విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...

- రచయిత, విజయ్ గజం
- హోదా, బీబీసీ కోసం
ఆ గ్రామాల ప్రజల చిరకాల కోరిక ఒక రోడ్డు. దానికోసం అధికారులను వారు ఎన్నోసార్లు కలిశారు. ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయారు. ఇక ఎవరో వస్తారు... ఏదో చేస్తారని చూడకుండా 9 గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది గిరిజనులు ఏకమై స్వయంగా రహదారిని నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేశారు.
విశాఖ జిల్లా వైశాల్యంలో సగం గిరిజన ప్రాంతమే ఉంటుంది. జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిదిలో 11 గిరిజన మండలాల్లో 245 గ్రామ పంచాయతీలు, 4,210 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ మారుమూల గిరిజన ప్రాంతాలే. చాలా గ్రామాలు కొండల్లో ఎక్కడో విసిరేసినట్లు ఉంటాయి.


ఆ గ్రామాలకు చేరుకోవాలంటే కిలోమీటర్ల కొద్ది నడుస్తూ కొండలు ఎక్కిదిగాల్సిందే. అలా 15 కిలోమీటర్లు నడిస్తే కానీ చేరుకోలేని ఒక గ్రామానికి బీబీసీ బృందం వెళ్లింది. ఆ ఊరి పేరు బోనూరు. ఈ ఊరిలో వారికి సరుకులు కావాలన్నా, ఆరోగ్యం బాలేకపోయినా ఇదే మార్గం. ఆరోగ్యం బాలేని వారిని గ్రామస్థులు డోలీల్లో మోసుకెళ్తారు. ఇలాంటి గ్రామాలు అక్కడ చాలా ఉన్నాయి.
ప్రభుత్వాల వైపు ఎదురుచూడకుండా తామే స్వయంగా రోడ్డు వేసుకునేందుకు అనంతగిరి మండలంలోని 9 గ్రామాల ప్రజలు చేయిచేయి కలిపారు. ఈ మండలంలోని వినుకోట పంచాయతీకు చెందిన బోనూరు, నడుమ వలస, చీడిమెట్ట, వంట్ల మామిడి, గడ్డి బంద, మెట్టి వలస, పందిరి మామిడి, కివర్ల పంచాయతీకి చెందిన పుతిక పుట్టు, జగడాల మామిడి గ్రామాలు కొండలపై ఉంటాయి.
ఈ 9 గ్రామాలలో దాదాపు 2 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరు ఏ అవసరం కోసమైనా దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం అనంతగిరికి, లేదా 30 కిలోమీటర్ల దూరంలోని దేవరాపల్లికి నడిచి వెళ్లాలి. కాకపోతే దేవరాపల్లి వేరే మండలం, వేరే నియోజకవర్గంలో ఉంది.
తమ ఊళ్లకు దేవరాపల్లి మండలంలోని చటాకంబా వరకూ రోడ్డు నిర్మించాలని ఎన్నోసార్లు ఇక్కడి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

అనంతగిరి మండలం బోనూరు నుంచి దేవరాపల్లి మండలం చటాకంబా వరకు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత మేరకు కనీసం మట్టి రోడ్డయినా వేయాలనేది స్థానికుల కోరిక.
తమ డిమాండును ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఏకమైన గ్రామస్థులు యువత సహాయంతో సొంతంగా బోనూరు నుంచి చటాకంబా వరకూ మట్టి రోడ్డు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ గ్రామాలలో కాస్త చదువుకున్న వారు ఉన్నారు. 7వ తరగతి వరకు చదువుకున్న యువకులు ఎక్కువ మంది ఉండగా, 10, ఇంటర్ వరకూ చదివిన వారు ఇద్దరు ముగ్గురు ఉంటారు.

