‘ప్రతి 10 అడుగులకో పాము’: ప్రపంచంలో అత్యధిక పాము జాతులు ఉన్న టాప్ 5 దేశాలు ఏవో తెలుసా?

పాములు, మెక్సికో, ఇండియా, కాంబోడియా, బ్రెజిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండోనేషియాలోని అడవులు, పర్వత ప్రాంతాల్లో ప్రమాదకరమైన పాములు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ తెలుగు

పామును చూస్తే చాలామంది భయపడతారు. దానికోరల్లోని విషం, వేగంగా దాడిచేసే తత్త్వం, స్...స్... అంటూ బుస కొట్టడం లాంటివన్నీ ఈ భయానికి కారణాలు. అయితే పాములన్నీ విషపూరితం కాదు. కేవలం కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవి.

జీవ వైవిధ్య పరిరక్షణలో పాముల పాత్ర క్రియాశీలకంగా ఉంది.

కాళ్లు లేకున్నా పాములు చాలా వేగంగా కదులుతాయి. నల్లతాచు గంటకు 19 కి.మీ వేగంతో, పక్కకు పాకుకుంటూ వెళ్లే ర్యాటిల్ స్నేక్ గంటకు 29 కి. మీ వేగంతో ప్రయాణించగలవు.

పాములు ఆహారాన్ని నమలలేవు. వేటాడిన జీవిని మింగేస్తాయి. తర్వాత తీరిగ్గా జీర్ణం చేసుకుంటాయి. పాముల్లో కొన్ని రకాలు మొసలి లాంటి భారీ జంతువును కూడా మింగేసి, జీర్ణం చేసుకోగలవు. ప్రపంచవ్యాప్తంగా పాముల్లో 4వేలకు పైగా రకాలు ఉన్నాయి. ఇందులో 600 విషపూరితమైనవి. ఇందులోనూ 200 రకాలు మాత్రమే మునుషులను చంపేంత విషపూరితమైనవని రిప్టైల్ డేటా బేస్ చెబుతోంది.

పాముల్లో అత్యంత ప్రమాదకరమైనది, విషపూరితమైనది సా స్కేల్డ్ వైపర్. ఇది పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆఫ్రికా, ఆసియన్ దేశాల్లో కనిపిస్తుంది. ఈ పాము కాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 వేల మంది చనిపోతున్నారని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ బీబీసీతో చెప్పారు.

ఇది అత్యంత విషపూరిత పాముల జాబితాలో అగ్ర‌స్థానంలో ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాములు, మెక్సికో, ఇండియా, కాంబోడియా, బ్రెజిల్

ఫొటో సోర్స్, Roger Hamling

ఫొటో క్యాప్షన్, పాముల జనాభాను లెక్కించడం కష్టం. (ప్రతీకాత్మక చిత్రం)

పాముల సంఖ్యను ఎలా లెక్క గడతారు?

స్వభావ రీత్యా ఒంటరి జీవులు కావడంతో పాముల జనాభాను లెక్కించడం కష్టం.

ప్రపంచంలో పాముల సంఖ్య గురించి స్పష్టత లేకున్నప్పటికీ అందుబాటులో ఉన్న కొన్ని అంశాల ఆధారంగా ఏ దేశంలో పాము జాతులు ఎక్కువగా ఉన్నాయనే గణాంకాలను సేకరించారు.

ఇతర క్షీరదాలు, పక్షుల మాదిరిగా కాకుండా అటవీ ప్రాంతాల్లో పాములను లెక్కించడం కష్టం.

క్షేత్రస్థాయి సర్వేలు, జీవ వైవిధ్య జాబితాల సాయంతో హెర్పటాలజిస్టులు పాముల సంఖ్యను లెక్క గడతారు.

వీటితో పాటు వివిధ జంతు జాతుల విస్తరణ మ్యాపులు, స్థానికుల నుంచి సేకరించే వివరాలు, పాము కాటు కేసుల లెక్కల మీద ఆధారపడతారు.

