"ఏడు నెలలుగా వెయిటింగ్‌లో పెట్టారు.. జీతం రాక ఇంటి అద్దె, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి ఆవేదన

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారులకు విధుల కేటాయింపు అంశం వివాదాస్పదంగా మారింది. డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావును సస్ఫెండ్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువడగా, ఇప్పటికే ఆయనతోపాటు పదుల సంఖ్యలో నాన్-క్యాడర్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను విధులకు దూరంగా వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉంచడం విమర్శలకు తావిస్తోంది.


తన సస్పెన్షన్ దురుద్దేశపూరితమంటూ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (సీఏటీ)ని ఆశ్రయించారు. కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది.
వీఆర్ అంశంపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ప్రభుత్వం మారినప్పుడల్లా పోలీసు అధికారులను బదిలీ చేయడం, వీఆర్‌లో పెట్టడం సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులను వీఆర్‌లో పెట్టడం వివాదానికి దారితీసింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అనేక మంది అధికారులను వైసీపీ ప్రభుత్వం అప్రాధాన్య పోస్టుల్లోకి పంపింది.
వీఆర్‌లో ఎంత మంది ఉన్నారు?
ఐదుగురు నాన్-క్యాడర్ ఎస్పీలకు పోస్టింగ్ రాలేదు. గతంలో ఎస్పీలుగా పనిచేసిన అధికారులు కూడా వీరిలో ఉన్నారు.
తొమ్మిది మంది అదనపు ఎస్పీ స్థాయి అధికారులకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు.
ఈ నెల 15 సాయంత్రం వరకు 58 మంది డీఎస్పీలు వీఆర్‌లో ఉన్నారు. ఈ డీఎస్పీల్లో 37 మందికి ఈ నెల 15 సాయంత్రం ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అదే రోజు మరో ఐదుగురు డీఎస్పీలను వీఆర్‌లోకి పంపింది.
సుమారు 100 మంది సీఐలు కూడా వీఆర్‌లో ఉన్నారు.
ఒక్క గుంటూరు రేంజ్‌లోనే 38 మంది సీఐలకు పోస్టింగ్ రాలేదు. ఏలూరు రేంజ్‌లో 30 మంది, విశాఖలో 20 మంది సీఐలు వీఆర్‌లో ఉన్నారు.
ఇంత పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు వీఆర్‌లో ఉండటం గతంలో ఎన్నడూ లేదని రిటైర్డ్ డీఎస్పీ పి.రవికుమార్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, FB/AndhraPradeshCM
వీఆర్‌లో ఎందుకు ఉంచుతారు?
నిబంధనల ప్రకారమైతే ఎవరైనా పోలీస్ అధికారి విధి నిర్వహణలో అలసత్వం వహించినా, లేదా మరే ఇతర సమస్యల కారణంగానైనా తాత్కాలికంగా వీఆర్‌లో ఉంచుతారు. తర్వాత విచారణ నిర్వహిస్తారు. అవసరమైతే చర్యలు తీసుకుని సాధారణంగా మూడు నెలల్లోగా విధులు కేటాయిస్తుంటారని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ రాజకీయ కారణాలతో చర్యలు తీసుకోవడం పెరిగిపోయిందనేది చాలాకాలంగా వినవస్తున్న విమర్శ.
నిబంధనల్లో గరిష్ఠంగా ఎంతకాలం వీఆర్‌లో ఉంచొచ్చనే ప్రస్తావన లేదు. సరిగ్గా ఆ వెసులుబాటును ఉపయోగించుకొనే ప్రస్తుత ప్రభుత్వం నెలల తరబడి వీఆర్‌లో ఉంచుతోందనే విమర్శలు వస్తున్నాయి.
జూన్, జులై నెలల్లో బదిలీల్లో భాగంగా వీఆర్‌లో ఉంచిన కొందరు అధికారులకు ఏడు నెలలు దాటుతున్నా పోస్టింగ్ ఇవ్వలేదు.
వీఆర్‌లో ఉంచిన సమయంలో ఎస్‌ఐ స్థాయి అధికారులకు వేతనాలు చెల్లిస్తారు. జిల్లాలో ఎస్పీ స్థాయిలో వారి వేతనాలు డ్రా చేసి చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. సీఐలు, ఆపై అధికారులకు మాత్రం వేతనాలు అందవు. మళ్లీ బాధ్యతలు కేటాయించిన తర్వాత వారికి బకాయిపడ్డ వేతనాలు చెల్లిస్తారు.

