ్యూలను విక్రయిస్తున్న 'ట్రస్ట్‌పైలెట్' వెబ్‌సైట్ - తమను తాము అత్యంత విశ్వసనీయమైన ఆన్‌లైన్ రివ్యూ సంస్థగా ప్రకటించుకుంటోంది.
ఈ వెబ్‌సైట్‌లో ఎవరైనా రివ్యూలను పోస్టు చేయవచ్చు. అయితే తమ వెబ్‌సైట్‌ను దుర్వినియోగం చేసేవారిని ఉపేక్షించబోమని ఆ సైట్ పేర్కొంటోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