ఒక యువకుడు మాత్రం బీటెక్‌లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ 9 గ్రామాలకు చెంది యువత తమ గ్రామస్థులతో సమావేశం ఎర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాగూ స్పందన లేదు కాబట్టి, గ్రామస్థులంతా శ్రమదానంతో సొంతంగా రోడ్డు వేసుకోవాలని తీర్మానించుకున్నారు.
ఒక్కో కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా రోజూ వచ్చి పనిచెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. పనికి వచ్చేప్పుడు ఎవరి భోజనం వారే తెచ్చుకోవాలనేది నిబంధన.
రోడ్డు నిర్మాణం ఇలా
చుట్టూతా దట్టమైన వెదురు అడవి. ఎటుచూసినా కొండలే. ఆ గిరిజనులు ఇవేవీ పట్టించుకోలేదు. ముందుగా రోడ్డు నిర్మాణం కోసం అని కొండను చదును చేయడం ప్రారంభించారు. బోనూరుకు చెందిన మాదాల వెంకటరావు అనే యువకుడు విశాఖలోని ఓ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. తాను పుస్తకాల్లో చదివింది గ్రామస్థులతో పాటు ఇతర యువతకు చెప్పడం ప్రారంభించారు వెంకటరావు.
ఇతర గ్రామాల పెద్దలు అందరూ కలిసి ఇంత వెడల్పు రోడ్డు ఉండాలి అని నిర్ణయం తీసుకొని రోడ్డు నిర్మామణం ప్రారంభించారు. అది కూడా దట్టమైన అడవి మధ్యలో నుంచి రోడ్డు వేయడం మొదలుపెట్టారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా రోజూ 200 నుంచి 300 వందల మంది వరకూ గిరిజనులు చిన్నా పెద్దా, ముసలి ముతకా అంతా కలసి కుటుంబానికి ఒక్కరు చొప్పున కొన్ని వారాలుగా బోనూరు నుంచి దేవరాపల్లి మండలం చటాకంబా వరకూ రోడ్డు వేసుకుంటూ వెళుతున్నారు.
ఇప్పటికే దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తయింది. మరో 5 కిలోమీటర్లు వేస్తే సరిపోతుంది. కనీసం ఆ 5 కిలోమీటర్ల దూరమైనా ప్రభుత్వం రోడ్డు వేయించాలని ఈ గిరిజనులు కోరుతున్నారు.

"మా గ్రామస్థులు, కుర్రవాళ్లు అందరం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఎన్నిసార్లు ప్రభుత్వానికి లెటర్లు పెట్టినా స్పందన లేదు కాబట్టి మనమే రోడ్డు వేసుకుందామని మాట్లాడుకున్నాము. ఇప్పటికే దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు వేశాము. మరో 5 కిలోమీటర్ల వెయ్యాల్సి ఉంది. అదైనా ప్రభుత్వం వేస్తే సంతోషం. లేదంటే అది కూడా మేమే వేసుకుంటాము. ఆస్పత్రికి వెళ్లాలన్నా, కొండలు కోనల్లో నడిచి వెళ్తుంటే మధ్యలోనే చనిపోతున్నారు. బాలింతలను డోలీలో తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా సార్లు అధికారులు మొర పెట్టుకున్నాము. రాజకీయ నాయకులు పట్టించుకోలేదు. అందుకే కుర్రవాళ్లం అంతా కలిసి మాట్లాడుకున్నాము. మాకు రోడ్డు వెయ్యాలనే సంకల్పమే తప్ప ఎలా వెయ్యాలో తెలియదు. మాలో కొంత మంది చదువుకున్న వాళ్లు ఉన్నారు. పెద్దవాళ్లకు ఇలా చేద్దాం అని మా భాషలో చెబుతున్నాము. అందరం కలిసి రోడ్డు వేసుకుంటున్నాము. నేను సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. నేను చదువుతున్నది వాళ్లకు చెబుతున్నాను. మేం చదువుకోవాలన్న స్కూలుకు వెళ్లాలన్నా దారి లేదు. అందుకే రోడ్డు వేసుకుంటున్నాము'' అని మాదాల వెంకట్రావు బీబీసీతో చెప్పారు.