ఫొటో సోర్స్, ANDHRAPRADESHSTATEPOLICE/FACEBOOK
'వేతనం రాక అప్పులు చేసి అల్లాడిపోతున్నా'
వేతనాలు రాకపోవడంతో తీవ్ర మనోవేదన కలుగుతోందని ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న, పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ డీఎస్పీ బీబీసీతో చెప్పారు.
"ఏడు నెలలుగా వీఆర్‌లో ఉన్నాను. జులైలో డీజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలొచ్చాయి. అప్పటి నుంచి ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, బ్యాంకు రుణాల ఈఎంఐలు చెల్లించలేక సతమతమవుతున్నాను. వెల్ఫేర్ ఫండ్ నుంచి అడ్వాన్సులు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా వాటిని కూడా నిలిపివేశారు. కారణం తెలీదు. అటు వేతనాలు రాక, ఇటు అడ్వాన్సులు తీసుకునే అవకాశం లేక, అప్పులతో అల్లాడిపోతున్నాను" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాలు, రాజధాని ఆందోళనల సందర్భంగా తమను బందోబస్తు విధులకు పిలిచారని, కేవలం టీఏ, డీఏ ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఆయన తెలిపారు. ఖర్చులు తడిసిమోపెడవుతున్నా కనికరించడం లేదని, గతంలో ఏ ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదని ఆక్షేపించారు.
అవసరమైతే వీఆర్‌లో ఉన్న పోలీసు అధికారులనూ ఉన్నతాధికారులు తాత్కాలికంగా బందోబస్తు విధులకు పిలుస్తారు. ఆ సమయంలో వేతనం ఇవ్వరు.
ఈ నెల 15న పోస్టింగ్ వచ్చిన డీఎస్పీల్లో ఈ అధికారి లేరు.

ఫొటో సోర్స్, Twitter
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై ప్రభుత్వం ఏమంది?
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని, అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ నిబంధనల మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నామని చెప్పింది. సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ఏబీ వెంకటేశ్వరరావు తన హోదాను ఉపయోగించుకొని కుమారుని కంపెనీకి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారన్నది ఆయనపై చేసిన ప్రధాన ఆరోపణ. ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లు, ఇతర రక్షణ, నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో గ్లోబల్ టెండర్లలో కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీకి కాకుండా తన కుమారుని కంపెనీకి మేలు చేసేలా ఆయన వ్యవహరించినట్టు ప్రభుత్వం ఆరోపిస్తోంది.
2015 మార్చిలో ఏబీ వెంకటేశ్వర రావు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు.
2015 జులైలో ఆయన కొడుకు చేతన్ సాయి కృష్ణ కంపెనీ ప్రారంభించగా, ఆయనకు డిసెంబర్‌లో కాంట్రాక్ట్ కేటాయించారని, అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సాగిందని పాలక పక్షం ఆరోపిస్తోంది.
కేంద్ర హోం శాఖ, రక్షణ, విమానయాన శాఖల నుంచి అనుమతులు ఉన్న కంపెనీల ద్వారానే అలాంటి సామగ్రి కొనాల్సి ఉండగా, దానికి భిన్నంగా ఎలాంటి లైసెన్సులు లేని కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారని, ఇది నిబంధనలు అతిక్రమించడమేనని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ సాగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే వైసీపీ ఈ అధికారిపై అనేక ఆరోపణలు చేసింది. ప్రభుత్వ అధికారిగా కాక చంద్రబాబు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని అప్పట్లో వైసీపీ నేతలు తరచుగా ఆరోపణలు చేస్తూ ఉండేవారు.
తన తండ్రిపై ఆరోపణలను చేతన్ సాయి కృష్ణ ఖండించారు.

