అర్ధరాత్రి మెలకువ వచ్చి, కళ్లు తెరిచి చూస్తే ఆమె ఒంటిపై భారీ కొండచిలువ.. తర్వాత ఏమైందంటే..

 రాచెల్ బ్లూర్, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Rachel Bloor

    • రచయిత, టిఫానీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన రాచెల్ బ్లూర్ సోమవారం అర్ధరాత్రి తన ఛాతీపై ఏదో బరువు ఉన్నట్టుగా అనిపించడంతో మేల్కొన్నారు.

సగం నిద్రలో ఉన్న ఆమె చీకట్లో తన కుక్క కోసం చేత్తో వెతుకుతుంటే మెత్తగా, పాకుతున్నదేదో తగిలింది.

దుప్పటిలోకి దూరి, తన మెడ వరకూ వస్తుండగా.. బెడ్ లైట్ ఆన్ చేసిన తన భర్త, "ఓహ్.. బేబీ.. కదలకు.. నీ మీద పేద్ద కొండచిలువ ఉంది" అని అన్నారని రాచెల్ బీబీసీతో చెప్పారు.

దీంతో, ఆమె నోటివెంట మొదట తిట్లు వచ్చాయి. తర్వాత, కుక్కలను గదిలో నుంచి బయటకు తీసుకువెళ్లమని ఆమె తన భర్తతో చెప్పారు.

"నా డాల్మేషియన్ పామును చూస్తే, అక్కడ బీభత్సం జరుగుతుందని అనుకున్నా" అని రాచెల్ అన్నారు.

కుక్కలను భర్త బయటకు తీసుకెళ్లిన తర్వాత, ఆమె జాగ్రత్తగా కదలడానికి ప్రయత్నించారు.

"నేను దుప్పటి కింద నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. 'ఇది నిజంగా జరుగుతుందా?' అనుకున్నా" అని రాచెల్ గుర్తుచేసుకున్నారు.

విషం లేని ఈ కార్పెట్ పైథాన్(కొండచిలువ) కిటికీ ద్వారా లోపలికి వచ్చి, మంచం మీదకు చేరినట్లు ఆమె భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'చాలా పెద్దది'

కొండచిలువ నుంచి రాచెల్ తప్పించుకున్న తర్వాత, ప్రశాంతంగా అదే కిటికీ గుండా దానిని తిరిగి వెళ్లేలా చేశారు.

"అది చాలా పెద్దది, అది నన్ను చుట్టుకుని ఉన్నప్పటికీ, దాని తోకలో కొంతభాగం ఇంకా కిటికీ బయటే ఉంది" అని ఆమె చెప్పారు.

"నేను దాన్ని పట్టుకున్నాను, అది పెద్దగా భయపడినట్లు అనిపించలేదు. నా చేతుల్లో కొద్దిగా కదిలింది" అన్నారు.

రాచెల్ భర్త నిశ్చేష్టుడై చూస్తుండగా, ఆమె మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే, తరచూ పాములు కనిపించే పొలాల మధ్యే ఆమె పెరిగారు.

"మనం ప్రశాంతంగా ఉంటే, అవి కూడా ప్రశాంతంగా ఉంటాయని భావిస్తా" అని అన్నారు రాచెల్.

కొండచిలువ, రాచెల్, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Rachel Bloor

ఫొటో క్యాప్షన్, కొండచిలువ తోకలో కొంత భాగం కిటికీ బయటే ఉంది.

అదే చెరకు తోటల్లో కనిపించే కప్ప(కేన్ టోడ్ - ఆస్ట్రేలియాలో అత్యంత హానికరమైన, అసహ్యకరమైన కీలకం) అయితే పరిస్థితి మరోలా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

"వాటిని అస్సలు భరించలేను. వాటిని చూస్తేనే నాకు వాంతులొస్తాయి. కేన్ టోడ్ అయితే భయపడేదాన్ని" అని రాచెల్ అన్నారు.

ఈ ఘటనలో మనుషులకు కానీ, జంతువులకు కానీ ఎలాంటి హాని కలగలేదు.

కార్పెట్ పైథాన్‌లు విషరహిత జీవులు. అవి తీరప్రాంత ఆస్ట్రేలియాలో సర్వసాధారణం, సాధారణంగా పక్షుల వంటి చిన్న జంతువులను తింటాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)