భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన 4 విష సర్పాలు.. వీటిని ఎలా గుర్తించాలి?

ఫొటో సోర్స్, SAMSON KIRUBAKARAN
- రచయిత, కె. శుభగుణం
- హోదా, బీబీసీ తమిళ్
పాము కాటు ఘటనలు ఎక్కువగా నమోదయ్యే దేశాలలో భారత్ ఒకటి. పాము కాటు కారణంగా ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
‘తమిళనాడులో పాము కాటు ఘటనల్లో దాదాపు 95 శాతం విషం లేని పాముల వల్లే జరుగుతున్నాయి. మిగిలిన 5 శాతం ఘటనల్లో ఎక్కువగా రక్త పింజర (రసెల్స్ వైపర్), నాగుపాము (ఇండియన్ కోబ్రా), చిన్న పింజర(సా స్కేల్డ్ వైపర్), కట్ల పాము (కామన్ క్రైట్) అనే ఈ నాలుగు రకాల విషపూరిత పాములే కారణం అని యూనివర్సల్ స్నేక్‌బైట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.ఎస్. మనోజ్ చెప్పారు.
"విషపూరితమైన, విషం లేని పాముల మధ్య తేడాను గుర్తించలేకపోవడం వల్ల, చాలా సందర్భాల్లో ప్రజలు కాటుకు గురైన తరువాత నిర్లక్ష్యం వహిస్తుంటారు. అప్పుడది ప్రాణాంతకంగా మారొచ్చు" అని గత తొమ్మిదేళ్లుగా పాముల పరిరక్షణ, వాటిపై పరిశోధనలో పాలుపంచుకుంటున్న మధురైకి చెందిన శాంసన్ కృపాకరన్ చెప్పారు.
విషపూరిత పాములను సరిగా గుర్తించగలిగితే పాము–మనిషి ఎదురెదురుపడే సందర్భాల్లో జరిగే ప్రమాదకర ఘటనలను చాలావరకు నివారించవచ్చన్నది నిపుణుల అభిప్రాయం.
కాబట్టి, భారతదేశంలో అత్యధిక మరణాలకు కారణమయ్యే ‘బిగ్ 4 స్నేక్స్’గా పిలిచే అత్యంత ప్రమాదకరమైన నాలుగు విషపూరిత పాములను చూసిన వెంటనే సులభంగా గుర్తించేందుకు సహాయపడే వాటి శరీర నిర్మాణంలోని ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, SAMSON KIRUBAKARAN
నాగుపామును ఎలా గుర్తించాలి?
నాగుపాము పడగ విప్పుతుంది. నాగుపాము పడగ విప్పినప్పుడు పడగ లోపల వైపు రెండు పెద్ద నల్లని మచ్చలు కనిపిస్తాయి. పైభాగంలో కూడా అలాంటి నల్ల మచ్చలతో పాటు, లేత రంగులో 'V' ఆకారంలో ఒక గుర్తు ఉంటుంది" అని శాంసన్ వివరించారు.
"నాగుపాము కళ్లు పూర్తిగా నల్లగా ఉంటాయి. ఆ కళ్ల కింద నల్లటి రంగులో,ఐ లాష్ కరిగినట్లుగా కనిపించే పలుచని గీత ఉంటుంది" అని డాక్టర్ మనోజ్ తెలిపారు.
అయితే, విషం లేని కొన్ని ఇతర పాముల కళ్లు కూడా నల్లగా ఉంటాయని చెప్పారు.

ఫొటో సోర్స్, SAMSON KIRUBAKARAN
"లీఫ్ స్నేక్ అని పిలిచే విషం లేని జాతి పాము కూడా కోబ్రాలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే దాని తలపై కూడా v ఆకారంలో గుర్తు ఉంటుంది. అయితే, దాని శరీరం కోబ్రా కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది" అని శాంసన్ చెప్పారు.
దాని శరీరం బాగా సన్నగా, పొడవుగా ఉంటుందని చెప్పారు.

ఫొటో సోర్స్, SAMSON KIRUBAKARAN
కట్ల పాము ఎలా గుర్తించాలి?
కట్ల పాము గురించి డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ, ఇతర పాములకు సాధారణంగా నల్లటి నాలుకలు ఉంటాయి, కానీ వీటికి గులాబీ రంగు నాలుకలు ఉంటాయని చెప్పారు.
ఇతర పాముల మాదిరిగా కాకుండా, దీనికి కొంచెం ప్రత్యేకమైన రూపం ఉందని శాంసన్ చెప్పారు. "కట్ల పాము శరీరం మొత్తం నల్లగా, మెరుస్తూ ఉంటుంది, ఈ మెరుపు ఆధారంగా వాటిని గుర్తించచొచ్చు" అని డాక్టర్ మనోజ్ చెప్పారు.
"వీటి శరీరంపై '=' లాగా సన్నని, సమాంతర గోధుమ రంగు రేఖలు ఉంటాయి. అది కూడా తల నుంచి మెడ వరకు కాకుండా, మెడ నుండి తోక వరకు ఉంటాయని" అని ఆయన తెలిపారు.
పాము కుబుసం విడిచే దశలో ఉంటే కొన్నిసార్లు ఈ రేఖలు స్పష్టంగా కనిపించవని శాంసన్ అన్నారు. అలాంటప్పుడు "ముదురు నలుపు రంగు చూసి వాటిని గుర్తించవచ్చు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, SAMSON KIRUBAKARAN
అయితే, సిల్వర్ బ్యాక్ స్నేక్ కూడా చూడ్డానికి కట్ల పాములా అనిపిస్తుంది.. కొందరు వాటిని చూసినప్పుడు కట్లపాము అని పొరపాటు పడుతుంటారని.. సిల్వర్ బ్యాక్ పాముకు విషం ఉండదని శాంసన్ చెప్పారు.
‘కట్ల పాముకు భిన్నంగా ఈ విషం లేని పాముల గీతలు తల నుంచి మొదలవుతాయి’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, SAMSON KIRUBAKARAN
రసెల్స్ వైపర్‌ను గుర్తించడం ఎలా?
సాధారణంగా వైపర్ రకం పాములు ను పరిశీలిస్తే వాటి తల త్రిభుజాకారంలో ఉంటుంది, వాటి మెడ పొట్టిగా, సన్నగా ఉంటుందని డాక్టర్ మనోజ్ చెప్పారు.
"గ్లాస్ వైపర్ తల త్రిభుజాకారంలో ఉంటుంది. దాని శరీరం అంతటా బాదం ఆకారంలో, పొడవాటి వృత్తాలుంటాయి. పైభాగంలో నల్లటి అంచులు ఉంటాయి, గొలుసులా విస్తరించి ఉంటుంది" అని ఆయన వివరించారు.
ఈ దీర్ఘవృత్తాల శ్రేణి తల నుంచి తోలు వరకు సమంగా ఉంటుందని, పక్కకి ఉండే ఇలాంటి దీర్ఘవృత్తాకారాలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయని శాంసన్ కృపాకరన్ వివరించారు.