'నా తండ్రి అధికారాన్ని ఉపయోగించుకోలేదు'
ప్రభుత్వ ఆరోపణలను, వైసీపీ ఆరోపణలను ఖండిస్తూ చేతన్ సాయి కృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు.
తాను ఇంతవరకు ఏ ప్రభుత్వంతోగాని, ప్రభుత్వశాఖతోగాని, ఆంధ్రప్రదేశ్‌లో లేదా ఏ రాష్ట్రంలోగాని ఏ రకమైన వ్యాపారమూ చెయ్యలేదని, ఏ టెండర్‌లోనూ పాల్గొనలేదని, తాను పనిచేసిందంతా ప్రైవేటు రంగంలోనేనని ఆయన చెప్పారు.
తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని ఏనాడూ వ్యాపారం చెయ్యడంగాని, లాభం పొందడంగాని చెయ్యలేదని చేతన్ అందులో చెప్పారు. కొన్ని స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడం, కొన్నింటిలో భాగస్వామిగా ఉండటం వాస్తవమే అయినప్పటికీ, అవేవీ షెల్ కంపెనీలు కావని తెలిపారు. కొన్నింటిలో అవకాశాలు లేక, మరికొన్ని తనకు తగిన సమయం లేక ముందుకు పోలేదని చెప్పారు.
కక్ష సాధింపు చర్యేనన్న చంద్రబాబు
ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు.
"ఆయన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. డీజీ స్థాయి. ఇష్టం లేకపోతే విధులు కేటాయించకుండా వదిలేయాలే తప్ప ఇలా వ్యవహరించడం సరికాదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రభుత్వం 300 మంది పోలీస్ అధికారులకు విధులు కేటాయించలేదని, గత 40 ఏళ్లలో ఇది ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు చెప్పారు. ఓ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినందుకు కక్ష తీర్చుకోవాలనుకోవడం దుర్మార్గమని, మంచి సంప్రదాయం కాదని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదని విమర్శించారు.

ఫొటో సోర్స్, ANDHRAPRADESHSTATEPOLICE/FACEBOOK
హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం
ఏపీలో పోలీస్ అధికారులను ప్రభుత్వం రాజకీయ కారణాలతో వేధిస్తోందంటూ ఏపీ హైకోర్టులో ఈ నెల 11న ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్టు సామాజిక కార్యకర్త పోలూరి శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.
ప్రభుత్వం మారినప్పటి నుంచి చాలా మందిని విధులకు దూరంగా ఉంచి వేతనాలు కూడా ఇవ్వడం లేదని, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. తక్షణం వారికి విధులను కేటాయించి వారి కుటుంబాలను ఆదుకోవాలని తమ వ్యాజ్యంలో కోరినట్లు చెప్పారు.
వ్యాజ్యాన్ని కోర్టు విచారణకు స్వీకరించిందని, వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసిందని శ్రీనివాసరావు తెలిపారు.
వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని, హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.

