‘దిశ యాప్‌లో తొలి ఫిర్యాదు.. ఆరు నిమిషాల్లో పోలీసులు వచ్చేశారు’ - ప్రెస్ రివ్యూ

దిశ యాప్

ఫొటో సోర్స్, Disha SOS app

మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన 'దిశ' యాప్ ద్వారా తొలి ఫిర్యాదు నమోదైందని, పోలీసులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ 'సాక్షి' దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరారు.

విశాఖపట్నంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కూడా ఇదే బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా.

బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున ఆయన తన సీటు వద్దకు వచ్చి అనుచితంగా ప్రవర్తించారని ఆ మహిళా ఉద్యోగి చెప్పారు.

Presentational grey line
News image
Presentational grey line

తెల్లవారు జామున 4.21 గంటల సమయంలో తన మొబైల్‌ ఫోన్‌ను ఐదు సార్లు షేక్ చేసి, దిశ యాప్‌ ద్వారా ఆమె ఎస్ఓఎస్ బటన్ నొక్కారు.

ఈ సమాచారం అందుకున్న దిశ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ మహిళ ఏలూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి పశ్చిమ గోదావరి ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌కు సమాచారం అందించారు.

ఎస్పీ ఆదేశాలతో ఏలూరు త్రీ టౌన్‌ పోలీసులు వెంటనే బయలుదేరి తెల్లవారుజామున 4.27 గంటలకు (కాల్‌ వచ్చిన 6 నిమిషాల్లో) బస్సు వద్దకు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిపై ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద కేసు నమోదైనట్లు సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ తెలిపారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని పోలీసులు తెలిపారు.

తమిళసై

ఫొటో సోర్స్, governor.telangana.gov.in

తెలుగు నేర్చుకుంటా: తెలంగాణ గవర్నర్ తమిళిసై

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలుగు నేర్చుకునేందుకు ఆసక్తి చూపించారని 'ఈనాడు' దినపత్రిక ఓ కథనం రాసింది.

దక్షిణాది రాష్ట్రాల్లోని 18 మంది తెలుగేతర ఉపాధ్యాయులకు 'తెలుగు భాషా బోధన'పై మూడు రోజుల పాటు తెలుగు వర్సిటీలో నిర్వహించిన శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి.

వర్సిటీ అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వి.సత్తిరెడ్డి నేతృత్వంలో సదరు బృంద సభ్యులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ డా.తమిళిసైని కలిశారు.

తక్కువ సమయంలోనే తెలుగు భాషపై వాళ్లు సాధించిన పట్టు, ప్రావీణ్యాన్ని చూసి తమిళిసై ఆశ్చర్యపోయారు.

తనకూ తెలుగు నేర్చుకోవాలని ఉందని, విశ్వవిద్యాలయం నుంచి ఒక తెలుగు బోధకురాలిని తన కోసం నియమించాలని రాజ్‌భవన్‌ అధికారులను ఆదేశించారు.

అధికారులు వెంటనే వర్సిటీ అధికారులు సంప్రదించారు. గవర్నర్‌కు తెలుగు బోధించడానికి వర్సిటీలో పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రెడ్డి శ్యామలను పంపించే అవకాశాలున్నాయి.

ఏపీ హైకోర్టు

ఫొటో సోర్స్, hc.ap.nic.in

వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారు: ఏపీ హైకోర్టు

ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటే ఫిర్యాదుదారు ఏ సామాజిక వర్గానికి చెందినవారో నిందితులకు తెలిసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

తమపై ఓ మహిళా కానిస్టేబుల్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు జర్నలిస్ట్‌లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

వారి పిటిషన్‌పై మంగళవారం కోర్టు విచారణ జరిపింది.

విధుల్లో ఉన్న జర్నలిస్టుకి ఎదుటివారు ఏ సామాజిక వర్గమో ఎలా తెలుస్తుందని పోలీసులను ప్రశ్నించింది.

మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది.

ఫిర్యాదుదారుది ఏ కులమో నిందితులకు తెలియదని, ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, Telangana CMO

కలెక్టర్లకు వ్యక్తిగత ప్రాధాన్యాలు వద్దు.. జట్టుగా పనిచేద్దాం: కేసీఆర్

కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలు వారు ఎంచుకోవద్దని, అధికార యంత్రాంగమంతా ఒకే ప్రాధాన్యంతో జట్టుగా పనిచేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారని 'నమస్తే తెలంగాణ' ఓ వార్త ప్రచురించింది.

కేసీఆర్‌ కిట్స్‌, కల్యాణలక్ష్మి, కంటివెలుగు వంటి పథకాలు పేదల కష్టాలను దూరం చేయాలనే ఉద్దేశంతో తెచ్చినవని, వాటిని కలెక్టర్లు అమలు చేయాల్సిందేనని అన్నారు.

మంగళవారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో కేసీఆర్ సమావేశమయ్యారు.

‘‘కలెక్టర్ల వ్యవస్థను బలోపేతంచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే కలెక్టర్లకు అండగా ఉండటంకోసం అడిషనల్‌ కలెక్టర్లను నియమించింది. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించాం. కలెక్టర్‌ జిల్లాస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించాలి’’ అని వారికి చెప్పారు.

గ్రామాల్లో రెవెన్యూ అజమాయిషీ అంతా కలెక్టర్ల చేతిలోనే ఉంటుందని, భూరికార్డులను సరిదిద్దే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టంచేశారు.

''అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యత విషయంలో మాత్రం వెనుకబడి ఉంది. తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిన తీసుకోవాలి. గ్రామల్లో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించాలి'' అని అన్నారు.

అత్యంత ప్రాధాన్యం కలిగిన పనులను వెంటనే చేపట్టడానికి వీలుగా జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

సీఎం ప్రకటన వెంటనే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు రూ.33 కోట్లు విడుదలచేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)