"ఏం చేస్తాం. రోడ్డు తవ్వుకుంటున్నాము. మాకు నడకకు కొండలు ఎక్కడానికి కాళ్లు పీకుతున్నాయి. దేశం అంతటా రోడ్డు వచ్చేసినా మాకు రోడ్డు రాలేదు. మా ఊరి చదువుకున్న పిల్లలు రోడ్డు తవ్వుదాం అంటే సరేనని అనుకున్నాం. ఈ ఊళ్లలో రెండు వేల మంది ఉన్నాము. నేను పుట్టిన కాడి నుంచి రోడ్డు లేదు. ఇప్పుడు ముసలిదాన్ని అయిపోతున్నాను. ఇప్పటి వరకూ రోడ్డు లేదు. డోలి కట్టుకొని వెళుతున్నా మధ్యలో ప్రాణాలు పోతున్నాయి. రోడ్డుంటే ఈ బాధ ఉండదని అనుకున్నాము. అందుకే రోడ్డు వేస్తున్నాము. ఇప్పటికే 10 కిలోమీటర్లు రోడ్డు వేశాము. ఓట్లు వేసినప్పుడే అన్ని రోడ్లూ, కుళాయిలు, కరెంట్లు ఇస్తామని నాయకులు చెబుతారు. ఓట్ల వరకే మేం కనిపిస్తాము. ఆ తరువాత పట్టించుకోవడం లేదు. అందుకే మేమే రోడ్డు వేసుకుంటున్నాము'' అని అన్నారు బోనూరు గ్రామానికి చెందిన మాదాల కర్రమ్మ.

చీడిమెట్ట గ్రామానికి చెందిన బుచ్చన్న అనే యువకుడు యువతనూ, గ్రామస్థులనూ ఒకే తాటిమీదకు తీసుకు రావడానికి ప్రయత్నించారు. '' బాట కోసం 9 గ్రామాల ప్రజలం ఒక్కటయ్యాము. మాకు మేమే సొంతంగా పనిచేస్తున్నాం. 10 కిలోమీటర్లు వేసుకున్నాము. మరో 5 కిలోమీటర్లు రోడ్డు వేస్తే సరిపోతుంది. రోజుకు 300 మంది పనిచేస్తున్నాము. ఒక్కళ్లు ఇంట్లో ఉంటే ఒకరు వచ్చి పనిచేస్తున్నాము. ఏ ప్రభుత్వ అధికారులూ పట్టించుకోలేదు. మా కూలి మానేసి వచ్చి చేస్తున్నాము'' అని బుచ్చన్న వివరించారు.

తొమ్మిది గిరిజన గ్రామాల ప్రజలు సొంతంగా రోడ్లు వేసుకుంటున్న విషయం ప్రసార మాధ్యమాల ద్వారా పాడేరు ఐటీడీవో పీవో బాలాజీ తెలుసుకున్నారు. ఈ గ్రామాలకు రోడ్డు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.

''స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా గిరిజన గ్రామాలకు రోడ్లు లేకపొవడం బాధాకరం. పాడేరు ఐటీడీఏ ప్రాంతంలో చాలా గ్రామాలకు రోడ్డు లేదు. మేం అన్ని గ్రామాలకూ శాశ్వత రోడ్లు వేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అనంతగిరి మండలం పినకోట, కివర్ల పంచాయితీ ప్రజలు తమకు రోడ్డు వేయాలని గతంలోనే స్పందన కార్యక్రమంలో కలిసి చెప్పారు. వాళ్లే రోడ్డు వేసుకుంటున్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. ఈ గ్రామస్థుల పట్టుదలను చూసి వెంటనే రోడ్డు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశాము. సాంకేతిక అనుమతులు వస్తే వచ్చే వర్కింగ్ సీజన్‌కు రోడ్డు వేయాలనే సంకల్పంతో ఉన్నాం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నవంబర్, డిసెంబర్ కల్లా రోడ్డు పూర్తవుతుంది. మా గిరిజనులు ఇంటికొక్కరు చొప్పున వచ్చి పనిచేస్తున్నారు. వారి కష్టాన్ని కూడా గుర్తిస్తాం. ఆ ప్రతిపాదనలు కూడా ఎన్ఆర్జీఎస్ క్రింద పంపాం. అవి వస్తే ఈ పని చేస్తున్న గిరిజనులకు కూలీలు చెల్లించేందుకు వీలుంటుంది'' అని పీవో బాలాజీ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు
- "ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
- దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న భారత్
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