ఫొటో సోర్స్, FB/Sucharitha.Mla
వివరాలు కోర్టులో చెబుతాం: హోం మంత్రి సుచరిత
విధులకు దూరంగా ఉన్న పోలీస్ అధికారుల విషయంలో ఏంచేయనున్నారో తెలుసుకొనేందుకు హోం మంత్రి మేకతోటి సుచరితను బీబీసీ సంప్రదించింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, వివరాలు న్యాయస్థానం ముందు వెల్లడిస్తామని ఆమె చెప్పారు.
డీజీపీ కార్యాలయాన్ని సంప్రదించగా, ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌వో) నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
నిబంధనలు మార్చి మరీ వేధింపులు: రిటైర్డ్ డీఎస్పీ
పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను మార్చి మరీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని రిటైర్డ్ డీఎస్పీ పి.రవికుమార్ బీబీసీతో అన్నారు. పోలీస్ శాఖలో చర్యలు తీసుకోవడం చాలా సాధారణమని, వీఆర్‌లో ఉంచడం, మళ్లీ పోస్టింగ్ ఇవ్వడం నిత్యం జరుగుతూనే ఉంటాయని, కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు.
"రాష్ట్రంలో 58 మంది డీఎస్పీలను వీఆర్‌లో పెడితే వారిలో 24 మంది కమ్మవారు ఉన్నారు. అసాధారణ సెలవు నిబంధనలు ఉద్యోగి వైద్య అవసరాలకు, ఇతర వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటారు. ఆ సమయంలో వేతనం, ఇంక్రిమెంట్, ప్రమోషన్లు లాంటివి ఉండవు. ఐదేళ్ల వరకు దానిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనను ఈ ప్రభుత్వం మార్చింది. ఆరు నెలలు వీఆర్‌లో ఉన్న వారిని ఈవోఎల్ (ఎక్స్‌ట్రార్డినరీ లీవ్)లో ఉన్నట్లు పేర్కొంటోంది. వేతనాలు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతోంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు" అని ఆయన విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వం కూడా వేధించింది: రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్
టీడీపీ హయాంలో పోలీస్ శాఖలో తీవ్ర వివక్ష సాగిందని రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ నాగుర్ రెడ్డి బీబీసీతో అన్నారు. చాలా మంది పోలీసు అధికారులను నాటి ప్రభుత్వం కూడా వేధించిందని, నెలల తరబడి పోస్టింగ్ ఇవ్వలేదని విమర్శించారు. ఏపీఎస్పీ ఐదో బెటాలియన్లో పనిచేసిన తనకు జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని చెప్పారు.
తనలాంటి వాళ్లు అప్పట్లో అనేక మంది ఉన్నారని, 2018 డిసెంబర్ నాటికి 80 మంది సీఐలను వీఆర్‌లో పెట్టారని, సమస్యను అప్పటి డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం దొరకలేదని నాగుర్ రెడ్డి తెలిపారు. తన హయాంలో పెద్ద సంఖ్యలో పోలీసులను వేధించిన చంద్రబాబు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని విమర్శించారు.
పోలీసు శాఖలో ఇది పరిపాటిగా మారుతోంది - రిటైర్డ్ ఐపీఎస్ హరికృష్ణ
ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పోలీసు శాఖలో పలువురిని వీఆర్‌లోకి పంపించే ప్రక్రియ గత కొన్నేళ్లుగా పెరుగుతోందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి హరికృష్ణ అభిప్రాయపడ్డారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలు మారిన సమయంలో కొందరు ఉన్నతాధికారులకు మాత్రమే స్థాన చలనం ఉండేది. ఇప్పుడు ఎస్ ఐ ల స్థాయి నుంచి అందరికీ తప్పడం లేదు. అప్పట్లో వీఆర్ లో పెట్టినా కొంత కాలానికి ఉపశమనం దక్కేది. ఇప్పుడు అలా కనిపించడం లేదు. పార్టీలు, నాయకులతో సంబంధం లేకుండా అందరూ అదే తీరున వ్యవహరిస్తున్నారు. కీలకమైన శాఖలో ఇలాంటి పరిణామాలు శ్రేయస్కరం కాదు. ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఆదేశాలు పాటించడం పోలీసుల కర్తవ్యం. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినప్పటికీ రాజకీయ కారణాలతో చర్యలు తీసుకుంటున్న తీరు సమంజసం కాదు. మార్పులు రావాలి. దానికి తగ్గట్టుగా పోలీసు యంత్రాంగం వ్యవహరించాలి’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం ఎన్ని కోవిడ్ కేసులు బయటపడ్డాయి?
- బడ్జెట్ 2020: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఏమన్నాయి
- ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంటే సీఏఏపై బీజేపీ రాజకీయం: కేసీఆర్
- ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజీల్‌పై వ్యాట్ పెంపు.. ప్రజలపై భారమెంత
- మెసేజ్‌లలో వచ్చే నగ్నచిత్రాలను తొలగించే ఫిల్టర్ తీసుకొచ్చిన ట్విటర్
- ఆయుష్మాన్ భారత్ పథకం తొలి లబ్ధిదారు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది...
- Reality Check: నరేంద్ర మోదీ హామీలు నిలబెట్టుకున్నారా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