ఈ లెక్కల ఆధారంగా చూసినప్పుడు మెక్సికో‌లో ఎక్కువ పాము జాతులు ఉన్నట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెబ్‌సైట్ వెల్లడించింది.

మెక్సికో

మెక్సికోలో 438 రకాల పాములు ఉన్నాయి. ఈ దేశంలో పాములు అధికంగా ఉండే ప్రాంతంలో ప్రతీ పది అడుగులకు ఒక పాము కనిపిస్తుంది.

ఒక్క ర్యాటిల్‌స్నేక్‌లోనే మెక్సికోలో 20కి పైగా రకాలున్నాయి.

దేశంలో సముద్రతీరంలోని మడ అడవులు, దట్టమైన అడవులు, పొడిగా ఉండే మెట్ట ప్రాంతం, నిర్జన మైదానాల వల్ల పాములసంఖ్య బాగా అభివృద్ధి చెందింది.

మెక్సికోలో పాములు లేని ప్రాంతం అంటూ ఏదీ లేదు.

దేశంలోని 32 రాష్ట్రాల్లో ఎక్కడకెళ్లినా ఇవి కనిపిస్తాయి.

ఇక్కడ పాములు ఎక్కువగా ఉండటానికి కారణం వాటికి అనుకూలమైన వాతావరణం, ఆహారం విస్తృతంగా లభించడం.

మెక్సికో పశ్చిమ తీరంలో ఉండే క్రోటలస్ బాసిలిస్కస్ అనే రాటిల్ స్నేక్ ప్రపంచంలోనే పొడవైన పాముల్లో ఒకటి. ఇది ఆరడగుల పొడవు ఉంటుంది.

వేటగాళ్ల బారి నుంచి పాములను రక్షించేందుకు మెక్సికోలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.

పాములు, మెక్సికో, ఇండియా, కాంబోడియా, బ్రెజిల్

ఫొటో సోర్స్, Sylvain CORDIER

ఫొటో క్యాప్షన్, అమెజాన్ వర్షారణ్యం అనకొండలకు ఆవాసంగా ఉంది.

బ్రెజిల్

అమెజాన్ వర్షారణ్యాల కారణంగా.. బ్రెజిల్ ఈ జాబితాలో ఉండటం ఆశ్చర్యం కలిగించదు.

ఈ దేశంలో 420 రకాల పాములు ఉన్నాయి. ప్రపంచంలో పాములకు అతి పెద్ద పునరుత్పత్తి కేంద్రం అమెజాన్ వర్షారణ్యం.

ఈ అడవులు అనేక ఏళ్లుగా వివిధ రకాల జీవులకు ఆవాసంగా ఉన్నాయి.

శరీరంపై రెండు మూడు రకాల రంగులతో సన్నగా పొడవుగా ఉండి తేలికపాటి విషం ఉన్న ఎరిత్రోలంప్రస్‌ జాతికి చెందిన పాములతో సహా బ్రెజిల్‌లో 30 రకాల విషపూరిత పాములు ఉన్నాయి. బ్రెజిల్‌లో నగరాలతోపాటు ఏ ప్రాంతానికి వెళ్లినా పాములు కనిపిస్తాయి.

నేలపై గుడ్డి పాములు, చెట్ల మీద ప్యారెట్ స్నేక్స్, అటక మీద ర్యాట్ స్నేక్స్ ఉంటాయని స్థానికంగా చెబుతుంటారు.

ప్రపంచంలో పొడవైన పాముల్లో రెండోదిగా గుర్తింపు పొందిన అనకొండ బ్రెజిల్‌లో కనిపిస్తుంది.

దీని చర్మం మందంగా ఉండటం, పెద్దగా ఉండటం వల్ల భయం పుట్టిస్తుంది.