అయితే, కొన్ని రసెల్ వైపర్లు ఇలాంటి మచ్చలు లేకుండా పూర్తిగా గోధుమ రంగులో ఉంటాయని.. అలాంటివి చాలా అరుదని డాక్టర్ ఎన్.ఎస్. మనోజ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, SAMSON KIRUBAKARAN
సా స్కేల్డ్ వైపర్‌ను ఎలా గుర్తించాలి?
ఈ రకం పాము పొడి ప్రాంతాల్లో నివసిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఈ పాముకాట్లు సంభవిస్తాయి.
"దీని తల నుంచి తోక వరకు రంపంలాంటి అంచుల్లా రెండు వైపులా వంచినట్టుగా కనిపిస్తుంది" అని మనోజ్ అన్నారు.
దాని వీపు పైభాగంలో చూస్తే, 'X' ఆకారంలో ఉన్న రేఖలు కనిపిస్తాయి అని శాంసన్ అన్నారు.
"దీని తలపై '+' (ప్లస్) గుర్తును పోలిన ఆకారం ఉంటుంది. దీని కళ్లు పిల్లి కళ్లలా ఓవల్ ఆకారంలో ఉంటాయి. సన్నని రేఖలాంటి ఐరిస్ ఉంటుంది" అని ఆయన వివరించారు.

"సాధారణంగా పాములు నేరుగా ముందుకు పాకుతాయి. కానీ, సా స్కేల్డ్ వైపర్ మాత్రం పక్కకు పాకుతుంది. అంటే, నేరుగా పాకడానికి బదులుగా, అవి తమ శరీరాలను వంచి పక్కకు కదులుతాయి" అని మనోజ్ వివరించారు.
తమిళనాడులో పక్కకు పాకుతూ కనిపించే ఏకైక పాము సా స్కేల్డ్ వైపర్ అని, చాలా నెమ్మదిగా కదులుతున్నప్పుడు మాత్రమే అది ముందువైపుకు పాకుతుందని కదులుతుందని ఆయన వివరించారు.
ఇవి ఎక్కువ పొడవు పెరగవని.. శరీరం లావుగా ఉంటుందని శాంసన్ చెప్పారు.

ఫొటో సోర్స్, SAMSON KIRUBAKARAN
కాటు గాయాన్ని చూసి ఏ పాముదో గుర్తించవచ్చా?
పాము కాటు గాయంలో కొంత పరిమాణం ఆధారంగా అది విషపూరిత పాముకి చెందిన కాటు అయి ఉండవచ్చు అని అంచనా వేయడం సాధ్యమని, కానీ 100 శాతం కచ్చితంగా చెప్పలేమని డాక్టర్ మనోజ్ అంటున్నారు.
అన్ని విషపూరిత పాములు కాటు వేసినప్పుడు రెండు కోరల గుర్తులను ఉంటాయనుకోలేం అని ఆయన అంటున్నారు.
అందువల్ల, "ఒక కోర విరిగిన సమయంలో, దానికి దగ్గరగా మూడవ కొత్తగా కోర పెరుగుతూ ఉండవచ్చు. కాబట్టి రెండు కోరల ముద్రలకు బదులుగా, మూడు కోరల ముద్రలు ఉండవచ్చు" అని మనోజ్ అన్నారు.
పాముల కోరలు విరిగిపోయినప్పటకీ, వాటి జీవితాకాలంపాటు అవి తిరిగి పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల, అవి కాటు వేసినప్పుడు రెండు, మూడు లేదా నాలుగు కోరల గుర్తులు కూడా ఉండవచ్చు. లేకపోతే, ఒకే కోరతో కాటేసి ఉండవచ్చు. కొన్నిసార్లు ఒక గీత మాత్రమే కనిపిస్తుంది. కానీ విషం శరీరంలోకి ప్రవేశించడానికి అది సరిపోతుంది" అని ఆయన వివరించారు.
‘వైపర్లు కాటు వేసినప్పుడు, కాటు వేసిన ప్రదేశంలో వాపు, రక్తస్రావం వంటి బాహ్య సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటి ఆధారంగా.. విషపూరిత పాము కాటు వేసిందని నిర్ధరించవచ్చు" అని మనోజ్ వివరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














