ఆంధ్రప్రదేశ్: 'చెట్టు వంతెన', మూడు గ్రామాల ప్రజలకు ఇదే రహదారి

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
అక్కడ వేసే ప్రతి అడుగు ప్రమాదమే. కానీ, వాగును దాటి బాహ్య ప్రపంచానికి వెళ్లడం ప్రమాదకరమైనా ఆ చెట్టు వంతెన ఒక్కటే మార్గం. ఇది దాదాపు 500 మంది గిరిజనులు నిత్యం అనుభవిస్తున్న వ్యథ. సురక్షితంగా వాగు దాటించే వంతెన కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి ఆశలు... గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు దగ్గరే ఆగిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం దేవాపురం పంచాయతీ పరిధిలో ఉన్న అర్జాపురం, మునగలపాలెం, తుమ్మలపాలెం గ్రామస్థులు తాచేరు వాగుపై చెట్టు కొమ్మలకు నిచ్చెనల ఆధారంగా ఒక వంతెన నిర్మించుకున్నారు.
దానిని 'చెట్టు వంతెన' అని పిలుస్తున్నారు. తమని వాగు దాటిస్తున్న ఆ చెట్టుని దేవుడు అని అంటున్నారు కూడా.
అసలు చెట్టును వంతెనగా ఎలా మార్చారో తెలుసుకునేందుకు బీబీసీ ఆ ప్రాంతానికి వెళ్లింది.


ప్రమాదకర ప్రయాణం..
అర్జాపురం, తుమ్మలపాలెం, మునకలపాలెం గ్రామాల గిరిజనులకు తమ నిత్యవసరాల కోసం వాగు దాటి వెళ్లడమంటే ప్రతి రోజూ ఒక పరీక్షే.
కొండల మధ్యలో ఉన్న ఈ గ్రామాలను బయటి ప్రపంచంతో కలిపే సరైన రోడ్డు కానీ, వాగులపై వంతెన కానీ లేవు. గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది తాచేరు వాగు. ఈ వాగు దాటితే కానీ కనీసం నిత్యవసర సరకులు తెచ్చుకోవడానికి సంతకు కూడా వెళ్లలేరు.
ఈ వాగు.. పైనున్న మన్యం కొండల్లో పుట్టి మధ్యలో చిన్న చిన్న వాగులను, గెడ్డలను తనతో కలుపుకుంటూ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో పాటు అనకాపల్లి జిల్లా వరకు ప్రవహిస్తుంది.
అత్యవసరమైన పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని, వాగులోకి దిగి కొందరు అవతలికి వెళ్తుంటారు. ఈ పని మహిళలు, వృద్ధులు, పిల్లలు, అనారోగ్య పరిస్థితులలో ఉన్న వారు చేయలేరు. వర్షంతో కొండల పైనుంచి ప్రవాహం పెరిగినా, ముఖ్యంగా వర్షాకాలంలో ఎవరూ వాగు దాటి అవతలికి వెళ్లలేరు.

వాగు ఉంది, వంతెన లేదు..
తమ మూడు గ్రామాలను, బయట ప్రపంచంతో కలిపేందుకు వంతెన లేకపోవడంతో గ్రామస్థులే ఒక ఉపాయం ఆలోచించారు.
గరికబంద అనే గ్రామానికి సమీపంలో ఆ వాగు గట్టుపై ఉన్న ఒక చెట్టు వాలిపోయి కొమ్మలు అవతలి గట్టు వరకూ ఆనుకొని ఉన్నాయి. ఆ వాలిన చెట్టు కొమ్మలను ఆసరగా చేసి, ఒక వంతెనగా మార్చుకున్నారు.
వాస్తవానికి, ఈ 'చెట్టు వంతెన' ప్రమాదకరమైనదనే చెప్పాలి.
ఒక వైపు వంగి ఉన్న కొమ్మలను రెండు నిచ్చెనలకు కలిపి తాత్కాలికంగా రాకపోకలు సాగిస్తున్నారు.
గతంలో ఈ వంతెన రెండు, మూడుసార్లు విరిగిపోయిందని, ఆ సమయంలో కొందరు వాగులో పడిపోయారని, అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తుమ్మలపాలెంకు చెందిన ఈశ్వర్ బీబీసీకి చెప్పారు.
"మా గ్రామంలో శుభకార్యాలకు కూడా బయట నుంచి పెద్దగా ఎవరూ రారు. ఎందుకంటే వాగు దాటడం, ఈ 'చెట్టు వంతెన'పై నుంచి రావడం.. రెండూ కష్టమే" అని ఈశ్వర్ అన్నారు.

'ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..'
"ఎలాగో ఆ చెట్టు వంగింది. దానికే నిచ్చెనలు కట్టి వాగు దాటుతున్నామండి. ఆ చెట్టే మాకు దేవుడిలా దారిచూపెడుతోంది" అని ములగలపాలెం గ్రామానికి చెందిన కొండమ్మ బీబీసీతో అన్నారు.
"ఆ చెట్టు ఉంది కాబట్టి దానిని వంతెనగా మార్చుకున్నాం. ప్రస్తుతానికి అదే మాకు ఆధారం." అని తుమ్మలపాలెం గ్రామానికి చెందిన మోనిక చెప్పారు.
''వాగు ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు వంతెనపై రాకపోకలు ప్రమాదకరమే. ముఖ్యంగా పిల్లలను ఎత్తుకుని వెళ్తున్న తల్లులు, వృద్ధులు కూడా రోజూ ఈ చెట్టు వంతెనే వినియోగిస్తారు. వారికి ఈ వంతెన దాటడం కూడా ఎంతో కష్టం'' అని చెప్పారు రమేష్.
"కానీ, మేం ఎక్కడికి వెళ్లాలన్నా ఆ వంతెన మీదే వెళ్లాలి. ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడమే" అన్నారు అర్జాపురానికి చెందిన లక్ష్మి.

ప్రవాహం ఎక్కువైతే ఇదీ మునిగిపోతుంది..
"వాగు ప్రవాహం ఎక్కువైతే ఆ 'చెట్టు వంతెన' కూడా మునిగిపోతుంది" అని రమేష్ చెప్పారు.
"తూర్పు కనుమల్లోని గెడ్డలు, వాగుల్లో ప్రవాహం పెరిగినా, వర్షాలు వచ్చినా తాచేరు వాగు ప్రవాహం ఎక్కువవుతుంది. అప్పుడు మా గ్రామాల నుంచి ఆ వాగు దాటి బయటకు వెళ్లలేం. అలాగే బయట వాళ్లు మా గ్రామాలకు రాలేరు. దీంతో మాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి" అని ఆయన తెలిపారు.

‘ఇక్కడకు రావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే...’
''ఈ గ్రామాలకు ఉపాధ్యాయులు, హెల్త్ వర్కర్లు, ఇతరులెవరైనా రావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. 'చెట్టు వంతెన'పై నుంచి రావాలి, లేదంటే ఏదోవిధంగా వాగు దాటాలి'' అని తుమ్మలపాలెం ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రబాబు బీబీసీతో అన్నారు.
"గతంలో ఆ చెట్టు వంతెన తెగిపోవడంతో రెండు మూడు సార్లు కింద పడిపోయాను. గ్రామస్థులే పైకి లాగారు" అని చెప్పారు.

హామీలు కాదు, పనులు కావాలంటున్న గిరిజనులు
"వాగుపై వంతెన కోసం ఏళ్ల తరబడి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా, ఎలాంటి ఫలితం కనిపించట్లేదు" అని అర్జాపురం గ్రామానికి చెందిన లక్ష్మి బీబీసీతో అన్నారు.
"ఇప్పటివరకు ఏ అధికారి మా ఊరు రాలేదు. నాయకులు మాత్రం ఎన్నికలప్పుడు ఓట్లు అడుగుతారు. అప్పుడు మాత్రమే గుర్తుకొస్తాం" అని దేవుడమ్మ చెప్పారు.
"ఓట్లు వేస్తున్నాం. కానీ మాకు వంతెన మాత్రం మంజూరు కావట్లేదు" అని మోనిక అన్నారు.
అధికారులు చేస్తాం, చూస్తాం అంటున్నారని గిరిజనులు చెబుతున్నారు.
"రావడం, కొలతలు తీసుకుని వెళ్లిపోవడమే తప్ప ఇంతవరకు ఏమీ చేయలేదు" అని చంద్రమ్మ, బాబురావు చెప్పారు.
ఈ సమస్యపై స్థానిక సీపీఎం నాయకుడు నరసింహమూర్తి బీబీసీతో మాట్లాడుతూ, ''ప్రతి రోజు వాగు దాటేందుకు ఆ 'చెట్టు వంతెన' ఒక్కటే మాకు ప్రస్తుతానికి ఆధారం. ప్రభుత్వం స్పందించి, ఇక్కడ వంతెన నిర్మించాలి" అని అన్నారు.
'వంతెన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది'
ప్రమాదకర పరిస్థితుల్లో 'చెట్టు వంతెన' పై నుంచి వాగు దాటుతున్న వైనం, గిరిజనులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న కష్టాన్ని పాడేరు ఐటీడీఏ అధికారుల దృష్టికి బీబీసీ తీసుకెళ్లింది. ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గొర్రా డేవిడ్ రాజు మాట్లాడారు.
"అర్జాపురం, మునగలపాక, తుమ్మలపాలెం గ్రామాలను ప్రధాన రోడ్లకు కలిపేందుకు గరికబంద గ్రామం నుంచి వంతెన నిర్మించేందుకు రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక సిద్ధమైంది. మట్టి నాణ్యత పరీక్షలు జరుగుతున్నాయి. వారం, పది రోజుల్లో పనులు ప్రారంభిస్తాం" అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