పాములు, మెక్సికో, ఇండియా, కాంబోడియా, బ్రెజిల్

ఫొటో సోర్స్, SSPCA

ఇండోనేషియా

పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్, ప్రకృతి అన్వేషణ సాహసికుల డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటి . మిగతా దేశాల్లో ఎక్కడైనా ఇది అంత కష్టమైన వ్యవహారం కాకపోవచ్చు. కానీ ఇండోనేషియాలోని జావా లేదా సుమత్రాలో అలాంటివి మొదలు పెట్టి పూర్తి చేయడం దాదాపు అసాధ్యం.

ఈ ప్రాంతాల్లో కొండ ఎక్కినా, అడవుల్లో ప్రయాణం మొదలు పెట్టినా మీరు మీ గమ్యస్థానాన్ని చేరే లోపే అనేక ప్రమాదాలు పలకరిస్తాయి.

ఇక్కడ ఉండే ప్రమాదకరమైన పాములు మీ శరీరంలోని రక్త నాళాళ్లోకి బలమైన విషాన్ని పంపిస్తాయి.

కొండ చిలువలు గట్టిగా బంధించి చంపేస్తాయి. పగడపు పాము విషం శరీరంలో కణజాలం మొత్తం చచ్చుబడిపోయేలా చేస్తుంది. అతిశయోక్తిలా అనిపించినా ఇండోనేషియాలో పాముల గురించి చెప్పడానికి ఇది కాస్త తక్కువే. ఇండోనేషియాలో 376 సర్ప జాతులు ఉన్నాయి.

వాటిలో కొన్ని ప్రజల మధ్య ప్రశాంతంగా జీవిస్తున్నాయి. మరి కొన్నింటిని జాగ్రత్తగా పట్టించుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇండోనేషియా పాముల్లో ఎక్కువ జాతులు అరుదుగా మాత్రమే బయటకు కనిపిస్తాయి.

హిప్సిస్కోపస్ ఇండోనేసినిస్ అనే అరుదైన నీటి పామును ఉత్తర సులవేసిలోని ఒక సరస్సులో 2024లో తొలిసారి గుర్తించారు.

పాములు, మెక్సికో, ఇండియా, కాంబోడియా, బ్రెజిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో వైవిధ్య భరిత భౌగోళిక పరిస్థితులు పాములకు అనుకూలంగా ఉంటుంది.

భారత్

భారత్ ఈ జాబితాలో ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం కాదు. వాస్తవానికి భారత్ స్థానం ఇంకా ముందుండాలి.

ఎందుకంటే భారత్ సమశీతోష్ణ మండలంలో ఉంది.

ఓ వైపు ఎడారి మరోవైపు మంచు పర్వతాలు, దేశం మధ్యలో భారీ పర్వత శ్రేణులు, విశాలమైన మెట్ట మైదానాలతో భారత్‌ భౌగోళికంగా వైవిధ్యానికి కేంద్ర స్థానం.

భారత్‌లో 305 రకాల పాము జాతులు ఉన్నాయి.

భారత్‌లో ఉన్న పాముల జాతుల్లో కొన్నింటిని ఇంకా గుర్తించలేదు. మట్టి పామును 2020లో పశ్చిమ కనుమల్లో కనుక్కున్నారు.

చురా వ్యాలీలో కుక్రీ స్నేక్‌ను 2021లో హిమాలయాల్లోని మారు మూల గ్రామంలో గుర్తించారు.

భారత్‌లో ఎటు వెళ్లినా పాములు కనిపిస్తాయి. బూడిద రంగులో కనిపించే కీల్ బ్యాక్ రకానికి చెందిన వాటితో పాటు అనేక విషపూరిత సర్పాలున్నాయి.

తాచు పాములు బహిరంగ మైదానాల్లోనే తిరుగుతుంటాయి.1758లో వీటిని తొలిసారి గుర్తించారు. భారత్‌లోని అత్యంత ప్రమాదకరమైన విషపూరిత సర్పాల్లొ ఒకటైన సా స్కేల్డ్ వైపర్‌ను 1801లో గుర్తించారు.

భారత దేశంలో నాగుపాముతో పోల్చడానికి భయంకరమైన రస్సెల్ వైపర్ లాంటి విషపూరిత సర్పం కూడా పనికిరాదు.

అత్యంత విషపూరిత పాముల్లో ఒకటైన నాగుపాము గంటల తరబడి కదలకుండా ఉండగలదు.

వీటితో మరో ప్రమాదం ఏంటంటే ఇవి ఎక్కువగా పొలాల్లో ఉండటం.

పాములు, మెక్సికో, ఇండియా, కాంబోడియా, బ్రెజిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రైమెరేసురస్ ఇన్సులారిస్ అనే ఈ పాము ఆకు పచ్చ, పసుపు పచ్చ, నీలి రంగులో కనిపిస్తుంది.

కొలంబియా

భయం గొలిపే విషయంలో డ్రగ్ కార్టెల్స్‌తో పోటీ పడుతాయి కొలంబియాలోని పాములు. మేఘాలు, పొగమంచు తేమతో కూడిన అరణ్యాలతో నిండిన దేశం కొలంబియా. ఇక్కడ అడవుల్లోని ప్రతీ మలుపు బుసలు కొడుతూ ఉంటుంది.

అడవుల్లో, మలుపులు తిరిగే దారుల్లో ఏ మారుమూలైనా ప్రమాదం పొంచి ఉండవచ్చు.

కొలంబియా అండీస్ పర్వత శ్రేణికి ఆవాసం. ఈ పర్వతాలు దేశాన్ని రెండుగా చీలుస్తున్నాయి. తూర్పు కొలంబియాలో బ్రెజిల్‌లో ఉన్నట్లుగా అనకొండలు భారీగా ఉన్నాయి. పశ్చిమ కొలంబియాలో ఒక్కటి కూడా లేదు. అండీస్ పర్వత శ్రేణికి రెండు వైపులా ఉన్న పాము జాతులు ఒకదానినొకటి కలుసుకోలేనంత గట్టి అడ్డుగోడ నిర్మించాయి.

కొలంబియా తర్వాతి స్థానాల్లో చైనా, ఈక్వెడార్, థాయిలాండ్, వియత్నాం, మలేషియా ఉన్నాయి.

పాములు, మెక్సికో, ఇండియా, కాంబోడియా, బ్రెజిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండోనేషియాలో బోయిగా డెండ్రోఫిలా అనే ఈ పాములో తేలికపాటి విషం ఉంటుంది.

ప్రజల్లో పెరుగుతున్న అవగాహన

తెలుగు రాష్ట్రాల్లో 41 రకాల పాము జాతులు ఉన్నాయి. వీటిలో ఏడు రకాల పాములు విషపూరితమైనవి. ఇందులో నాలుగు రకాలకు చెందిన పాములు కాటు వేస్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. వీటిని బిగ్ ఫోర్ వెనమస్ స్నేక్స్ అంటారు" అని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ చెప్పారు.

పాముల విషయంలో ప్రజల్లో ఇప్పటికీ అపోహలు భయాలు ఉన్నాయని, అయితే కొన్ని సంస్థలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల వారిలో అవగాహన పెరిగిందని ఆయన అన్నారు.

"గతంలో పాముల గురించి తెలుసుకునేందుకు, పాముల్ని పట్టుకునేందుకు మాకు రోజుకు వంద కాల్స్ మాత్రమే వచ్చేవి. ప్రస్తుతం రోజుకు 300 కాల్స్ వస్తున్నాయి" అని అవినాష్ బీబీసీతో చెప్పారు.

పాము జాతులు అత్యధికంగా ఉన్న దేశాలే కాదు. అసలు పాములే లేని దేశాలు కూడా ఉన్నాయి.

న్యూజీలాండ్‌, ఐర్లండ్, ఐస్‌ల్యాండ్, గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటికా, పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ద్వీప దేశమైన కిరిబాటిలో పాముల్లేవు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)